సగమే పూర్తయిన ఓ కవిత

సమయం వుదయం 6:10
ఇంకా బద్ధకంగా పడకలోనే!
దిగి పగటి గడియారంలోకి
పరుగెత్తి ఏమీ చేయాలనిపించట్లేదు

పొద్దు తేరకుండానే
పడకగది బయట వేపచెట్టుమీద చేరి
అల్లరి చేసే పిట్టలు
గోలచేసీ చేసీ విసుగెత్తి వెళ్ళిపోయాయి.

సమయం 7:20
లేవాలనే అనిపించట్లేదు.
నన్ను తలుచుకునేవారూ
‘అన’వసరంగా నా కోసమే వచ్చేవారూ
కూడా ఎవరూ లేరు.

సగమే పూర్తయిన ఓ కవిత
అదుగో అలా నన్నే చూస్తూ అక్కడ,
రాత్రి కథ చెప్పమని అడిగి
చెప్పలేని స్థితికి అర్థంగాక
అలిగి
బుంగమూతితోనే నిద్రపోతున్న
బుజ్జితల్లీ,
నిర్విరామంగా ఎవరూ
పట్టించుకోకున్నా
అవసరపడి
తిరుగుతున్న పంఖా తప్ప
నన్నూ నామనసునూ
కదిలిస్తున్నవేవీ లేవిక్కడ!

సమయం ఎనిమిది కావస్తున్నట్లుంది
పరుచుకుంటున్న తెల్లటి ఎండా
వెచ్చనౌతున్న ఎండాకాలపు గాలీ
గుచ్చుకునీ గుచ్చుకోకుండా వుండే
రాత్రి నీవు కురిపించిన
మౌనమో మాటలో కన్నీరో నవ్వులో-
ఏదో లీలగా ఒక అలికిడి చేస్తూ…


విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ...