కేతన ఆంధ్ర భాషాభూషణము-8

క్రియలు (చివరి భాగం)

మొట్టమొదటి తెలుగు వ్యాకరణం అయిన కేతన ఆంధ్ర భాషాభూషణమునకు టీకా తాత్పర్యాలతో విశ్లేషణ వ్యాస పరంపరలో ఇది చివరి భాగం.

సంబోధనల్లో వైవిధ్యం

తే.
అన్యుఁ బిలుచుచో నిడుద లౌ నక్షరములు
కురుచ లై జడ్జముల మోచుఁ గొన్ని యెడలఁ
కొడుక రా మఱి కొడుక పో కొడుక రమ్ము
కొడుక పొ మ్మన జగతిలోఁ గూడుఁ గాన. 170

అన్యున్ = ఇతరులను; పిలుచుచో = పిలిచేటప్పుడు; నిడుదలు + ఔను = దీర్ఘంగా ఉండే అక్షరాలు; కుఱుచలు + ఐ = హ్రస్వాలై; జడ్జముల = ద్విత్వ’ము’ అంటే ‘మ్ము’ అని; మోచున్ = మోస్తాయి; కొన్నియెడల కొన్నిసార్లు; కొడుక రా = కుమారా, రా! (అనీ); మఱి = ఇంకా; కొడుక పో = కుమారా; పో! (అనీ); కొడుక రమ్ము = కుమారా, రమ్ము, కొడుకపొమ్ము = కుమారా, పొమ్ము; అన = అనే విధంగా; జగతిలోన = ప్రపంచంలో; కూడున్ + కాన = కలుస్తుంది కాబట్టి.

“ఇతరులను పిలిచేటప్పుడు దీర్ఘాక్షరాల్లో ఉండే సంబోధన కొన్నిసార్లు హ్రస్వమై, అట్లా అయినప్పుడు ద్విత్వ ము కారాన్ని (మ్ము) పొందుతుంది. ఉదా: రా-రమ్ము, పో-పొమ్ము”.

సాధారణంగా సంబోధనలు తెలుగులో దీర్ఘాంతాలుగా ఉంటాయి. రాముడా! సీతా! అని స్వరాన్ని పెంచి దీర్ఘాంతమైన అచ్చుతో పలుకుతాం (కొన్ని భాషల్లో కేవలం స్వరాన్ని పెంచడం ద్వారా మాత్రమే ఉంటుంది). కానీ రాసేటప్పుడు కావ్య భాషలో మాత్రాభేదం కోసం (గురు లఘు తేడా) హ్రస్వ – దీర్ఘ భేదాలలో భాషా నియమాల పరిధిలోనే స్వేచ్ఛ తీసుకుని ఉపయోగించుకున్నారు కవులు. దానిలో భాగమే విధ్యర్థక వాక్యంగా మనం పేర్కొనే ‘రా, పో’ లను ‘అన్యు బిలుచుచో’ అంటే ఇతరులను పిలిచేవిగా అర్థాన్ని ఆధారంగా చెప్పి ఇవి కొన్నిసార్లు హ్రస్వంగా మారుతాయనీ, అప్పుడు దాని వెంట ద్విత్వ మకారం అంటే ‘మ్ము’ వస్తుందని చెప్పాడు. ఆధునిక భాషలో రా, పో రూపాలను ఏకవచనానికీ, రండి, పొండి రూపాలను బహువచన గౌరవ వచనాలకూ వాడుతున్నాం. నాకు దొరికిన పాఠంలో ఇది ‘జడ్డముల’ మోచు అంటే జడ్డ = ద్విత్వ, ముల = ము+ము ‘మ్ము’ను పొందుతుంది అని వుంది. అయితే దేవినేని సూరయ్య ‘జడ్డలై మోచు’ (పు. 126) అని ఇచ్చాడు. అప్పుడు ‘మ్ము’ చేరడాన్ని వివరించడం సాధ్యం కాదు. అందువల్ల నాకు లభ్యమైన ప్రతిలోని పద్యమే సరియైందని భావించాల్సి ఉంటుంది. రా, పోలతో పాటు సూరయ్య తే – తెమ్ము (పు. 127) కూడా చేర్చాడు.

తే.
అన్యుఁ బనుపుచో నుఱ్ఱంత మైన శబ్ద
మచ్చు పైనున్న ముఱ్ఱంత మగుట నిజము
మొనసి పొడు వరిసేనల ననఁగఁ జనదు
పొడువు మరిసేన ననుటయె పోలుఁ గాని.171

అన్యున్ ఇతరులను; పనుపుచోన్ = ఆజ్ఞాపించేటప్పుడు; ఉఱ్ఱు+ అంతమైన శబ్దము = ఉకారాంతమైన పదం; అచ్చుపైన్ = అచ్చు మీద; ఉన్న = ఉన్నటువంటి; ముఱ్ఱు+అంతము = ముకారాంతం; అగుట నిజము = అవటం తప్పనిసరి; మొనసిపొడువు + అరి సేనలన్ = ధైర్యంగా పొడువు శత్రుసేనలను; అనఁగన్ చనదు = అనరాదు; పొడువుము + అరిసేనన్ = శత్రుసేనను పొడువుము; అనుటయె = అనడమే; పోలున్ + కాని = సరియైనది కాని. “ఇతరులను ఆజ్ఞాపించేటప్పుడు ఉకారాంతమైన శబ్దం పై అచ్చు వచ్చినట్లయితే అది ‘ముకారాంతం’ అవాలి; ఉదా: “పొడువరిసేనల” అనడం సరికాదు; ‘పొడువుము అరిసేన’ అనడమే సరియైనది”.

విధ్యర్థక వాక్యాలలో ఏక వచనంలో క్రియకు ఆధునిక తెలుగులో ఏమీ చేరదు. ధాతురూపమే విధ్యర్థకరూపంగా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చాలా క్రియలు కూడా ‘ఉ’ కారాంతాలే. ‘విధి’ అంటే ఆజ్ఞాపించటం, కోరటం లేదా చెప్పడం. అందువల్ల మనం మరొకర్ని ఏకవచనంలో “తిను!, విను!” అంటాం.

క్రియారూపం విధ్యర్థక ఏకవచనరూపం తిను తిను! విను విను! చెప్పు చెప్పు! మాట్లాడు మాట్లాడు!

కానీ కావ్య భాషకు సంబంధించిన తెలుగులో ఇలా క్రియా రూపంతో అభేదంగా ఉండే రూపప్రయోగం సరియైనది కాదనీ, –ము కారాంత ప్రయోగం ఉన్నదే సరియైనదని కేతన వ్యాఖ్యానించాడు. అందువల్లనే కావ్యభాషలో ఎక్కువగా తినుము, వినుము, చెప్పుము, పొడువుము (కేతన) ఇలా ముకారాంత రూపాలు కనిపిస్తాయి.

తే.
చునులపై నకారము పొడచూపుఁ బోవు
నొప్ప నచ్చులు పై డాసి యుండెనేని
యొదవుచున్నచో నొదవుచునున్న చోట
పొడుచుచడరెను బొడుచుచునడరె ననఁగ. 172

చునులపై = చును చివరలో వచ్చే పదాలపై; న కారము = ‘న’ అక్షరం; పొడచూపున్ = వస్తుంది (కనిపిస్తుంది); పోవున్ = పోతుంది; ఒప్పన్ = సరిగ్గా; అచ్చులు = స్వరాలు (ఆదులు) పై డాసి = కలిసి; ఉండెనేని ఉన్నట్లయితే; ఒదవుచున్నచో= ఒదవుచున్న అనే క్రియలో చు ఉన్నచోట; ఒదవుచునున్నచోట = ఒదవుచునున్న అనే చోట; పొడుచుచడరెను = పొడుచుచు + అడరెను = (పొడుస్తూ భయపడ్డాడు) అనే చు కారాంత పదాలకు; పొడుచుచును + అడరెను = ను చేరినరూపంతో; అనఁగ = అనే విధంగా.

“క్రియలో చునుల తర్వాత వచ్చే ‘న’కారం అచ్చు ఉన్నట్లయితే, ఒదవుచున్న లేదా ఒదవుచునున్న; పొడుచుచడరెను లేదా పొడుచుచునడరెను అనే ఉదాహరణల్లో కనిపించే విధంగా కొన్నిసార్లు పై అచ్చుతో కలిసి ఉంటుంది, కొన్నిసార్లు పోతుంది”. న కారం అంటే ద్రుతమనీ, ద్రుతం అంటే జారిపోవడం అనీ చెప్పారు కేతన తర్వాత వ్యాకర్తలు. కావ్యభాషలోని తెలుగు మాటలన్నింటినీ “ద్రుతప్రకృతికాలు, కళలు” అని రెండుగా విభజించి, న కారాంతమైన వన్నీ ద్రుతప్రకృతికాలనీ, కానివి కళలనీ సూత్రీకరించారు. అందువల్ల ఈ నకారం కొన్నిచోట్ల వస్తుంది; కొన్నిసార్లు పోతుంది. ఇది కూడా ఛందో అవసరాల రీత్యా ఏర్పడిందేనేమో అనిపిస్తుంది. అదనపు మాత్ర అవసరమైన చోట్ల ద్రుతానికి అవకాశం ఉన్నప్పుడు నకారాన్ని పెట్టుకోవడం, గణవిభజనకు అడ్డం వస్తున్నట్లయితే తొలగించి వాడడం కవులకు చాలా వెసులుబాటును ఇస్తుంది. ఈ సూత్రం కూడా దానికే చెందిందని భావించాలి.

దీనిపై దేవినేని సూరయ్య “శత్రర్థచువర్ణముపై నకారము పోగా సంధి యగుననియు లేనిచో నకారము మీది స్వరముతో మేళవించుననియు నెఱుంగునది” అని వివరించాడు. హరిశివకుమార్ దీని విషయమై ఏమీ వ్యాఖ్యానించలేదు.

వచ్చు, పో క్రియలు

ఆ.
అందు నిందు నెందు ననునర్థములు మఱి
యటయు నిటయు నెటయు నగుఁ గ్రమమునఁ
గ్రియలు రాక పోక లయి మీఁదనుండిన
నుతగుణాభిరామ నూత్నదండి. 173

అందున్; ఇందున్, ఎందున్ = దానిలో, దీనిలో, దేనిలో (అందులో, ఇందులో, ఎందులో); అనున్ + అర్థములు = అనే అర్థాలు కల పదాలు; మఱి = ఇంకా; అటయున్, ఇటయున్; ఎటయున్ = అట, ఇట, ఎట అని కూడా; అగున్ = అవుతాయి; క్రమమున = వరుసగా; క్రియలు క్రియారూపాలు; రాకపోకలు + అయి = వచ్చు, పో అనేవి; మీదన్+ ఉండిన = ఈ రూపాల పై వచ్చినప్పుడు; నుతగుణాభిరామనూత్నదండి =పొగడ దగ్గ మంచి గుణాలు గల ఓ కేతనా.

“వచ్చు, పోవు అనే క్రియారూపాలకు ముందు అందు, ఇందు, ఎందు ఉన్నట్లయితే అవి వరుసగా అట, ఇట, ఎట అని అవుతాయి”.

ఈ సూత్రం ప్రకారం అందున్, ఇందున్, ఎందున్, అనే పదాలు ‘రాక, పోక’ అనే వ్యక్తీకరణలో మారిపోయి “అట, ఇట, ఎట” అనే విధంగా వచ్చు, పోవు అనే అర్థాలకు చెందిన క్రియారూపాల కలయికలో మారుతాయి. అందున్ = అట అనీ, ఇందున్ = ఇట అనీ, ఎందున్ >ఎట అనీ అవుతాయని అర్థం చేసుకోవాలి. మరో విధంగా చెప్పాలంటే అంతర్నిర్మాణంలో ఉండే అందు, ఇందు, ఎందు అనేవి “రాకపోకల క్రియలు” (Verb of Motion) చేరినప్పుడు బాహ్య వ్యక్తీకరణలో అట, ఇట, ఎట అవుతాయని కేతన చెప్పిన విధం అర్థం చేసుకుంటే కేతన భాషా పరిశీలనా దృష్టి, దానిని సూత్రీకరించిన తీరు భాషా వ్యాకరణ జిజ్ఞాసులకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది.

క.
అటపోయెడి నిటవచ్చెడి
నెటకరిగెడి ననుట యుచిత మిటువలెఁ గాదే
నటయాడెడి నిటపాడెడి
నెటగూర్చున్నాఁ డనఁగ నెసంగవు గృతులన్. 174

అటపోయెడిన్ = అక్కడకు వెళ్ళాడు; ఇట వచ్చెడిన్ = ఇక్కడకు వచ్చాడు; ఎటకు + అరిగెడిన్ = ఎక్కడకు వెళ్తున్నాడు; అనుట = అనడం; ఉచితము = సరియైనది; ఇటువలెన్ = ఈ విధంగా; కాదేన్ = కానట్లయితే; అటన్ + ఆడెడి = అక్కడ ఆడాడు; ఇటన్ పాడెడి = ఇక్కడ పాడాడు; ఎటన్ + కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు; అనఁగన్ = అనే విధంగా; ఎసగవు = ఉండవు; కృతులన్ = కావ్యాలలో.

“రాకపోకల క్రియలతోనే అట పోయెడిన్, ఇట వచ్చెడిన్, ఎట కరిగెడిన్ అనే విధంగా కావ్యాలలో వాడటం ఉచితంగా ఉంటుంది కానీ రాకపోకలు కాని క్రియలైన ఆడు, పాడు లతో అట ఆడెడిన్, ఇట పాడెడిన్, ఎట కూర్చున్నాడు అని వాడడం సబబు (సరియైంది) కాదు”.

కేతన మొట్ట మొదటిసారిగా చేసిన భాషా సంబంధమైన నిశిత పరిశీలనలో ఇది కూడా ఒకటి. రూపాలు అందు, ఇందు, ఎందు అనే మాటలకు బదులుగా అట, ఇట, ఎట అనేవి కేవలం “రాకపోకల” కు చెందిన క్రియారూపాలతోనే వస్తాయనీ, మిగిలిన క్రియలు వేటితోనూ రావు అనీ ఆడు, పాడు, కూర్చుండు వంటివి తీసుకొని ఉదహరించాడు. ఇది కూడా ఆధునిక భాషా శాస్త్ర పద్ధతి. దీనిలో వ్యాకరణ అసమ్మతి కానీ వ్యవహార అసమ్మతికానీ ఉన్నప్పుడు దానిని చుక్క (*) గుర్తుతో సంకేతించి అవి భాషా వ్యవహారంలో రావనీ, కుదరవనీ వివరిస్తారు ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు. చేకూరి రామారావు సుజాత భర్తను కొట్టిన తెడ్డు సరియైన రూపమనీ, * సుజాత తెడ్డుతో కొట్టిన భర్త అన్నది తెలుగు వ్యవహర్తలు అంగీకరించని రూపమనీ తెలుగు వాక్యం (1975)లో వివరంగా చర్చించారు. అలాగే కేతన పాడు, ఆడు, కూర్చుండు వంటి క్రియలతో అట, ఇట, ఎట రావని, కావ్యాలలో అవి అనుమతించరనీ చెప్పాడు.

కానీ భద్రిరాజు కృష్ణమూర్తి తిక్కన భారతం నుండి ఈ రూపాల ప్రయోగాలు తీసి చూపించారు. అయితే ఇవి నన్నయలో ఎలా ఉన్నాయో పరిశీలించాలి. ఈ విషయంపై మరింత పరిశోధన చేయవచ్చు.

క.
సల్లలితైకపదముపై
నిల్లు నిలును గ్రియలఁ గొన్ని యెడలను దగ సం
ధిల్లుట శోభిలుటయుఁ బ్రభ
విల్లుట యన జగతిలోన బెడఁ గై యుండున్. 175

సల్లలిత = సరియైన విధంగా; ఏక పదముపై = ఒకే పదం మీద; ఇల్లున్, ఇలునున్ =ఇల్లు లేదా ఇలు అనేవి; క్రియలన్ + క్రియలలోని కొన్ని యెడలను = కొన్ని చోట్ల; తగ = చక్కగా; సంధిల్లుట = కలపటం లేదా జతచేయటం (-ఇల్లుతో); శోభిలుటయున్ ప్రకాశించుట (-ఇలుతో); ప్రభవిల్లుట పుట్టడం (ప్రభవ + ఇల్లు); అన = అనే విధంగా; జగతిలోన = ప్రపంచంలో; బెడగు + ఐ = ఎక్కువగా; ఉండున్ = ఉంటాయి.

“కొన్ని క్రియలలో కొన్నిసార్లు ఒకే పదంపై -ఇల్లు లేదా – ఇలు అనే ప్రత్యయం చేరుతుంది. సంధిల్లుట, శోభిలుట, ప్రభవిల్లుట అనేవి ఉదాహరణలు”. ఇది కూడా కేతన పరిశీలనకు ప్రథమంగా చిక్కిన భాషా విశేషం. ఇక్కడ ఇల్లు లేదా ఇలు ప్రత్యయం కొన్ని సంస్కృత రూపాలపై చేరి క్రియారూపాలుగా మారుతున్నాయి. ‘ఇంచు’ అనేది ప్రేరణార్థకం. కానీ ఇల్లు లేదా ఇలు అనేది సకర్మక, అకర్మక క్రియలు రెండింటికీ చెందినది. ఇవి ఏయే రూపాలకు చేరుతాయో కచ్చితంగా చెప్పడం కష్టం కానీ, అప్పటికే ఉన్న కొన్ని ప్రయోగాలను – సంధిల్లు, శోభిలు, ప్రభవిల్లు వంటి వాటిని కేతన ఉదాహరించాడు. దేవినేని సూరయ్య “కొన్ని ధాతువులకు ఇంచుక్కునకు మాఱుగా ఇల్లు ఇలు అనునవి వచ్చునని యెఱుంగునది. ఇవి అప్రేరణముననెవచ్చును” (పు. 129) అని చెప్పాడు. ‘అప్రేరణము’ అంటే “ప్రేరణార్థకం కాని వాటిలో” అని అర్థం చేసుకోవాలి.

క.
మల్లెయు లంజెయు గద్దెయు
నొల్లెను ననుపగిదిపలుకు లొప్పవుఁ గృతులన్
మల్లియ లంజియ గద్దియ
యొల్లియ యని పలికి రేని యొప్పున్ గృతులన్. 176

మల్లెయు = మల్లె (పువ్వు) అనేమాట; లంజెయు = లంజె (=వేశ్య) అనే పదం; గద్దెయు = గద్దె (పీఠం) అనేమాట; ఒల్లె = ఒల్లె (పైట) అనే పదం; అను పగిది = అనేటటువంటి; పలుకులు = మాటలు; ఒప్పవు కృతులన్ = కావ్యాలలో సరిగ్గా ఉండవు, బాగా అనిపించవు; మల్లియ, లంజియ, గద్దియ, ఒల్లియ = వాటిపై ‘య’ చేర్చిన ఇలాంటి పదాలు; అని = అనే విధంగా; పలికిరి+ఏని = చెప్పినట్లయితే; ఒప్పున్ = అంగీకార్యం అవుతాయి; కృతులన్ = కావ్యాలలో.

“కావ్యాలలో మల్లె, లంజె, గద్దె, ఒల్లె వంటి మాటలు ఆ విధంగా వాడిన దానికన్నా మల్లియ, లంజియ, గద్దియ, ఒల్లియ అని వాడితేనే ఎక్కువ ఔచిత్యంగా ఉంటాయి”.

పైన పేర్కొన్న రెండు రకాల రూపాలలో కావ్యాలలో వాడేందుకై కవులు రెండో గుంపునే (యకారంతో) ఎక్కువగా ఇష్టపడతారన్నది పై పద్యం సారాంశం. ఇదే సంప్రదాయం ఈనాటికీ సినిమా సాహిత్యంలో కూడా కనిపిస్తుంది (ఉదా: మల్లియలారా! మాలికలారా అనే సి.నారాయణరెడ్డి గీతం). అయితే ఈ రెండో రూపాలు ఏక వచన ప్రయోగంలో బాగా అనిపిస్తాయేమో కానీ సమాసకల్పనలో మాత్రం మొదటి రూపాలే కనిపిస్తాయి; ఉదా: మల్లెపూలు అంటాం అంతే కానీ మల్లియపూలు అనే ప్రయోగం ఉన్నట్లు లేదు; అలాగే గద్దెపీట అంటాం కానీ గద్దియపీట అని ఎక్కడా వాడినట్లు లేదు.

హరిశివకుమార్ “కేతన ఈ పద్యమున ఎదంతరూపములను, ఇయాంత రూపములను రెంటిని యంగీకరించినట్లున్నది. కొన్ని ప్రతులలో నీ పద్యమున “ఒప్పవుకృతులన్” అను అర్ధబిందురహిత పాఠాంతరమును ఉండి వ్యతిరేకార్థము నిచ్చుచున్నది. చింతామణియు, అధర్వణ కారికావళియు, నీ రెండు రూపముల నంగీకరించెనని అహోబలపండితుడు అధర్వణోక్తి యాధారముగా కేతన సూత్రమును పూర్వపక్షము కావించినాడు (పు. 321). కూచిమంచి తిమ్మకవి కూడా ఈ సందర్భమున నహోబల పండితునే యనుకరించినాడు (సర్వలక్షణ 17). శ్రీ కల్లూరి వారును, శ్రీ వజ్జలవారును, శ్రీ దివాకర్ల వేంకటావధాని గారును ఇట్టి ఇయాంత రూపములా కాలమున నంగీకృతములు కాకపోవుటచే కేతన వానిని నిరాకరించి యుండవచ్చునని వ్రాసినారు. నన్నయ భారతమున పదివేల గద్దియల్ (ఆర.1-344), పదివేల లొట్టియల్ (సభా. 1-267) వంటి ఇయాంత రూపములే బహుళములు. కానీ ఇరువదివేల గద్దెల పసిండియు (ఆర.2-345) అనుచోట ఎదంతరూపమును కన్పట్టుచున్నది. కేతనయే స్వయముగా తన దశకుమార చరిత్రమున లంజియ (6-78), లంజె (6-89) అను రెండు రూపములను ప్రయోగించియున్నాడు. దీనివలన అర్ధబిందువిరహితము కంటె, నర్ధబిందు సహితమైన రూపాలు ‘ఒప్పవుఁగృతులన్’ అనుకొన్నచో ఒప్పు+అవున్+కృతులన్’ అని చెప్పవచ్చును. దీనికి ‘ఒప్పుగ గృతులన్’ ” (వావిళ్ళ – 1914) (పు. 147-148) అని పాఠాంతరాలతో రెండు రూపాల ప్రయోగాలు కావ్యాలలోనూ, కేతన కావ్యంలోనూ ఉన్న విషయం సోదాహరణంగా వివరించాడు.

ఇంతా చేస్తే, ఇది కూడా ఛందో విషయకమైన అంశంగానే గుర్తించాల్సి ఉంది. అంతకుమించిన విశేషమేమీ లేదు. అంటే మల్లె హగణం లేదా గలం కాగా, మల్లియ భగణం (గురువు – లఘువు – లఘువుతో) అవుతుంది. అయితే కవులు రెండో రూపాలనే ఎక్కువగా గ్రహించినట్లు కేతన చెప్తూంటే, హరిశివకుమార్ కేతన వాటిని నిరాకరించినట్లు కల్లూరి, వజ్జల, దివాకర్ల భావించినట్లు చెప్పారు. మిగిలిన వాదం వారిది సరియైనదే.

క.
ఱవ డవలపై వకారము
కవియనుమతిఁ బోవు ఱడలు కడునిడుపు లగున్
శివు మఱవండు మఱాఁడు గ
డవఁబలికెను వాఁడు శివు గడా బలికె ననన్. 177

ఱవ, డవ లపై = పదాంతంలోని ఱవ, డవ అనే రూపాలపై; వకారము= ‘వ’ అనే అక్షరం; కవి యనుమతిన్ = కవి అంగీకారంతో (ఇష్టంతో); పోవు = పోతుంది; జడలు = అకార, డకారాలు; కడు = మిక్కిలి; నిడుపులగున్ = దీర్ఘాలవుతాయి; శివు = శివుణ్ణి ; మఱవండు = మఱవండు = మరవడు అనేది మఱాడుగా మారుతుంది; కడవన్+పలికెను = చివరగా మాట్లాడాడు; వాఁడు = అతడు; శివున్ = శివునితో, కడా పలికెన్ = చివరికి మాట్లాడాడు; అనన్ = అనే విధంగా.

“ ఱవ, డవ అనేవి చివరగా ఉన్న పదాలలో చివరి వకారం లోపించి, ఱ, డ లు దీర్ఘాలుగా మారుతాయి. ఉదా: శివు (ణ్ణి) మఱవండు అనేది మఱాఁడు అనీ, కడవపలికెను అనే దానిలో కడవలో వ – లోపించి కడా అనీ మారతాయి”.

ఇది ఒక ధ్వని సూత్రం. ‘ఱ, డ’ల తర్వాత ఉన్న ‘వ’ కారం లోపించినప్పుడు ఱ, డలు దీర్ఘాలు అవుతాయి. ఈ సూత్రం వల్ల కూడా పద్య కావ్యాలకు గణనియతిలో హ్రస్వ – దీర్ఘ భేదం వల్ల మార్పు ఉంటుంది. మఱవడు అంటే నాలుగు హ్రస్వాలై నలగణం అవగా, మఱాడు అనేది పదం మధ్య దీర్ఘంతో ‘జగణం’ గా మారుతుంది. కడవ అనేది మూడు హ్రస్వాలతో నగణం అయితే, కడా అనేది ‘నగం’ (హ్రస్వదీర్ఘాలతో) అవుతుంది. ఇంతకుమించి ఈ మార్పులకు వేరే ప్రయోజనం ఉన్నట్లు కన్పించదు. హరిశివకుమార్ వీటికి నన్నయ, కేతనలనుండే కాక, బసవపురాణం నుండి (‘మఱాకుమమ్మ’ బసవ 3-407) కూడా ప్రయోగాలు చూపించాడు (పు. 148).

క.
దూయుట దాఁగుట దొంగయు
దాయుట యని చెప్పి రేని దనరును గృతులన్
డూయుట డాగుట డొంగయు
డాయుట యని చెప్పినను బెడంగగుఁగృతులన్. 178

దూయుట = దూయడం, దాఁగుట = దాక్కోవడం, దొంగయు = దొంగిలించే వ్యక్తి; దాయుట = దాచడం; అని చెప్పిరి + ఏనిన్ = అన్నట్లయితే; తనరును = ఒప్పుతాయి; కృతులన్ = కావ్యాలలో; డూయుట, డాఁగుట, డొంగయు; డాయుట అని చెప్పినను అని డకారంతో ప్రయోగించినా కూడా; బెడంగు+అగున్ = బాగానే ఉంటుంది; కృతులన్ = కావ్యాలలో.

“కావ్యాలలో దూయుట, దాగుట, దొంగ(ను) దాయుట అని చెప్పినా, డూయుట, డొంగ ( ను) డాయుట అని చెప్పినా కూడా రెండూ సరియైనవే.”

ఇది ఒక ‘ధ్వని మార్పు’ కు చెందిన సూత్రం. శాసన భాషాకాలంలో డ కార ప్రయోగాలుగా పదాదిన ఉన్న రూపాలలో అధికభాగం ‘ద’ కారంగా అంటే మూర్ధన్య డ కారం దంత్య దకారంగా మారిపోయింది. తన కాలానికి ప్రయోగాలు రెండూ సరియైనవేనని చెప్పాడు కేతన.

హరిశివకుమార్ ముద్దరాజు రామన్న అన్న వ్యాకర్త లేదా కవి రెండు రూపాలు (డ, ద లతో) లేవని చెప్పినట్లు తిమ్మకవి ఉటంకిస్తూ, రెండూ ఉన్నాయని, రామన్న చెప్పింది ‘యథార్థం కాద’ని రాసిన పద్యాన్నీ, అడిదము సూరకవి కూడా రెండు రూపాలూ ఉన్నాయన్న పద్యాన్ని ఉటంకిస్తూ, నన్నయ ప్రయోగాలు కూడా (డించి (ఆది, 5-29), డాగి (అరణ్య 2-82), డిగ్గి (ఆది 6-52), డగ్గఱ (అరణ్య. 3-295), డప్పి (అర.2-109) వంటి రూపాలను చూపాడు. “ఇట్టి వానిని సూరి కూడా నంగీకరించినాడు” (పు. 148-149) అని పేర్కొన్నాడు.

క.
ఇన భూతార్థముఁ దెలుపును
గనుఁగొనఁగాఁ గర్తృకరణకర్మంబులఁ బం
డినవాఁ డనఁ బొడిచినవా
లనఁ బండినకొలుచు నాఁగ ననువై యునికిన్. 179

ఇన = ఇన అనే ప్రత్యయం, భూతార్థమున్ = భూతకాలం అర్థాన్ని; తెలుపును = తెలుపుతుంది; కనుగొనగాన్ = పరిశీలిస్తే; కర్తృకరణ కర్మంబులన్ = కర్తల (ప్రథమావిభక్తి); కరణ = (తృతీయా విభక్తి); కర్మ (ద్వితీయా విభక్తి) లలో; పండినవాఁడు + అన = పడుకొన్న (నిద్రపోయిన) వాడు (కర్త) అన్న విధంగా; పొడిచిన వాలు + అన = పొడిచిన కత్తి అన్న విధంగా (కరణం); పండిన కొలుచు (పండిన ధాన్యం) (కర్మ) నాఁగన్ = అన్న విధంగా; అనువై + ఉనికిన్ = అనుకూలంగా ఉండటం వల్ల.

“కర్తృ వాచకానికీ, కరణానికీ, కర్మకూ కూడా భూతకాలాన్ని తెలిపేందుకు – ఇన ప్రత్యయం వస్తుంది. పండినవాడు (కర్త), పొడిచిన వాలు (కరణం), పండిన కొలుచు (కర్మ) అనేవి ఉదాహరణలు”.

-ఇన ప్రత్యయం భూతకాల అసమాపక క్రియలకు చేరుతుంది. అయితే ఇది కర్తకూ (Subject), కరణకూ (Instrument), కర్మకూ (Object), చేరుతుందని గుర్తించడం కేతన ప్రత్యేకత. అందువల్ల వాటన్నింటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ ఇచ్చాడు.

1. కర్తకు : పండినవాడు ‘పడుకొన్నవాడు’

2. కరణకు: పొడిచినవాలు ‘పొడిచినకత్తి’ (ఏ కత్తితో పొడిచాడో ఆ కత్తి)

3. కర్మకు : పండిన కొలుచు (పండిన ధాన్యం) వీటిలో కర్త, కర్మ కాక కరణానికి కూడా ‘ఇన’ వస్తుందని కేతన చెప్పగా, సూరయ్య ఇంత ముఖ్యమైన పరిశీలన వదిలేసి “కర్త కర్మ క్రియలందు ‘ఇన’ అను ప్రత్యయము భూతార్థమును దెలుపును” అని రాయటంలో బహుశా చిన్న పొరపాటు దొర్లినట్లు భావించాల్సి ఉంటుంది (పు. 131). దీనిపై హరిశివకుమార్ ఏమీ చెప్పలేదు.

తెలుగు భాషపై ఈ రకం పరిశీలనలో కూడా కేతనే ప్రథముడని గుర్తించాలి.

క.
ఇనపై నుండునకారం
బును పై వాఁ డనుపదంబు మొదలివకారం
బును జడ్డ నకారం బగుఁ
గనినాఁ డభిమతములోలిఁ గన్నాఁ డనఁగన్. 180

ఇనపైన్ ఇన ప్రత్యయంపైన; ఉండు = ఉండేటటువంటి; నకారంబును = న అనే అక్షరం (కూడా); పై = మీద; వాఁడు+అనుపదంబు = వాడు అనేమాట; మొదలి వ కారంబును = మొదటి ‘వ’ అక్షరం; జడ్డ నకారంబు + అగున్ = అవుతుంది; కనినాఁడు = కను+ఇన+వాడు = కనినాడు; అభిమతములు = ఇష్టాలు; ఓలిన్ = క్రమంగా; కన్నాఁడు + అనఁగన్ = కన్నాడు అనే విధంగా.

“భూతకాల అర్థాన్ని తెలిపే ఇన ప్రత్యయం ‘వాడు’ అనేమాట చేరినప్పుడు వకారం స్థానంలో ద్విత్వ నకారం అవుతుంది. కనినాడు – కన్నాడు అనేవి ఉదాహరణలు”. క్రియా రూపానికి ‘ఇన’ అనే భూతకాల అసమాపక క్రియ చేరి దానికి వాడు పదం కూడా చేరినప్పుడు (పై పద్యంలోని కర్త ఉదాహరణ పండినవాడు లోవలె) వకారం స్థానంలో ద్విత్వ న కారం వస్తుంది. దీని నిష్పన్నవిధానం ఈ విధంగా ఉంటుంది;

ఉదా: కను + ఇన + వాడు = కనిన + వాడు (‘ఇన’ ప్రత్యయం) = కనిన + ఆడు ‘వకార లోపం’ = కనినాడు ‘అకార సంధి’ = కన్నాడు ‘ద్విత్వ న కారం’

తిక్కన, కేతన ఇలాంటి క్రియారూపాలను వాడారు. ఇవి ఆధునిక భాషలో కూడా వాడే క్రియారూపాలు.

క.
వినెఁ గనెఁ గొనె ననుపగిదిన్
జను పలుకుల నుండు నడఁగు సంబంధంబుల్వి
నియెఁ గనియెఁ గొనియె ననఁగ
ననువై వర్తిల్లుఁ గాన నభినవదండీ. 181

వినెన్, కనెన్; కొనెన్ = విన్నాడు, కన్నాడు, కొన్నాడు; అనుపగిదిన్ = అనే విధంగా; చను = వ్యవహరింపబడే; పలుకులన్ = మాటల్లో; ఉండున్ అడఁగు = ఉంటాయి పోతాయి; సంబంధంబుల్ = సంబంధాలు; వినియెన్, కనియెన్, కొనియెన్ – అనఁగన్ = ‘ఇయ’ కలిసిన పిమ్మట కనె – కనియె, వినె – వినియె, కొనె- కొనియె అనే రూపాంతరాలు; అనఁగన్ = అనే విధంగా; అనువై = అనుకూలంగా; వర్తిల్లున్ + కాన = ప్రవర్తిస్తాయి కాబట్టి; అభినవదండీ = కేతనా!

“వినె, కనె, కొనె వంటి మాటలకు వినియె, కనియె, కొనియె అనే రూపాంతరాలు కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు రావు”.

ఇది కూడా ‘య’ డాగమసంధి రూపమే. విని + ఎ = వినె కావాల్సి ఉండగా, రెండచ్చుల మధ్య సంధిని కానివ్వకుండా యడాగమం వచ్చి ఇ-~య-ఎ అని ఏర్పడటం తెలుగులో చాలా సాధారణంగా జరిగే విషయమే. అందువల్లనే కేతన ‘ఉండున్, ఉడుగున్’ అంటే వస్తుంది, పోతుంది అంటూ రూపాంతరాలను చూపాడు.

ఇది కూడా మల్లియ వలె ఛందస్సుకు అంటే గణాలకు దోహదం చేసే ప్రక్రియే. వినె, కనె, కొనె అనేవి రెండు లఘువులతో ఉన్నవి కాగా, వినియె, కనియె, కొనియె అనేవి మూడు లఘువులతో ఉండడం కవులకు ఎప్పుడూ ఆపద్ధర్మంగా పనికొచ్చే విషయమే.

తెలుగులో యకార, వకారాలు చాలా స్వేచ్ఛగా పదాదిన, పదమధ్యంలో, పదాంతంలో కొన్నిసార్లు వచ్చి చేరుతాయి. కొన్నిసార్లు ఉన్నవికూడా పోతాయి. (వకారం పోవడానికి – వాడు – ఆడు, వెన్నెల – ఎన్నెల; చేరడానికి ఊరు – వూరు; ఓర్పు – వోర్పు ; ఏలు- యేలు మొ||) అందుకే చిన్నయసూరి యకారంబును వువూ, వొవోలును తెలుగు పదంబుల మొదట లేవని సూత్రీకరించాల్సి వచ్చింది.

క.
మానుగ నఱ్ఱి ఱ్ఱంతము
లైనపదము లూఁదఁబలుక నగు నె ఱ్ఱు ఱ్ఱం
తానేకశబ్ద జాలము
దా నఱ్ఱత మగు నూది తగఁ బల్కు నెడన్. 182

మానుగన్ = చక్కగా; అఱ్ఱు = అకారం; ఇఱ్ఱు = ఇ కారం, అంతములు ఐన పదములు = చివరలో వచ్చే పదాలు; ఊదన్ పలుకన్ = ఊది పలుకగా; అగున్ = అవుతాయి; ఎఱ్ఱు = ఎకారం; ఉఱ్ఱు= ఉకారం; అంత = చివర్లో ఉండే; అనేక శబ్దజాలము = చాలా మాటలు; తాన్ = తాను; అఱ్ఱు + అంతము అగున్ = అకారాంతం అవుతుంది; ఊది = గట్టిగా నొక్కి; తగన్ = చక్కగా; పల్కున్ + ఎడన్ = పలికేటప్పుడు.

“ఒక మాటను నొక్కి చెప్పడానికి అకారాంత, ఇకారాంత పదాలకు ‘ఎ’ కారం వచ్చి చేరుతుంది; ఉకారాంత పదాలను నొక్కి (గట్టిగా) చెప్పడానికి ‘అ’ కారం వచ్చి చేరుతుంది”.

ఈ సూత్రంలో కేతన ఒక మాటను గట్టిగా నొక్కి చెప్పేటప్పుడు చేరే ప్రత్యయాన్ని (దీన్ని ఇంగ్లీషులో emphatic particle అంటారు) గురించి చెప్పాడు. అయితే అది ఒకే రూపంలో అన్నింటా లేదు. అకారాంత, ఇకారాంత పదాలపై ‘ఎ’ వచ్చి చేరగా, ఉకారాంత పదాలపై ‘అ’ చేరుతుంది. అంటే కావ్యభాషలో ఇది వర్ణ విధేయసూత్రంగా ప్రవర్తిస్తోంది. వీటికి ఉదాహరణలు కింది పద్యంలో చూద్దాం.

క.
దాతయె కల్పమహీజము
నీతియె బ్రతుకునకుఁ దెరువు నిఖిలకళా ని
ష్ణాతుఁడ మహాత్ముఁ డన ని
ట్లాతతముగఁ జెల్లుఁ గాన నభినవదండీ. 183

దాతయె = దాత + ఎ (= ఇచ్చేవాడే); కల్పమహీజము = కల్పవృక్షము; నీతియె = నీతి + ఎ = నీతిగా ఉండటమే; బ్రతుకునకున్ = జీవితానికి; తెరువు = మార్గం, దారి; నిఖలకళానిష్ణాతుఁడ = నిఖిల కళానిష్ణాతుఁడు + అ = అన్ని కళల్లో ఆరితేరినవాడు; మహాత్ముఁడ = మహాత్ముఁడు + అ; అనన్ = అనే విధంగా; ఇట్లు = ఈ విధంగా; ఆతతముగన్ = ఎక్కువగా (చాలా చోట్ల); చెల్లున్ గాన = వ్యవహరింపబడుతోంది కాబట్టి; అభినవదండీ.

“భాషలో అంతటా వాడే దాతయె కల్పమహీజము; నీతియె బ్రతుకునకు తెరువు; నిఖిల కళానిష్ణాతుఁడ; మహాత్ముఁడ – అనేవి ఉదాహరణలు”.

ఈ ఉదాహరణల్లో నొక్కి చెప్పే మాటలతోపాటు అన్ని కాలాలకూ వర్తించే మంచిమాటలను కూడా నొక్కి చెప్పాడు. నిజానికి కేతన చూపాల్సిన ఉదాహరణలు ఆయా మాటలకే పరిమితం చేసినట్లయితే-

1. అకారాంతాలకు : దాత + ఎ = దాతయె (అ+ ఎ = యె)
2. ఇకారాంతాలకు : నీతి + ఎ = నీతియె (ఇ + ఎ = యె)
3. ఉకారాంతాలకు : అ) నిఖలకళానిష్ణాతుడు + అ నిఖలకళానిష్ణాతుడ (ఉ + అ) నిఖల కళానిష్ణాతుడ
ఆ) మహాత్ముడు + అ = మహాత్ముడ (ఉ + అ)

కానీ వీటిని చెప్తూ కేతన ఇచ్చిన సందేశం:

1. దాతయె కల్ప మహీజము
2. నీతియె బ్రతుకునకు తెరువు.

వీటికి నన్నయ ఉదాహరణలను శివకుమార్ చూపాడు (పు. 149)

ఇలా తన వ్యాకరణమంతటా చారిత్రక, సాహిత్య, సార్వజనీన విషయాలను ఉదహరిస్తూ కేతన దానిని ఆసక్తికరంగానూ, ఆదర్శనీయంగానూ చూపాడు. చిన్నయసూరి బహుశా కేతన నుండి ఈ స్ఫూర్తిని పొందడం వల్లనే, తన బాలవ్యాకరణమంతటా రామాయణ కథను పరచి మనల్ని ఆశ్చర్యానందాలలో ముంచాడు. వ్యాకరణాన్ని ఆనందంగా నేర్చుకోవడానికి ఈ పద్ధతి దోహదం చేస్తుందని చేరా ‘తెలుగు వాక్యం’ కూడా (సమకాలీన విషయాల ఉదాహరణలవల్ల) నిరూపిస్తుంది. (ఈ సూత్రం పూర్తిగా సరియైనది కాదనీ, ఇ కారాంతాలకు కూడా ‘అ’ ప్రత్యయమే చేరుతోందనీ (అంటే ‘నీతియ’ వలె) భద్రిరాజు కృష్ణమూర్తి గారు తిక్కన ఉదాహరణలు చూపాడు. వీటిని ఇంకా పరిశీలించాలి.)

క.
ఉత్తమగుణ సూచక మగు
నెత్తమ్మియు నెమ్మొగంబు నెత్తావియు నా
ని త్తెఱఁగున రసికులు దమ
చిత్తము రుచియించుచోటఁ జెప్పుదు రొప్పన్. 184

ఉత్తమ గుణసూచకం = విశిష్టగుణాన్ని తెలియజేసేది; అగు = అయిన; నెత్తమ్మియు = మంచి తామర పువ్వు (నెర+తమ్మి); నెమ్మొగంబు = మంచి ముఖం (నెర+మొగము); నెత్తావియు = మంచివాసన (నెర+తావి); నాన్ = అనే విధంగా; ఇత్తెఱఁగున విధంగా (ఈ + తెరగు (త్రికసంధి); రసికులు = సహృదయ ఆస్వాదకులు; తమ చిత్తము = తమ మనస్సుకు; రుచియించుచోటన్ = ఇష్టమైన చోట్లలో; చెప్పుదురు = చెప్తారు, వాడతారు; ఒప్పన్ = తగినట్లుగా.

“కొన్ని పదాలకు “మంచిగుణాలు” ఉన్నాయని తెలిపేందుకై రసికులైనవారు కొన్ని ప్రత్యేకమైన మాటలు తమ మనసుకు ఇష్టమైనచోట్ల నెత్తమ్మి, నెమ్మొగము, నెత్తావి అని వాడతారు”.

అసలు మాటలు తమ్మి, మొగము, తావి ఇలా ఉంటే, కొందరు ‘రసికులు’ (కేతన వాడిన ఈ మాటను గుర్తించండి) తమకు ఇష్టమైన చోట్ల ఉత్తమ గుణాన్ని తెలియజేసే నెత్తమ్మి, నెమ్మొగము, నెత్తావి వంటివి వాడుతారు.

ఇక్కడ కేతన గతంలో చెప్పిన రెండు పద్యాలను గుర్తుచేసుకోవాలి అవి 124, 125 పద్యాలు. 124 లో క్రొ, నె అనేవి కావ్యానికి పనిగట్టుకొని క్రొత్త, నెఱ అనే అర్థంతో చేరి ద్విత్వాలవుతాయని చెప్పి 125లో నెన్నడుము, నెమ్మొగము, నెత్తావి అనే ఉదాహరణలు అక్కడే ఇచ్చాడు. అయితే ఇవి రసజ్ఞులు తమ “చిత్తము రుచియించుచోట” చెప్తారనడం మనకు చిన్న నవ్వును కలిగిస్తుంది. వ్యాకరణ రచనలో కూడా తాను రసజ్ఞతనే చూపుతున్నానని మనకు చెప్పాలని కేతన భావంలా అనిపిస్తుంది.

క.
పెక్కిటి కొక క్రియ యిడుచో
నొక్కటం దుదినొండె మొదలనొండెను మఱి యొ
క్కొక్కటి కొండెను బెట్టుదు
రక్కట క్రియ నడుమఁ బెట్ట రాంధ్రకవీంద్రుల్. 185

పెక్కిటికి = అనేకమైన వాటికి; ఒక క్రియ = ఒకే క్రియను; ఇడుచోన్ = ఉంచినట్లయితే; ఒక్కటన్ = ఒకేచోట; తుదిన్+ఒండె = చివరనైనా; మొదలన్ + ఒండెను = మొదట్లో నైనా; మఱి = ఇంకా; ఒక్కొక్కటికి = ఒక్కొక్కదానికి; ఒండెను = విడిగా; పెట్టుదురు = పెడతారు; అక్కట = అయ్యో; క్రియన్ = క్రియారూపాన్ని; నడుమన్ = మధ్యలో (మాత్రం); పెట్టరు = ఉంచరు; ఆంధ్రకవీంద్రుల్ = తెలుగు కవులు.

“చాలా మాటలకు కలిపి ఆంధ్రకవులు ఒకటే క్రియ పెట్టేటప్పుడు దానిని చివరకానీ, మొదటకానీ, ఒక్కొక్క దానికి విడివిడిగా కానీ పెడతారు; కానీ అయ్యో, మధ్యలో మాత్రం పెట్టరు”.

తెలుగు వాక్య నిర్మాణానికి సంబంధించి కేతన చేసిన మరొక గొప్ప పరిశీలన ఇది. దానిని ఆయన చెప్పిన తీరు కూడా ఎంతో బాగుందనిపిస్తుంది. మామూలుగా తెలుగు వాక్యంలో కర్త కర్మ (కర్మ – ఐచ్ఛికం) క్రియ ఉంటాయి. అయితే ఒకే క్రియ ఎక్కువ కర్తలతో రావచ్చు. (1) ఒకటి వాక్యం చివర్లో; (2) రెండు వాక్యం మొదట్లో లేదా (3) ప్రతి వాక్యంలో విడివిడిగా. అంతేకానీ రెండు మాటల మధ్యన మాత్రం క్రియను ఆంధ్రకవులు పెట్టరు. అయితే ఈ సూత్రాన్ని చెప్తూ పద్యంలో ‘అక్కట’ అని వాడడం చాలా నవ్వు పుట్టించేదిగా ఉంది.

తెలుగు కవిత్వంలో ఆధునికంగా కూడా పదాదిన క్రియ పెట్టడం ద్వారా కవిత్వీకరించామనుకోవడం ఆనవాయితీ. వాక్యం చివర పెట్టడం తెలుగు భాష సహజ లక్షణం. సరే, ప్రతి మాటకు క్రియను పునరుక్తం చేసి, సంయుక్త వాక్యాన్ని అసంయుక్త సామాన్య వాక్యాలుగా మార్చడం మూడో పద్ధతి. అసలు మూడో విధానం నుండే ఆధునిక భాషా శాస్త్రంలో మొదటి రెండు సామాన్య వాక్యాలలో కర్తలు వేరై క్రియ ఒక్కటిగా ఉన్నా, కర్మలు వేరై క్రియ ఒక్కటిగా ఉన్నా, ఆ రెండు సామాన్య వాక్యాలలోని ఒక క్రియను లోపింపచేసి వాటిని ఒకే వాక్యంగా కలపడం జరుగుతుంది. కర్త ఒక్కటే అయినప్పుడు, కర్మ కూడా ఒకటే అయినప్పుడు, క్రియ కూడా ఒకటే అయినప్పుడూ కూడా వాటిలో ఒక్కటి మాత్రమే మిగిలి, మిగిలినవి పోతాయి. అయితే ఈ విషయంలో గ్రాంథిక లేదా కావ్యభాషకు, ఆధునిక భాషలో క్రియానిర్మాణంలో ఉన్న తేడా వల్ల లింగ వచన పురుష ప్రత్యయాలు చేరడం వల్ల భిన్న కర్తృకాలుగా ఉండి ఒకే క్రియ ఉన్నా వాటిని కలిపినప్పుడు బహువచన రూపం వస్తుంది.

క్రియ:
ఉదా: 1) నేను వచ్చాను; ఆమె వచ్చింది. = నేను, ఆమె వచ్చాం.
2) ఆవులు పాలిస్తాయి. మేకలు పాలిస్తాయి. = ఆవులు, మేకలు పాలిస్తాయి.

కర్త:
అతడు అన్నం తిన్నాడు. అతడు నిద్రపోయాడు = అతడు అన్నం తిన్నాడు, నిద్రపోయాడు.

కర్మ:
సీత పుస్తకాలు కొన్నది. సుజాత పుస్తకాలు కొన్నది. = సీత, సుజాత పుస్తకాలు కొన్నారు.

కేతన ప్రకారం ఇది ‘క్రియ’కు సంబంధించిన అధ్యాయం కాబట్టి ఆయన ఒకటే క్రియ అనేక మాటలకు వచ్చినప్పుడు ఎలా ప్రయోగించాలో చెప్పాడు. పైన చెప్పినట్లు కావ్యభాషలో ప్రథమ పురుషకంతటికీ (పుం, స్త్రీ, నపుం) (ఏక X బహు వచనాల్లో) ఒకే క్రియ ఉండటం వల్ల సంయోజనం సులభం అవుతోంది.

దేవినేని సూరయ్య “రెండు కర్మ పదముల మధ్య క్రియాపదముండరాదు” అని దీనిపై వ్యాఖ్యానించాడు. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకొని సూరి “ఏక వాక్యంబునం దొకానొక్కండు తక్క సర్వపదంబులు క్రమనిరపేక్షంబుగం ప్రయోగింపంజను” అని సూత్రీకరించాడని హరిశివకుమార్ (పు. 150) పేర్కొన్నారు. కింది ఉదాహరణ చూస్తే బాగా అర్థం అవుతుంది.

క.
కరి యరిగెఁ దురగ మరిగెను
గరియున్ దురగంబు నరిగెఁ గ్రక్కున నరిగెన్
గరియును దురగము ననఁ దగుఁ
గరియరిగెన్ దురగ మనినఁ గైకొన రార్యుల్. 186

కరియరిగెన్ = ఏనుగు వెళ్ళింది; తురగము అరిగెను = గుర్రం వెళ్ళింది; కరియున్ తురగంబున్ = ఏనుగు, గుర్రం; అరిగె = వెళ్ళాయి; అనన్ తగున్ = అనడం చెల్లుతుంది; గ్రక్కున = త్వరగా; అరిగెన్ = వెళ్ళాయి; కరియును తురగమున్ = ఏనుగు, గుర్రం; అనన్+తగున్ = అనవచ్చు; కరి అరిగె తురగము = కరి వెళ్ళింది గుర్రం అని రెండు కర్తలమధ్యక్రియ పెట్టినవాక్యం; అనినన్ = అంటే; కైకొనరు + ఆర్యులు = పెద్దలు స్వీకరించరు.

“కరియరిగె, తురగమరిగెను’ అని దేనికదిగా కానీ, ‘కరియు, తురగము నరిగె’ అని కానీ ‘అరిగెన్ కరియున్ తురగమును” అనికానీ అనవచ్చును అంతేకానీ ‘కరియరిగెను తురగము’ అంటే మాత్రం పెద్దలు ఒప్పుకోరు”.

తెలుగు క్రియారూప నిర్మాణంలో కావ్యభాషకు, ఆధునికభాషకు తేడా ఉన్నప్పటికీ సూత్రం చెప్పే విషయం మాత్రం రెంటికీ సరిపోతుంది. ఇదే విషయాన్ని చేకూరి రామారావు తన తెలుగు వాక్యంలో (1975) చెప్పారు.

అందువల్ల కేతన 13వ శతాబ్దంలో చేసిన ఈ సూత్రీకరణ ఆధునిక భాషాశాస్త్ర పద్ధతులకు దగ్గరగా ఉండటం భాషాశాస్త్ర, సాహిత్య విద్యార్థులకు మహానందాన్ని కలిగించే పరిశీలన. వాక్యంలో క్రియ ఎక్కడైనా సాధ్యమే కానీ రెండుకర్తల ( లేదా నామాల)మధ్య మాత్రం కాదు అన్నది ఈనాటికీ వర్తిస్తుంది.

క.
తీవెల మ్రాఁకుల పేరులు
పూవులకున్ బేళ్ళు మొగలిపువ్వులు దక్కన్
గ్రోవులు మల్లెలు జాజులు
దా విరివాదు లని చెప్పఁ దగుఁ బెక్కులుగన్. 187

తీవెల = తీగల; మ్రాఁకుల = చెట్ల; పేరులు పేర్లు; పూవులకున్ పూలకు కూడా; పేళ్ళు = పేర్లే; మొగలిపువ్వులు తక్కన్ = మొగలిపూలు తప్ప; క్రోవులు = ఎర్రటి గోరింట పూలు; మల్లెలు = మల్లెపూలు; జాజులు = జాజిపూలు; విరివాదులు= సువాసన గల పూలు ; అని = అనే విధంగా; చెప్పదగున్ = చెప్పవచ్చును; పెక్కులున్ = అనేక విధాలుగా.

“మొగలిపూలు తప్ప మిగిలిన అన్ని పూలకు వాటి తీగెల చెట్ల పేర్లే పేర్లు. ఉదా: క్రోవులు, మల్లెలు, జాజులు, తావిరివాదులు”

ఈ సూత్రాన్ని పెద్దగా వివరించేపని లేదు. తీగెలకు, చెట్లకు ఉన్న పేర్లే (ఒక్క మొగలి పూలకు తప్ప) వాటి పూలకు కూడా వాడుతారని, చెప్పాడు కేతన. అయితే మల్లెతీగ, మల్లెపూలు అన్నట్లుగా మొగలి పూలకు సంబంధించినంతవరకు అది తీగె కాదు, చెట్టుకాదు; పొద. బహుశా అందువల్లనే కేతన మొగలిపూలు తప్ప అన్నాడేమో. ‘మొగలిపొద’ అంటాంకానీ మొగలిచెట్టు అనం కదా!

క.
మానయు జేనయు లోనగు
నానా పరిమాణములు జనము గొలుచునెడన్
మానెఁడు జేనెఁడు ననుక్రియ
మాన కెఁడులనొందుమీఁద మ్రానయకేతా. 188

మానయు = మాన అనే కొలత; జేనయు = అరచేతిని చాపినప్పుడు బొటనవేలినుండి చిటికెన వేలివరకు; లోనగు = మొదలైన; నానా పరిమాణములు = వివిధ పరిమాణములు, జనము = ప్రజలు; కొలుచున్ = ఎడన్ = తూకం వేసేటప్పుడు; మానెఁడు, జేనెఁడున్ =మానెడు, జేనెడు; అనుక్రియన్ = అనే విధంగా; మానక = విడువకుండా; ఎడులన్ = ‘ఎడు’ ప్రత్యయాన్ని; ఒందు = పొందుతాయి; మీద = పైన; మ్రానయకేతా = మ్రానయ కుమారుడైన కేతనా!

“కొలతలను కొలిచేటప్పుడు మాన, జేన మొదలైన వాటికి అన్నింటికి ‘ఎడు’ ప్రత్యయం చేరి అన్ని పరిమాణాలకూ ‘మానెడు’, ‘జేనెడు’ అనే విధంగా రూపాలు ఏర్పడుతాయి”. కేతన ఈ పరిశీలన కూడా సునిశితమైందే. “నానా పరిమాణములు” అనడం వల్ల కుంచెడు, గుప్పెడు, గరిటెడు, గిన్నెడు అవుతుంది. చెంచాడు అని పాతకొత్త కొలతలన్నింటికీ కూడా ‘ఎడు’ వాడటం ఆధునికంగా కూడా ఉంది.

హరిశివకుమార్ ఈ సందర్భంలో “నూటేసి, వేయునేసి” ఇత్యాది ప్రయోగాలలోని ‘ఏసి’ అనే ప్రత్యయాన్ని కేతన గానీ, సూరిగాని గ్రహింపలేదని సూచించారు.

క.
తెలుఁగునకు లక్షణము భువి
నలవడు క్రియ దండి చెప్పె నభిధానములో
పలఁ జెప్పినక్రియ లన్నియుఁ
దెలియుఁడు సత్కవులు మేలు దేటపడంగన్. 189

తెలుగునకు = తెలుగు భాషకు; లక్షణము వ్యాకరణం; భువిన్ = భూమ్మీద; అలవడుక్రియన్ = ఉపయోగించే విధం; దండి చెప్పెన్ = కేతన చెప్పాడు; అభిధానము లోపల = పేర్లలోపల, నిఘంటువుల లో; చెప్పిన క్రియలు = చెప్పినటువంటి క్రియారూపాలు; తెలియుఁడు= తెలుసుకోండి; సత్కవులు = మంచి కవులు; మేలు = మంచి; తేటపడంగన్ స్పష్టమయ్యేట్లుగా.

“తెలుగుకు భూమ్మీద ‘లక్షణము’ అలవాటు అయ్యే విధంగా కేతన ‘అభిధానం’ లోపల క్రియల గురించి చెప్పిన విషయాలను మంచికవులు మంచి అనేది తేటతెల్లమయ్యే విధంగా తెలుసుకోండి”.

కేతన మొట్టమొదటి పద్యాలలో తెలుగుకు తానే మొట్టమొదటి ‘లక్షణం’ రాస్తున్నానని చెప్పాడు. తిరిగి ఈ పద్యంలో అదే విషయం చెప్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం “తెలుగుకు లక్షణము (భువిని) అలవడుక్రియన్” అన్నది. అంటే తెలుగుకు వ్యాకరణ లక్షణం ఇంకా అలవడలేదనీ అది తన వల్లనే ప్రారంభమయిందనీ, అందువల్ల సత్కవులు దీనివల్ల ప్రయోజనం పొందాలనీ ఈ పద్యంలో వివరించాడు.

అభిధానము అనే మాటకు ‘పేరు, నిఘంటువు’ అనే అర్థాలున్నాయి. ఈ పద్యం వల్ల కేతన ‘నిఘంటువు కూడా రూపొందించాడా?’ అనే అనుమానం కలుగుతోంది.

క.
తప్పులు దీర్పు డు కవులం
దొప్పులు గైకొను డు దీనికోపనివారల్
తప్పొప్పని వెడబుద్ధులు
విప్పకు డీయన్న లార వేడెద మిమ్మున్. 190

తప్పులు తీర్పుడు = తప్పులను సరిదిద్దండి; కవులందు = కవులలో; ఒప్పులు గైకొనుడు = సరియైనవే స్వీకరించండి; దీనికి ఓపనివారల్ = దీనికి అంగీకరించలేని (ఓర్వలేని) వారు; తప్పు ఒప్పని = తప్పులను ఒప్పులంటూ; వెడబుద్ధులు = నీచమైన బుద్ధులను; విప్పకుడీ = విప్పదీయకండి; అన్నలార = పెద్దలారా; వేడెదమిమ్మున్= మిమ్మల్ని వేడుకుంటాను.

“తప్పులుంటే సరిచేయండి; కవులల్లో ఒప్పులు ఉన్నట్లయితే స్వీకరించండి. దీనికి ఓర్వని వారు తప్పును ఒప్పంటూ నీచబుద్ధిని చూపకండి. అన్నలారా! మిమ్మల్ని వేడుకొంటాను”.

కేతన గ్రంథం ప్రారంభంలోనే 9వ పద్యంలో ఇంచుమించు ఇదే విషయాన్ని చెప్పాడు. బహుశా కేతనకు సంబంధించినంతవరకూ ఇదే మొదటి వ్యాకరణ గ్రంథం కాబట్టి ఆయన్ని ఈ గ్రంథాన్ని, సూత్రీకరణలను ఇతర కవులు అంగీకరిస్తారా అన్న శంక వేధించి ఉండవచ్చు. అందుకే ప్రారంభంలో చెప్పిన విషయాన్నే ముగింపులోనూ చెప్పాడని భావించాల్సి ఉంటుంది.

(కేతన కాలానికే ‘అన్నలార’ అనే గౌరవవాచక సంబోధన ప్రయోగం ఉందన్నమాట!)

ఆ.
పాలునీరు వేఱు పఱచు నా కలహంస
రీతి మ్రానయార్య కేతనకవి
ఆంధ్రలక్షణంబు నలరంగ నాచంద్ర
తారకంబుఁగాఁగఁ దా రచించె. 191

పాలు = పాలను; నీరు = నీటిని; వేఱుపఱచున్ = వేరు చేసే; ఆ కలహంసరీతి = ఆ హంస వలె; మ్రానయ + ఆర్య కేతన కవి = మ్రానయ పుత్రుడైన కేతన అనే కవి; ఆంధ్రలక్షణంబు = తెలుగు భాషా లక్షణాన్ని; అలరంగన్ మెచ్చే విధంగా; ఆ చంద్రతారకంబుగాఁగ = చంద్రుడు, తారకలు ఉండేంతవరకు ఉండేలా; తా= తాను; రచించె = రాసాడు.

“పాలను నీళ్ళను వేరు చేసే కలహంసవలె మ్రానయగారి కేతనకవి ఆచంద్ర తారార్కంగా ఉండేలా ఈ తెలుగు లక్షణ గ్రంథాన్ని రచించాడు”.

ఇది ఈ గ్రంథంలో చివరి పద్యం. అన్ని కావ్యాలకు కవులు రాసే విధంగానే కేతన మళ్ళీ మరొక్కసారి తాను రాసిన ఈ గ్రంథం గురించి చెప్తూ, హంస పాలను నీళ్ళను వేరు చేసి చూపే విధంగా తాను తెలుగు భాషకు లక్షణాన్ని రాసానని చెప్పడంలో తత్సమేతరమైన దేశీయ తెలుగుకు సంబంధించిన సూత్రాలనే వర్ణించాలని ఉద్దేశించినట్లుగానూ కావ్యభాషా లక్షణాలలో ఏవి సరియైనవో, ఏవి కావో కూడా సూత్రీకరించినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

గద్యము : ఇది శ్రీమదభినవదండి విరచితం బైన యాంధ్రభాషాభూషణంబునందు సర్వంబును నేకాశ్వాసము.

ఇది = ఈ గ్రంథం; శ్రీమత్ అభినవదండి = అభినవదండి అనే బిరుదుగల కేతనచే; విరచితంబు అయిన = రచింపబడ్డ; ఆంధ్రభాషాభూషణంబునందు = ఆంధ్ర భాషాభూషణంలో; సర్వంబును = అంతా కలిపి, ఏకాశ్వాసము = ఒకటే ఆశ్వాసం. ఈ గద్యం వల్ల కేతన తాను రాసిన ఈ ఆంధ్రభాషాభూషణమనే లక్షణ గ్రంథం ఒకే ఒక ఆశ్వాసాన్ని కలిగి ఉందని చెప్తూ ఆశ్వాసాంత గద్యాన్ని రాసి కావ్యసంప్రదాయంలో ముగించాడు.


పైన వివరించినట్లు ఆధునిక వర్ణనాత్మక భాషశాస్త్రజ్ఞుల వలె సూత్రాలను ఉదాహరణలతో అతి తక్కువ పారిభాషిక పదాలతో తన వ్యాకరణాన్ని 191 పద్యాలతో రాసిన కేతన తొలి తెలుగు వ్యాకర్త. సంస్కృత సంప్రదాయంలో పాణినీయ పరిభాషకు భిన్నంగా తేలికైన మాటలతో రాసిన మొట్టమొదటి తెలుగు వ్యాకరణం. అందరూ చదవదగ్గది, చదివి ఆలోచించదగ్గదీను!


ఉపయుక్త గ్రంథసూచి

తెలుగు

  1. కేతన, మూలఘటిక, 13వ శతాబ్దం. ఆంధ్రభాషాభూషణము.
  2. కృష్ణమూర్తి, భద్రిరాజు సం. 1974. తెలుగు భాషా చరిత్ర. హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్
    సాహిత్య అకాడమీ. (8వ ముద్రణ : 2010 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం).
  3. కృష్ణమూర్తి, భద్రిరాజు సం. 2001 భాష, సాహిత్యం, సంస్కృతి. హైదరాబాదు, నీల్ కమల్
    పబ్లికేషన్స్.
  4. చంద్రశేఖర రెడ్డి, డి. 2001. మనభాష. హైదరాబాదు, మీడియా పబ్లికేషన్స్.
    చిన్నయసూరి, పరవస్తు 1857. బాలవ్యాకరణము.
  5. రామారావు, చేకూరి. 1975. తెలుగు వాక్యం. హైదరాబాదు : ఆంధ్రప్రదేశ్ సాహిత్య
    అకాడమీ.
  6. రామారావు, చేకూరి. 1970. తెలుగు బహువచన రూప నిష్పత్తి భారతి. జూన్.
    మలిముద్రణ: తెలుగు లో వెలుగులులో.
  7. రామారావు, చేకూరి 1981. తెలుగులో వెలుగులు. హైదరాబాదు. ఆంధ్ర సారస్వత పరిషత్తు.
    వేంకటరమణ శాస్త్రి, దువ్వూరి. 1970. రమణీయము, బాలవ్యాకరణ సమీక్ష. వాల్తేరు;
    ఆంధ్రాయూనివర్సిటీ ప్రెస్సు.
  8. వేంకట రాయశాస్త్రి, వేదం.?. ఆంధ్రులు, తెలుగు వారు ఒకరేనా? వేర్వేరా? మద్రాసు:
    వావిళ్ళ ప్రచురణ.
  9. శివకుమార్, హరి. 1973. కేతన. వరంగల్l శ్రీకృష్ణ ప్రజా ప్రచురణలు (2005).
    సూరయ్య, దేవినేని. 1953. ఆంధ్రభాషాభూషణము: దివ్య ప్రభా వివరణ సహితము.
    తెనాలి; కళాకృష్ణుల కావ్యమాల నం. 3.
  10. సుందరాచార్యులు, కె.వి. 1989. అచ్చతెలుగు కృతుల పరిశీలనం. హైదరాబాదు:
    రచయిత.

English

  1. Bloomfield, L. 1933. Language. New York: Holt, Rinehart and Winston.
    Brown, William. 1818. Telugu-English Dictionary. (New Delhi: Asian
    Educational Services. Reprint. 1991).
  2. Chomsky, Noam. 1965. Aspects of the Theory of Syntax. Cambridge, Mass:
    MIT Press.
  3. Chomsky, Noam and Morris Halle. 1968. The Sound Patterns of English.
    Harper and Row.
  4. Foley, James. 1977. Foundations of Theoretical Phonology. Cambridge:
    Cambridge University Press.
  5. Krishnamurti, Bh. 1961. Telugu Verbal Bases. A comparative and Descriptive
    Study. Berkeley and Los Angeles: University of California Press. (Reprinted
    1972. Delhi: Motilal Banarsidass).
  6. Krishnamurti, Bh. And J.P. L. Gwynn. 1985. A Grammar of Modern Telugu.
    Delhi: Oxford and IBH Publishing Company.
  7. Nida, Eugene, A. 1949. Morphology: The Descriptive Analysis of Words.
    Michigan: University of Michigan Press.
  8. Fillmore, Charles. 1968. ‘Case for Case’ in Bach, Emmon and Robert T.
    Harms. 1968. Universals in Linguistic Theory. New York: Holt Rinehart
    and Winston. 1-88.
  9. Usha Devi, A. 1978. A Typological Study of Dravidian Morphophonemics.
    Unpublished M.Phil. Dissertation. Osmania University. Hyderabad.
  10. ——1981. On Certain Phonological Processes in South Dravidian II.
    in South Asian Languages. Structure, Convergence and Diglossia. eds.
    Krishnamurthi, Bh.,.Colin P. Masica and A.K. Sinha. Delhi: Motilal Banarsidas-
    — pp. 93-100.
  11. —– 2009. ‘Treatment of Telugu Verb by Ketana (13th. C.A.D.)
    and Chinnaya Suri (19th. C. A.D.): A comparison’. Paper presented in the
    International Seminar on Dravidian Linguistics in Honour of
    Prof. S. Agesthialingom. Annamalai University: Annamalainagar. 19-21,
    August, 2009.

అయినవోలు ఉషాదేవి

రచయిత అయినవోలు ఉషాదేవి గురించి: అయినవోలు ఉషాదేవి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులు గానూ, భాషాభివృద్ధి పీఠానికి పీఠాధిపతిగా, నిఘంటునిర్మాణ శాఖకు శాఖాధిపతిగానూ పనిచేశారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ భాషాశాస్త్ర సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణలు చేసిన వీరు ఇంగ్లీషు, తెలుగు భాషల్లో సుమారు 60కి పైగా వ్యాసాలు ప్రచురించారు. Acquisition of Telugu syntax (1990, New Delhi), ధ్వన్యనుకరణ పదకోశం (2001, తెలుగు విశ్వవిద్యాలయం), Issues on Lexicography 2006, Andhra Bhasha bhushanamu: Original Text with Transliteration, meaning, Translation మొదలైనవి ఆవిడ రాసిన గ్రంథాలలో ప్రసిద్ధమైనవి. వివిధ విశ్వవిద్యాలయాల భాషాశాస్త్ర శాఖలలో రిసోర్స్ పర్సన్‌గా, యుజిసి విజిటింగ్ ఫెలోగా ఆహ్వానిత ఉపన్యాసాలిచ్చారు. పాఠ్యసంఘాలలో సభ్యులుగా, పరీక్షకులుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001లో వీరికి "ఉత్తమ ఉపాధ్యాయ" పురస్కారాన్నిచ్చింది. 2012 లో తెలుగు విశ్వవిద్యాలయం ఉషాదేవిగారిని కీర్తిపురస్కారంతో సత్కరించింది. సైద్ధాంతిక, అనువర్తిత భాషాశాస్త్ర రంగాలతోపాటు, తెలుగు సాహిత్యం, సంప్రదాయ వ్యాకరణాలు కూడా ఉషాదేవిగారికి అభిమాన అధ్యయన విషయాలు. ...