కేతన ఆంధ్ర భాషాభూషణము-7

క్రియలు (క్రితం సంచికనుండి కొనసాగింపు)

వర్ణనాత్మకంగా భాషల వ్యాకరణాన్ని వివరించడం ఆధునిక భాషాశాస్త్ర వ్యాకరణాల లక్షణం. అయితే, ఇటువంటి ఆధునిక వర్ణనాత్మకమైన వివరణలు, ఉదాహరణలు కేతన వ్యాకరణంలో కనిపించడం అబ్బురపరిచే విషయం.

ప్రార్థన, ప్రశ్న, సంశయం, నిశ్చయం, తెగడటం

తే.
ప్రార్థనార్థంబుచోటను బ్రశ్నచోట
సంశయం బుండుచోట నిశ్చయము చోటఁ
దెగడుచోటను నేత్వంబు తెనుఁగునందు
నోయొ లొందును సంశయం బొందుచోట. 153

ప్రార్థన + అర్థంబుచోటను = కోరే సందర్భంలోనూ; ప్రశ్నచోట = ప్రశ్నించే= ప్రశ్నించే(అడిగే)టప్పుడు; సంశయంబు + ఉండుచోట = సందేహం ఉన్నప్పుడూ; నిశ్చయముచోట = కచ్చితంగా చెప్పేటప్పుడు; ఏత్వంబు “ఏత్వం’ (ఏకారం); తెనుగునందు= తెలుగులో; ఓ, (యె)లు= ఓ లేదా ఒ(యె) లు =దీర్ఘమైన ఓ కారం కానీ, హ్రస్వ ఒ కారం కానీ; ఒందును = పొందుతాయి (వస్తాయి); సంశయం బుండుచోట= ఒక్క సందేహమే ఉన్నప్పుడు.

“కోరేటప్పుడు, ప్రశ్న వేసేటప్పుడు, సందేహాన్ని వ్యక్తం చేసేటప్పుడు; నిర్ధారణగా చెప్పేటప్పుడు, తిట్టేటప్పుడు (వాదించేటప్పుడు) తెలుగులో ‘ఏత్వం’ వస్తుంది; అయితే సందేహం తెలియజేసేటప్పుడు ‘ఓ, ఒ’లు వస్తాయి”.

ఆధునిక భాషాశాస్త్రం ప్రకారం ఈ సూత్రాన్ని వాక్యనిర్మాణానికి సంబంధించిందిగా పరిగణిస్తారు. అయితే కేతన దీనిని క్రియా రూప నిర్మాణంలో భాగంగా చూపించాడు. ఎందుకంటే క్రియాంతభాష అయిన తెలుగు వంటి భాషలలో వాక్యనిర్మాణం ఎక్కువగా క్రియాపూరకంపై ఆధారపడుతుంది. ఏదైనా ఎవరినైనా కోరినప్పుడు (ఉదా: ఈ పుస్తకం నాకు ఇవ్వవా?); ఎవరినైనా, దేనినైనా ప్రశ్నించినప్పుడు (రేపు మీరు వస్తున్నారా?); సందేహం కలిగినప్పుడు (ఈ బొమ్మ బాగుందా? ఆబొమ్మా!); కచ్చితంగా చెప్పేటప్పుడు (ఇది మంచిదే!); ఎవరినైనా తిట్టేటప్పుడు (చావవే) – ఇలాంటి సందర్భాలలో చాలా వాటిలో క్రియపైనే ఆయా అర్థాలను సూచించే ‘చిరుప్రత్యయం’ (particle) ( కొందరు ఇలాంటి వాటిని అపదాలు అన్నారు)చేరటం సామాన్యం. అయితే ఈ చిరుప్రత్యయం ఎప్పుడూ, అన్ని సందర్భాలలోనూ క్రియపైనే వస్తుందనడానికి లేదు. emphatic particle గా ఇంగ్లీషులో పేర్కొనేదాన్ని కూడా కేతన ‘నిశ్చయముచోట’ అని గుర్తించి సూత్రీకరించడం ఆశ్చర్యకరం. ఈ విషయాలపై మరింత వివరంగా ‘తెలుగు వాక్యం’ (రామారావు, చేకూరి, 1975) లో తెలుసుకోవచ్చు. ఈ ఒక్క సూత్రం ద్వారా ఐదు రకాల వాక్యార్థ భేదాలను ఒకే ఒక్క ‘ఏత్వం’ సూచిస్తుందన్న విషయాన్ని చెప్పడం, దానిలోనే సంశయానికి (సందేహార్థకం) ‘ఓ, ఒ’ కూడా వస్తాయని చెప్పడం – వీటిని కేతన మొట్టమొదటిసారిగా తెలుగుకు ప్రతిపాదించాడు. ఆధునికతెలుగులో ఈ ‘ఏత్వం’ ‘ఆ’ గా మారింది. ఈ విషయాన్ని ఉదాహరణలను వివరించేప్పుడు కింది పద్యంలో చర్చించటం జరుగుతుంది.

దేవినేని సూరయ్య సూత్రాన్ని యథాతథంగా వచనంలో ఇచ్చాడు. (పు. 116). హరిశివకుమార్ కూడా అలాగే చెప్తూ (పు. 140), నన్నయ్య ప్రయోగాలు కొన్ని చూపించాడు.

క.
పోవే వానలు గలవే
నీవే ననుఁ బిలిచి తిపుడు నియతుం డతఁడే
నీవు పొలియవే యమృతమొ
త్రావును విషమోయనఁగ నుదాహరణంబుల్. (154)

పోవే = వెళ్ళవా (కోరడం); వానలుగలవే = వర్షాలు ఉన్నాయా (ప్రశ్న); నీవేనను పిలిచితి + ఇపుడు = ఇప్పుడు నన్ను పిలిచింది నువ్వేనా (సందేహం); నియతుండు + ఇతడే = క్రమశిక్షణ గలవాడు ఈయనే (నిశ్చయం); నీవు పొలియవే = నువ్వు చావు + (తిట్టు (తెగడు)); అమృతమొ =చావు లేకుండా చేసే ద్రవం + ‘ఒ’; త్రావును =తాగుతాడు/తాగుతుంది; విషమో = చనిపోయేలా చేసే ద్రవం +ఓ; అనగన్ = అనేవిధంగా; ఉదాహరణంబుల్ = ఉదాహరణలు.

“పోవే, వానలుగలవే, నీవే నను ఇప్పుడు పిలిచితి; నియతుండు ఇతడే, నీవు పొలియవే, అమృతమొ, విషమో త్రావును – ఇవీ వరుసగా ఉదాహరణలు”.

గ్రాంథిక భాషలో ‘ఏత్వం’లో వ్యక్తీకరించే ఐదు రకాల భేదాలు ఆధునిక భాషలో ‘ఆ’ తో వ్యక్తమవుతాయి. కానీ సంశయానికి మాత్రం ‘ఓ’ నే వస్తుంది. కింది ఉదాహరణలను చూడండి :

కేతన ఉదాహరణలు 'ఏ'     ఆధునిక భాష 'ఆ'
:ప్రార్థన         పోవే                 పోవా!
ప్రశ్న. వానలు గలవే?*   వానలున్నాయా?
సంశయం     నీవే.           నువ్వే?
(నీవే నను పిలిచితి (ఇపుడు) ఇప్పుడు నన్ను పిలిచింది నువ్వేనా(?)

నిశ్చయం. నియతుండు ఇతడే నియమం కలవాడు ఈయనే!
తెగడటం:నీవు పోలియవే/ నువ్వు చావరా! (పుం)
(తిట్టడం) నువ్వు చావవే (స్త్రీ, నపుం)

6) సంశయానికి : అమృతమొ, విషమోత్రావును. వస్తాడో, రాడో; ఉన్నాడో, లేడో!

శివకుమార్ “నన్నయ భారతమున – చిత్తశాంతి యొనర్పవే (ఆది, 1-150), నియోగించితే, అరుగునో, తలంచిరో వంటి ప్రయోగములున్నవి” అని చూపాడు.

సంశయంలో ఒ-ఓల (హ్రస్వ-దీర్ఘ) భేదం ఉండటానికి కారణం ఛందస్సే. లఘుమాత్ర కావలసినప్పుడు కవులు ‘ఒ’ వాడి, గురు మాత్ర కావలిసినప్పుడు ‘ఓ’ వాడారు. అందువల్లనే ఆధునిక తెలుగులో హ్రస్వం లేదు, కేవలం దీర్ఘమైన ‘ఓ’ మాత్రమే ఉంది. ఉదా: వస్తాడో రాడో! పుస్తకమో, పెన్నో! మొ|| (ఆరోజుల్లో కూడా వానలు సరిగ్గా పడేవి కావేమో!)

క.
ఎంచఁగ నేఁగుపదముతుదఁ
దెంచుట యగుఁ గ్రియల నరుగుదెంచుటపై కే
తెంచుట చనుదెంచుట నడ
తెంచుట తోతెంచు టనఁగఁ దెల్లం బగుచున్. (155)

ఎంచఁగన్ = లెక్కిస్తే, పరిశీలిస్తే, ఏఁగు పదము తుదన్ = ఏగు (=వెళ్ళు, పోవు) అనే క్రియాపదం చివర; తెంచుట; యగున్ = (-తెంచుట) అనే ప్రత్యయం వస్తుంది; క్రియలన్ = క్రియారూపాలలో; అరుగుదెంచుట = అరుగు (=వెళ్ళు, పోవు) + తెంచుట; (=వచ్చు); పైకి +ఏతెంచుట = పైకి రావడం, చను + తెంచుట = వెళ్ళడం, పోవడం; నడతెంచుట = నడిచి రావడం; తోతెంచుట = వెంటరావడం; అనఁగన్ = అనే విధంగా; తెల్లంబు + అగుచున్ = విశదం అయ్యే విధంగా.

“ఏఁగు’ అనే అర్థంలో వచ్చే క్రియా పదాలన్నింటికీ (-తెంచుట) చేరుతుంది. ఉదాహరణలు అరుగుదెంచుట; (పైకి) ఏ తెంచుట; చనుదెంచుట; నడతెంచుట; తో తెంచుట”.

వీటన్నింటినీ భాషా శాస్త్రంలో verbs of motion (కదిలే క్రియలు) అనడం పరిపాటి. ఇవి వివిధ భాషల్లో వివిధ రకాలుగా ఉంటాయి. రష్యన్ భాషలో ఇవి చాలా ఎక్కువ. ఇక్కడ మాత్రం అన్ని క్రియారూపాలూ కూడా ‘వెళ్ళు’, ‘పోవు’ అనే అర్థాలను ఇస్తూ, ‘తెంచుట’ వాడటంతో ‘వచ్చు’ అనే అర్థాన్ని కూడా ఇస్తాయి. ఈ క్రియా పదాలన్నింటిలోనూ ‘తెంచుట’ కనిపిస్తూండటం వల్ల కేతన వలె “సామాన్య రూప, అర్థ సామ్యాలతో అన్నిచోట్లా కనిపించే వర్ణసముదాయాన్ని (కనిష్ఠ పదాంశంగా ఆధునిక వర్ణనాత్మక భాషా శాస్త్రంలో వేరు చేయాలనే నైడా (Nida, 1968) బ్లూమ్ ఫీల్డ్ (Bloomfield, 1933) సూత్రాలవలె వేరుచేసి ప్రత్యయంగా చూశాడు. ఇలాంటివి చూసినప్పుడు కేతన వ్యాకరణ రచనలో ఎంత ఆధునిక దృష్టికలవాడోనని ఆశ్చర్యం కలగకమానదు. వెళ్ళు లేదా వచ్చుకు సంబంధించిన కేతన ఉదాహరణలు (-తెంచుట) ప్రత్యయంతో – ఈ కింది విధంగా ఉంటాయి.

1. అరుగు + తెంచుట – అరుగుదెంచుట 2. ఏగు + తెంచుట – ఏ తెంచుట/ ( ఏగుదెంచు) 3. చను + తెంచుట — చను దెంచుట 4. నడ(<డు) + తెంచుట — నడ తెంచుట 5. తో(చు) + తెంచుట తో తెంచుట ఆధునిక తెలుగులో చివరి రెండు పదాల ప్రయోగం (నడతెంచు, తోతెంచు) కనిపించదు. దీనిపై కూడా సూరయ్య ప్రత్యేక వివరణేమీ ఇవ్వలేదు. పై ఉదాహరణలే చూపించాడు. శివకుమార్ “ 'ఏఁగు' వంటి పదములకు 'తెంచు' అను ప్రయుక్తమై 'అరుగు దెంచు, ఏ తెంచు' అని యేర్పడును. నన్నయకు పూర్వ శాసనములలో - అరుగుదెంచు, తో తెంచు, ఏగుదెంచు వంటి ప్రయోగములున్నవి. నన్నయకూడ - పుత్తెంచు (ఆర. 2-185), చనుదెంచు (ఆది, 1-117) వంటి రూపములను ప్రయోగించియున్నాడు” (పు. 140) అని ప్రయోగాలు చూపాడు.

క.
ఒకకర్త చేయు పనులకుఁ
బ్రకటితముగ మొదలనయినపని యిత్వాంతం
బకృతం బైనను కాంతం
బకుటిల కర్తవ్య కార్య మన్వంత మగున్. 156

ఒక కర్త చేయుపనులకున్ = వాక్యానికి కర్తగా ఉండే నామం చేసే (వివిధ) పనులకు; ప్రకటితముగ = స్పష్టంగా; మొదలన్ = మొదటగా; ఐన పని = అయిపోయిన పని; ఇత్వ అంతంబు = ‘ఇ’ చివర వచ్చేది; అకృతంబు+అయినను = చేయనిపని అయినప్పుడు (వ్యతిరేకార్థంలో); కాంతంబు = ‘క’ అంతంగా; అకుటిల = కపటం లేని; కర్తవ్యకార్యము = చేయాల్సిన పని; అను+అంతము = ‘అను’ శబ్దం చివర్లో వచ్చేది; అగున్ = అవుతుంది.

“ఒకకర్త చేసే పనులకు మొదలు పెట్టి పూర్తయిన పని ఇకారాంతం అవుతుంది; చేయని పనులకు ‘క’ కారం చివర్లో వస్తుంది; కపటంలేని, సూటిగా చేయదగ్గ పనులకు ‘అను’ చివర్లో వస్తుంది”.

ఈ పద్యంలో కేతన మూడు సూత్రాలను వివరించాడు. ఇవన్నీ అసమాపక క్రియలు. మూడు కూడా మూడు వాక్య నిర్మాణ రీతులకు సంబంధించినవే అందువల్లనే భూతకాల అసమాపక క్రియలకు (క్వార్థకాలకు) సాధారణంగా ఏకకర్తృకం ఉంటుందన్న గమనింపు కూడా దీనిలో చేర్చాడు కేతన (చూ. రామారావు, చేకూరి, 1975). ఏకకర్తృకమై అంటే ఒకే కర్త ఉండి, పూర్తయిన పనుల జాబితా ఉన్నప్పుడు అవన్నీ ‘ఇ’ కారాంతాలు అవుతాయి. (చూ. ఉదా: క్రింది పద్యం). అలాగే ‘చేయనిపని’ అంటే వ్యతిరేక అసమాపక క్రియారూపంలో ‘క’ ప్రత్యయం వస్తుందనీ; కపటం లేని స్పష్టమైన పనులకు క్రియల చివర్లో ‘అను’ ప్రత్యయం వస్తుందనీ కేతన సూత్రీకరించాడు. వీటిని తర్వాత వ్యాకర్తలు వరుసగా క్త్వార్థక, వ్యతిరేక క్త్వార్థక, తుమున్నర్థకాలుగా పేర్కొన్నారు.

“ఒక కర్త పూర్తి చేయు పనులలో మొదటి పూర్తియైన పని ‘ఇ’ కారాంతమును, చేయనిపనియైనచో ‘అక’ అంతమును, చేయదగిన పనియైనచో ‘అన్వంతము’ను అగునని చెప్పి క్వార్థక – వ్యతిరేకార్థక, తుమున్నర్థక ధాతువులను కేతన వివరించాడు” అని హరిశివకుమార్ వివరించాడు (పు-140)

ఆ.
ఆడఁబోయి చూచి యలిగెఁ బెట్టక త్రోచె
వినక పలికె నియ్యకొనక చనియె
కుడువ నేఁగె వేఁడుకొన నాసతో వచ్చె
నన నుదాహరణము లయ్యెఁ గృతుల. 157

ఆడన్ = అక్కడికి; పోయి = వెళ్ళి; చూచి = చూసి; అలిగె = కోపం తెచ్చుకున్నాడు/ తెచ్చుకున్నది; పెట్టక = పెట్టకుండా; త్రోచె = తోసాడు/తోసింది; వినకపలికెన్ = వినకుండా మాట్లాడాడు/ మాట్లాడింది; ఇయ్యకొనక = ఇవ్వడానికి ఇష్టపడక; చనియె = వెళ్ళిపోయాడు/ పోయింది; కుడువన్ ఏగె = తినడానికి వెళ్ళాడు/ వెళ్ళింది; వేడుకొనన్ = వేడుకోవడానికి, ఆసతో వచ్చెన్ = ఆశగా వచ్చాడు/ వచ్చింది; అనన్ = అనే విధంగా; ఉదాహరణములు= ఉదాహరణలు; అయ్యెన్ కృతులన్ = కావ్యాలలో ఉన్నాయి.

“కావ్యాలలో కనిపించే ఉదాహరణలు; ఆడబోయి చూచి యలిగె, పెట్టక త్రోచె, వినక పలికె; ఇయ్యకొనక చనియె, కుడువన్ ఏగె; వేడుకొనన్ ఆసతో వచ్చె మొ॥”.

ఇ కారం చేరి క్త్వార్థక అసమాపక క్రియారూపాలు ఏర్పడ్డప్పుడు అవి ఏక కర్తృకంగానే ఉంటాయనీ, భిన్న కర్తృకాలుగా ఉండడం వ్యాకరణ, వ్యవహార సమ్మతం కాదనీ చేకూరి రామారావు సోదాహరణంగా పరివర్తన వ్యాకరణ సిద్ధాంత రీత్యా ‘తెలుగు వాక్యం’లో (1975) వాదించాడు. అయితే ఈ విషయాన్ని 13వ శతాబ్దంలోనే పసికట్టి ‘ఒక కర్త చేయు పనులకు’ అంటూ చిన్న చిన్న మాటలలో సూత్రీకరించి ఉదాహరించిన కేతన వ్యాకరణ రచనా విధానంలోని సునిశిత దృష్టి, మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. దీనికి వ్యతిరేకార్థంలో ‘క’ చేరుతుందని (కొందరు ‘అక’ అనీ అంటారు) చెప్పి కేతన “పెట్టకత్రోచె, వినక పలికె, ఇయ్యకొనక చనియె” అని మూడు ఉదాహరణలు ఇచ్చాడు. అంటే రెండు విధాలైన క్త్వార్ధక, వ్యతిరేక క్త్వార్థక ప్రయోగాలలోనూ “ఒకే కర్త” ఉండాలనీ, ఉంటుందనీ కేతన చేసిన సూత్రీకరణ ఆధునిక భాషా శాస్త్రజ్ఞులను నిజంగా ఆనందపరిచే విషయం.

ఇవి కూడా భూతకాలిక అసమాపక క్రియలు కాగా, భవిష్యత్ సూచకమైన తుమున్నర్థకంలో కుడువన్ ఏగె, వేడుకొనన్ ఆసతో వచ్చె అనేవి ‘అన్’ అనే ప్రత్యయం చేరి ఏర్పడుతాయని, ఇవి కావ్యాలలో ఇలా వాడుతూ ఉన్నారనీ కేతన సోపపత్తికంగా ఉదాహరించాడు. అయితే వీటికి వ్యాకరణ పారిభాషిక పదాలను కేతన వాడలేదు. ఈ క్త్వార్థక, వ్యతిరేక క్త్వార్థక, తుమున్నర్థక అనే మాటల వల్ల ఆధునిక భాషా సాహిత్య విద్యార్థులు పాఠశాలల్లో విశ్వవిద్యాలయాల్లో వాటిని నేర్చుకోవడం పట్ల ఎంతో విముఖత చూపుతున్నారు. వారికి ఇలాంటి కేతన ప్రతిపాదించిన తేలికైన సూత్ర పద్ధతిలో వ్యాకరణాన్ని వివరిస్తే తెలుగు భాషా వైముఖ్య ధోరణులు తగ్గిపోయే అవకాశం ఉందేమో ఆలోచించాలి.

పైన చెప్పిన మూడు రకాల అసమాపక క్రియలు కూడా ఒకేకర్తను (ఏకకర్తృకం) కలిగి ఉంటాయన్న విషయం గమనిస్తే కేతన సూత్రీకరణలోని ఆధునికత్వం మనకు బోధపడుతుంది.

దేవినేని సూరయ్య, హరిశివకుమార్ గార్లు ఇద్దరూ పై వివరాల ప్రస్తావన లేకుండా తర్వాత కాలంలో వాటిని వ్యవహరించిన వ్యాకరణ పరిభాషలో వివరించారు. చూడండి. సూరయ్య : “వివ: ఇకారాంతములకు. ఉదా|| పోయి, చూచి, ‘ క్త్వార్థకము’ కకారాంతములకు ఉదా|| పెట్టక, వినక, ఇయ్య కొనక ‘వ్యతిరేక క్త్వార్థకము’ అన్వంతములకు ఉదా|| కుడువన్ (ను); వేడుకొనన్(ను) ‘తుమున్నర్థకములు” (పు. 117) అని మాత్రమే చెప్పాడు.

హరి శివకుమార్ “ఒక కర్త పూర్తి చేయు పనులలో మొదట పూర్తియైన పని ‘ఇ’కారాంతమును, చేయనిపనియైనచో ‘అక’ అంతమును, చేయదగిన పనియైనచో ‘అన్వంతము’ను అగునని చెప్పి, క్త్వార్థక – వ్యతిరేక క్త్వార్థక – తుమున్నర్థక ధాతువులను కేతన వివరించినాడు”. (పు. 140) అని చెప్పి శాసన ప్రయోగాలు కూడా చూపించాడు.

క్రియలను గురించిన వివరణలో వాక్యనిర్మాణ సూత్రాన్ని కూడా తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత కేతనకే దక్కుతుంది.

క.
తినుటకును తింట యగు మఱి
కొనుటకుఁ గొంట యగుఁ గనుటకుం గంట యగున్
వినుటకు వింట యగున్ దా
ననుటకు నంట యగు వలసినప్పుడు కృతులన్. (158)

తినుటకు = తినుట అనే క్రియకు; తింట+అగు = తింట అని అవుతుంది; మఱి= ఇంకా; కొనుటకు కొంట యగున్ = కొనుట అనే క్రియకు కొంట అని అవుతుంది; కనుటకున్ కంట యగున్ = కనుట అనే క్రియ కంటగా మారుతుంది; వినుటకు వింటయగున్ = వినుట వింటగా అవుతుంది; తాన్ = తాను; అనుటకు అంట యగు = అనడానికి అంట అని అవుతుంది; వలసినప్పుడు కావలసినప్పుడు; కృతులన్ కావ్యాలలో.

“కావ్యాలలో అవసరమైనప్పుడు తినుట అనే క్రియ తింట అనీ, కొనుట కొంట అనీ, కనుట కంట అనీ, వినుట వింట అనీ, అనుట అంట అనీ మారుతుంది”. తెలుగులో కావ్యాల, కవుల పుణ్యమా అని రూపవైవిధ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఎంత ఎక్కువగా ప్రబలిపోయాయంటే చిన్నయసూరి కూడా వీటిలో కొన్నింటికి సూత్రాలు రాయక తప్పలేదు. దీనికి కేతనే ఆద్యుడుగా కనిపిస్తున్నాడు. ఈ సూత్రాన్ని బట్టి చూస్తే శాసనభాషలోనూ, తాటాకుల్లోనూ మనకు మరొక రెండు రకాల రూపవైవిధ్యాలు కూడా కనిపిస్తాయి. –

(1) ధ్వని/వర్ణ మార్పుల వల్ల ఏర్పడ్డ రూపవైవిధ్యాలు (చిలుక-చిలక – లు >ల స్వరసమీకరణ);

(2) లేఖక దోషరూప వైవిధ్యాలు.

అయితే ఇక్కడ కేతన ఇచ్చిన రూపవైవిధ్యం ఛందస్సుకోసం కవులు ఏర్పరచుకున్నది. పై మూడు రకాల వైవిధ్యాల వల్ల ఏది సరియైన రూపం అన్న విషయమై గ్రాంథిక, వ్యావహారిక వాదాలకాలంలో అనేక చర్చలు జరిగాయి. రకరకాల రూపవైవిధ్యాలు కనిపిస్తున్నప్పుడు వాటిలో ఒకదాన్ని ‘శిష్టమైనదిగా, ప్రామాణికమైనదిగా నిర్ణయించాలి అన్న జయంతి రామయ్య పంతులు గారు వంటి వారూ, కాదని గిడుగు రామమూర్తిపంతులు గార్ల వాదాలలోని భేదాలలో కనిపించే ఒక ప్రధాన అంశం అని గుర్తించాలి.

కేతన రాసిన ఈ సూత్రంలోని విషయాన్ని గమనిస్తే తెలుగు భాషకు సంబంధించిన రెండు అంశాలు ఇతని కాలానికే రూపు దిద్దుకున్నట్లు కనిపిస్తుంది. అవి:

1. న కారం బిందువు (సున్న)గా మారటం.

2. ఈ మార్పు ఛందో అవసరాల రీత్యా అనివార్యం కావటం. అంటే తినుట, వినుట, కొనుట, అనుట ఇవన్నీ మూడు లఘువులతో ‘న’ గణంగా పరిగణించ బడుతాయి; కాని సున్న స్వతంత్రం కాకపోవటం వల్ల దానితో కలిసిన ముందు అక్షరం గురువుగా మారుతుంది. అందువల్ల తిను తిం-గా మారి గురువై, తింట, వింట, కొంట, అంట మొ||వన్నీ గురు+లఘు జంటగా ‘గలం’ అనే ‘హ’ గణంగా మారుతాయి. అందువల్ల కవులు ‘న’ గణం అవసరమైతే ‘న’ కారంతోనూ, ‘గలం’ (హ) గణం అవసరమైనప్పుడు బిందుపూర్వకంగానూ వీటిని మార్చుకుని వాడుకున్నారు. దాంతో తెలుగులో రూపాంతరాలకు జీవం పోసారు. ఇలాంటివే చిలుక – చిల్క, అలుక – అల్క అర్మిలి అరిమిలి మొదలైన కలిపే, విడగొట్టే పదమధ్య వర్ణమార్పిడి రూపాలు. వీటన్నిటినీ వర్ణాదేశ, వర్ణలోప సంధులుగా గుర్తించాలి.

దేవినేని సూరయ్య “అను, కను, విను, తిను, మను అను నీ యన్వాది క్రియలకు ట వర్ణము పరమగునప్పుడు ను స్థానమున నిండుసున్న వైకల్పికముగా వచ్చును” (పు. 118) అని తర్వాతి వ్యాకర్తల సూత్రాన్ని ఇచ్చాడు.

హరి శివకుమార్ “అవసరమైనప్పుడు కావ్యములందు తినుటకు తింట, కొనుటకు కొంట, వినుటకు వింట వంటి రూపములు వచ్చునని కేతన నిర్దేశించినాడు. శ్రీ వజ్జలవారు చెప్పినట్లు ఇట్టి ప్రయోగములు నన్నయ భారతమున మృగ్యములైనను, అట్టి ప్రయోగములు కేతన కాలమునకే నుండెననుటకు – అంట, కంట, గైకొంట వంటి తిక్కన ప్రయోగములే ప్రబల నిదర్శనములు. ఇట్టివి అసాధువులని అహోబిల పండితుడు నిరసించి కేతన మతమును ఖండించినాడు. ఈ విషయమును శ్రీ గిడుగు వారును సమర్థించినారు” (పు. 141) అన్నాడు.

వ్యతిరేక క్త్వార్థకం

క.
ఉటలకును నకలగు తెనుఁగు
చుటలకు వక లగును గదియుచో మును దాఁజే
యుటకున్ జేయక మును ద్రో
చుటకున్ ద్రోవక మునును బ్రచురమైయునికిన్. 159

ఉటలకున్ = ఉట చివర ఉన్న క్రియాపదాలకు; ‘అక’లు అగు = ‘అక’ ప్రత్యయం చేరుతుంది, తెనుగు = తెలుగులో; చుటలకు = చువర్ణాంత క్రియలకు; ‘వక’లు అగును = ‘వక’ చేరుతుంది; కదియుచో = కలిపినప్పుడు; మును = పూర్వం, ముందు; తాన్ = తాను; చేయుటకున్ = చేయడానికి; చేయకమును = చేయకపూర్వం; త్రోచుటకున్ తోయడానికి; త్రోవకమునును = తోయడానికి పూర్వం; ప్రచురమై = ప్రయుక్తమై, ఉపయోగించబడి; ఉనికిన్ = ఉండడం వల్ల.

“ఉట అనే వర్ణకం చివరలో ఉన్న క్రియలకు అక అనీ; ‘చుట’ అని చివర్లో ఉన్న క్రియారూపాలకు ‘వక’ అనీ వచ్చి చేరుతాయి. చేయుటకున్, చేయకమును; త్రోచుటకున్, త్రోవకమును అనేవి ఉదాహరణలు”.

భూతకాల అసమాపక క్రియల వ్యతిరేకరూపాలలో రెండు సపదాంశాలు (allomorphs) గుర్తిస్తున్నాడు కేతన. ఇవి రెండూ కూడా వర్ణ విధేయ సూత్రాలే. ‘ఉట’ అనే అక్షరాలు క్రియల చివర ఉన్నట్లయితే వాటికి ‘అక’ అనే ప్రత్యయం చేరుతుందనీ, ‘చుట’ అని ఉన్న వాటికి ‘వక’ చేరుతుందనీ సూత్రం చెపుతోంది. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఉదాహరణకూడా ఇచ్చాడు.

ఉదా: చేయుట (‘ఉట’ చివర ఉన్న క్రియ)లో ఉట చివర ఉంది. అందువల్ల చేయుటకు చేయక (అక ప్రత్యయంతో) అనీ; త్రోచుటలో ‘చుట’ ఉన్నందువల్ల త్రోచక అని కాకుండా ‘వక’ చేరి త్రోవక అని అవుతుందనీ కేతన వివరించిన తీరులో సపదాంశాల’ గుర్తింపు, వాటి ‘వర్ణవిధేయ’ సూత్రీకరణా కనిపిస్తుంది. నిజానికి రెండిటిలోనూ ఉన్నది ‘అక’ ప్రత్యయమే. ఈ ప్రత్యయం చేరినప్పుడు ‘చు’ కారాంతాలకు ‘వ’ ఆగమంగా వచ్చి చేరిందని అర్థం. ఇదే ఆధునిక తెలుగులో ‘య’ డాగమంగా మారింది. (తోయు- తోయక).

దేవినేని సూరయ్య “వ్యతిరేక క్వార్ధమందు ఉకారాంతములగు ధాతువులకు అక వచ్చుననియు, చు వర్ణాంత ధాతువులకు వక వచ్చుననియు నెఱుంగునది” (పు. 119) అని వివరించి, ఉదా|| చేయుట – చేయక, త్రోచుట – త్రోవక అని ఇచ్చాడు. హరిశివకుమార్ “తరువాతి పద్యమున కేతన – భావార్థకమైన ‘ఉట’ అంతమందు గల వ్యతిరేకార్థ ధాతువులకు చివర ‘అక’ అనునదియు, ‘చుట’ అంతమందు గల్గిన ధాతువులకు చివర ‘వక’ అనునదియు వచ్చును చేయక, త్రోవక” (పు. 141) అని వివరించాడు.

క.
దీవెన కెడమయుఁ గాతయుఁ
గావుతయున్ దెనుఁగుకవులకబ్బంబులలో
శ్రీవెలిఁగెడ మధిపుఁడు మేల్
గావించుగాత మేలుగావుత యనఁగన్. 160

దీవెనకు = దీవించడానికి; ఎడమయు = ‘ఎడమ’ అనే ప్రత్యయం; కాతయున్ = ‘కాత’ ప్రత్యయం; తెనుగు కవుల = తెలుగు కవుల; కబ్బంబులలో = కావ్యాలలో; శ్రీ వెలుగు+ ఎడమ=వెలిగెడమ = సంపద వెలగాలి; అధిపుడు = రాజు; మేల్ కావించు + కాత = మేలు చేయుగాక; మేల్ + కావుత = మంచి జరగాలి; అనఁగన్ = అనే విధంగా.

“దీవించడానికి తెలుగు కవుల కావ్యాలలో ‘ఎడమ’, ‘కాత’ ” కావుత” అనే ప్రత్యయాలు కనిపిస్తాయి. ఉదా: శ్రీ వెలిగెడమ; అధిపుడు మేల్ గావించుగాత; మేల్ గావుత అనే విధంగా”.

వీటిని ‘ఆశీరర్థక’ వాక్యాలుగా పేర్కొంటారు. ఇవి రెండు విధాలుగా ఉన్నాయి. 1) ఎడమ’ ప్రత్యయం క్రియతో కలుస్తుంది; 2) కాత – కావుత అనేవి నామం విశేషణంతో చేరుతాయి.

ఆధునిక తెలుగులో ‘ఎడమ’ ప్రయోగం లేదు. కావుత/కాత అనేవి అగు – అవులకు జరిగిన వర్ణ వ్యత్యయ రూపాలుగా మారి, మేలగు అనీ కాత > కాక > గాక అయి రెండూ కలిసి మేలు + అవు/అగు+కాక = మేలగుగాక; అని కానీ, మేలు కలుగుగాక, జరుగుగాక అనే విధంగా కొన్ని క్రియలతో చేరి ఈ ‘దీవెన’ అర్థాలు ఏర్పడుతున్నాయి.

చక్కటి తెలుగు పదం ‘దీవెన’ అని కేతన వాడినా దీనిని సంస్కృతీకరించి, అంటే సంస్కృత వ్యాకరణ సంప్రదాయాల ననుసరించి ‘ఆశీరర్థకం’ అని వాడటం వల్ల తర్వాతి కాలంలో ఇంతకుముందే చెప్పినట్లు వ్యాకరణ పరిభాషలో క్లిష్టత ఏర్పడి సామాన్యులకు అర్థం కాకుండా పోయింది. తేలికైన మాటలలో, సులభమైన శైలిలో వ్యాకరణం ఎలా రాయవచ్చో కేతనను చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది.

దేవినేని సూరయ్య “ఆశీరాద్యర్థకమున తెలుగునందు ఎడున్, కావుతన్, కాతన్ అనునవి వచ్చును. శ్రీ వెలిగెడున్, మేల్గావించుగాతన్, మేల్ గావుతన్ మొదలగునవి యుదాహరణములు. ఆశీరాద్యర్థకంబున వచ్చు ఎడు, త వర్ణంబులు ద్రుతాంతంబులు. ఈ ద్రుతమున కచ్చు పరంబగునప్పుడు మకారము వచ్చును. జయం బయ్యెడుమని, జయంబగుతమని మొ.” (పు. 119) అని వివరించగా; హరిశివకుమార్ “ఈ ఆశీరర్థక ప్రత్యయముల విషయమున భిన్నాభిప్రాయములున్నవి. కేతన చెప్పిన ప్రత్యయములు ఎడున్, తన్, గావుతన్ అనునవి యని కొందఱును, (వావిళ్ళ 1914, శ్రీ వడ్లమూడి మొ||). ఎడమ, కాత, గావుతలు అని కొందఱును (న.భా. – పు. 868, శ్రీ జి.వి.సీతాపతి ‘త్రిలింగరజతోత్సవ సంచిక’ – పుటలు 666-667) భిన్నాభిప్రాయములు కల్గియున్నారు. కొన్ని ఆ కాలపు ప్రయోగములు పరికించినచో, పై రూపములన్నియు నంగీకృతములేయని స్పష్టమగుచున్నది. నన్నయ – ఎడున్ (ఆది – 1-105), ఎడమ (ఆది – 2-87) కావుతమ (ఆది 8-63) అను వానిని ప్రయోగించియున్నాడు. కేతనయే తన దశ కుమారచరిత్రమున ఎడున్ (దశకు 9-98) తన్ (దశకు 1-1), గావుతన్ (1-6), గావుతమ (1-4) అను వానిని ప్రయోగించినాడు (పుటలు 141-142)” అని ఇచ్చిన వివరణ ఎంతో అదనపు సమాచారాన్ని అందించడమేగాక ఈ విషయంలో మరింతగా జరగాల్సిన కృషిని పరోక్షంగా తెలియజేస్తుంది. ఈ కావుత, గావుత, గాతల రూపాలు అగు, గాక లుగా పరిణామం ఎప్పుడు చెందాయో, ‘ఎడమ’ కావ్యాలలోనే ఉందా లేక వ్యవహారంలో కూడా ఉందా?, దాని ప్రయోగం తెలుగుభాషా పరిణామంలో ఎప్పటినుండి ఆగిపోయింది? – ఇవన్నీ పరిశీలించాల్సిన అంశాలు.

నూత్న పదసృష్టి – అర్థ విజ్ఞానం

162వ పద్యం నుండి ఒకటి రెండు మినహాయింపులతో కేతన తన తదనంతర వ్యాకర్తలు కృత్, తద్ధితాలనీ ఆధునికభాషాశాస్త్ర వేత్తలు Derivational Processes అనీ పేర్కొన్న వాటిని వివరించాడు.

కానీ వీటికి ముందుగా విభక్తి, సంధి, సమాసం, క్రియలకు వలె ‘తదనంతరంబ…. ఎరింగించెద’ అన్న పూరక సూత్రాన్నేదీ ఇవ్వలేదు. క్రియల నుండి ఉత్పన్నమయ్యే కొత్త పదాలే (కృత్తులు) కాకుండా, నామ, విశేషణాలనుండి ఉత్పన్నమయ్యే కొత్త పదాలూ (తద్ధితాలు) కలిపి ఈ క్రియ అధ్యాయం కిందనే కేతన పేర్కొనటం వల్ల అప్పటికి వీటికి సంబంధించి స్పష్టంగా వ్యాకరణ పరిభాషలో భేదం ఏర్పడలేదేమో ననైనా భావించాలి లేదా కేతన వీలయినంత తక్కువ పరిభాషనే ఎంచుకుని, సంక్లిష్టమైనవన్నీ పరిహరించి, పక్కన పెట్టేసాడు అనైనా అనుకోవాలి. ఈ రెండిట్లో రెండోదే సరియైందనిపిస్తుంది.

తే.
ఏకపదముపైఁ గాఁడు నేర్పెల్లఁ దెలుపు
గొనబుకాఁడు బలిమికాఁడు కొండెకాఁడు
చనవుకాఁడు చెలిమికాఁడు జాడగాఁడు
బందికాఁ డన నెల్లెడఁ బరఁగుచుండు. 161

ఏకపదముపై = ఒక్కమాటపై; కాఁడు = కాడు అనే ప్రత్యయం; నేర్పు ఎల్లన్ నైపుణ్యాన్ని అంతటినీ; తెలుపు = తెలియజేస్తుంది; గొనబుకాఁడు = గొనబు+కాఁడు =అందగాడు; బలిమి + కాఁడు = బలిమికాఁడు = బలవంతుడు; కొండె+కాఁడు =పితూరీలు (కొండేలు) చెప్పేవాడు (చెప్పడంలో నేర్పరి); చనవు + కాఁడు = సభ్యత గలవాడు; చెలిమి+కాఁడు = స్నేహితుడు; జాడగాఁడు = ఎరిగినవాడు; బంది+కాఁడు = దొంగ (=బందిపోటు); అనన్ = అనే విధంగా; ఎల్లెడన్ = అన్నిచోట్లా (భాషలోనూ, కావ్యాల్లోనూ అని అనుకోవాలి); పరఁగుచుండు = ఉపయోగింపబడుతాయి.

“ఒక పదంపై చేరిన ‘కాఁడు’ అనే ప్రత్యయం నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. గొనబుకాఁడు, బలిమికాఁడు, కొండెకాఁడు; చనవుకాఁడు, చెలిమికాఁడు, జాడగాఁడు, బందికాఁడు అనే విధంగా అంతటా ప్రయోగింపబడుతాయి”.

కేతన ఈ పద్యంలో ప్రత్యయానికి ఉన్న ‘అర్థాన్ని’ చెప్పాడు సూత్రంగా తీసుకోవాలంటే ఈ ప్రత్యయం వేటికి చేరుతుందో చెప్పాలి, కానీ దాని అర్థాన్ని కాదు కదా? అయినా ఈ పద్యం నుండీ వ్యాకరణ శాస్త్రంలో అర్థ విజ్ఞానాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది కూడా కేతనే అని గుర్తించాలి. అసలు విషయం ఏమంటే కాడు అనే ప్రత్యయం ఏయే పదాలకు చేరుతుందో నిష్కర్షగా చెప్పడం కుదరదు. – కాడు మాత్రమే కాదు; తద్ధిత, కృత్ ప్రత్యయాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. అంతేకాదు, ఈ పరిస్థితి అంటే ఏయే మాటలతో ఏ ప్రత్యయం వస్తుందో చెప్పడం మాత్రమే సాధ్యమై, ఏయే రకం మాటలతో ఆ ప్రత్యయం చేరదో చెప్పడం కూడా ఒక్క తెలుగుకే కాదు, ఏ భాషలోనూ కూడా పూర్తిగా సాధ్యమయ్యే విషయం కాదు. బహుశా అందుకనే కేతన ప్రత్యయాల చేర్పు వల్ల కలిగే అర్థంలో మార్పుని మాత్రమే వివరించాడను కోవాలి.

దేవినేని సూరయ్య తన వివరణలో “ఒక పదము మీద “కాడు” అను ప్రత్యయము చేరి నేర్పు తెలియజేయును. ఉ|| గొనబుకాడు(అందగాడు), బలిమికాడు (బలముగలవాడు), కొండెకాడు (కొండెము చెప్పువాడు), చనవుకాడు (అనురాగము గలవాడు), చెలిమికాడు (స్నేహము గలవాడు), జాడకాడు (దారి గుర్తెరిగినవాడు) బందికాడు (బందిపోటువాడు)” అని ఉదాహరణములు”, వాటి అర్థాలు ఇచ్చి “వానికి తద్ధితములని పేరు. తద్ధితములనగా సంస్కృతాంధ్ర విశేష్య విశేషణములగొన్ని ప్రత్యయములేర్పడి యర్థభేదమును దెల్పును” (పు. 119-120). అని చెప్పి కొన్ని సంస్కృత తద్ధితాలను కూడా వివరించాడు.

హరిశివకుమార్ 166వ పద్యం ముందు చెప్పి, దానిలో ‘కాడు’ (ఆడు, ఈడులతో కలిపి) పుంలింగమని చెప్పాడనీ, అలాగే “ ‘కాడు’ ప్రత్యయము నేర్పును కూడా తెల్పునని చెప్పినాడు కేతన” (పు. 144) అని చెప్తూ ఈ రూపములనన్నింటిని చిన్నయ సూరి కూడా సాధించినాడు (బాల. తద్ధిత – 11, 15, 23) ‘కాడు’ ప్రత్యయం బహువచనంలో కూడా వచ్చింది (పద్యం 71) అని కూడా అన్నారు.

ఆ.
ఈఁడు బాస దెల్పు నీఁడు గుణము దెల్పు
నీఁడు కులము దెల్పు నెల్లయెడలఁ
గన్నడీఁడు నాఁగఁ గపటీఁడు నాఁగ సా
లీఁడు నాఁగ వేరులేక చనుట. 162

ఈఁడు బాస తెల్పున్ = ఈడు ప్రత్యయం భాషను తెలియజేస్తుంది; ఈఁడు గుణము దెల్పున్ = ఈడు గుణాన్ని తెలియజేస్తుంది. ‘ఈఁడు’ కులము దెలుపు = ఈడు కులాన్ని కూడా తెలియజేస్తుంది; ఎల్లయెడలన్ = అన్ని చోట్ల కూడా. కన్నడీఁడు నాఁగ = కన్నడీఁడు (కన్నడ భాష మాట్లాడేవాడు) అనే విధంగా; కపటీఁడు నాఁగ = మోసం చేసేవాడు (గుణం) అనే విధంగా; సాలీఁడు నాఁగ = సాలె (చేనేత) కులానికి చెందినవాడు అనే విధంగా వేరు లేక చనుట = వేరు వేరుగా లేకపోవడం వల్ల.

“వేరు వేరు ప్రత్యయాలు లేకపోవడం వల్ల ఈడు అనే ప్రత్యయరూపం భాషను, గుణాన్ని, కులాన్ని తెలియజేస్తుంది; ఉదా: కన్నడీడు (భాషకు సంబంధించినవాడు), కపటీడు (గుణం) సాలీడు (కులం) అనే విధంగా”

భాషాశాస్త్రంలోని రెండు ప్రధాన విభాగాలు పదాంశ నిర్మాణ శాస్త్రం, (Morphology) శబ్దార్థ విజ్ఞానశాస్త్రం (Lexical Semantics) కేతన గుర్తించిన ఈ అంశాన్ని – అంటే రూపం ఒక్కటిగా ఉండి వేరు వేరు అర్థాలను ఇచ్చే విషయాలను – విడివిడిగా చర్చిస్తాయి. రూపం ఒకటిగా ఉండి అర్థాల్లో సామ్యం లేనట్లయితే ఆ రూపాలను వేరు వేరు పదాంశాలుగా గుర్తించాలని ఇంగ్లీషులోని ‘బ్యాంక్’ అనే మాటను చూపుతుంది. బ్యాంక్ అనే పదానికి రూపం (ఇంగ్లీషులోనైతే వర్ణక్రమం, ఉచ్చారణ రెండూ కలిపి) ఒకేలా ఉన్నా ఒక బ్యాంకుకు డబ్బు సంబంధమైన కార్యాలయం’గానూ మరో బ్యాంక్ నదీ తీరం గానూ అర్థాలున్నందువల్ల అవి ఒకేగాట కట్టకుండా, వేర్వేరు పదాంశాలుగా గుర్తించాలని అక్కడ వివరిస్తే, అదే శాస్త్ర సూత్రం ఆధారంగానే శబ్దార్థ విజ్ఞాన శాస్త్రంలో వాటిని ‘హోమోనిమీకి చెందినవిగా, అంటే రూపసామ్యం కలిగి భిన్నార్థాలు కలిగినవిగా చెప్తారు. అందువల్ల ఇలాంటి వాటిని నిఘంటువుల్లో వేరువేరు ఆరోపాలుగా చూపాలని, వాటికి వేరు చేసి చూసే విధంగా అంకెలు చేర్చాలనీ నిర్ణయించి అలాగే నిఘంటువుల్లో ఆరోపాలు కూడా ఇస్తున్నారు.

కేతన కూడా ఒక్కసారే ‘ఈడు’ అని వాడకుండా; మూడుసార్లు విడివిడిగా ఈడు బాస తెల్పు, ఈడు గుణము తెలుపు, ఈడు కులము తెల్పు అని మూడు ‘ఈడు’లను చెప్తూ, ఇవన్నీ రూప సామ్యం కలిగి “వేరు లేకుండా” ఉన్నాయని స్పష్టం చేస్తాడు. ఈ చివర చెప్పిన మాటలవల్లా మూడుసార్లు విడివిడిగా ‘ఈడు’ అనడం వల్లా పైన వివరించిన భాషాశాస్త్ర సూత్రాన్ని కేతన తనదైన పద్ధతిలో గుర్తించి నిర్దేశించినట్లు గ్రహిస్తే, ఆయన సునిశితబుద్ధికీ, సూత్రీకరణకూ మనం నమస్కరించకుండా ఉండలేం.

సూరయ్య “ఈడు అనునది భాషను, గుణమును, కులమును దెల్పును” (121) అని మాత్రమే చెప్పగా హరిశివకుమార్ “కన్నడీడు, కపటీడు, సాలీడు” వంటి పదములలో “ఈడు’ అనునది భాషను గుణమును తెలుపుననియు వివరించినాడు” (పుట. 144) అంటూ కులాన్ని వదిలేయడం జరిగింది. ఇంతకుమించిన వివరణేమీ వారిలో లేదు.

క.
ఇండి యనుట లే దనుటయె
యొండొకయర్థంబు గలుగ నోపదు ధర ము
క్కిండియు వెరవిండియు వ్రా
యిండియు నుప్పిండి యనఁగ నేర్పడియునికిన్. 163

ఇండి+అనుట = ఇండి అనే ప్రత్యయం వాడితే; లేదు+అనుటయె = లేదని చెప్పడమే; ఒండొక = మరొక; అర్థంబు = అర్థం; కలుగన్ + ఓపదు = ఉండే వీలులేదు; ధర = భూమిపై; ముక్కిండియు = ముక్కు లేనివాడు; వెరవిండియు = ఉపాయం లేనివాడు; వ్రాయిండియు = రాయడం లేనివాడు (=తెలియనివాడు); ఉప్పిండియు = ఉప్పులేనిది; అనగన్ = అనే విధంగా; ఏర్పడి+ ఉనికిన్ = ఏర్పడి ఉండడం వల్ల.

“ఇండి అనే ప్రత్యయానికి లేదు అనే అర్థం; మరో అర్థం ఏదీ లేదు. ఉదా: ముక్కిండి, వెరవిండి, వ్రాయిండి, ఉప్పిండి”.

ఈ ప్రత్యయం ‘లేకపోవడం’ అనే అర్థంలో కొన్ని పదాలకు మాత్రమే చేరుతుంది. అయితే పైన ఈడుకు మూడు భిన్న అర్థాలు ఉన్నట్లు చెప్పడం వల్ల కేతన దానికి “ఒండొక అర్థంబు కలుగనోపదు” (వేరే ఇంకే అర్థం లేదు) అని స్పష్టం చేస్తూ నాలుగు ఉదాహరణలు ఇచ్చాడు ముక్కిండి, వెరవిండి, వ్రాయిండి, ఉప్పిండి. వీటిలో ముక్కిండి , ముక్కిడిగామారి నేటి తెలుగులో వాడకంలో ఉంది, సామెతలో కూడా (‘ముందే ముక్కిడి, ఆపైన పడిశం’) నిలిచి ఉంది.

దేవినేనిసూరయ్య “ఇండి (ఇండి) అనునది లేదు అనునర్థమును దెలుపును (పు. 121) అంటూ ఇండితో కేతన ఇచ్చిన రూపాలేకాక ‘ఇండి’ అనునది తదభావద్యోతకమున వచ్చునని చెప్పి, ‘ముక్కిండి, వెరవిండి’ అనువాని నుదాహరించినాడు కేతన; ఇట్టి బిందుపూర్వకరూపమునకు ప్రయోగములు మృగ్యములు” (పు. 144) అని చెప్తూ, “చిన్నయ సూరికూడా ‘ఇండి’ అనే చెప్పినాడు; కేతన చెప్పినది బహుశః ప్రాచీన రూపము కావచ్చును.

నేటి ఇండిలోని అరసున్న పూర్వమొకప్పుడిది బిందుపూర్వకమై యుండెనని తెల్పుచున్నది. దశకుమార చరిత్ర, విజ్ఞానేశ్వరములలో కేతనయే ‘వెరవిఁడి’ (దశ. 11-104; విజ్ఞా – 101) అను ఇ(డి ప్రత్యయముతో కూడిన రూపాన్నే వాడి యున్నాడు” అని పేర్కొన్నాడు (పు. 144). ఈయన తిక్కన ప్రయోగం బిందువులేని “అరులకు సిరి యిచ్చెదనను వెరవిఁడియుం గలడె’ అనే ప్రయోగం కూడా చూపాడు.

తే.
ఆఁడు నరియును నధమ కార్యములఁ దెలుపు
బొంకులాఁడు తగవులాఁడు ఱంకులాఁడు
పెంటి పెనపరి ముండరి తుంటరియును
గల్లరియు నన నెల్లెడఁ జెల్లుఁ గాన. 164

ఆఁడున్ = ఆడుప్రత్యయం; అరియును = అరిప్రత్యయం కూడా, అధమ కార్యములన్ = నీచమైన పనులను; తెలుపు = తెలియజేస్తాయి. బొంకులాఁడు = అబద్ధాలు చెప్పే వ్యక్తి; తగవులాఁడు = జగడాల మారి; ఱంకులాఁడు = భార్యకాని స్త్రీలతో తిరిగేవాడు; పెంటి పెనపరి = వాదులాడే వ్యక్తి; ముండరి = భర్తను కోల్పోయిన స్త్రీలతో తిరిగేవాడు; తుంటరి యును = కొంటెపనులు చేసేవాడు; కల్లరియు = అబద్ధాలాడే వాడు; అనన్ = అనే విధంగా; ఎల్లెడన్ = అన్నిచోట్ల; చెల్లుఁగాన = ఉపయోగింపబడుతాయి కాబట్టి.

“ఆఁడు, అరి అనే రెండు ప్రత్యయాలు కూడా నీచమైన పనులను చేయడాన్ని తెలియజేస్తాయి. బొంకులాఁడు, తగవులాఁడు, ఱంకులాఁడు, పెంటి పెనపరి; ముండరి, తుంటరి, కల్లరి అనేవి ఉదాహరణలు”.

రెండు ప్రత్యయాలు – రూపంలో వేరు వేరు, కానీ అర్థంలో సమానం. ఇవి రెండూ కూడా చేరినప్పుడు నీచమైన పనులు చేయడాన్ని తెలుపుతాయి అన్న అర్థ వివరణ ముందుగా ఇచ్చి, కేతన పుంలింగ పదాలుగా బొంకులాడు, తగవులాడు, ఱంకులాడు వంటి ఉదాహరణలిచ్చాడు. ఈ విషయంలో రెండు అంశాలు గమనించాలి. (1) ఈ ఆడు ప్రత్యయం ఏకవచనంపై చేరలేదు, బహువచనరూపాలపై అంటే బొంకులు, తగవులు, ఱంకులు పై చేరింది. పోతే ఆడు వల్ల నీచార్థం వస్తోందా లేక ప్రధానపదాలైన బొంకులు, తగవులు, ఱంకులు అన్న మాటలకే నీచార్థం ఉందా? అన్నది చర్చించాల్సిన విషయం ‘అరి’ ప్రత్యయం చేరడం వల్ల ‘అధమకార్యం’ తెలుస్తోందా లేక పెనపరి, ముండ, తుంట, కల్ల. అనే మాటల్లోనే ఏదైనా నీచార్థం ఉందా లేదా అన్నది కూడా పరిశీలించాల్సిన విషయమేననిపిస్తోంది.

ఈ విషయాలపై దేవినేని సూరయ్య, హరిశివకుమార్ ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. హరిశివకుమార్ మాత్రం ఈ ప్రత్యయాలకు కేతన ‘అర్థవివరణ’ చేసినాడని (పు. 144) తెలిపాడు.

క.
అమి లేమికి నిమి కల్మికి
నమరంగాఁ దనము ధర్మ మగుటకుఁ దగుఁ గా
నమి వినమి తాల్మి కూరిమి
తమమంచితనంబు లోభితన మనఁ జనుటన్. 165

అమి లేమికిన్ = ‘అమి’ ప్రత్యయం ‘లేకపోవడానికి’; ఇవి కలిమికిన్ = ‘ఇమి’ ప్రత్యయం ‘కలిగి ఉండడానికి’ (లేమి= పేదరికం; కలిమి = ధనం); అమరంగా = సరిగ్గా; తనము = తనము ప్రత్యయం, ధర్మము + అగుటకున్ = ఆచరించదగ్గ విషయానికి, తగున్ = సరిపోతాయి; కానమి = కాను + అమి = కనిపించని, వినమి = విను +అమి = వినిపించని; తాల్మి= తాలు+ ఇమి = ఓపిక ఉండడం; కూరిమి = స్నేహంగా ఉండటం; తమ = తమ యొక్క మంచితనంబు = మంచితనం; లోభితనము = పిసినారి స్వభావం; అనన్ = అనే విధంగా; చనుటన్ = ఉపయోగింపబడటం వల్ల.

“అమి అనే ప్రత్యయం లేకపోవడానికి, ఇమి ప్రత్యయం ఉందనడానికి, తనము స్వభావా (ధర్మా)నికి చేరుతాయి. కానమి, వినమి (‘అమి’కి); తాల్మి, కూరిమి (‘ఇమి’కి) మంచితనం, లోభితనం (‘తనం’ ప్రత్యయానికి) ఉదాహరణలు”.

ఈ సూత్రంలో ‘మూడు’ ప్రత్యయాలు వాటి అర్థాలూ, వాటికి ప్రయోగాలు చూపించాడు కేతన. కానమి, వినమి అనేటటువంటి పదాల్లో కనిపించే ‘అమి’ ప్రత్యయం ‘లేకపోవడానికీ’, తాల్మి, కూరిమి వంటి మాటల్లో కనిపించే ‘ఇమి’ ‘ఉందని చెప్పడానికి’, మంచితనము, లోభితనము వంటి పదాల్లోని ‘తనం’ స్వధర్మాన్ని తెలియజేయడానికీ ఉదాహరణలుగా చూపించాడు. వీటిలో అమి ప్రత్యయం చేరే ‘కనమి, వినమి’ పదాలు ఆధునిక భాషలో ఉపయోగంలో లేవు. మిగిలిన రెండూ ఉన్నాయి. (66వ పద్యం చూడండి) దేవినేని సూరయ్య వివరణ: “అమి అను ప్రత్యయము లేదను నర్థమునకు, ఇమి అను ప్రత్యయాలు ఉన్నదను నర్థమును, తనము అను ప్రత్యయము ధర్మమును దెల్పును”. (పు. 123)

హరిశివకుమార్ : ” ‘అమి’ అనునది లేదను నర్థమునను; ‘ఇమి’ అనునది యున్నదను నర్థమునను, ‘తనము’ అనునది తత్ – ధర్మము తెలుపునదిగను వాడబడునని కేతన చెప్పినాడు. వాటిలో ‘అమి’ ప్రత్యయము కేవలము క్రియాపదముల పైననే కనిపించుచున్నది. అందువలన సూరి దీనిని ‘మిజి’ యని చెప్పి క్రియా ప్రకరణములో చెప్పినాడు. కాని కేతన దీనిని కృదంతముగా పరిగణించినట్లు కన్పట్టుచున్నది. నన్నయ భారతమున తేజరిల్లమి (ఆది 1-141), రక్షింపమి (అర-1-170) వంటి ప్రయోగములున్నవి. ‘ఇమి’ యనునది ‘బలిమి’, ‘చెలిమి’ ఇత్యాది పదములలో ‘కల’యను నర్థమున నామవాచకములపైనను, ‘తాల్మి, కలిమి’ ఇత్యాది ప్రయోగములలో క్రియలపైనను వచ్చుచున్నది. అందువలన సూరి దీనిని తద్ధిత ప్రకరణములోను, మరియు కృదంత ప్రకరణములోను గూడ చెప్పినాడు.

కాని కేతన మాత్రము అర్థ విచారణ చేసి యున్నదను నర్థమున వచ్చునని చెప్పినాడు. ‘పలుగుదనము’ (ఆది-5-203) వంటి ప్రయోగములలో ‘తనము’ తత్ – ధర్మ బోధకముగ నున్నది”. (పు. 144 – 145).

క.
ఆఁడును నీఁడును గత్తెయుఁ
గాఁ డనుచోఁ గర్త యగు జగం బెఱుఁగంగా
బోఁడి యనఁగ నెల్లెడలను
నాఁడుం బేళ్ళకును జెల్లు నభినవదండీ. 166

ఆఁడునున్ = ఆడు ప్రత్యయం; ఈఁడునున్ = ఈడు ప్రత్యయం; కత్తెయున్ కత్తె ప్రత్యయం; కాఁడు+అనుచోన్ = కాడు అనే ప్రత్యయం వాడినప్పుడు; కర్తయగు కర్త అవుతుంది; జగంబు ఎఱుగంగా = ప్రపంచానికి తెలిసే విధంగా; బోఁడియనగ = బోడి అనే ప్రత్యయానికి; ఎల్లెడలనున్ = అన్నిచోట్లా కూడా; ఆఁడున్ + పేళ్ళకును ఆడవారి పేర్లకు; చెల్లున్ = సరిపోతుంది; అభినవదండీ = ఓ కేతనా!

“ఆఁడు, ఈఁడు, కత్తె, కాఁడు, బోఁడి అనే ప్రత్యయాలన్నీ కూడా వాక్యంలోని) కర్తను తెలియజేస్తాయి. వీటిలో – బోడి అనేది అన్ని సందర్భాలలోనూ ఆడవారి పేర్లకే వస్తుంది”.

ఈ ప్రత్యయాలలో కొన్నింటికి ఇంతకు పూర్వం పద్యాలలో ఉదాహరణలు ఇవ్వడం వల్ల కేతన ఇక్కడ ప్రత్యేకంగా మళ్ళీ ఉదాహరణలు చూపలేదని అనుకోవాలి. ఇవన్నీ కూడా చేరిప్పుడు ఆ పదాలు ‘కర్త’ (వాక్యానికి సంబంధించింది; క్రియతో అన్వయించేది) అవుతాయి. వీటిలో కత్తె, బోడి అనేవి “ఎల్లవేళలా” (=అన్నిచోట్లా) స్త్రీలను తెలియజేస్తాయి. (చూ. 162, 163 పద్యాలు)

దేవినేని సూరయ్య ఈ పద్యం కింద విశేషాంశములు పేరుతో వివిధ తద్ధిత (భావార్థక, మతుబద్ధక, స్వార్థక, మానార్థక, దఘ్నార్థక, తాచ్ఛీల్య శీర్షికల కింద) ప్రత్యయాలను ఇచ్చాడు. పనిలో పనిగా (ఈ సందర్భములో) కృదంతాలను కూడా కొన్నింటిని ఉదాహరణలతో సహా ఇచ్చాడు.

రుగాగమ సంధి

క.
ఆలికి రాలగు దిగువ గు
ణాలి నిలిపి పలుకుచోట నను వగునెడ గొ
డ్రాలు జవరాలు పాతకు
రాలు గెడపురాలు ముద్దరా లనఁ జనుటన్. 167

ఆలికి రాలగు = ‘ఆలి’ ప్రత్యయం చేరినప్పుడు ‘ర’ వస్తుంది; దిగువ = ముందుగా; గుణాల = గుణవాచకాలు (విశేషణాలకు); నిలిపి = చేర్చి; పలుకుచోటన్ = చెప్పేచోట్లలో; అనువు + అగున్ + ఎడ = అనువైన సందర్భాలలో; గొడ్రాలు = పిల్లలు లేని స్త్రీ,(< గొడ్డు + ఆలు); జవరాలు = యవ్వనవతి (< జవ + ఆలు); పాతకురాలు = పాపి (< పాతక+ఆలు); కెడపురాలు = చెడ్డ స్త్రీ (కెడపు + ఆలు); ముద్దరాలు = అమాయక (ముద్ద + ఆలు); అనన్ = అనే విధంగా; చనుటన్ = చెల్లే (వాడే) విధంగా. “ఆలి ప్రత్యయం విశేషణాలకు చేర్చినప్పుడు ఆలికి ముందు (=దిగువ) 'ర' వచ్చి ‘రాలు' అవుతుంది. ఉదాహరణలు; గొడ్రాలు, జవరాలు, పాతకురాలు, కెడపురాలు, ముద్దరాలు”. కేతన తర్వాతి వ్యాకర్తలు దీనిని రుగాగమసంధి అన్నారు. కానీ కేతన అచ్చమైన వర్ణనాత్మక (భాషాశాస్త్ర పద్ధతిలో) వ్యాకర్త. అందువల్ల ఆలు అనే ప్రత్యయాన్ని విశేషణాలకు చేర్చినప్పుడు ముందుగా 'ర' చేరి ' రాలు' అవుతుంది అన్నాడు. 'వ్యాకర్తలు ఇచ్చిన ఉదాహరణలన్నీ కూడా కేతన నుండీ చిన్నయసూరి దాకా అవే అని చెప్పవచ్చు. ఆలు శబ్దము పరంబగునప్పుడు రుగాగంబగు - (చిన్నయసూరి సంధి 30) అని 'రు' ఆగమంగా సూత్రీకరించాడు చిన్నయసూరి.

వ- గ ( గ- వ) ల మార్పు

ఆ.
అచ్చ తెలుఁగుమాట నను వైనచో వకా
రము గకారరూప మమరఁ దోఁచుఁ
దీవె తీగె యనఁగ జేవ చేగ యనఁగఁ
బవలు పగలు నాఁగఁ బరఁగుఁ గాన. 168

అచ్చ తెలుగుమాటన్ = అచ్చమైన (తత్సమేతర) తెలుగు మాటలలో; అనువైనచో = అనుకూలమైన చోట్ల; వకారము = ‘వ’ అనే అక్షరం; గకార రూపము = ‘గ’ అక్షరంగా (రూపంలో); తోచున్ = కనిపిస్తుంది; తీవె తీగె అనఁగ = తీవెను తీగె అనే విధంగా; చేవ చేగ అనఁగ = చేవను చేగ అనే విధంగా; పవలు పగలు నాఁగ = పవలు అనే మాటను పగలు అనే విధంగా, పరఁగున్ కాన = వినియోగిస్తారు కాబట్టి.

“అచ్చ తెలుగు మాటలలో అనుకూలమైన చోట్ల ‘వ’ కు బదులుగా ‘గ’ కారం వస్తుంది. తీవె, చేవ, పవలు అనే పదాలు వరుసగా తీగె, చేగ, పగలు అని కూడా వాడబడుతాయి”.

కేతన కాలానికి తీవె, చేవ, పవలు అనే రూపాలే మొదటిరూపాలు గానూ, తీగె, చేగ, పగలు అనేవి ‘వ’కారం ‘గ’గా మారుతుందని చెప్పిన సూత్రం ఆధారంగానూ నిష్పన్నం చేయబడుతాయని తెలుస్తోంది.

కానీ ఆధునిక తెలుగులో దీనికి భిన్నంగా తీగె, పగలు అనే రూపాలను ప్రధాన రూపాలుగా తీసుకొని, ‘ గ’ కారం వకారంగా మారిందని సూత్రీకరించి తీవె, పవలు పదాలను నిష్పన్నం చేయడం జరుగుతోంది. ఏ రకంగానైనా కూడా గ-వ లేదా వ-గ ల మధ్య ధ్వని మార్పు సహజమేనని చెప్పవచ్చు. దేవినేని సూరయ్య “అనువైనచోనని చెప్పి యుండుటచే బదాద్యము కానిదై అసంయుక్తంబైన, వకారమునకు గకారము వచ్చునని యెఱుంగునది (పు. 126)” అని చిన్నయసూరి సూత్రాన్ని మాత్రమే చెప్పగా హరిశివకుమార్ “అచ్చ తెనుగు మాటలలో ననువైన చోట్ల ‘గ’ కారమునకు ‘వ’ కారము వచ్చును” అని సూత్రాన్ని (పైన వివరించినట్లు) తిరగవేసి ఇస్తూ ఉదాహరణల్లో కూడా “తీగె తీవె, పగలు-పవలు” అంటూ తిరగేసి ఇచ్చారు. వీటితోపాటు “నన్నయ పవలు (ఆది 2-152), తవిలి (అర.2-230) వంటి వానిని ప్రయోగించియున్నాడు” అని చూపి, సూరి (చిన్నయసూరి) “అపదాంత్యంబయి యసంయుక్తంబయిన గకారంబునకు వకారం బగునని చెప్పినాడు” (పు. 140) అన్నాడు. ఏమైనా వీరిద్దరూ కేతన సూత్రాన్ని తిరగేసి ఇచ్చారు. కానీ కేతన ‘వ’ కార రూపాలనే ప్రధానంగా తీసుకున్నాడనీ, దాన్ని హరిశివకుమార్ చూపిన ‘నన్నయ’ ఉదాహరణలు కూడా బలపరుస్తున్నాయనీ గ్రహించాలి.

తే.
ఆతఁ డిట్టివాఁ డెట్టివాఁ డట్టివాఁడు
నాఁగఁ జనునట్టి త్రితయమునకుఁ గ్రమమున
నాతఁ డిట్ట్టిఁడునెట్టిఁడు నట్టిఁ డనఁగఁ
దగుల నిమ్మెయి నభినవదండి చేసె. 169

ఆతఁడు ఇట్టివాఁడు = ఆయన ఇలాంటివాడు; ఎట్టివాఁడు ఎలాంటివాఁడు; అట్టివాడు= అలాంటివాడు; నాఁగన్ = అనే విధంగా; చనున్ + అట్టి = వాడేటటువంటి; త్రితయమునకున్ = మూడు రకాల పద ప్రయోగాలకు; క్రమమునన్ = వరుసగా; ఆతఁడు = ఆయన; ఇట్టిఁడు, ఎట్టిఁడు, అట్టిఁడు (అనే ఈ మాటలను); అనఁగన్ = అనే విధంగా; తగులన్ = సరియైన విధంగా; ఇమ్మెయిన్ = ఈ + మెయిన్ = ఈ విధంగా; అభినవదండి చేసె = కేతన చేసాడు (ఏర్పరిచాడు).

“ఆయన ఇట్టివాడు, ఎట్టివాడు, అట్టివాడు అనే ఈ మూడు పదాలకు క్రమంగా ఇట్టిడు, ఎట్టిడు, అట్టిడు అనేవి వాడబడుతాయని కేతన సూత్రీకరించాడు”.

ఆ, ఈ, ఏ అనే అక్షరాలు కేవలం అక్షరాలు మాత్రమే కావు. ఇవి దూర, సామీప్య, ప్రశ్నార్థక రూపాలకు చెంది, సర్వనామాలలోనూ, స్థల, కాలాలలోను అర్థవంతమైన సపదాంశాలుగా ఉపయోగింపబడుతాయి. వాటిని తర్వాత వ్యాకర్తలు ‘త్రికము’ అని వ్యవహరించగా, కేతన ‘త్రితయము’ అని వాడాడు. ఈ పై మూడు – ఇట్టివాడు (దగ్గర వ్యక్తికి), ఎట్టివాడు (ప్రశ్నార్థకానికి), అట్టివాడు (దూరంగా ఉన్న వ్యక్తికి) వాడే సర్వనామాలలో ‘వా’ లోపించి ఇట్టిడు, ఎట్టిడు, అట్టిడు అని కూడా వాడవచ్చునని సూత్రీకరించాడు కేతన. కానీ ఇవి తర్వాత కాలం వ్యాకరణాల్లో ఉన్నట్టు కనిపించదు. బహుశా ఇలాంటి రూపాలు కేతన కాలం తర్వాత ప్రయోగాల్లో ఉండి ఉండకపోవచ్చు.

ఈ విషయమై దేవినేని సూరయ్య కూడా ‘ఇక్కడ వాకారములోపించినదని ఎఱుంగునది’ (పు. 126) అని మాత్రమే అన్నాడు.

హరిశివకుమార్ “ఇట్టి రూపములను చింతామణి కర్తగాని అధర్వణుడుగాని, అప్పకవి గాని సాధింపనేలేదు” అన్నాడు. ఇది కూడా పైన చెప్పిన అంశాన్ని బలపరుస్తోంది. అయితే ఈయన నన్నయ – అట్టిఁడ (ఆది 4-168), ఇట్టిఁడే (ఆది. 5-230), వంటి యేక వచనరూపములేకాక, అట్టిరు (ఆది 4-17; సభా-1-236) వంటి బహువచన రూపములను గూడ ప్రయోగించి యున్నాడు”. (పు. 146) అని ఉదాహరణలు చూపడం వల్ల ఇవి నన్నయ కాలంలో ఎక్కువగా ప్రయోగంలో ఉండి ఉండవచ్చునని భావించాలి.


అయినవోలు ఉషాదేవి

రచయిత అయినవోలు ఉషాదేవి గురించి: అయినవోలు ఉషాదేవి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులు గానూ, భాషాభివృద్ధి పీఠానికి పీఠాధిపతిగా, నిఘంటునిర్మాణ శాఖకు శాఖాధిపతిగానూ పనిచేశారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ భాషాశాస్త్ర సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణలు చేసిన వీరు ఇంగ్లీషు, తెలుగు భాషల్లో సుమారు 60కి పైగా వ్యాసాలు ప్రచురించారు. Acquisition of Telugu syntax (1990, New Delhi), ధ్వన్యనుకరణ పదకోశం (2001, తెలుగు విశ్వవిద్యాలయం), Issues on Lexicography 2006, Andhra Bhasha bhushanamu: Original Text with Transliteration, meaning, Translation మొదలైనవి ఆవిడ రాసిన గ్రంథాలలో ప్రసిద్ధమైనవి. వివిధ విశ్వవిద్యాలయాల భాషాశాస్త్ర శాఖలలో రిసోర్స్ పర్సన్‌గా, యుజిసి విజిటింగ్ ఫెలోగా ఆహ్వానిత ఉపన్యాసాలిచ్చారు. పాఠ్యసంఘాలలో సభ్యులుగా, పరీక్షకులుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001లో వీరికి "ఉత్తమ ఉపాధ్యాయ" పురస్కారాన్నిచ్చింది. 2012 లో తెలుగు విశ్వవిద్యాలయం ఉషాదేవిగారిని కీర్తిపురస్కారంతో సత్కరించింది. సైద్ధాంతిక, అనువర్తిత భాషాశాస్త్ర రంగాలతోపాటు, తెలుగు సాహిత్యం, సంప్రదాయ వ్యాకరణాలు కూడా ఉషాదేవిగారికి అభిమాన అధ్యయన విషయాలు. ...