ఒక ఇల్లు దొరికే వరకు ఇంటిలోపలి మనిషి దొరికే వరకు.
బయటి నుంచి కాకుండా లోపల్నించి కాలుస్తున్న ఎండ
కంఠాన్ని చుట్టి మస్తిష్కానికి పడగ యెత్తుతున్న దాహం.మనం కలుస్తామంటావు, అందాక
మంత్రవాక్యం మరిచిపోవద్దంటావు.ఒక్కో అక్షరం పేలి కోటి అణువులై గాలిలో ఎగురుతున్నావు
వాక్యం సంగతి సరే, నిర్మించగలనా మనదైన ఓ అక్షరాన్నైనా?ఇక్కడ ఎవరూ లేరని కదూ అన్నాను, ఎందుకు లేరూ? ఉన్నారు
అదిగో ఆ టీ కొట్టు దగ్గర ఒకాయన వంగి కాలు గోక్కుంటున్నాడు
ఆటో లోంచి డ్రైవరు అప్పుడప్పుడు నా వైపు కూడా చూస్తున్నాడు
ఆసుపత్రి చెత్త కుప్ప పక్కన శునకం దిక్కులు చూస్తూనే వుంది.ఇల్లు దొరకదు మనుషులు దొరకరు.
ఇక్కడ నుంచోడానికి గట్టి కారణం దొరకదు.డెజావూ?!
ఎప్పుడో చూశాను ఇవే గోడల్ని, ఇదే, ఈ ఆకలి గొన్న శునకాన్ని
నన్ను గిరాకీ అనే ఒక సర్వనామంతో సంభావించే చోదక నేత్రాల్ని
తేనీటి ప్లాస్టిక్ కప్పుల గుట్ట పక్కన గోక బడుతున్న చరణ కండరాన్ని
ఎప్పుడో చూశాను ఈ గోడల్ని సరిగ్గా ఇవే గొడవల్ని, ఇది మామూలే.నేనుంటాను. ఎదురు చూస్తుంటాను ఇలాగే. ఎవరిదో ఒక ఇంటి
వసారాలోంచి, నన్ను కాసేపు నిలబడనిచ్చిన ఇంకో ఇంటి చూరు
కింది చిరుగు నీడ లోంచి చూస్తుంటాను; నువ్వు వస్తావు ప్రేమగా
పెదాలు విచ్చినట్లు తలుపులు తెరుస్తావు, ఒక చల్లని నీడ లోనికినువ్వు ఎవరో తెలియదు, తెలుసు అనుకున్నాను, తెలుసనుకుని
ముద్దు పెట్టుకోబోయాను, నీ కన్నులలో దిగ్భ్రాంతి, పరాయి పదం
ఎక్కడో ఏదో కలుక్కుమన్న చప్పుడు ఇల్లు లేదింట్లో ఎవరూ లేరువున్నట్టుండి వున్నానొక పేరు లేని వూరిలో, ఆగిపోయిన దారిలో.