ఈ రోజుల్లో భావవ్యక్తీకరణ హక్కుల గురించిన వాదాలను పలుకోణాలనుండి చూడాల్సి వుంది. భారతదేశానికి సంబంధించినంతవరకు భావవ్యక్తీకరణ విషయంలో జరిగే తిరుగుబాటుకీ కులవ్యవస్థకీ ఉన్న సంబంధం అతి కీలకమైనది. ఆ దృష్టితో చూసే ఒక చిన్న ప్రయత్నమే ఇది.
కులవ్యవస్థ పాటించే సమాజంలో ‘తాను-ఇతరులు’ అన్న క్రమానుగతమైన భేదం (hierarchical difference) చాలా బలంగా పాతుకుపోయి వుంది. తాను అంటే తననీ తన కులాన్ని సూచిస్తుంది. ఇతరులంటే మిగిలిన కులాలవాళ్ళు. తనను తాను హెచ్చుగాను, ఇతరులను ఎప్పుడూ తనకంటే తక్కువగానూ చూసే మనస్తత్వం సహజంగానే ఉంది. ఈ మనస్తత్వమే తనకంటే పైన హెచ్చుగా మరొక కులం ఉందని కూడా అంగీకరించడానికి కారణమవుతుంది. రోజువారీ జీవితంలో ఈ వివక్షని సాధారణంగా ఎదుర్కొంటుంటాము.
మామూలు సంభాషణల్లో ‘మావాళ్ళు’ అని ఒకరు మొదలుపెట్టారంటే తన కులస్థుల గురించి చెప్తున్నాడని అర్థం. ‘మా ఆచారాలు’ అనంటే తమ కులపు అలవాట్లను ప్రస్తావిస్తున్నాడని అర్థం. ‘మీరేవుట్లు?’ అని ప్రశ్నించి కులం తెలుసుకుంటుంటారు. పల్లెటూళ్ళనుండి, పట్నందాక ఎక్కడున్నా ఒక్క మాటతో తమని వేరుపరచుకొని ఇతరులను అన్యులను చేసేయొచ్చు. తాను-ఇతరులు అన్న ఈ వివక్ష భావవ్యక్తీకరణ ప్రతిఘటింపు, అసహనం అన్నవాటిల్లో బహిరంగంగానూ సూక్ష్మంగానూ అమలవుతూ ఉంటాయి.
ఒక కులస్థులు మరొక కులస్థుల అలవాట్లను సహించరు. ఇతర కులస్థుల వ్యవహార, ఆచారాల పట్ల చులకన భావం ప్రదర్శిస్తుంటారు. ఒకే కులానికి చెందిన పెళ్ళిళ్ళలో కూడా ప్రాంతాలు వేరైతే అడిగే మొదటి ప్రశ్న, ‘మన ఆహారపు అలవాట్లు వేరు, వాళ్ళవి వేరు. ఎలా కుదురుతుంది?’ అన్నదే. మన దేశంలో కులాలనుబట్టీ ప్రాంతాలనుబట్టీ ఆహార విషయాల్లో చిన్న చిన్న తేడాలున్నాయి. ప్రాథమికంగా వరన్నము, కూరలు, రసం ఒకటే అయినప్పటికీ తేడాలున్నట్టు భావించడం, వాటిని గేలి చెయ్యడం సాధారణంగా చూస్తుంటాము. ఇక ఇతర కులాల ఆహారపు అలవాట్ల గురించి అసహ్యించుకోవడం, కించపరచడం కూడా చేస్తుంటారు.
అలానే ప్రతి భాషలోనూ ప్రాంతాలవారీగా రకరకాల మాండలికాలున్నాయి. అయితే ఒకే ప్రాంతంలో ఉన్న వివిధ కులాలవాళ్ళు మాట్లాడే భాష గేలికి గురవుతూ ఉంటుంది. ముఖ్యంగా అగ్రకులాలవారు మేలైన భాష మాట్లాడుతున్నట్టూ తక్కువ కులాలవారు అశిష్ట భాష మాట్లాడుతున్నట్టూ చిత్రించడమూ సమాజంలో ఉంది. సంస్కృత నాటకాల్లోనూ ఈ తేడా స్పష్టంగా చూపబడి ఉంది. ఆ కొనసాగింపు అన్ని రంగాల్లోనూ కనబడుతూనే ఉంది. పౌరాణిక నాటకాల్లో పరిచారకులూ విదూషకులూ మాట్లాడే భాషకూ ప్రధాన పాత్రలు మాట్లాడే భాషకూ తేడా ఉంటుంది.
తొలినాళ్ళ చలనచిత్రాల్లో నాయకుడు గ్రాంథిక/రాత భాషలోనూ హాస్యపాత్రలు పల్లెటూరి యాసల్లోనూ మాట్లాడటాన్ని గమనించవచ్చు. అది ఇప్పటికీ సినిమాలలో కొనసాగుతూనే ఉంది. మిగిలిన అన్ని పాత్రలూ ఒకే రకమైన భాష మాట్లాడినా హాస్యనటులు వాడే పదాలు కొన్ని నేలబారుగా ఉండటం గమనించగలము. ఒకరకంగా నాయకుడి పాత్ర అగ్రకులంగానూ హాస్య నటుడి పాత్ర అణగారిన కులంగానూ తేడాలు చూపించడానికి ఈ భాషలను వాడతారు. కుల ప్రతిష్ఠలను హైలైట్ చేసే సినిమాలలో ఈ తేడా స్పష్టంగానే కనబడుతుంది.
ఇలా సమాజంలోని వివిధ స్థాయిలలో ఈ వివక్ష కొనసాగుతుంది. తాను, ఇతరులు సమానం కాదన్నది బట్టబయలు. సాటి మనిషి తనకి సమానమే అని భావించలేని కులవివక్షతో చూసే మనిషి మనసు ఇతరుల అభిప్రాయాలకు తగిన గౌరవం ఎలా ఇవ్వగలదు?
అగ్రకులానికి చెందిన వ్యక్తితో తక్కువ కులానికి చెందిన వ్యక్తి మాట్లాడటం అన్నది సాటి మనుషుల మధ్యన జరిగే సంభాషణలా ఉండదు. వారి శరీర భాష (body language) గమనార్హం. తరగతి గదుల్లో పిల్లల అరుపుల్ని తగ్గించడానికి ఉపాధ్యాయులు పాటించే ఒక పద్ధతి, పిల్లల్ని చేతులు కట్టుకుని నోటి మీద వేలు పెట్టుకోమనడం. పిల్లలు అరుస్తూ, గోలచేస్తూ సందడిగా ఉన్న తరగతి గది లోపలకి ఉపాధ్యాయుడు రాగానే గద్దించి చెప్పే వాక్యం, ‘అందరూ చేతులు కట్టుకుని నోటిమీద వేలుపెట్టుకోండి’. వెంటనే పిల్లలు ఒక చేయి మడిచి పొట్టమీద పెట్టుకుని మరో చేతిలోని అన్ని వేళ్ళూ ముడుచుకుని చూపుడు వేలిని పెదవులపై పెట్టుకుంటారు. ఇది శిక్ష కాదు. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి చేసే ఒకానొక యుక్తి.
ఇదెక్కడనుండి వచ్చిందంటే అగ్ర కులస్థుడికీ బలహీన కులస్థుడికీ మధ్య సంభాషణలో బలహీన కులస్థుడి శరీర భాష నుండి తీసుకోబడింది. వంగిన నడుము, ఒంటిచేతిని పొట్టమీద పెట్టుకుని మరో చేయిని నోటికడ్డం పెట్టుకుని మాట్లాడుతాడు. బలహీన కులంవాడి ఎంగిలి తుంపర్లు అగ్రకులస్థుడి మీద పడితే అంటు అన్నది ఆచారం. అలా నడుం వంచుకుని చేయడ్డుపెట్టుకుని మాట్లాడేప్పుడు గొంతు హెచ్చే అవకాశమే లేదు. హీనస్వరం మాత్రమే వినిపిస్తుంది.
ఒక్క శరీర భాషలోనే కాదు, సంభాషణా భాషల్లో కూడా తక్కువ, ఎక్కువ అన్న అసమానత్వం ఉండటం గమనించవచ్చు. అగ్ర కులస్థుడు తక్కువ కులస్థుడ్ని సంబోధించేప్పుడు ‘రేయ్’ అని గౌరవం లేకుండా పిలవచ్చు. తనకంటే వయసులో ఎంత పెద్దవారైనా సరే రేయ్ అనో, పేరు పెట్టి పిలవడమో ఇప్పటికీ గమనిస్తుంటాము. తక్కువ కులస్థుడు అయ్యగోరూ, సాములూ, బాబూ, వంటి గౌరవమైన పదాలే వాడతాడు. పైన, కింద అన్న రెండు స్థాయిల్లో ఉన్న వారి సంభాషణలో పైకులస్థుడి భాషలో ఆధిక్యత ధ్వనిస్తుంది.
విశదంగా చెప్పాలంటే ఆజ్ఞాపించే భాష, బోధన భాష, విచారించే భాష అని దానిని చెప్పుకోవచ్చు. తాను ఇచ్చేపనిని చేయమన్నప్పుడు ఆజ్ఞాపించే అధికార భాష. ఎలా చెయ్యాలి, ఎలా నడుచుకోవాలని చెప్పేప్పుడు బోధన ధ్వనించే భాష. పని ఎంతవరకు వచ్చిందని నిలదీసేప్పుడు విచారించే భాష. ఇవి రోజువారీ జీవితంలో అణగారిన వర్గంవారి మీద ప్రయోగించబడే భాషలు.
అణగారిన వర్గానికి చెందినవారి భాష గమనిస్తే అంగీకరించే భాష, ఆమోదించే భాష, విధేయత ప్రదర్శించే భాష వాడుతుంటారు. ఆజ్ఞని శిరసావహించే ‘సరేనండయ్యా’, ‘అట్టాగే అయ్యగోరూ’ వంటి పదాలు గలది అంగీకారం తెలిపే భాష. చెప్పినదాన్ని అలా విని ‘అవునండీ’, ‘అలాగేనండీ’, అనేప్పుడు ఆమోద భాష. ఇప్పటికీ ఇద్దరు సమాన స్థాయి ఉన్నవారి మధ్యన ఒకరు చెప్పినదాన్ని మరొకరు విని, ‘అలాగేనండీ’ అంటూ ఒళ్ళు వంచి హాస్యం చెయ్యడమన్నది ఉంది. ఇది తాళమెయ్యడం. ఈ పద్ధతి ఎక్కువ తక్కువ అన్న అసమానత్వ సంభాషణలనుండి వచ్చిన ఆచారం/అలవాటు. అగ్రకులస్థుడు ఎంత పనికిమాలిన మాట చెప్పినా, ఎంత అసంబద్ధంగా మాట్లాడినా దాన్ని ఎత్తి చూపించకుండా చెప్పిన ప్రతిదానికీ అమోదిస్తూ ‘అవునండయ్యా’ అనాలి. దీన్నే తాళమెయ్యడం అనంటారు. అగ్ర కులస్థుడు ఇచ్చే ఆజ్ఞలను లేదా అధికార ప్రయోగాలను శిరసావహిస్తూ ‘చేసేస్తానండయ్య’ వంటి విధేయత ప్రదర్శిస్తూ ఉండటం మరో రకమైన భాష.
ఇటువంటి వివక్ష ఉన్న సంభాషణల్లో సమానత్వమన్నది అసలుండదు. ఒకరు చెప్పేవారుగానూ, మరొకరు వినేవారుగానూ భాగస్వామ్యం వహిస్తారు. ఏదైనా సందర్భంలో చెప్పేవారి మాటలతో వినేవారు ఏకీభవించకపోతే అదో పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. దానిని ఎదిరించి మాట్లాడటం, ఎదురు తిరగటం, అనంటారు. నాకే ఎదురు తిరిగాడ్రా, నన్నే ఎదిరించాడ్రా, అనడం ఇక్కడ సాధారణంగా చూస్తుంటాము. ఇక్కడ ‘నాకే’, ‘నన్నే’ అన్న పదాల్లోని ఏ-కారం ‘అగ్ర కులస్థుడనైన నన్నే’ అన్న భావాన్ని సూచిస్తుంది.
అభిప్రాయాన్ని అంగీకరించకపోవడం అన్నది ఎదురు తిరగడంగా పరిగణించబడుతుంది. అలా ఏకీభవించకుండా తనవైపు అభిప్రాయం చెప్పే తక్కువ కులస్థుడికి దెబ్బలూ తన్నులూ కూడా పడుతుంటాయి. భావవ్యక్తీకరణ అన్నదే ఎదిరించి మాట్లాడటంగా భావించబడే నేపథ్యంలో సమానత్వమన్నది ఎక్కడుంటుంది? కొన్ని ప్రాంతాల పల్లెటూళ్ళలో టీ కొట్టుల్లో అగ్ర కులాలవారికీ తక్కువ కులాలవారికీ గ్లాసులు కూడా వేర్వేరువి వాడుతుంటారు. అలాంటి చోట అగ్రకులస్థుడికీ తక్కువ కులస్థుడికీ జరిగే సంభాషణలు గమనించినా అసమానత్వం స్పష్టం అవుతుంది. సాధారణంగా మొదలయ్యే సంభాషణ ఘాటుగా మారిపోగలదు. దానికి కారణం ఒకరి అభిప్రాయంతో మరొకరు ఏకీభవించలేకపోవడమే. వెంటనే అది ఎదిరించి మాట్లాడటంగా మారిపోయి, ఎవరు ఏంటి అన్న తారతమ్యాలు పరిశీలించడం మొదలవుతుంది.
అలాగే, చెప్పిన మాట వినడం- అన్నది ప్రజల నానుడి. పిల్లల విషయంలో పెద్దలు చెప్పే మొదటి ఫిర్యాదు ‘చెప్పినమాట వినట్లేదు’ అన్నదే. బడిలో ఉపాధ్యాయులు చేసే మొదటి ఫిర్యాదు కూడా ఇదే. ‘ఈ పిల్లలసలు చెప్పిన మాట వినరండీ’ అని చెప్పని ఉపాధ్యాయుడుండడు. ఇదికూడా కులవ్యవస్థ నుండి వచ్చిన నుడే. పైనున్నవాడు చెప్పినదానికి ఎటువంటి ఆక్షేపణా తెలపకుండ కిందున్నవాడు అంగీకరించి నడుచుకోవడం ‘చెప్పిన మాట వినడం.’ ఏమాత్రం విభేదించినా ‘చెప్పినమాట వినకపోవడం’ అన్న దుశ్చర్యగా మారిపోతుంది.
కులవ్యవస్థ సమానత్వానికి వ్యతిరేకం అన్నదానికి ఇలాంటి ఎన్నెన్నో ఉదాహరణలున్నాయి. మనుస్మృతి వంటి గ్రంథాల్లో కుల వివక్షగురించి, తక్కువ కులంవారికి ఇవ్వవలసిన శిక్షల గురించీ రాయబడి ఉన్నాయి. సామెతల్లో కూడా ఈ వివక్షలు గమనించవచ్చు. ‘భూస్వామి బఱ్ఱున పిత్తితే కేశవా మాధవా, పాలేరు పిత్తితే పట్టుకుని తన్నండి‘ – ఒకే చర్యను ఇద్దరు చేసినప్పుడు అగ్ర కులస్థుడుది ప్రకృతి సహజమైన చర్యగానూ తక్కువ కులస్థుడు చేస్తే అది ఆచార హీనంగానూ భావించబడుతుంది.
తనకంటూ ఎటువంటి అభిప్రాయమూ ఉండకూడదు, అలా ఉన్నా దానిని దాచిపెట్టుకోవాలి, పైవాడు చెప్పినదాన్ని విని నడుచుకోవాలి. ఇదే కులవ్యవస్థ ఉన్న సమాజంయొక్క పోకడ. ఈ పోకడని సమాజంలోని అన్ని అంచెల వ్యవస్థల (హైరార్కీల) లోనూ పాటిస్తుంటాము.
ఈ పరిస్థితులున్న సమాజంలో భావ వ్యక్తీకరణ, వాక్స్వాతంత్ర్యము- ఇవన్నీ నాగరిక ప్రపంచంలో మాటలుగానే వాడబడుతున్నాయి. కులవ్యవస్థ పాతుకుపోయున్న సమాజంలో ఈ కొత్త నిర్వచనాలేవీ చొచ్చుకుపోయి ప్రభావితం చేసేంతగా బలపడలేవు. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది చదువు లేకపోవడం. తన పేరు తను రాసుకోగలిన ప్రతివాడినీ చదువుకున్న వాడిగా పరిగణించేశాము. ప్రాథమిక పాఠశాలతో చదువుని ఆపేసుకున్నవారి శాతమే ఎక్కువ మనకి. ఈ రోజుకీ చదువు ఒక తప్పనిసరి అవసరం అని భావించనివారే అత్యధిక సంఖ్యలో ఉన్నారు.
రెండవది, మనకు లభించే చదువుల నాణ్యత. మామూలుగానే అక్షరాలు తెలిసుండటమే చదువని అనుకుంటారు. చదువుకున్నవాడైనప్పటికీ కులవ్యవస్థ గురించి ఏమైనా అభిప్రాయం వెళ్ళబుచ్చితే ‘చదువుకున్న పొగరు’ అన్న నిందకు గురి చేస్తారు. దానికి తోడు మన విద్యావ్యవస్థలో కులవ్యస్థలోని వివక్ష అమానుషం అన్నది అర్థంచేసుకోడానికి ఏ దశలోనూ అవకాశం కల్పించటంలేదు. కులవ్యవస్థ గూర్చి ఎటువంటి అవగాహనా కలిగించుకోకుండానే పైచదువులదాక పూర్తిచేయగలము. పెద్ద పదవుల్లో చేరి తరతరాలుగా పాతుకుపోయిన అవే కుల వివక్షలను కొనసాగిస్తూ ఉద్యోగాలు నిర్వహించవచ్చు. డాక్టర్, ఇంజినీర్, కలెక్టర్- ఇలా ఎటువంటి ఉద్యోగి అయినప్పటికీ ఈ కులవ్యవస్థని నిర్మూలించడానికి ఎటువంటి ప్రయత్నమూ చెయ్యకుండానే ఉద్యోగ జీవితాన్ని నిర్వహించవచ్చు. వారిలోని కులవిచక్షణ బయటపడకపోవచ్చు. బయటపడినా ఎటువంటి సమస్యా ఉండదు.
చదువుకున్న అందరూ జ్ఞానం కలవారు కారు. చదువు, జ్ఞానం అన్నదానికి విభేదం ఉంది. మనకి చదువు అన్నది ఆర్ధిక సంపాదన కొరకు ఏర్పడినదే. అలాంటప్పుడు ఎంత పెద్ద చదువులు చదువుకుంటే మాత్రం ఏం లాభం? ఏ రాష్ట్రం పోయినా, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసినా తమ కుల గుర్తింపునూ కుల అభిమానాన్నీ వదులుకోరు. వదులుకోవలసిన అవసరమూ లేదు. కుల వ్యవస్థ గురించిన జ్ఞానం లేకుండా ఆ వివక్షను ఛేదించే ప్రయత్నం లేకుండా, ఆ స్పృహ కూడా లేని మనోస్థితిలో జీవించే మనుషులున్న సమాజంలో భావవ్యక్తీకరణ అన్న ఆధునిక నిర్వచనాల గురించిన అవగాహన ఉండాలని ఎలా ఆశించగలం? దాని అవసరాలను ఎలా చర్చించగలం?
(28-04-17 బెంగళూరు పెన్ సంస్థ నిర్వహించిన లేఖన-2017 కార్యక్రమంలో ప్రసిద్ధ అరవ రచయిత పెరుమాళ్ మురుగన్ చేసిన ప్రసంగపాఠం.)