ఆకురాలిన చప్పుడు

ఎక్కడో ఆకురాలిన చప్పుడు వినిపిస్తుంది
ఇంకెక్కడో రెక్కలు ముడిచిన పావురం మాటలు వినిపిస్తాయి
మహానగరపు ఖాళీలేనితనం
గోలచేస్తూనే వుంటుంది

గదిలో మాత్రం
నిశ్శబ్దపు పోట్లు.
గొంతు పెగలని ఆక్రందనలు,
పెదాలు దాటని ప్రశ్నలూ సమాధానాలూ
పలుగై పొడుస్తుంటాయి

ఎంత హింస
మౌనం చేసే గాయాలకు లేపనాలుండవు.
నిశ్శబ్ధాన్నీ దూరాల్నీ ప్రేమించినా
మౌనాన్నీ దూరమవుతున్న దగ్గరనీ భరించలేము

డైరీలోని ప్రతి పేజీ ఖాళీగా మిగిలుంటుంది
రాయలేని అక్షరాలు
పాళీలోనూ గుండెలోనూ
తడిగా కాలుతుంటాయి

ఓ చప్పుడు కోసం
నగర ఘోషను వినపడనివ్వని
ఓ మాట చేసే చప్పుడు కోసం
వెతికీ వెతికీ
వెలితి నిండిన గుండెలో
ఏదో ఆకు రాలిన చప్పుడు వినిపిస్తుంది.