తీరనిది

దాహంతో నువ్వు తపించిపోయేటప్పుడు
అప్పటిదాకా నీపై తారాడిన
చలచల్లని కారుమబ్బు
మెల్లగా ఘనీభవిస్తుంది
అదాటుగా పైనుంచి శిలావర్షం కురుస్తుంది

సెలయేటి తేటనీటిలో నువ్వు చేతులు ముంచుతావు
దోసిట్లో నీరు
రక్తవర్ణం దాల్చుతుంది

నది ఒడ్డునే నువ్వు పరిగెత్తి పరిగెత్తి
రొప్పుతూ ఆగిపోతావు
ప్రాణం కడగట్టుతుంది
అందీ అందకుండా అది సాగిపోతుంది

దాహం తీరదు
తపన ఆగదు

అలిసిపోయి అలిసిపోయి కట్టకడపట
ఒకానొక సాగరతీరం చేరతావు
అదొక్కటే నిన్ను దప్పిక తీర్చుకొమ్మని
ఆదరంగా పిలుస్తుంది.


పాపినేని శివశంకర్

రచయిత పాపినేని శివశంకర్ గురించి:

పాపినేని శివశంకర్ ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచంలోని అగ్రశ్రేణి కవులలో ఒకరు. ఆయన కథకులు, విమర్శకులు కూడా. సాహితీ త్రిముఖుడుగా ప్రసిద్ధిగాంచారు. పాపినేని శివశంకర్ 6 నవంబర్ 1953న గుంటూరు జిల్లా నెక్కల్లులో జన్మించారు. రెండు కథాసంపుటాలు, ఐదు కవితా సంకలనాలు, మూడు వ్యాససంపుటాలు, ఒక పరిశోధనా గ్రంథం, తల్లీ నిన్ను దలంచి పద్యపరిచయ గ్రంథం ప్రచురించారు. రజనీగంధ కవితాసంపుటానికి 2016లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు లభించింది. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేసి గుంటూరులో నివాసం చేస్తున్నారు. ఆలోచనల, అనుభూతుల మేళవింపు శివశంకర్ కవిత్వం. అందులోని తాత్త్వికమైన లోతులు చదువరులను ఆలోచింపజేస్తాయి.

 ...