ఆర్ యూ రెడీ?

ధైర్యం తెచ్చిపెట్టుకొని, గొంతు సరిచేసుకుంటూ “రేపు ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో సినిమాకు వెళ్ళాలనుకుంటున్నాను. నాతో రావడానికి నీకు వీలవుతుందా?” అడిగాడు వాసు.

“నన్ను డేట్‌కి అడుగుతున్నావా?” కొంటెగా నవ్వుతూ ఎదురు ప్రశ్న వేసింది లలిత. ఆ ప్రశ్నకు గతుక్కుమన్నాడు వాసు. తను అంత బాహాటంగా మాట్లాడుతుందనుకోలేదు. వాళ్ళ మాటల్ని ఆఫీసులో ఇంకెవరైనా విన్నారేమోనని చుట్టూ చూసాడు. ఎవరూ లేరు. అందరూ కాఫీ బ్రేక్ తీసుకున్నట్టున్నారు.

వాసు, లలిత హైద్రాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీ సహోద్యోగులు. లలిత కలుపుగోలుతనం, చలాకీతనం చూసి ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు వాసు. వాసు ఇంజనీరింగ్ మెరిట్లో పాసయ్యి క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం సంపాదించాడు. పూర్తిగా అమాయకత్వం పోని ముఖం, టీం లో ఇతరులకన్నా తెలివితేటల్లో చురుగ్గా అగుపించే వాసు అంటే లలితకి ఒక ప్రత్యేక అభిమానం ఉంది. ఒకరి పట్ల ఇంకొకరికి ‘స్పెషల్ ఫీలింగ్’ ఉందని ఇద్దరికి తెలుసు.

లలిత అన్న మాటకి జవాబు ఏమి చెప్పాలో తెలియక తికమకపడుతున్న వాసుని ఆ ఇబ్బందిలోనుండి బయట పడేస్తూ – “సినిమాలు ఎప్పుడూ చూసేవేగా! ఏదైనా పబ్‌కి వెళదాం” అంటూ ప్రపోజ్ చేసింది. వాసు ఇంతవరకు పబ్‌కి ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి సందిగ్ధంలో పడ్డాడు.

“ఈ మధ్యనే బీర్స్ అండ్ ఛీర్స్ అనే పబ్ ఒకటి తెరిచారు. లైవ్ బ్యాండ్, మంచి డాన్స్ ఫ్లోర్ ఉందిట. అక్కడికెళ్దాం” అంటూ నిర్ణయించింది లలిత. వెరైటీగా ఉందనిపించి సరేనన్నాడు వాసు. తన సీటు దగ్గరకి వెళుతున్న వాసుతో “బై ది వే, అక్కడ కవర్ చార్జ్ ఒక్కొక్కరికి రెండు వేలు” అంది లలిత. ‘అంటే తను మిగతా ఖర్చులన్నింటిని కలుపుకొని కనీసం ఆరువేల రూపాయలతో వెళ్ళాలన్న మాట’ లెక్కవేసుకున్నాడు వాసు.

పబ్ లోపల గట్టిగా మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. అప్పటికే చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు నవ్వులు, కేరింతలతో మాట్లాడుకుంటున్నారు. లలిత పక్కన నిల్చుంటే ఆమె రాసుకున్న పెర్ ఫ్యూం పరిమళం ఒక కొత్త అనుభవం వింతగా ఫీలయ్యాడు.

“పద. బీర్ తెచ్చుకుందాం. కూర్చొని తీరిగ్గా మాట్లాడుకోవచ్చు.” అంది లలిత. లలిత బీర్ తాగుతుందని తెలిసి వస్తున్న ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకున్నాడు వాసు. ఇద్దరికీ చెరో బాటిల్ కొన్నాడు. వాసుకి తన చేతిని అందించి దూరంగా మూలనున్న సోఫా వద్దకు దారి తీసింది లలిత. మెత్తటి లలిత చేతిని సున్నితంగా పట్టుకొని మంత్రముగ్ధునిలా నడిచాడు వాసు. మరింత దగ్గరగా కూర్చుంది. బీర్ సిప్ చేస్తూ వినవస్తున్న మ్యూజిక్ అనుగుణంగా తల, భుజాలు కదిలిస్తున్నది లలిత. ఆమె భుజం అతని భుజాన్ని తాకుతున్న స్పర్శ వాసుకి తెలుస్తూనే ఉంది.

“నచ్చిందా ఈ పబ్? నీకిబ్బందిగా ఉందా ఈ అట్మాస్ఫియర్?”

“నో, నో! అదేం లేదు. మొదటిసారి కాబట్టి ఇదంతా కొంచెం కొత్తగా ఉంది. అంతే!”

“అలవాటైతే నువ్వూ బాగా ఎంజాయ్ చేస్తావు. నాకు మొదట్నుంచీ ఇష్టమే. అంతా మన వయసువాళ్ళే. చాలా ఓపెన్‌గా, రిలాక్సింగా ఉంటుంది అప్పుడప్పుడూ వస్తే”

లలిత ఈ రోజు కోసమే ప్రత్యేకంగా బ్యూటీ పార్లర్కు వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నట్లుంది. వాసుకి ఆమె ముఖంలో ఇంతకు ముందు చూడని కొత్త అందం అగుపడుతోంది.

“యస్. ఐ అగ్రీ విత్ యూ. మరి మీ ఇంట్లో అమ్మానాన్నలకి తెలుసా నువ్విలా వస్తావని?” సందేహం వెలిబుచ్చాడు వాసు.

“తెలుసు. మారే కాలంతో మారడానికే వాళ్ళూ ట్రై చేస్తున్నారు. వాళ్ళ వేల్యూస్ వేరు కదా. అలా అని మా అమ్మా నాన్నా నేను చేసేవన్నీ ఒప్పుకోరు. కానీ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళవి. ఏదో తెలివిగా ఒప్పించటానికి ప్రయత్నిస్తూ, మరీ గొడవ జరగకుందా చూసుకుంటాను” అంది లలిత. ఆమెలోని మెచ్యూరిటీని చూసి ఆశ్చర్యపోయాడు వాసు.

“అవును. మంచిచెడులు, తప్పొప్పులు కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారతాయని నేనూ అనుకుంటున్నాను” ఏకీభవిస్తూ అన్నాడు వాసు.

“కరెక్ట్! అంతగా ఆలోచిస్తే మన తాతాబామ్మలు, అమ్మానాన్నలు వాళ్ళ కాలాల్లో కూడా అంతో ఇంతో మారే ఉంటారు. దానికి వాళ్ళ పెద్దల దగ్గరనుండి వ్యతిరేకత వచ్చే ఉంటుంది” అని లలిత అంటుంటే మ్యూజిక్ బీట్ వేగం పెరిగింది. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఫ్లోర్ మీద డాన్స్ చెయ్యటం మొదలెట్టారు.

“పద, మనం కూడా డాన్స్ చేద్దాం” అంది లలిత.

“నాకు డాన్స్ అంతగా రాదు. నా డాన్స్ చూస్తే నువ్వు నవ్వుతావు” అన్నాడు వాసు.

“కమాన్. డోంట్ బి షై. నేను ఈ మధ్యనే డాన్స్ క్లాసులు తీసుకొన్నాను. నీకు నేర్పుతాను పద” అంటూ వాసుని లాక్కెళ్ళింది.

లలిత వాసు ఎదురుగా నిలబడి అతని ఎడమ చేతిని తన కుడి చేతిలోకి తీసుకుంది. తన ఎడమ చేతిని అతని నడుము చుట్టూ వేసి నెమ్మదిగా స్టెప్పులు వేయిస్తూ అతనికి డాన్స్ నేర్పించింది. వాసు బిడియపడుతుంటే అతని కుడి చేతిని తన నడుము చుట్టూ వేయించుకుంది. అలా వాళ్ళిద్దరు అలసిపోయేంత వరకు డాన్స్ చేశారు.

రాత్రి రెండయింది. పబ్ కట్టేసిన తర్వాత లలిత, వాసు ఆటో ఎక్కారు. బీరిచ్చిన మైకపు ధైర్యం, కొత్తగా ఏదో తెలీని ఆనందంతొ వాసు లలిత నడుము చుట్టు వేసి దగ్గరకు లాక్కున్నాడు. లలిత అతని కళ్ళలోకి మత్తుగా చూసి నవ్వింది. ఆమె చెంపపై సుతారంగా ముద్దు పెట్టుకుంటూ “ఐ లవ్ యూ, లల్లీ” అన్నాడు.

అటు తర్వాత మరికొన్ని సార్లు కలిసి వాళ్ళు బయటకు వెళ్ళారు. మరింత దగ్గరయ్యారు. కొన్ని నెలల తర్వాత వాసు ఉద్యోగం మారాడు. మళ్ళీ వాసు లలితని కలుసుకోలేదు.


“వాసూ! ఆ కంప్యూటర్ పని కట్టేసి త్వరగా తెములు. నువ్వు తయారైతేగాని మనం పెళ్ళికి వెళ్ళేది లేదు” వంటింట్లోనుండి కేకేసింది వాసు తల్లి.

“వీడి వాలకం చూస్తుంటే మనం చేరుకునే సరికి పెళ్ళి భోజనాలు కూడా అయిపోతాయి. ఇక మనం అమ్మాయిని అత్తారింటికి సాగనంపటానికే వెళ్ళాలి” వరండాలో నుండి విసుక్కున్నాడు వాసు తండ్రి అప్పటికే తయారైపోయి. ఇక తప్పక స్నానానికి లేచాడు వాసు. తనకెవరు తెలియని పెళ్ళికి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు. తల్లిదండ్రులు బలవంతం చేస్తే ఇంకేమి చెయ్యలేకపోయాడు.

అందరూ కలిసి వాసు కొత్త కారులో పెళ్ళికి చేరుకొన్నారు. వెయ్యికి పైగా వచ్చిన అతిథులతో హాలంతా నిండింది. తల్లిదండ్రులు పరిచయమున్న వాళ్ళని పలకరిస్తూ గుంపులో కలిసిపోయారు. ఏం చెయ్యాలో పాలుపోని వాసు హాల్లో వెనగ్గా ఒక ఖాళీ కుర్చీలో సెటిలయ్యి తళుకులు వెతకడం మొదలుపెట్టాడు. వేదికపై పెళ్ళి తంతు చురుగ్గా నడుస్తున్నది. ఉన్నట్టుండి కళ్ళు జిగేల్మన్నాయి.

ఒక మెరుపు తీగ వేదిక పైనుండి దిగి కుర్చీ వరుసలన్నింటిని దాటుతూ తను కూర్చున్న దిక్కే వస్తున్నది. తన దిక్కే నడిచి వచ్చి కొద్ది దూరంలో ఉన్న ఖాళీ కుర్చీలో కూర్చుంది. మొదటి చూపులోనే ఆ అమ్మాయి వాసుని కట్టిపడేసింది. పాలు, పసుపు తగు మోతాదుల్లో కలిపిన శరీరచ్ఛాయ, ఒత్తైన తలజుట్టు.

‘ఉష్! చాలా ఉక్కగా ఉంది’ అనుకుంటూ కొంగుతో విసురుకుంటున్నది. ఆమె నుదుటి మీద సన్నగా చెమట. వాసుకి మంచు కురిసిన గులాబీలు గుర్తొచ్చాయి. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని క్షణం మాత్రం ఆలస్యం చేయకుండా అమ్మాయికి దగ్గరగా జరిగి “హలో! నా పేరు వాసు. మీ పేరు తెలుసుకోవచ్చా?” పరిచయం చేసుకున్నాడు, కొత్తగా అలవాటైన కలుపుగోలుతనంతో, ఏమాత్రమూ తడబాటు లేకుండా.

“హాయ్! నా పేరు లావణ్య” శ్రావ్యంగా వచ్చింది సమాధానం. ‘రూపానికి సరిపడే పేరు’ అని మనస్సులో అనుకున్నాడు.

ఇరువురు పరిచయాలు చేసుకున్నారు. వాసు తన గురించి, తను చేస్తున్న ఉద్యోగం ఉరించి చెప్పాడు. లావణ్య ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్యెస్సీ చేస్తున్నట్టు చెప్పింది. పెళ్ళికుమార్తెకు దగ్గరి బంధువట. తొందరగానే చనువుగా మాట్లాడుకోడం మొదలు పెట్టారు. ‘అన్నయ్యా! అమ్మానాన్నలు వెళ్ళటానికి రెడీ అవుతున్నారు. నువ్వో పది నిమిషాల్లో భోజనం చేసి వచ్చేసెయ్’ అంటూ చెప్పిన చెల్లెలు మళ్ళీ మధ్యలో వచ్చి మూడుసార్లు గుర్తు చేస్తేగాని భోజనానికి లేవలేదు వాసు.

ఆఫీసులో పనిచేస్తున్నాడన్న పేరేగాని అతని ధ్యాసంతా లావణ్య చుట్టే తిరుగుతున్నది. కంప్యూటర్ లోని అక్షరాలన్ని గజిబిజిగా అగుపిస్తున్నాయి. ‘ప్రేమ గుడ్డిది’ అంటే ఇదేనేమో అనుకున్నాడు వాసు. బ్రేక్ తీసుకొని బయటికెళ్ళి కాఫీతాగుతూ దీర్ఘంగా ఆలోచించాడు. మొదటిసారి చూసినప్పుడు కట్టిపడేసిన లావణ్య అందం, మొదలైన కలవరం, ఇప్పటివరకు ఇంకే పనీమీద ఏకాగ్రత కుదరక పోవడం… ఒక నిర్ణయానికొచ్చాడు.

‘ఇంతకీ లావణ్యకి ఇష్టం లేకపోతే తన గురించి వివరాలు అడగటం, ఈ-మెయిల్ అడ్రస్ ఇవ్వడం ఎందుకు. నన్ను ఇష్టపడిందేమో. లావణ్యనే ఆడిగితే పోలా?’ అని అనుకొన్నాడు.

అనుకొన్నదే ఆలస్యం తిరిగి కంప్యూటర్ దగ్గరికొచ్చాడు. లావణ్య ఆన్ లైన్ లోనే ఉంది. ఒక్కసారి ఊపిరి బలంగా పీల్చి ఛాటింగ్ మొదలెట్టాడు.

“హలో లావణ్యా! ఎలా ఉన్నావు?”

“హలో వాసూ! బాగానే ఉన్నాను. నీవెలా ఉన్నావు?”

“నేను బాగానే ఉన్నాను. నిన్నటి పెళ్ళి జ్ఞాపకాల నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను.”

“అవును. నేను కూడా అదే స్థితిలో ఉన్నాను.” లావణ్య అలా అన్నందుకు చాలా సంతోషించాడు వాసు.

“నువ్వు నాకు ఒకటే గుర్తుకు వస్తున్నావు” అసలు విషయం బయటపెట్టాడు వాసు. ఏమని జవాబు ఇస్తుందో అని తెగ టెన్షన్ పడ్డాడు.

బదులుగా ‘స్మైల్ ఫేస్’. వాసు సంతోషానికి అవధుల్లేవు. ‘యస్’ అంటూ గాలిలోకి చేతులు విసిరాడు.

“బై ది వే, నేను వచ్చే శని, ఆదివారాలు హైద్రాబాదు వస్తున్నాను ”

వాసు సంతోషం రెండింతలైంది. లావణ్య ఇంత తొందరలో మళ్ళీ హైద్రాబాద్ వస్తుందనుకోలేదు వాసు. తను లావణ్యను మళ్ళీ కలిసే అవకాశం లభిస్తుంది.

“వచ్చినప్పుడు తప్పకుండా ఫోను చెయ్యి. మనం కలుసుకోవచ్చు”

లావణ్య దగ్గర్ నుండి వెంటనే సమాధానం లేదు. వాసు టెన్షన్ లో పడ్డాడు. కొద్ది సేపటికి జవాబిచ్చింది.

“చూద్దాం”

“అలా అనకు. ప్లీజ్. నాకు నిన్ను చూడాలనుంది. నువ్వు, నేను కలిసి అలా బయటికెళ్దాం. ఒక సాయంత్రం టైం నాకివ్వు. నీతో ఎన్నో మాట్లాడాలి.”

“సారీ వాసూ! ఈసారి వీలు పడక పోవచ్చు. అయినా నేను మధ్యమధ్యలో హైద్రాబాదు వస్తూనే ఉంటాను. ఇంకెప్పుడైనా కలుసుకోవచ్చు” అంది లావణ్య.