తెగిన గొలుసులు

పగల్ని అమ్మేసి
రాత్రిని కొనుక్కున్నాను
నిద్రని తాకట్టుపెట్టి
ఉద్రేకాన్ని అద్దెకు తెచ్చుకొన్నాను
అంతా చీకట్లో ఆవిరయి
అజాగళ స్తనాల
అసౌకర్యం మిగిలింది

వధ్యశిలమీద పద్యం.


వెచ్చని సముద్రతలం మీద
చేపల చాపల కోసం
పడవ ప్రయాణం
లంగరేస్తే బట్ట నిలువదు
సహస్రాక్షుడి సహపంక్తి భోజనం
వేదాలు, హాలాహలము
మోసానికి మొదటి పాఠాలు
మగ మోహిని, ఇద్దరూ ఒకరే

నిర్వచనోత్తర పాపం.


రోడ్ రోలర్ వప్రక్రీడలో
గుంతల రహస్యాలన్నీ
సురగంగార్పణం
ముసురు చక్రంలో
కాలిన శనగపిండి వాసన

సిరియాళుడి శివపూజలో
పండగనాడు తెగిన
మేకలు లెక్కబెట్టడం
అతిథి కోసమే వంట

పవిత్ర యాత్రలో
జేబునిండా గులకరాళ్ళు.