మన సమాజంలో ఒక ఆనవాయితీ ఉంది. ‘పెద్ద’వారు, ‘గొప్ప’వారు, బడా ‘బాబు’ల వంటివారు మామూలు ప్రజలు కొనవలసి వచ్చేవి చాలా చాలా కొనరు. అవి వారికి ‘కాంప్లిమెంటరీ’గా వస్తాయి, వారిని ప్రసన్నం చేసుకోగోరిన వారినుంచి. వారూ అలా తాయిలాలు ఆశిస్తారు, సాధిస్తారు. అయితే కాంప్లిమెంటరీగా ఏదైనా ఇప్పించుకున్నంత మాత్రాననే పెద్దవారు గొప్పవారు ఎవరూ కారు. పెద్దరికం, గౌరవం వచ్చి వారి మీద పడిపోవు. డబ్బులు పెట్టి కొనుక్కోవడం వారనుకున్నట్టు నామోషీ కాదు. కాని, ఆ అపోహ మాత్రం మనలో వేళ్ళూనుకునిపోయింది. తెలుగు సాహిత్యసమాజమూ ఇందుకు మినహాయింపు కాదు. వేరే దేశాల్లో, వేరే భాషల్లో సాధారణంగా ఏ బుక్‍షాపులోనో, పుస్తకోత్సవాలలోనో జరిగే పుస్తకావిష్కరణ సభలో వేదిక మీద రచయిత ఒక్కడే ఉంటాడు. తన పుస్తకం నుంచి కొంతభాగం చదివి వినిపిస్తాడు, శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తాడు. సంధానకర్తగా అక్కడ వేరెవరైనా ఉన్నా, వాళ్ళు పుస్తకానికి సంబంధించిన చర్చనే నడుపుతారు. దానికి కొనసాగింపుగా పాఠకులు ఆ పుస్తకాన్ని పరిశీలిస్తారు, నచ్చితే కొనుక్కుంటారు, రచయిత స్వహస్తాలతో సంతకం చేసి ఇస్తాడు కూడా. పాఠకులు, రచయితా ఒకే తలంలోకి వచ్చి, సాహిత్య సంస్కారాన్ని పెంపొందించుకునే ఇలాంటి ఒక దృశ్యం తెలుగులో ఊహకు కూడా అందదు. కొత్తొక వింత అనిపించుకోవడం కోసం ఆవిష్కరణలు హోటళ్ళలో, బారుల్లో అయినా జరుపుతారు కాని బుక్‍షాపులకు మాత్రం ఆమడ దూరంలో ఉంటారు. అధ్యక్షులుగానో ప్రత్యేక ఆహ్వానితులగానో ఎప్పుడూ విచ్చేసే ఆ కొద్దిమందే ఎంత ఇరుకుగా ఉన్నా వేదికమీదే సర్దుకుంటారు. సాహిత్యం గురించి, సాహిత్యబాధ్యతల గురించి, రచయితకూ తమకూ ఉన్న బంధం గురించి, రచయిత వ్యాసంగంలో తమ పాత్ర గురించి, రచయిత ప్రతిభ గురించి- ఉన్నవీ లేనివీ కలిపి కుట్టిన ఊకదంపుడు ఉపన్యాసాల అనంతరం, పుస్తకాన్ని అందరూ కలిసి గిఫ్టురాపునుంచి ఆవిష్కరిస్తారు. అప్పటికప్పుడే సదరు రచయిత ఆ వేదిక మీద పెద్దలందరికీ గౌరవాదరాభిమానాలతో తన పుస్తకాన్ని వినయంగా సమర్పించుకుంటాడు. ఆ కాపీ అలా కాంప్లిమెంటరీగా రాకపోతే తమ గౌరవానికి భంగం కలిగినట్టు సదరు ఆహ్వానితులు చిన్నబుచ్చుకోవడం కద్దు. ఆపైన అచ్చేసిన ఐదువందల కాపీలలో కనీసం రెండు మూడొందలు రచయితే అందరికీ ఉచితంగా ఇవ్వడమూ లేదా తానే గంపగుత్తంగా తెలిసినవాళ్ళందరికీ పంపడమూ కద్దు. ఈ ప్రహసనం ఇంత రివాజుగా మారాక కూడా రచయితలందరూ మా పుస్తకాలు ఎవరూ కొనరు, వాటికి ఆదరణ లేదు, తెలుగువారికి సాహిత్యాభిమానం శూన్యం అని ఆక్రోశించడమే ఆశ్చర్యం. రచన నిజంగా గొప్పగా ఉంటే పాఠకుడే అడిగి మరీ కొనుక్కుంటాడు అన్న విషయం ప్రస్తుతానికి పక్కన పెట్టినా, తన రచన మీద గౌరవం ఉన్న ఏ రచయితా తన పుస్తకాన్ని ఉబ్బరగా ఎవరికీ ఇవ్వడు. ఇవ్వకూడదు. మరి అలా ఇస్తున్నాడూ అంటే కారణం? తన గుర్తింపు కోసం, ఆ పెద్దల ఆమోదం, సాహచర్యం కోసం. అబద్దపు రివ్యూల కోసం లేదూ కనీసం కానిమాటలు దొర్లకుండా వాళ్ళ ముందరి కాళ్ళకు బంధం వెయ్యడం కోసం. ఈ రొంపిలోకి ఇంకా దిగని, దిగాలనుకోని రచయితలుంటే, వారికి మేమొక సలహా ఇవ్వదలచాం. అది ఇదీ: పుస్తకావిష్కరణ సభలు పుస్తకాల దుకాణాలలోనే పెట్టండి. అచ్చు వేసిన ప్రతులన్నీ, ఐదుకు మించకుండా తీసుకొని, మిగతావన్నీ ప్రచురణకర్త/పంపిణీదారుడి దగ్గరే ఉంచండి. అమ్మే బాధ్యత వారికే అప్పచెప్పండి. సభకు విచ్చేసిన పెద్దలు, పిన్నలు, అతిథులు, ఆహ్వానితులు, ఉపన్యాసకులు, శ్రోతలు, ఆపైన పాఠకులు అందరూ, ఏ మినహాయింపూ లేకుండా నచ్చితే పుస్తకం కొనుక్కుంటారు, లేకుంటే లేదు. మిమ్మల్ని మీరైనా మరొకరైనా రచయితగా గుర్తించాలంటే, ఇట్లాంటి నిబద్ధత ఒక కనీస అర్హత. ప్రచురణకర్త కష్టానికి ఇదొక కనీస గౌరవం. సాహిత్యపు మనుగడా? దిగులొద్దు. దాని జీవితం మనం చింతించాల్సినంత చిన్నదేం కాదు.