ఈ రోజుల్లో హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ అన్న పేరు వినగానే ‘ఆయనెవరో బెంగాలీ అనుకుంటాను’ అన్న వాళ్ళను నేను చూశాను. కాని రెండు, మూడు తరాల తెలుగు వాళ్ళు ‘హరీన్ చటో’ అని ముద్దుగా పిలుచుకుని, ఆయనను తెలుగువాడిగా చేసుకున్నారు. 1951లో విజయవాడ నియోజకవర్గం నుండి లోక్‌సభకు కూడా పంపారు అన్న సంగతి ఈ తరం వాళ్ళకి తెలియదు. శ్రీశ్రీ రాతలతో పరిచయం వున్నవారికి ‘హరీన్ చటో, గిరాం మూర్తి ఇటీవల మా ఇన్స్పిరేషన్’ అన్న శ్రీశ్రీ మాట తెలుసు. హరీంద్రనాథ్ తండ్రి అఘోరనాథ్ D.Sc (Doctor of Science) డిగ్రీ పొందిన మొదటి భారతీయుడు. ఆయన హైదరాబాద్ నిజాం దగ్గర పనిచేసేవాడు. ఈనాటి నిజాం కాలేజి ఆయన ప్రారంభించినదే. హరీంద్రనాథ్ తల్లి వరద సుందరీదేవికి తెలుగు కూడా బాగా వచ్చు. (చూ. Life And Myself; Vol.i; 1948). హరీంద్రనాథ్‍కు మరి తెలుగు ఎంత బాగా వచ్చో నాకు తెలియదు. సరోజినీ నాయుడు హరీంద్రనాథ్‍కు స్వయాన అక్క. తెలుగు వికిపీడియాలో (అలాగే ఇంగ్లీషు వికిలో కూడా) ఆయన గురించి, ఆయన రచనల గురించి, ఆయన నటించిన సినిమాల గురించి మంచి సమాచారమే వుంది కాబట్టి ఆయన్ని గురించి మరింత తెలుసుకోదలిచిన వాళ్ళు ఇక్కడ చదువుకోవచ్చు. ఇంకా హరీంద్రనాథ్ గురించిన ప్రస్తావనలు తెలుగు సాహిత్యంలో తరచుగా కనిపిస్తాయి. (ఉదా. ఆచంట జానకిరాం, నా స్మృతిపథంలో, 1960.)
శ్రీశ్రీ సప్తతి ఉత్సవాలు చిరంజీవిని కుమారి, మిరియాల రామకృష్ణగార్లు కాకినాడలో జరిపినప్పుడు హరీన్ చటోని ఆహ్వానించారు. ఈ సప్తతి సభకి (03మార్చ్ 1980) ఆయనే అధ్యక్షుడు. అప్పుడు హరీన్ ఐదు రోజులు అక్కడే వున్నాడని, తాను పుస్తకాల స్టాల్ పెడితే నేనే అమ్ముతానని అక్కడ కూర్చుని అమ్మాడని ఆయనతో దగ్గరగా సమయం గడిపిన విశ్వేశ్వరరావుగారు (శ్రీశ్రీ ప్రింటర్స్) ఈ మధ్య ఒక సంభాషణలో గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ సందర్భంలో పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు గాంధీ భవన్ హోటల్లో జరిపిన సంభాషణ ఈ సంచికలో విందాం. భట్టుగారు ఈ రికార్డింగ్ నాకిచ్చి దాదాపు 20 ఏళ్ళవుతుంది. ఇది హోటల్ కారిడార్ లో ఇన్‍ఫార్మల్‍గా జరిపింది కావడంతో వెనకనుంచి మాటలు, సినిమా పాటలు వినిపిస్తుంటాయి. ఆ బ్యాక్‍గ్రౌండ్ నాయిస్ తొలగించడం అంత తేలికయిన పని కాదని అర్థం అయింది. చాలావరకూ తీసివేయగలిగినా ఇంకా కొంత వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఈ సంభాషణని లోకానికి అందించడంలో చాలా ఆలస్యం అయింది, మరింత ఆలస్యం చేయదలుచుకోలేదు. భట్టుగారికి ఈ విలువయిన రికార్డింగు అందించినందుకు కృతజ్ఞతలు.
హరీన్ చటో మంచి నటుడు, గాయకుడు, హార్మోనియం బాగా వాయించేవాడు. ఆయన పాడిన ‘సూర్య అస్త్ హోగయా-గగన్ మస్త్ హోగయా’, ‘తరుణ అరుణసే రంజిత ధరణి’ అన్న రెండు పాటలు యూట్యూబ్‍లో వినవచ్చు. నా దగ్గర చాలా కాలంగా ఒక మట్టి రికార్డుంది. దానిపైన (Columbia-GE188, సుమారు 1929-33 కాలం నాటిది) ‘Poet Harindranath Chattopadhyaya’ అని వుంది. ఆయనే స్వయంగా హార్మోనియం వాయించాడా అన్న విషయం స్పష్టంగా లేదు. వాద్యకారుని పేరు ప్రత్యేకంగా ఇవ్వలేదు కాబట్టి ఆయనే వాద్యకారుడు కూడా అయ్యుండవచ్చు.
అరుదయిన ఈ రెండు రికార్డింగులు మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను.
- హరీన్ చటోతో సంభాషణ
- కాయ్‍కో మేరే ఘర్ ఆయే
- కోయల్ కూకె సునావా