ఎడతెగని వాగులా
కాలం ప్రవహిస్తూనే వుంది
కాలంతోపాటు కొట్టుకుపోతూ
కాలానికి ఎదురీదుతూ
జీవితం దొర్లిపోతూనే వుంది.
దేహాకాశం వర్షిస్తున్నట్టే వుంది
మనసు నారుమడి
ఎప్పుడు తడారిపోయిందో తెలీదు
మొన్నో నిన్నో ప్రసవించినట్టున్నా
గుండె పొదుగు
ఎప్పుడు వట్టిపోయిందో తెలీదు.
దీపాగ్రం లాంటి మస్తిష్కానికి
మనం మనం అంటూ అక్కడ రాసుకున్న పేజీలకి
ఎప్పుడు చెదలు పట్టాయో తెలీదు
ఇప్పుడెక్కడ చూసినా
నేను తాలూకు సూక్ష్మాతిసూక్ష్మ శకలాలే.
నీడల్ని పెకలించుకుని
శూన్యం ఊడ
ఇళ్ళల్లోకి ఎప్పుడు దిగబడిందో తెలీదు
బయటకి ఇళ్ళన్నీ ప్రశాంతంగా కనబడుతున్నా
లోపల గదులు గదులుగా శూన్యం
ఎప్పుడు విస్తరించిందో తెలీదు.
కనిపించని గుంజకు కట్టేయబడి
వలయాలుగా వలయాలుగా
శూన్యం చుట్టూ పరిభ్రమిస్తోన్న
సింథటిక్ భూగోళం మీద
తడిలేని వర్చువల్ రుతువొక్కటే నడుస్తోంది.