ఇవాళ హిందూ పేపరు తెరిచి చూద్దును! తాటికాయలంత అక్షరాలతో వార్త: స్విట్జర్లండ్‌లో ఉన్న సెర్న్ (CERN) అనే భౌతికశాస్త్ర ప్రయోగశాలకు చెందిన రెండు పరిశోధక బృందాలు ‘హిగ్స్ బోసాన్’ అనే ఒక పరమాణులేశపు ఉనికిని నిర్ధారించాయని.
సృష్టి ప్రారంభదశలో ఉన్నది కేవలం అనంతమైన శక్తి, పరమాణువులు, తప్ప వేటికీ ద్రవ్యరాశి లేదు. ఈ విశ్వంలో పరమాణువులకి ద్రవ్యరాశి లభించనంత వరకూ దేనికీ అస్తిత్వం కలగదు. జటిలమైన ఈ సమస్యకి పరిష్కారంగా ఈ విశ్వం అంతానూ ఒక శక్తి ఆక్రమించి ఉందని, ఆ క్షేత్రానికి మూలాధారం హిగ్స్ బోసాన్ అని పిలవబడే ఒక పరమాణు లేశమని 1964లో పీటర్ హిగ్స్ అనే శాస్త్రజ్ఞుడు (మరిద్దరు శాస్త్రవేత్తలతో కలిసి) ప్రతిపాదించాడు. ఆయన పేరుమీదగా ఆ శక్తిక్షేత్రాన్ని హిగ్స్ ఫీల్డ్ అని పిలుస్తారు. అయితే ఇప్పటిదాకా ఎవరూ ఈ హిగ్స్ బోసాన్ ఉనికిని నిర్ధారించలేకపోవడంతో ఇప్పటిదాకా ఇది కేవలం ఒక ప్రతిపాదనగానే మిగిలిపోయింది. 29 మే 1929న ఇంగ్లండులో పుట్టిన హిగ్స్‌కి, భౌతికశాస్త్రాన్ని మలుపుతిప్పగల ఈ ప్రతిపాదనకు 2013లో నోబెల్ పురస్కారం లభించింది.
దానితోపాటు ‘ఈ పరిశోధనలో పాలుపంచుకున్న భారతీయశాస్త్రవేత్తలు’ అన్న బాక్స్ ఐటమ్; అందులో సి.ఎమ్.ఎస్. అన్న బృందం నాయకుడు వివేక్ శర్మ, ప్రక్కన నవ్వుతూ చంద్రం, అర్చనా శర్మ, మరికొందరూ.
నాకెంతో గర్వంగా ఉంది. చంద్రం సాధించిన ఘనతలో నా పాత్ర ఏమీ లేకపోయినా, ఆ వ్యక్తి నా స్నేహితుడు, అతనితో కలిసి కొంతకాలం గడిపేనన్న భావనతో, నేనే ఆ ఘనత సాధించినంత సంబరంగా ఉంది.
వాడి నేపథ్యానికి, వాడు అందుకున్న శిఖరాలు చూస్తుంటే నమ్మశక్యం కాదు. లేకపోతే, తాతలనాడు నేతులు తాగేమని చెప్పుకునే దేశంలో, ఎక్కడో, పట్నమూ కాదు పల్లెటూరూ కాదు అన్న ఊర్లో, అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టటం ఏమిటి? చదువు పూర్తయితే చాలును అనిపించే బొటాబొటీ ఆర్థిక పరిస్థితులలో, ఎవరో దయతలిచి చేయూత అందిస్తే చదువుకున్నవాడు, ఐ.ఐ.టి.లో సీటు సంపాదించడమేమిటి? ఉత్తమ పరిశోధకుడిగా గుర్తింపు తెచ్చుకుని కాల్‌టెక్‌లో ఉద్యోగం, సెర్న్ వంటి అంతర్జాతీయ పరిశోధక సంస్థలో కీలకస్థానం సంపాదించటమేమిటి?
అందులోనూ, తను పాల్గొన్న పరిశోధన చిన్నదేమీ కాదు. అంతర్జాతీయ స్థాయిలో కొన్ని వేలమంది శాస్త్రజ్ఞులు పాల్గొన్నది; ఈ శతాబ్దంలోనే అత్యంత కీలకమైన పరిశోధనగా పేరు తెచ్చుకున్నది. ఈ పరిశోధనతో కణభౌతిక శాస్త్రం కీలకమైన మలుపు తిరిగినట్టే.
చంద్రం చిన్నప్పటి నుంచీ అంతే!
నేను ఊహించినదానికంటే ఎప్పుడూ ఒక మెట్టు పైనే!
అప్పుడు మేము ఫోర్తు ఫారంలో ఉన్నాం. ఆ ఏడే అనకాపల్లి నుండి వచ్చి ఓ కుర్రాడు మా క్లాసులో చేరాడు. ఎవరితో మాటాడేవాడు కాదు. వాడికి మహా గర్రా అనుకునే వాళ్ళం. అప్పటి వరకూ అన్ని సబ్జెక్టుల్లోనూ నాదే క్లాసు ఫస్టు. నాకెంత గర్రా ఉండాలి. అందుకే నేనూ వెళ్ళి పలకరించలేదు.
మాకు ఇంగ్లీషు తప్ప తక్కిన అన్ని పాఠాలూ తెలుగులోనే బోధించేవారు. చివరకి హిందీ కూడా. రాయడానికి దేవనాగరి లిపి వాడినా, బోధన తెలుగులోనే ఉండేది. నూటికి ఇరవై మార్కులు వస్తే పరీక్ష గట్టెక్కినట్టే. అలాంటి పరిస్థితుల్లో, ఇండో-అమెరికను సాంస్కృతిక వినిమయ కార్యక్రమంలో భాగంగా అల్నాస్కర్ అని ఒక అమెరికను మాకు అప్పుడే ప్రచారంలోకి వస్తున్న ఆధునిక గణితాన్ని బోధించడానికి మా స్కూలుకి వచ్చాడు. ఆయన మాకు త్రికోణమితి బోధించేవాడు. ఆయనకి మా అవగాహన స్థాయి గురించి ముందే ఒక అంచనా ఉండే ఉంటుంది. అందుకని నెమ్మదిగా ఒక్కొక్క మాటా పలుకుతూ, హావభావాలతో, బొమ్మలతో, అర్థాన్ని బోధపరుస్తూ చాలా ఓపిగ్గా, పాఠం చెప్పేవాడు. మాకు అందులోని ప్రాథమిక విషయం అవగాహన అవడానికి కనీసం మూడు నాలుగు నెలలు పట్టి ఉంటుంది.
కొన్నాళ్ళకి అతను రంగు రంగుల సుద్దముక్కలు తీసుకొచ్చి పాఠం చెబుతూ, సరియైన సమాధానం చెప్పిన వాళ్ళకి ఒక రంగు సుద్దముక్క బహుమతిగా ఇవ్వడం ప్రారంభించాడు. ముంగిలా ఎవరితోనూ మాటాడకుండా కూచునే చంద్రం ఒక్కడే రోజూ రంగుసుద్దలు అల్నాస్కర్ నుండి కొట్టేస్తుండేవాడు. రోజుకి ఒకటైనా రంగు సుద్దముక్క సంపాదించాలన్న కోరికతో అందరం పాఠం జాగ్రత్తగా వినేవాళ్ళం. ఒకటి రెండు సార్లు రంగుసుద్దలు సంపాదించినా, చంద్రానిదే ఎప్పుడూ పైచెయ్యిగా ఉండేది. నా క్లాసు ఫస్టుకి కూడా ఎసరు వచ్చేలా ఉండడంతో నాకు గొప్ప ఉడుకుమోత్తనంగా ఉండేది.
నా అదృష్టం కొద్దీ, మూడునెలల పరీక్షలు పూర్తవకుండా అతని ఆరోగ్యం దెబ్బతినడంతో అల్నాస్కర్ అమెరికా వెళ్ళి, తిరిగి రాలేదు.
మూడునెలల పరీక్షల తర్వాత జీవీఆర్ మాష్టారు అల్నాస్కర్ చోటులో వచ్చారు. ఆయన మొదటిసారి క్లాసు తీసుకుంటున్నారు. జీవీఆర్ అంటే అందరికీ హడలు. సన్నగా, పొడుగ్గా ఎప్పుడూ తెల్లని పంచ కట్టుకుని, ఖద్దరు లాల్చీ తొడుక్కుని, కొనదేరిన ముక్కూ, పొడవైన చెవులూ, సుబాస్ చంద్రబోసు కళ్ళద్దాల్లాంటి కళ్ళద్దాలతో ఒక పక్క భయం, మరొక పక్క భక్తీ రెండూ కలిగేవి ఆయన్ని చూస్తుంటే. ఆయన గురించి చిత్రవిచిత్రమైన కథలు ప్రచారంలో ఉండేవి. ముక్కోపి అని, కోపం వస్తే, బోర్డు తుడుచుకునే డస్టరుతో పిల్లల్ని కొట్టేవారని, రూళ్ళకర్రతో మండమీద కొట్టేవారని, లేకపోతే సొరుగులోంచి సుద్దముక్క తియ్యమని చెప్పి తీస్తుంటే సొరుగుని ఒక్కసారి మూసేసేవారనీ ఇలా ఎన్నో. అందరూ అనుకోవటం తప్ప నిజం ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ, ఆయన మాటకి ఎదురు చెబితే, లెంపలు వాయించేవారు.
జీవీఆర్ మాష్టారు క్లాసులోకి అడుగుపెడుతూనే, ‘బీజగణితంలో మీకు ఏమాత్రం అవగాహన ఉందో తెలిస్తే, దానిని బట్టి ఇకముందు ఎలా పాఠం చెప్పాలో ప్రణాళిక వేసుకుందాం,” అని చెప్పి, చిన్న సమీకరణాలమీద సుళువైన ప్రశ్నలతో ప్రారంభించి, మరుక్షణంలోనే వాటిని తిరగేసి కారణాంకాలు చెప్పమని, క్రమంగా ప్రశ్నలని జటిలం చేసుకుంటూ వెళ్ళేరు. సమాధానం చెప్పలేనివాళ్ళని బెంచీ మీద నిలబడమన్నారు. నలభై మంది ఉన్న క్లాసులో చంద్రం ఒక్కడే ఆరోజు సరైన సమాధానాలు చెప్పి బెంచీ ఎక్కకుండా తప్పించుకున్నాడు. క్లాసు మొత్తం అంతా బెంచీ మీద నిలబడ్డాం.
చంద్రంతో నేను స్నేహం చెయ్యడం ఇక తప్పదని ఆ రోజే నిశ్చయం అయిపోయింది. కాని, చంద్రానితో వచ్చిన గట్టి చిక్కు వాడు ఎవడితోనూ అంత తొందరగా స్నేహం చేసేవాడు కాదు. అందుకని మొదట్లో వాణ్ణి తిట్టుకునేవాళ్ళం గానీ వాడు ఏకాంతాన్ని ఇష్టపడతాడని, పదిమందిలో కలవడానికి బిడియం ఎక్కువని చివరకు అర్థం చేసుకున్నాను.
ఒకసారి ఏదో పత్రికలో చంద్రం రాసిన కవిత పడిందిట. వాళ్ళ నాన్నగారు తన మిత్రుడైన ఎవరో పేరున్న కవికి చూపించి అభిప్రాయం అడిగారట. ఆ కవిగారు చెప్పిన సలహాలని తోసిపారేస్తూ, తను రాసిందే బాగుందని ముక్కు సూటిగా చెప్పాడట. ఆ సంగతి చంద్రమే తర్వాత ఎప్పుడో చెప్పాడు. వాడు ఎవడినీ ఖాతరుచేసే రకం కాదు.
చంద్రంతో స్నేహం చెయ్యడానికి ఎంతో కష్టపడవలసి వచ్చింది. ఆరునెలల పరీక్షల్లో లెక్కల్లో, నేను ఫస్టు మార్కు తెచ్చుకున్నాకే వాడు నాతో స్నేహం చెయ్యడానికి మొగ్గు చూపించాడు. “కంగ్రాచ్యులేషన్స్‌రా రామనాథం!” అని చంద్రం అభినందించినపుడు నేను చుక్కల్లో కూచున్నాను.
వాడికి రకరకాల స్టాంపులూ, ఫస్ట్ డే కవర్లూ సంపాదించడం, పాటలు పాడటం మొదలైన చాలా అలవాట్లు ఉండేవి. ‘జయ జననీ పరమ పావనీ’ అన్న మనదేశం సినిమాలో సముద్రాల సీనియర్ రాసిన పాట అంటే వాడికి ఇష్టం. మా ఊర్లో కోనేటికి ఉత్తరగట్టున ఒకప్పుడు గ్రంథాలయం ఉండేది. ఆదివారాల్లోనూ, శలవు రోజుల్లోనూ చంద్రం అడ్రసు అదే. ఎప్పుడూ ఏదో చదువుతూ కనిపించేవాడు. వాడి సహవాసం వల్లనే నాకు కూడా పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది.
ఆ రోజుల్లో పరిటి వెంకట రమణగారని సైన్సు లెక్చరర్ చెఱువుకి తూరుపు గట్టున మేమున్న వాసలోనే అద్దెకు ఉండేవారు. ఆయన బ్రహ్మచారి. ఆయనకి తల్లిదండ్రులు, చుట్టాలూ పక్కాలూ ఎవరూ లేరు. మనిషి చాలా మృదు స్వభావి. పిల్లలంటే వల్లమాలిన ప్రేమ. ఇంట్లో కేరం బోర్డూ, చదరంగం, రకరకాల పుస్తకాలూ ఉంచి పిల్లల్ని అక్కడే ఆడుకోమని, చదువుకోమనీ అనేవారు. నాకు చిన్నప్పటినుండీ ఆయన దగ్గర చేరిక. ఇంట్లో ఎప్పుడూ ఒకరిద్దరు విద్యార్థుల్ని ఉంచుకుని ఆయనే చదువు చెప్పించేవారు.
వాళ్ళది గోదావరి ప్రాంతంలో ఏదో పల్లెటూరు. సంప్రదాయ కుటుంబం. ఒకసారి పెద్ద వరద వచ్చి, అందరూ కొట్టుకుపోగా, అతను మాత్రం ప్రాణాలతో బయటపడ్డారట. అనాథగా మిగిలిన అతన్ని ఎవరో దయాళువు విజయనగరం తీసుకువచ్చి సంస్కృత కళాశాలలో ప్రవేశపెట్టి, ఉచిత భోజన సదుపాయం, విద్యార్థి భోజన సత్రంలొనే వసతీ కల్పించడం వల్ల స్కూలు ఫైనలుదాకా అక్కడ చదివి, తర్వాత పిల్లలకి ట్యూషన్లు చెప్పుకుని మహరాజా కళాశాలలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్శిటీలో ఎమ్.ఎస్‌సి. చేసి, చదువుకున్న కళాశాలలోనే ఉద్యోగం సంపాదించారు. నేనూ, వేణూ, చంద్రం అతని ప్రియ శిష్యులం కావడంతో, యూనివర్శిటీలో చేరేదాకా సైన్సూ, లెక్కల్లో ఏ సందేహం వచ్చినా ఆయన దగ్గరికే పరిగెత్తేవాళ్ళం.
ఆయనకి భారతీయ తత్త్వశాస్త్రమన్నా, సంస్కృతి అన్నా వల్లమాలిన అభిమానం. పాఠాలు చెబుతున్నపుడు మధ్యమధ్యలో ఈ విషయాలు దొర్లించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సంప్రదాయం పట్ల కొంత మొగ్గు ఎక్కువ ఉన్నప్పటికీ, ఏది చెప్పినా, సంప్రదాయాన్ని, సైన్సునీ మేళవిస్తూ మనసుకి హత్తుకుపోయేలా చెప్పేవారు. ఒకసారి క్లాసులో ‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’ అన్న నానుడి ప్రస్తావన వచ్చింది.
గురువుగారి ఆలోచనలు ఒక విషయం నుండి మరొక విషయానికి వెళ్ళి చివరకి ‘సత్యం స్వరూపం ఏమిటి?’ అన్న ప్రశ్నకి దారి తీశాయి. సత్యం అన్నదానికి అస్తిత్వం ఎప్పుడూ ఉంటుందని, అది మన ఎదురుగానే ఉంటున్నప్పటికీ మనకి కనిపించకపోవచ్చునని, దాన్ని మనం పంచేంద్రియాలద్వారా, బుద్ధి ద్వారా తెలుసుకోడానికి అవకాశం ఉంది అని గురువుగారు అన్నారు.
అప్పుడు చంద్రం, “గురువుగారూ! ఇది సత్యం అని చెబితే నమ్మడమేనా, లేక ఎవరైనా దాన్ని స్వయంగా పరీక్షించి తెలుసుకోవచ్చా? దాని స్వభావమేమిటో మనకి తెలియనప్పుడు, ఎదురుగా ఉన్నది సత్యమని నిర్ధారించడం ఎలా?” అని అడిగేడు.
దానికి గురువుగారు, “మంచి ప్రశ్న వేశావు. దీన్ని రెండు భాగాలుగా విడగొడతాను. ఒకటి సత్యం ఎవరైనా తెలుసుకో సాధ్యమా? రెండవది అది సత్యమే అని నిర్ణయించడం ఎలా అన్నది. ఈ సృష్టిలో సత్ అంటే దాని ఉనికికి కారకుడైన పరమాత్మ ఒక్కడే. ‘ఒక్కడే’ అని నేను పుంలింగం వాడుతున్నప్పటికీ ఆ పరమాత్మ పురుషుడో, స్త్రీనో ఎవరికీ తెలియదు. ఈ పరమాత్మకి మూడు మౌలిక లక్షణాలు ఉన్నాయి: సత్యం, జ్ఞానం, అనంతం. ఈ పరమాత్మ అస్తిత్వం సత్యం. అంటే, తక్కిన ప్రతి వస్తువు విషయంలోనూ దాని అస్తిత్వానికి మూలకారణం ఒకటి అవసరమైనప్పటికీ, పరమాత్మ అస్తిత్వానికి మూలకారణం లేదు. తనని తాను సృష్టించుకోగల పరమాత్మ సృష్టికి ముందుకూడా ఉన్నాడు. జ్ఞానమే పరమాత్మ, అతడు అనంతుడు, అంటే కాలాతీతుడు. మనం చూసే ఈ చరాచర సృష్టి, దాని వైవిధ్యం అంతా వ్యక్త పార్శ్వం; ఇంద్రియజ్ఞానంతో ఈ పార్శ్వాన్ని గ్రహించగలం. అవ్యక్త పార్శ్వం తాపసులకి, అంటే దానిగురించి తీవ్రంగా కృషిచేసే జిజ్ఞాసువులకి మాత్రమే సాధ్యం. ఉదాహరణకి, కొన్ని వేల ఏళ్ళ క్రితం జిజ్ఞాసువైన ఒక ముని సృష్టి పూర్వస్థితి గురించి నాసదీయ సూక్తంలో అద్భుతంగా వర్ణిస్తాడు. న, అసత్, అన్న ఆ సూక్తంలోని మొదటి రెండు మాటలనుబట్టి సూక్తానికి ఆ పేరు వచ్చింది. అది ఋగ్వేదం 10వ మండలంలో ఉంది. ఈ రోజు భౌతికశాస్త్రజ్ఞులు బిగ్ బాంగ్ అని పిలుస్తున్న సమయానికి పూర్వస్థితికి అతని ఊహ సరిపోలుతుంది. దాని గురించి తర్వాత ఎప్పుడైనా మాటాడుకుందాం.
“ఇప్పుడు నువ్వడిగిన రెండవ ప్రశ్న, సత్యాన్ని సత్యమని నిర్ణయించడం ఎలా అన్నదానికి వద్దాం. ఇది అన్నిటిలోకీ క్లిష్టమైనది. ఒక ప్రమేయాన్ని తప్పని చెప్పడానికి ఒక ఉదాహరణ సరిపోతుంది కాని, దాన్ని ఋజువు చెయ్యడానికి వెయ్యి ఉదాహరణలు సరిపోవు. వెయ్యిన్నొక్కసారి, అది అనుభవంలో తప్పు కావచ్చు. అందుకని జీవితంలో మనకి కనిపించే, లేదా ఎవరైనా తన అనుభూతిగా ప్రకటించే అనుభవాన్ని సత్యమా, కాదా అని నిర్ణయించడానికి, తర్కానికి లొంగే కొన్ని ప్రమాణాలు – ప్రత్యక్షమని, పరోక్షమని, అనుమానమని, ఉపమానమని – ఏర్పరచారు. వస్తువుని ఆశ్రయించి ఉండే సత్యం దేశ, కాల, పాత్ర, పరిమితులకు లోబడకుండా ఉంటుంది. ఆ పరిమితులకు లోబడినపుడు అది వైయక్తిక సత్యం అవుతుంది తప్ప సార్వజనీనిక సత్యం కాదు, కాలేదు. ఉదాహరణకి ఉప్పు, పంచదార, కర్పూరం, ఇంద్రధనుస్సూ వంటివి ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా తమ తమ రుచుల్నీ, రంగుల్నీ ఒకే విధంగా ప్రకటిస్తాయి. అది ప్రత్యక్ష ప్రమాణం. అంటే కంటికి ఎదురుగా ఉన్నదానిని పరీక్షించి నిర్ణయించడం. మనం ఉన్నచోట వర్షం పడకపోయినా, ఎక్కడినుండో గాలి మోసుకు వచ్చే వింత వాసన చూసి, మనం ఎక్కడో వర్షం పడుతోందని గ్రహిస్తాం. అది అనుమాన ప్రమాణం. మీరు శుక్రగ్రహం మీద సల్ఫర్ ఉందని, కుజగ్రహం మీద ఇనుము ఎక్కువ ఉందనీ చదివి ఉంటారు. శాస్త్రజ్ఞులకి ఎలా తెలిసింది? ప్రతి మూలకానికీ ఒక నిర్దిష్టమైన కాంతి తరంగం ఉంటుంది. అది విశ్వంలో ఏ మూలనుండి వచ్చినా ఆ తరంగం ఒక్కటే. ఒక ఖగోళ వస్తువునుండి ప్రతిఫలించే కాంతి తరంగాలను విశ్లేషించి మనకు తెలిసినవాటితో సరిపోల్చి అక్కడ ఏ యే మూలకాలున్నాయో నిర్ణయిస్తారు. ఇది ఉపమాన ప్రమాణం…”
అంటూ సత్యాన్ని ఎన్ని రకాలుగా నిర్ధారిస్తారో గురువుగారు అటు సంప్రదాయాన్ని, ఇటు సైన్సునీ మేళవిస్తూ ఎంతో ఆసక్తికరంగా చెప్పారు. అంతా అర్థం అయిందని చెప్పలేను గానీ ఆ అర్థం అయీ అవని స్థితే, మా ఇద్దరిలోనూ నాసదీయ సూక్తం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం రేకెత్తించింది. చంద్రం, ఋగ్వేదావధానిగారి ఇంటికి వెళ్ళిమరీ ఆ నాసదీయ సూక్తాన్నీ, దాని అర్థాన్నీ చెప్పించుకుని వచ్చాడు.
నా సంగతి మాటకేం గాని, గురువుగారు చెప్పిన విషయాలు చంద్రం జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేశాయో అతని పరిశోధనే ఋజువు చేసింది.
జీవితం ఎప్పుడు ఏ మలుపు తిప్పుతుందో తెలీదు. ఆ క్షణంలో మనం గ్రహించలేం కానీ, ఒక గొప్ప మానసిక సంఘర్షణకి లోనైన తర్వాత, నమ్మలేనంతగా, అప్పటి వరకు నడుస్తున్న త్రోవకి పూర్తిగా వ్యతిరేకదిశలో జీవితం మలుపు తిరిగిపోతుంది. అప్పటి వరకు నమ్మిన విశ్వాసాల స్థానాన్ని కొత్త నమ్మకాలు ఆక్రమించుకుంటాయి. అలా జరుగుతుందని మనం ఆ క్షణంలో గాని, అంతకు ముందు వరకు గాని ఊహించనైనా ఊహించలేం.
ఎమ్.ఎస్‌సి. తర్వాత ఇద్దరం యూనివర్శిటీలో రీసెర్చి స్కాలర్స్‌గా చేరాం. డిపార్ట్‌మెంటుకి నడచి చేరుకునేపాటి దూరంలో గది అద్దెకు తీసుకున్నాం. మా ప్రక్క గదిలో నారాయణరావు, నర్సింగరావు అని బోటనీ స్కాలర్స్, వాసు అని మేథమేటిక్స్ స్కాలరూ ఉండేవాళ్ళు. చంద్రానికి కొన్ని నియమాలుండేవి. ఉదయాన్నే సంధ్యావందనం చేసేవాడు. శనివారం ఉల్లిపాయ తినేవాడు కాదు. ఆరు నూరయినా శనివారం హార్బరు దగ్గర వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళకుండా రాత్రి ఫలహారం చేసేవాడు కాదు. వీటిని చూసి అప్పుడప్పుడు వాళ్ళు ఆటపట్టిస్తుండేవారు కూడా.
ఆ రోజు శుక్రవారం. మేముంటున్న చోట పోలేరమ్మ జాతర జరుగుతోంది. మాది రోడ్డుని ఆనుకున్న గదేమో, ఇక రాత్రి పదిదాకా అరుపులూ, కేకలూ, మైకులో పాటలతోనూ, ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమం పేరుతో సినిమా పాటల రికార్డు డాన్సులతోనూ హోరెత్తిపోతోంది. కిటికీలూ, తలుపులూ బిడాయించుకుని అందరం కబుర్లు చెప్పుకుంటున్నాం. సినిమాలు, క్రికెట్, రిసెర్చి గోలలు, యూనివర్శిటీలో ఉద్యోగావకాశాలూ… ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్పుకుని, చివరకి మా సంభాషణ దేవుఁడున్నాడా, లేదా? అన్న చర్చకి దారి తీశాయి. తెల్లవార్లూ చర్చించుకున్నాం. చంద్రం, నేనూ, దేవుఁడున్నాడనీ; వాళ్ళు ముగ్గురూ లేడనీ.
చిత్రం ఏమిటంటే, తర్వాత రెండురోజులపాటు చంద్రం గొప్ప మానసిక సంఘర్షణకి గురయ్యాడు. మూడవరోజు నుండీ రోజూ చేసే సంధ్యావందనం మానేశాడు. ఆ శనివారం ఉల్లిపాయ వేసిన కూరతో పూరీలు తిన్నాడు. గుడికి వెళ్ళడం మానేశాడు. నాస్తికుడిగా మారిపోయాడు. మరింత ఆశ్చర్యకరమైన విషయం వాళ్ళు ముగ్గురూ ఆస్తికులుగా మారిపోవడం. నేనైతే నిజమని నమ్మలేకపోయాను. చిన్నప్పటినుండి వచ్చిన విశ్వాసాలని ఒక్కసారి చంద్రం ఎలా వదులుకోగలిగేడో నాకు అంతుపట్టలేదు. నాకు దాన్ని ఎలా సమన్వయించుకోవాలో తెలియలేదు. అదే విషయం చంద్రాన్ని అడిగాను.
“రామనాథం! రెండు రోజులు మన వాదనని, వాళ్ళ వాదననీ బేరీజు వేసుకున్నాను. ఇప్పటి వరకు నా నమ్మకాన్ని, దాని వెనుక గల కారణాల్నీ సవాలుచేసే పరిస్థితి ఎదుర్కోలేదు. వాళ్ళ పరిస్థితీ అదే కావొచ్చు. చివరకి గ్రహించింది ఏమిటంటే, సైన్సుకైనా మతానికైనా కొన్ని స్వయంసత్యాలుంటాయి. మనం అంగీకరించేవి. A priori అంటారు వాటిని. ఏ విధమైన సందేహానికి, విమర్శకూ అతీతమైనవి. అవి హేతువుకి లొంగవు. అంతేకాదు, ఎందుకు అంగీకరించాలన్నదానికి తగిన కారణమూ కనిపించదు. ఈ విషయంలో రెండింటికీ నమ్మకమే ప్రధానం. ఆ ప్రాథమిక ప్రతిపాదనలని స్వయంసత్యాలని అంగీకరిస్తేనే, వాటి పునాదిమీద, తక్కిన సిద్ధాంతం నిలబడుతుంది. ఏ మతంలో చూసినా దేముడు స్వయంభువు. కార్య-కారణ న్యాయాన్ని అనుసరించి, ఏ వస్తువు అస్తిత్వానికైనా ఒక కారణం ఉంటుందని మనం అంగీకరించినపుడు, దేవుడు ఎలా స్వయంభువో మతం మన వివేకాన్ని సంతృప్తిపరచగలిగేలా చెప్పలేదు. అంతే కాదు, ‘అతను సర్వవ్యాపి, సర్వ శక్తిమంతుడు, సర్వజ్ఞుడు,’ అని మనల్ని ప్రశ్నించకుండా నమ్మమంటుంది.
“అలాగే, సైన్సు, సృష్టికి బిగ్ బాంగ్ మూలకారణం అంటుంది. విశ్వం వ్యాకోచిస్తోందని, దూరంగా ఉన్న గెలాక్సీలు ఇంకా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నాయనీ చెబుతుంది. ఇంత రోదసి, ఇంత పదార్థమూ ముందే అక్కడ ఎలా ఉన్నాయి? ఎక్కడినుండి వచ్చాయి? వీటిని ఎవరు సృష్టించారు? అలా వ్యాకోచించడానికి బిగ్ బాంగ్‌కి ముందరి పరిస్థితులని సైన్సు ఊహించగలదు గాని, ఎందుకు అలా ఉన్నాయో చెప్పలేదు.
“అయితే రెండింటికీ ముఖ్యమైన తేడా, సైన్సు తన అజ్ఞానాన్ని అంగీకరిస్తుంది. ఆ సత్యాన్ని తెలుసుకుందికి పరిశోధనలు చేస్తూనే ఉంటుంది; మతం తన అజ్ఞానాన్ని మార్మికత మాటున దాచుతుంది. అంతే! నిన్నటి వాదన, ప్రతివాదనలు నా విశ్వాసాలని నిశితమైన తార్కికపరీక్షకి నిలబెట్టాయి. ఒక పరిశోధక విద్యార్ధిగా నమ్మకానికంటే, వివేకానికే తలవంచాను. నమ్మకం, వివేకం – ఈ రెంటిలో దేనిమీద ఎక్కువగా ఒక మనిషి విశ్వాసాలు ఆధారపడతాయో, దానికి అనుగుణంగా ఆ వ్యక్తి ఆస్తికుడిగానో, నాస్తికుడిగానో మారుతాడని ఇప్పుడు గ్రహించాను” అన్నాడు.
కొద్దిరోజులకే చంద్రం కాన్పూర్ ఐ.ఐ.టి.లో సీటు తెచ్చుకుని వెళ్ళిపోయాడు. తర్వాత నేను అందుకోలేని, ఊహకి కూడా అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు.
కొన్ని రోజులకి తన పరిశోధనాభిలాష పార్టికల్ ఫిజిక్స్ వైపు మళ్ళిందని, తనిప్పుడు అక్కడి ఆక్సిలరేటర్ మీద పని చేస్తున్నాననీ రాశాడు. చివరగా, ఐ.ఐ.టి. పవాయ్‌లో జరిగిన నేషనల్ సైన్స్ కాంగ్రెస్‌లో ఒకసారి కలిసేడు. తనకి సెర్న్‌లో పోస్ట్ డాక్టరల్ వర్క్ చెయ్యడానికి అవకాశం వచ్చిందని, త్వరలో తన సూపర్ సీనియర్ వివేక్ శర్మతో పనిచెయ్యడానికి జెనీవా వెళ్తున్నాననీ చెప్పాడు.
హిందూ పేపరులో ఈ ప్రాజెక్టులోనే పని చేసిన మరొక భారతీయ శాస్త్రవేత్త అర్చనా శర్మ ఇచ్చిన ఇంటర్వ్యూ చదివి, ఒక బృహత్తర యత్నం చేసి చంద్రం వివరాలు సేకరించి అభినందిస్తూ మెయిల్ చేశాను. జవాబుగా వెంటనే నాకు ఫోను చేశాడు. పీవీఆర్ మాష్టారిని దర్శించుకోవడానికి త్వరలో ఇండియా వస్తున్నానని చెప్పాడు. నేను కూడా గురువుగారిని చూసి చాలా రోజులైందని చెప్పి, విమానాశ్రయంలో చంద్రాన్ని కలుసుకుని అక్కడ నుండి నేరుగా ఇద్దరం గురువుగారిని చూడటానికి ప్రణాళిక వేసుకున్నాం.
చంద్రంతో గడిపిన రెండు రోజులూ రెండు నిముషాల్లా గడిచిపోయేయి. నా రిసర్చ్ గురించి అడిగాడు గాని ఏవో పొడిపొడి సమాధానాలు చెప్పి మాట తప్పించి వాడి విషయాలకి మళ్ళించాను.
చివరకి, “ఒరేయ్ చంద్రం! హిగ్స్ బోసాన్ గురించి పత్రికలు ఊదరగొడుతున్నాయి. మీ బాస్ కూడా నాసదీయ సూక్తం తనకి స్ఫూర్తి నిచ్చిందని ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. ఏమిటి దాని ప్రత్యేకత?” అని అడిగాను.
“రామనాథం! కార్ల్ సేగన్ శాస్త్రీయ దృక్పథం గురించి రెండు మంచి మాటలు చెప్పాడు. ఒకదానికొకటి పైకి విరుద్ధంగా కనిపించే ప్రతిపాదనలని సరితూచి, సమన్వయించగలగడమే సైన్సుకున్న బలమైన, మౌలిక శక్తి అనీ; ఎంత అసంబద్ధంగా కనిపించినా, మన విశ్వాసాలకీ, అనుభవాలకీ ఎంత వ్యతిరేకంగా ఉన్నా, కొత్త ఆలోచనలని ఆహ్వానించడమూ, వాటిని నిర్దాక్షిణ్యంగా, సహేతుకంగా విమర్శించి తూర్పారబట్టడం ద్వారానే వాటి అంతరాంతరాల్లో దాగున్న సత్యాలని అది వెలికి తీయగలదనీ. నాసదీయసూక్తంలో ఆ పూర్వఋషి చెప్పిన మాటల్లో నిగూఢమైన సత్యం ఒకటి ఉంది. ఈ సృష్టి అంతా మాయతో, చీకటిలో కప్పబడి ఉందని. ఆ చీకటి ఒక ‘ప్రతీక’ అయి ఉంటుందని మా టీమ్ లీడ్ వివేక్ శర్మ చాలాసార్లు అంటుండేవారు. ఈ విశ్వం అంతా ఒక శక్తి వ్యాపించి ఉంది. దాన్ని హిగ్స్ ఫీల్డ్ అంటాం. సృష్టికి అవసరమైన పదార్థాన్ని హిగ్స్ ఫీల్డ్ ఇస్తుంది. అయితే దాని ఉనికిని మనం నిర్ధారించలేకపోయాం ఇప్పటిదాకా. హిగ్స్ బోసాన్ ఆ ఫీల్డ్‌కి చెందిన మౌలికమైన పరమాణువే. దాన్ని కనుక్కోవడం వల్ల హిగ్స్ ఫీల్డ్ కేవలం ఊహ కాదని, సత్యమనీ ఋజువయ్యింది. సృష్టిలో ఇప్పటికీ అంతుపట్టని కృష్ణపదార్థం, కృష్ణశక్తి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవలసిన చాలా విషయాలు ఉన్నాయి. హిగ్స్ బోసాన్ ఆవిష్కరణ ఆ దిశలో కొత్త పరిజ్ఞానానికి, కొత్త ఆవిష్కరణలకీ దారి తీస్తుందని నాకు నమ్మకంరా!
“సృష్టి ప్రారంభ క్షణంలో ఉన్న ద్రవ్యరాశి సరిగ్గా ఇప్పుడు విశ్వం వ్యాకోచిస్తున్న వేగానికి సరిగ్గా అతికినట్టు సరిపోయే ప్రమాణంలో ఉంది. అంతకంటే (అంటే దశాంశస్థానంలో 13వ అంకె వరకు సమానంగా ఉంటూ 14వ అంకెలో) ఏ మాత్రం ఎక్కువయినా ఈ పాటికి విశ్వం ఎప్పుడో కుంచించుకుపోయేది. అంతకంటే ఏ మాత్రం తక్కువున్నా, ఇప్పటి కంటే ఎన్నో రెట్లు వ్యాకోచించి ఉండేది. వ్యాకోచించే విశ్వగోళపు వ్యాసార్థాన్ని కాలం మీద ఆధారపడిన చరరాశిగా చేసుకుని, సృష్టి వ్యాకోచ వేగానికి అనేక విలువలకు ప్రతిపాదించి, ఆ విలువలకి తగ్గ ఫలితాలు రాబడుతూ, 1922లో అలెగ్జాండర్ ఫ్రీడ్‌మన్ అన్న రష్యను ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒక ముఖ్యమైన వ్యాసం ప్రచురించాడు. 1923లో ప్రచురించిన తన పుస్తకం World as a Space and Timeలో ఫ్రీడ్‌మన్ బిగ్ బాంగ్‌కి తాను సాధించిన సమాధానాలలో ఒకటైన అనంతవిశ్వాల నమూనాకు (సృష్టి-వినాశం-సృష్టి చక్రీయంగా అనంతంగా సాగుతాయి) హిందూపురాణ గాథలు ప్రేరణ అని చెప్పుకున్నాడు.
“నాసదీయ సూక్త ఋషి ఊహ ప్రకారం కూడా సృష్టి, స్థితి, లయలు చక్రీయంగా కొనసాగుతాయి. ఒక ప్రళయం తర్వాత, తిరిగి సృష్టి జరిగే వరకూ, దేనికీ అస్తిత్వం లేదు. స్థలం అన్నదే లేదు. కాలం లేదు, మృత్యువు, అమృతత్వం/ శాశ్వతత్వం ఏవీ లేవు. క్రింద-మీద, కుడి-ఎడమ లేవు; చివరకి శూన్యం కూడా లేదు. అంతా చీకటి. చీకటిలో మునిగినట్టున్న చీకటి. అటువంటి చీకటి కప్పిన, పదార్థం లేని స్థితినుండి, ఈ ప్రకృతి అంతా సృష్టించబడింది. అది ఎలా సృష్టించబడిందో ఎవరూ చెప్పలేరు. బహుశా ఈ స్థితినే బసవరాజు అప్పారావుగారు తన గేయంలో, ‘జగములన్నీ కాలయోనిలో మొగములెరుగక నిదురవోవగ’ అని అని ఉంటారు.
“ఈ రెండు ఆలోచనలకీ దగ్గర పోలికలు ఉన్నాయి.”
“ఎనీ వే, ఇక ఉంటానురా! థాంక్యూ! చాలా రోజుల తర్వాత ఇద్దరం క్వాలిటీ టైమ్ గడిపాం. మళ్ళీ కలుద్దాం!” అంటూ చెక్-ఇన్ వైపు దారి తీశాడు.
చెక్-ఇన్ పూర్తి చేసుకుని సెక్యూరిటీ చెక్‌కి వెళుతూ, ఎస్కలేటర్ మీంచి చెయ్యి ఊపి టాటా చెబుతున్న చంద్రాన్ని చూస్తుంటే, నాకు కన్నీటిపొర అడ్డుతగిలి చంద్రం చంద్రంలా కనిపించలేదు. శాస్త్రజ్ఞుడిగా మారిన ఒక పురాతన ఋషి కనిపించాడు.
[హిగ్స్ బోసాన్ ఆవిష్కరణ వంటి చారిత్రక సత్యం, కార్ల్ సేగన్, అర్చనా శర్మ, వివేక్ శర్మ వంటి కొన్ని పేర్లు మినహా తక్కినదంతా పూర్తిగా కల్పన. ఎక్కడ ఏమాత్రం పోలికలున్నా యాదృచ్ఛికం అని రచయిత సవినయంగా మనవి చేసుకుంటున్నాడు. జులై 4, 2022కి హిగ్స్ బోసాన్ కనుక్కొని 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వ్రాసిన కథ.]