తీరా నేను విముక్తమయ్యాక!

పొందినది పోగొట్టుకోకూడదని పాకులాడిన నాకు
అసలు నువ్వు పొందినదేమీ లేదని
తెలియజెప్పిన నువ్వు

గూడు నాదేనన్న భ్రమలో
మాయాద్వీపపు పక్షినై విహరించిన నాకు
బంధం కేవలం భావనే అన్న ఎరుక కలిగించిన నువ్వు

నీ కళ్ళలో నా నీడ కోసం
వెతికి వెతికి ఓడిపోయాక
ఇప్పుడు నా బొమ్మ ఎదురుగా నువ్వు

చెలిమి ఊసులు చెప్పే చెలికాని కోసం
మాటల మాలలు కూర్చుకొని
మమతల తావినై మనసంతా నిండిపోవాలని
పరితపించి పరితపించి పరాజయం పాలయ్యాక
చేతిలో దండతో నువ్వు

నీ దాహం తీర్చాలన్న తపనతో
నదిగా ప్రవహించినా గుర్తించని నువ్వు
సాగరంగా విశ్రమించాక
గొంతు ఎండిపోయేలా దుఃఖిస్తూ

తీరా నేను విముక్తమయ్యాక!

జీవితమంతా ఆత్మీయ స్పర్శ కోసం అలమటించిన నేను
హిమ శీతల స్పర్శలో సేద తీరాక!