బస్సెడు దూరం

” ఇంకెంత సేపు పడుతుందో ఈ బస్సు కదలడానికి!”
“ఏమయ్యా డ్రైవరూ ! ఎప్పుడు వెళ్ళేది??”
“రాత్రికల్లా వచ్చేయమ్మాయి ఊరినుంచి.”
“పిల్ల ఏడుస్తోంది. కాస్త ఎత్తుకోరాదండీ?”
– ఒక దానికి ఒక దానికి సంబంధం లేని సంభాషణలు అప్పుడోటీ, ఇప్పుడోటీ మధ్య మధ్యన చెవిన పడుతున్నాయి శివానికి. ఈ ఊరుని చివరి సారిగా చూస్తూ సీటు పై వెనక్కి ఒరిగాడు. సగం తెరిచిన కిటికీ లోంచి చూపుల ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉందింకా. డ్రైవర్ తన సీటు-తలుపు వైపు వెళ్ళడం కనిపించింది.

చిన్నప్పుడు డ్రైవర్ సీటు అంటే ఎంత సరదా తనకి ! ఆగి ఉన్న మామయ్య కారెక్కి స్టీరింగు తో ఆడుకున్నా, ఊరి ప్రయాణం మధ్యలో బస్సు ఆగి డ్రైవరు టీ కి వెళితే వెంటనే స్టీరింగ్ దగ్గరికెళ్ళి – ఇష్టమైన పని చేయబోయి నాన్న చేత దెబ్బలు తిన్నా, ఇంటి బయట ఉన్న రోడ్డు రోలరు అందకున్నా ఎక్కేసి అదిచూసిన డ్రైవర్ తిట్లకు భయపడి కిందకు దిగినా – ఇప్పటికైనా దాని పై మోజు పోయిందా ?

బస్సు నెమ్మదిగా కదిలింది .. భద్రాచలం వైపు. రోడ్డు ఎంత నున్నగా ఉంది ! పైన సూర్య తాపం కూడా అంతగా లేదు. అబ్బ! ముందు కూర్చున్నాయన ఒకటే కదులుతున్నాడు. ఆ తల అటూ ఇటూ తిప్పుతూ ఉంటే మా చెడ్డ చిరాగ్గా ఉంది – అనుకున్నాడు శివం. ఇటు పక్కనాయన పేపర్లో మునిగాడు. శివానికి బస్సు లో అవతలి వైపు కనిపించడం లేదు. దానితో చేసేదేం లేక మళ్ళీ కిటికీ ని ఆశ్రయించాడు శివం. ప్రకృతి ఆరాధన మొదలు మళ్ళీ.

ఏం ఊరిది? అశ్వపురం అట. అదేం పేరు? రాజుల కాలం లాగా? ఏమో చందమామ కథల్లోలా ఇక్కడ కూడా నిజంగానే రాజులున్నారేమో ఒకప్పుడు. ఓహ్! పొద్దున్న అక్కడ ఆ ఊళ్ళో సెల్ ఫోన్ లో అశ్వపురం అని చూపింది. అంటే ఈ చుట్టుపక్కల్లో ఇదే కాస్త పెద్ద ఊరు అన్నమాట. “మా ఊరు అశ్వపురం” అంటే బాగుంటుందా? “మేము అశ్వపురవాసులం” అంటే బాగుంటుందా?

మేకల గుంపు. వెనకాలే ఓ కుర్రాడు. అర్థ నగ్నంగా. వాడి చేతిలో ఓ కర్ర. వాడి భయానికి ఎక్కువ నసపెట్టకుండా నడుస్తున్నాయి మేకలు. ఈ మేకలు మనసులో ఏమనుకుంటూ ఉంటాయో ఏమో కాపరి మీద. అన్నట్లు మేకలకూ ఆలోచనలు ఉంటాయా? బస్సు లోని జనాలంతా వాటికి గొర్రెల్లా కనిపిస్తారా ? గొర్రెలకైతే కాస్త జ్ఞాపకశక్తి ఉంటుందంట. మేకలకో ? – శివం ఆలోచనలు ఖాళీ గా ఉన్నందుకో ఏమో ఎన్నో దిక్కులకు పోతున్నాయి.

పొద్దున్నే కదూ ఈ ఊరు వచ్చింది తను. అప్పుడే వీడ్కోలు. శాశ్వత వీడుకోలు – ” మళ్ళీ ఈ ఊరు కి రాననుకుంటాను జీవితం లో. అంతే కాబోలు. ఇక్కడి ప్రకృతి అందాల్ని మళ్ళీ చూసుకోలేను. రైల్లో వచ్చేటప్పటి అందమైన అడవి ని మళ్ళీ చూడలేనేమో. పొద్దున్న ఊళ్ళోకి ట్రైను అడుగు పెట్టే ముందు వచ్చిన అడవిలో కనిపించిన రహస్య దారిని ఎన్నటికీ శోధించలేను. నిన్నటి అర్థ రాత్రి లా ఆ చక్రి గాడితో బోగీ మెట్లపై కూర్చుని , చల్లని గాలికివణుకుతూ, జోకులేసుకుని నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటానా మళ్ళీ ? ఏమో ! అర్థ రాత్రి మూడు కి ఏదో స్టేషన్ లో టీ కోసం అల్లాడుతూ .. ఎదురుచూస్తానో లేదో మళ్ళీ.

నిన్నటి అనుభవం నేటికి జ్ఞాపకమే కాబోలు. రేపటికైతే అదే గతమై కూర్చుంటుందేమో ” అనుకుంటున్నాడు తనలో తానే.

చినుకులు …. వెధవ చినుకులు ….. ఇప్పుడు వర్షం పడితే కిటికీ వేసేయాలి – చిరాగ్గా అనుకున్నాడు తన చైతన్య స్రవంతి ని ఇంతవరకూ హాయిగా అనుభవిస్తూ ఉన్న శివం. మేఘాలు భలే ఉంటాయి. అమరిక మార్చేది ఆకాశరాజో లేక మేఘాలకే రెక్కలుండి ఎగురుకుంటూ తిరిగి అల్లరి చేస్తూ ఉంటాయో తెలీదు కానీ ఒక్కో రోజు డిజైన్ భలే కుదురుతుంది ఆకాశానికి. ఓహ్ ! ఇంద్రధనుస్సు … ఈ కాస్త చినుకలకే !! – మొన్న స్కూల్లో పిల్లలకి ఇంద్రధనుస్సు చూపితే ఎంత అబ్బురంగా చూసారు ! పిల్లలకి ప్రతీదీ అబ్బురమే . అయినా సరిగా చూడాలే కానీ ప్రపంచం లో ఎన్ని విషయాల్లో చూసే కొద్దీ కొత్త వింతలు తెలుస్తూ పోవు ?

పాత వింతలు కూడా ఉంటాయా ఏం ? – తన మనసడిగిన ప్రశ్న కు అప్రయత్నంగా నవ్వుకున్నాడు శివం.

సెల్ రింగౌతోంది. నాన్న. తాను బయలుదెరాడో లేదో అని ఆయన ఆత్రం. మళ్ళీ కిటికీ వైపు కి శివం. ” నీళ్ళు తాగి చాలా సేపు అయినట్లుంది. దాహంగా ఉంది ” అనుకున్నాడు. అయినా తానీ మధ్య బాటిళ్ళకి బాటిళ్ళు నీళ్ళు తాగేస్తున్నాడు. నీళ్ళెక్కువ తాగితే లావౌతారా? అమ్మో ! తాను లావవకూడదు. తన అందమైన శరీరం లావుగా ఉంటే ఎలా ఉంటుంది ? లావంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఓ మేష్టారుండేవాడు – గుర్నాథ రావు -లావుగా బుర్ర మీసాల్తో, అరవీర భయంకరంగా ఉండేవాడు .. స్కూలు …. ఎంత హాయిగా గడిచిపోయాయి ఆ రోజులు ? ఇప్పుడు తాను హాయిగా ఉన్నట్లేనా ? ఉంటే ఎందుకా నిట్టూర్పు – ” స్కూలు రోజులు హాయి ” అని ?

కిటికీ అవతల ఏదో ఊరవతలి చెరువుగట్టు కనిపిస్తోంది. ఇక్కడ …. ప్రేమ కబుర్లు బాగా కుదురుతాయేమో. ప్రేమ …అమ్మ ప్రేమ , చెలి ప్రేమ ఒక గాఢత తో ఉండలేవా ? మొన్న రాజు గాడిది పెళ్ళైంది. ఈ రోజు కిషోర్ పెళ్ళి కి ఇక్కడికొచ్చాడు. రేపు తనూ పెళ్ళి చేసుకుంటాడా? వీళ్ళంతా తన పెళ్ళికీ వస్తారా? ఓహ్!! ఈ రోజు మ్యాచ్ !!!! ఠక్కున పక్కనున్న పేపర్ శాల్తీ ని అడిగాడు శివం – ” ఇండియా గెల్చిందా ?” – “లేదు”. నిరాశ తో మళ్ళీ తన ఆలోచనా స్రవంతి కి కిటికీ చూపుతున్న చలన చిత్రానికి తానూ ప్రేక్షకుడయ్యాడు.

ఇంకో పావుగంటలో భద్రాచలం వచ్చేస్తుంది అనుకుంటా …. రోడ్డు పైని మైలు రాయి ని చూసి లెక్క వేసాడు. చిన్నతనం లో ఓ మైలు రాయి దాటగానే మరో మైలు రాయి కోసం ఎదురుచూసేవాడు ఆశగా. కనబడగానే దాని పై గీసిన సంఖ్యను సరిచూసుకునే వాడు – ఒకటి తగ్గిందా లేదా అని. ఇప్పటికీ ఒక్కోరోజు అలా చేయాలనిపిస్తుంది …. కానీ ఏదో అడ్డు ….. భద్రాచలం చూడాలని … గోదారమ్మ ఒడిలో కాసేపు సేద తీరాలని …. ఈ కోరిక ఈనాటిదా ?? ” వెన్నెల్లో గోదారి అందం … ” , ” ఉప్పొంగెలే గోదావరీ .. “, “వేదం లా ఘోషించే గోదావరీ .. ” – గోదారమ్మ పేరు తలవగానే లిప్తపాటులో ఎన్ని పాటలు గుర్తొస్తున్నాయి …. అనుకున్నాడు. బస్సు లో ఏ మూలో పసిపిల్లాడి ఏడుపు. అమ్మ సముదాయింపు. అమ్మ సమక్షం లో పసిపిల్లవని వారు ఎవరన్నా ఉంటారా ? శివానికీ ఏడవాలనిపించింది అమ్మ ముద్దుల కోసం.

” ఇదిగో భద్రాద్రీ గౌతమి అదిగో చూడండి ” – టూరిజం శాఖ వారి బ్యానరు. బస్సు ఊళ్ళోకి వచ్చేసినట్లుంది. పుణ్యక్షేత్రం వాసనలు తెలుస్తున్నాయి. పూజా సామగ్రి దుకాణాలు .. జనమూ …. దారిలో రామదాసు విగ్రహమూ …. కాస్త దూరం లో గోదారమ్మ గలగలలు ….. భద్రాద్రి కి వచ్చేసాం. “ఈ పెళ్ళి పుణ్యమా అని చివరికి భద్రాద్రి చూస్తున్నా …..

రాత్రి కి మళ్ళీ ట్రైను. ఇంతలోపు భద్రాద్రి రామయ్యను, గోదారమ్మ ను తనివితీరా చూసుకోవాలి … ” అని శివం అనుకుంటూ ఉండగా బస్సు ఆగింది. ” దిగండి సార్ అందరూ …. సరిగ్గా 6:30 కి మళ్ళీ బయలుదెరతాం.” – డ్రైవర్ మాటలు వినిపించాయి. జీవితమనే మహాప్రస్థానం లో ఇదో చిన్న మజిలీ శివానికి. వట్టి కాళ్ళతో గుడి మెట్టుపై తొలి అడుగు వేస్తూ వద్దన్నా వదలని తన చైతన్య స్రవంతి లోకే వెళుతూ …. ఊపిరి కున్నంత వయసు ఈ చైతన్య స్రవంతి ది అనుకున్నాడు శివం …..