తంగం అత్తయ్య చెప్పే కథలు వింటూ అర్ధరాత్రుళ్ళ వరకూ మేలుకున్న ఆ రాత్రులెప్పటికీ మాకు మరపుకు రావు. ఆవు, పులి, కుందేలు-తాబేలు ఇలాటి మామూలు కథలు కావు అత్తయ్య చెప్పే కథలు. తన సొంతగా కల్పించి అల్లుకుంటూ పోయేది.
కొన్ని కథలైతే కవిత్వంలా ఉండేవి. మరి కొన్ని ఎంతకీ ముగింపుకు రాని మృదువైన పాటల్లా సాగేవి. కథలతోనే అత్తయ్య మా మనసుల్లో కొన్ని ఊహా చిత్రాలు ముద్రించేది. దేవతలూ రాక్షసులూ కూడా ఆమె కథల్లో కొత్త కొత్త రూపాలు ధరించేవాళ్ళు. శూర్పణఖ, తాటకి లాంటి రాక్షసులు భావావేశాలు, ప్రేమలూ కలబోసుకున్న మృదువైన మనుషులుగా మారిపోయేవాళ్ళు అత్తయ్య చేతిలో. ఇతిహాసాల చీకటి మూలల్లో వదిలేసిన పాత్రలన్నిటినీ బయటికి లాగి వాటికి రంగులద్దేది తంగం అత్తయ్య. రెక్కలు తెగిన పక్షిని మృదువైన హస్తాలతో నిమురుతూ సాంత్వన కలించినట్టుగా ఉండేది ఆ పాత్రల మీద అత్తయ్య ప్రేమ.
అసలు ఆ రాత్రులన్నీ గొప్ప అద్భుతంలా తోస్తాయి ఇప్పటికీ. ఆ పురాతనమైన ఇంటి మధ్యగదిలో పక్కపక్కనే వరసాగ్గా పడుకునేవాళ్ళం బంధువుల పిల్లలం. అత్తయ్య చెప్పే కథలన్నీ మంద్రంగా సాగే తుమ్మెద ఝంకారంలా మసక మసగ్గా ఇప్పటికీ గుండెలో వినిపిస్తుంది.
బోలెడన్ని రాతి స్థంభాలతో రాజభవనంలా తోచే ఆ ఇంట్లో పెద్ద టేకు తలుపుకు చేరగిలపడి నిల్చునే అత్తయ్య రూపమే ఇంకా కళ్ళ నిండా.
చేతిలో మట్టి ప్రమిద వెలిగించి పట్టుకుని, దీపానికి కొంగు అడ్డంపెట్టి జాగ్రత్తగా గూట్లో పెడుతుంటే ఆ వెలుగు నీడల మధ్య అత్త కావ్య నాయికలా ఎంత బాగుండేదనీ!
ఏకాంబరం మావయ్యకు అన్నం వడ్డిస్తూ, బావి పిట్టగోడకు కాలు తన్నిపెట్టి నీళ్ళు తోడుతూ… అత్తయ్య ఎంత ప్రత్యేకంగా కనపడేదనీ!
అత్తయ్యది నల్లని అందమైన విగ్రహం. జుట్టంతా తెల్లబడిపోయినా మొహం మీద ఒక్క ముడత కూడా ఉండేదికాదు. వాళ్ళింట్లో పాతకాలం నాటి తొక్కుడు హార్మోనియం ఉండేది. దాన్ని వాయించాలంటే దాని కింద ఉండే మెట్లు తొక్కుతూ వాయించాలి. అత్తయ్యకి మాత్రమే వచ్చు అది. దాన్ని వాయిస్తూ మెత్తని స్వరంతో భక్తి గీతాలు మొదలుకుని వదనమే చంద్ర బింబమూ లాంటి ప్రణయ గీతాలు, వన్నన్ వదనే లాటి ఉల్లాసపు పాటలూ పాడుతుంటే హార్మోనియం మెట్ల మీద అత్తయ్య వేళ్ళు సీతాకోక చిలకల్లా నాట్యమాడేవి.
ఇదంతా ఒక పక్కనుంచితే, అత్తయ్య చుట్టూ ఏదో మిస్టరీ పరుచుకునుండేది. అత్తయ్యను చూసినపుడు అందరి కళ్ళలో జాలి కనపడేది. కొందరి కళ్ళు తడయ్యేవి.
ఏకాంబరం మావయ్యకి మరో భార్య ఉండేది. అయినా ఆయన తంగం అత్తయ్యను పువ్వులా అపురూపంగా చూసుకునేవాడు. ‘తంగమ్మా’ అని తప్ప ‘ఏమే, ఒసేయ్’ అని పిలవగా చూడలేదు. అయినా అత్తయ్య, ప్రతి సందర్భంలోనూ ఏదో ధూమపు తెరల మధ్య దాగినట్టు, వెనకే ఉండేది తప్ప ముందుకొచ్చేది కాదు.
ఈ మిస్టరీని ముత్తుమామ కూతురు వల్లి విడగొట్టింది, వాళ్ళమ్మ చెప్పిందట, ‘తంగం అత్తయ్య పుష్పవతి కాలే’దని. ‘పుష్పవతి అంటే?’ అడిగాం అందరం.
“అంటే, అత్తయ్య పెద్దమనిషి కాలేదు.” ఈ మధ్యనే ఓణీలేయడం మొదలెట్టిన వల్లి చెప్పింది పమిట సవరించుకుంటూ.
“పెద్దమనిషి కాలేదా? మరి అత్తయ్య జుట్టంతా తెల్లబడిపోయిందిగా?”
“అబ్బ! అది కాదే.”
ఆ తర్వాత మేమంతా అత్తయ్య శరీరాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూడటం మొదలుపెట్టాం. పెద్దమనిషి కాని వాళ్ళ శరీరం ఎలా ఉంటుందో కనిపెట్టాలని మా ప్రయత్నం. అత్తయ్య స్నానం చేసి తడి చీర చుట్టుకుని స్నానాలగది నుంచి బయటికి వచ్చినపుడు, అందరు ఆడవాళ్ళ లాగానే కనపడేది. ఆకుపచ్చ చీర కట్టి, ఎర్ర రవికను వక్షం కిందుగా బిగించి ముడివేసి, జుట్టు ముడేసుకుని నిలబడినపుడు కూడా మామూలుగానే కనపడేది మాకు.
వల్లి వాళ్ళమ్మ దానితో అన్నదట, ‘తంగంది ఒట్టి బోలు శరీరం. అందులో ఏం లేదు. ఖాళీ.’
ఎక్కడుంది ఆ ఖాళీ? కనపడదా మాకు?
ఒకరోజు సాయంత్రం తోటలో ఒక ఎండిపోయిన చెట్టుని నరికి కూల్చారు. ఎండిన ఆకుల గలగలల మధ్య చెట్టు పెద్ద శబ్దంచేస్తూ కూలిపోయింది. చెట్టు మాను లోపల అంతా ఖాళీగా బొగిలిపోయి ఉంది. వల్లి మోచేత్తో నా నడుంలో పొడుస్తూ చెప్పింది “అదిగో, అదే ఖాళీతనమంటే. పైకి బాగానే ఉంటుంది. లోపల ఖాళీ.”
అది సరే, అత్తయ్యకు దానికీ సంబంధం ఏంటో అర్థంకాలేదు.
అత్తయ్య ఒంట్లో ఇంతకీ ఏ రహస్యం దాగుందో? మిగతావాళ్ళకీ అత్తయ్యకీ తేడా ఏంటో? చెమటలు కక్కే వేసవి మధ్యాహ్నాలు అత్తయ్య సామాన్లగదిలో కునుకుతీసేది. ఆమె పక్కనే వరసాగా పిల్లలం. మా మీదుగా చెయ్యి వేసి పడుకునేదేమో, అత్తయ్య నిండు వక్షం తలకు తగులుతూ ఉంటే హాయిగా గొప్ప భరోసాగా ఉండేది.
చేతులు, నడుము, అన్నీ జాగ్రత్తగా పరిశీలించినా అత్తయ్యలో వల్లి చెప్పిన ఖాళీ ఏమిటో తెలిసేదికాదు. అసలు ఆవిడలో ఏదో మహిమ ఉంది. వెచ్చని అత్తయ్య స్పర్శ మహోగ్రంగా ప్రవహించే నదిలా మాలో ఉన్నదేదో కడిగి పారేసేదేమో. నా ఒంటి మీద చెయ్యేసి నిమిరినపుడు, జుట్టులోపలికి వేళ్ళు పోనిచ్చి తైలమర్దన చేసినపుడు మాకు ఆ మహిమ తెలిసేది. అత్తయ్య చెయ్యి పడితే ఆవు చేపి కుండెడు పాలిచ్చేది. అత్తయ్య చేత్తో విసిరేస్తే చాలు, విత్తనాలు వనాలుగా మొలకెత్తేవి. అత్తయ్య చెయ్యి మంచిదని అమ్మ కూడా చెప్పేది. నా చెల్లెలు పుట్టినపుడు అత్తయ్య మా ఇంటికి వచ్చింది అమ్మకి సాయంగా. ‘వదినా, నా పక్కనే ఉండు. పట్టుకో నన్ను. నువ్వుంటే నాకు నొప్పులు తెలీవు.’ అమ్మ నొప్పులతో మూలుగుతూనే అంది. ఎత్తుగా ఉన్న అమ్మ పొట్టని తంగం అత్తయ్య లాఘవంగా నొక్కుతూ ‘ఏం భయం లేదు, అంతా సజావుగా జరిగిపోతుంది చూడు’ అనటం తలుపు చాటు నుంచి చూశా నేను.
“వదినా, నీ కడుపున కూడా ఒక కాయ…” అమ్మ ఏడ్చింది.
“చాల్లే, వూరుకో! నాకేం తక్కువైంది ఇప్పుడు? మహరాణిలా దర్జాగా బతుకుతున్నా. నా ఇంటి నిండా పిల్లలే!” ఏకాంబరం మావయ్య రెండో భార్యకి ఏడుగురు పిల్లలు.
“అది కాదొదినా, నీకు ఆ భాగ్యం లేక…”
“ఏంటే నువ్వూ? నిక్షేపంగా ఉన్నాను. నాకేం ఆకలెయ్యదా? నిద్ర పట్టదా? నా ఒళ్ళు కూడా అందర్లాటిదే. దెబ్బలు తగిలితే నొప్పెడుతుంది, తింటే అరుగుతుంది.” అత్తయ్య నవ్వింది.
అమ్మ అత్తయ్య చెయ్యిని చెంపకు ఆనించి గట్టిగా నొక్కి పట్టుకుంది.
అత్తయ్య కలవని డాక్టర్ లేడట, వల్లి చెప్పింది. ఊరిలోకి కొత్తగా వచ్చే ప్రతి డాక్టరూ అత్తయ్యకి మందులు ఇచ్చినవాడేనట. ఒక్కోసారి ఆ మందుల ప్రభావంతో అత్తయ్య రోజంతా నిద్రపోతూనే ఉండేదట. వేపాకు మండలు, ఉడుక్కయ్ డప్పులూ మోగిస్తూ ఏవో పూజలవీ కూడా చేశారట. రాత్రివేళ పెరట్లో అత్తయ్య చీకట్లో ఉండగా ఎవరో గభాలున మీదకు దూకేట్టు చేశారట, అకస్మాత్తుగా అంత భయపడితే ఆ భయంతో బహిష్టు మొదలవుతుందని. అత్తయ్య జడుసుకుని బట్టలుతికే బండ మీద పడి తలకు దెబ్బ తగిలించుకుంది కానీ బహిష్టు మాత్రం కాలేదు.
ఆ తర్వాత ఇంకో డాక్టర్ వచ్చినపుడు, ఇహ నన్నొదిలేయండంటూ అత్తయ్య భయంతో పెద్దగా ఏడ్చింది.
ఏకాంబరం మావయ్యకి రెండో పెళ్ళి నిశ్చయమైన రాత్రి తంగం అత్తయ్య గన్నేరుపప్పు నూరి తాగింది. సమయానికి విరుగుడు ఇచ్చి కాపాడారు గానీ దక్కాల్సింది కాదు. మావయ్య హడలిపోయాడు. ‘నీకు బాధ కలిగించే పనేదీ నేను చెయ్యను తంగమ్మా’ అని ఏడ్చాడు. ఆ తర్వాత అత్తయ్యే మావయ్య కోసం పిల్లని చూసింది. ఆ రకంగా మావయ్య జీవితంలోకి సంగమలై వచ్చింది. ఇదంతా వల్లి చెప్పిన కథ.
అత్తయ్య అమ్మ తలకి తన తల ఆనించి గుసగుసగా అంటోంది, ‘నీకు పిల్ల పుట్టబోతుంటే, ఇప్పుడు నా సంగతెందుకే!’ ఆ గొంతులో ఏముందో అత్తయ్యకే తెలియాలి.
ఆ రాత్రే నాకు చెల్లెలు పుట్టింది.
ఆ తర్వాత రోజుల్లో సెలవులకు వెళ్ళినపుడు అత్తయ్య చెప్పే కథల్లో ఆ కథ నా మనసులో నిలిచిపోయింది.
ఒకరోజు రాత్రి పొడుగాటి హాల్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ జంపకాన పరిచి, కొన్ని తలగడలు పడేసుకుని పడుకున్నాం. నూనె మరకలతో కనీసం గలీబులైనా లేని ఆ తలగడల అందం చూసితీరాలి. పైన ముదురు రంగు గుడ్డ, లోపలేమో గడ్డ కట్టిన దూది ఉండలుగా పైకి కనిపిస్తూ ఉండేది. చుట్టాలొచ్చినపుడు పిల్లలందరికీ అవే. రోజంతా ఒళ్ళు హూనమయ్యేలా ఆటలాడిన పిల్లలం తలగడ మీద తల ఆనీ ఆనగానే నిద్రలో పడేవాళ్ళం. అవి రాళ్ళలా ఉంటే మాత్రం ఎవడిక్కావాలి గనక?
వంటిల్లు సర్దుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. గిన్నెల చప్పుడు, కీచుమంటూ వెనక తలుపు చప్పుడు, తలుపు మూల చీపురు పడేసిన మెత్తని శబ్దం. ఆ తర్వాత ముగ్గు డబ్బా తీసిన శబ్దం. మట్టి పొయ్యి అలికి అత్తయ్య ముగ్గు పెడుతున్నట్టుంది.
వంటింటి తలుపు మూస్తున్న చప్పుడు. ఇహ అత్తయ్య రావడమే తరువాయి. ఎవరమూ నిద్రకి పడలేదు, అత్తయ్య కోసం ఎదురుచూస్తూ మేలుకునే ఉన్నాం. అత్తయ్య కొంగుకి చేతులు తుడుచుకుంటూ రాగానే సోమూగాడన్నాడు “అత్తయ్యా, కథ చెప్పవూ?”
“ఏంట్రా మీరంతా ఇంకా నిద్ర పోలేదూ?” అంటూనే అత్తయ్య వచ్చి మా పక్కన కూచుంది.
కామాక్షి, సోము అత్తయ్య వైపు పాకి ఆమె ఒళ్ళో తలలుపెట్టుకు పడుకున్నారు. మిగతా అందరం బోర్లా పడుకుని మోచేతులు దిళ్ళ మీద ఆనించి సిద్ధమైపోయాం కథ కోసం.
అలసిన అత్తయ్య మొహాన చెమట మెరుస్తోంది. కళ్ళు మూసుకుని రెండు నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయింది.
“అదొక పెద్ద అడవి” కథ మొదలెట్టింది.
“ఆ అడవిలో జంతువులన్నీ సంతోషంగా ఉండేవి. ఎన్నో పండ్ల చెట్లు. వాటి మధ్యగా పారే సెలయేరు. జంతువులన్నీ అక్కడే నీళ్ళు తాగేవి. ఆ అడవికి వేటగాళ్ళ భయమే లేదు. ఏ చెట్టు చాటు నుంచో వేటగాడి బాణాలు తగులుతాయనే భయం లేకుండా కౄరమృగాలన్నీ స్వేచ్ఛగా తిరిగేవి. అడవిలో ఎన్నడూ దావానలం రగిలేదుకాదు. కొత్తవాళ్ళెవరూ అటొచ్చేవారుకాదు. క్రూర సాధు జంతువులన్నీ కలిసిమెలిసి ఉన్నట్టుండేది అక్కడ. ఏ చెట్టు మీద గుడ్లగూబ ఏ రాత్రి వేళ గుటగుటమంటుందో, ఏ రాయి మీద కూచుని కప్ప బెకబెకలాడుతుందో, ఎప్పుడు ఎక్కడ నెమలి పురివిప్పి నాట్యం చేస్తుందో అన్నీ అందరికీ తెలుసు.
ఒకరోజు ఒక లేళ్ళ గుంపు నీళ్ళు తాగడానికి సెలయేరుకి వెళ్ళినపుడు ఒక లేడి తప్పిపోయింది. కొంతసేపయ్యాక అది అకస్మాత్తుగా తాను వేరొక అడవిలో ఉన్నట్టు కనిపెట్టి నిర్ఘాంతపోయింది. ఆ అడవి అంతా కొత్తగా ఉంది. అడవిలో నలిగిన దారులే లేవు. గొడ్డళ్ళ గుర్తులున్న సగం నరికిన చెట్లు, దగ్గర్లో పెద్దగా శబ్దంచేస్తూ జారే జలపాతం.
ఎవరూ లేని ఒంటరితనం, అడవంతా ఎడారిలా తోచింది లేడికి. భయంతో హడలిపోయి ఏడుస్తూ అటూ ఇటూ పరుగులు తీసింది. చీకటి పడింది. లేడికి భయం ఇంకా ఎక్కువైంది. నిశ్శబ్దంలో చీకట్లో జలపాతం హోరు మరింత భయపెడుతోంది. దూరంలో ఎవరో వేటగాడు తను కొట్టిన జంతువును దేన్నో మంట వేసి కాలుస్తున్నాడు. ఆ మంట చూసి లేడి భయంతో నక్కి నక్కి అక్కడి నుంచి దూరంగా పారిపోయింది.
చాలా రోజులు గడిచిపోయాయి. ఒక పున్నమి రాత్రి వెన్నెల కాంతిలో వెండిపూత పూసినట్టు జారే జలపాతం అందం లేడికి గోచరమైంది. మునుపటిలా అది లేడిని భయపెట్టలేదు. వెన్నెల చల్లగా అడవంతా పరుచుకుని, మాయచేసినట్టు అన్నిటినీ అందంగా మార్చేసింది.
ఇది కొత్త అడవైనా, ఇక్కడా నీళ్ళున్నాయి, చెట్లూ, మొక్కలూ ఉన్నాయి. లేడి ఆశ్చర్యపోయింది. క్రమక్రమంగా దాని కళ్ళకి ఇతర జంతువులు, పక్షులు, వేలాడే తేనెపట్లు, పచ్చని కాంతితో మెరిసే గడ్డీ అన్నీ కనపడ్డాయి. ఈ అడవి ఇహ కొత్తది కానే కాదు. లేడి అడవంతా సంతోషంతో తిరిగింది. దాని మనసిప్పుడు ప్రశాంతతతో నిండిపోయింది.”
అత్తయ్య కథ ముగించింది. హాల్లో మేము పడుకున్న చోట మాత్రమే దీపపు వెలుగు పడుతోంది. మిగతా అంతా చీకట్లో దాక్కుంది. కథ వింటూ చీకటి అడవిని మనోఫలకం మీద ఊహించుకున్నాం. లేడితో అందరం స్నేహంచేసి, చివర్లో దానితో పాటు శాంతపడ్డాం.
దిళ్ళను కౌగిలించుకుని అందరూ నిద్రకి ఒరిగారు. నా గరుకు దిండు మీద ఒరగబోతూ తలెత్తి చూశాను.
మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టి, వాటి మీద తల వాల్చి దీర్ఘంగా శూన్యంలోకి చూస్తూ… తంగం అత్తయ్య.
(మూలం: కాట్టిల్ ఒరు మాన్. In a forest, a deer అన్నపేరుతో ఆంగ్లంలోకి అనువదించబడింది. ఆంగ్లానువాదం: C. T. Indra)