నాకు నలుగురు అక్కలున్నా, వాళ్ళలో మా పెద్దక్క – దేవక్క జ్ఞాపకాలే నా మనసునెక్కువగా వెంబడిస్తుంటాయంటే ఆశ్చర్యం లేదు. అందుకు ముఖ్యమయిన కారణం ఆమె ఇప్పుడు లేకపోవటం కావచ్చు. లేదా నేను పుట్టేసరికి ఆమె వయసు పదమూడేళ్ళు కావడం ఇంకొక కారణమేమో? అన్నయ్య మా అమ్మకు మొదటి సంతానం. ఆయన తర్వాత పుట్టిన మేము నలుగురు ఆడపిల్లలలో దేవక్క పెద్దది. ఇంట్లో పెద్ద కూతురు అనే ముద్ర ఆమెకు అంటుకుని తన బాధ్యతలను పర్మనెంటుగా పెంచింది. మమ్మల్ని పెంచి పెద్దచేయడంలో అమ్మకు తోడ్పడుతూ, ఆమె తన బాల్యాన్ని పూర్తిగా మరిచిపోయినా ఆశ్చర్యం లేదు. ఇంట్లో ఆమెను దేవక్క అని అనేవాళ్ళు ఎక్కువయి, బంధువుల సర్కిల్లో అందరికీ దేవక్క అని చెప్తేనే అర్థమవుతుంది. శారదా దేవి అని ఆమెను గురించి పేరుతో చెప్తే త్వరగా అర్థం కాదు. కానీ మా నాయనకు మాత్రం ఆమె ఎప్పటికీ ‘సన్నక్క’నే. నేను చిన్నప్పుడెప్పుడూ అనుకునేదాన్ని. ఆమె మా అందరికన్నా పెద్దది కదా, దేవక్కను ఈయన ‘సన్నక్క’ అంటాడెందుకని.
అప్పట్లో మాకు స్కూళ్ళలో ఇంకా యూనిఫారం బట్టలు వేసుకునే పద్ధతి లేదు. అయినా చాలా సార్లు మేమందరం ఒకే రకం బట్టతో కుట్టిన లంగా-జాకెట్లు మా అక్కలు, గౌను నేను, వేసుకునేవాళ్ళం. అప్పట్లో మా నాయన ఉద్యోగంలో మా ఊరు అనంతపురం దగ్గర పల్లెలకు ఎక్కువ క్యాంపులు పొయ్యేవారు. పామిడికి పొయినప్పుడు, బట్టలు కట్‌పీసులు బరువుకు (కొలతల్లో కాక) తెచ్చేవారు. ఒక్కొక్కసారి ఒక్కోరకం బట్ట వస్తే మా దేవక్క మా అందరికీ ఇంట్లోనే బట్టలు కుట్టేది. మా చిన్నక్కలిద్దరూ బట్ట కొని తెచ్చిన మా నాయన్ను, బుద్ధిగా మా అందరికీ కుట్టి పెట్టిన మా దేవక్కను లోలోపల తిట్టుకునేవాళ్ళు. నేను మాత్రం ఆ గౌను ఏం బాలేదని ఏడ్చేదాన్ని. అప్పట్లో మా నాయనకు వచ్చే చిన్న నెలసరి అదాయంలో మా ఐదు మందినీ పెంచి పెద్ద చేయాలంటే ఎంత పొదుపు చెయ్యాలో మాకేమర్థమవుతుంది?
మేమందరం బాగా చదువుకోవాలని అమ్మ కోరిక అయినా అమ్మాయిల్లో మొదట ఎస్సెల్సీ పాసయిన మా దేవక్కను నాయన ఇంక ముందుకు చదివించేది లేదని అంటే ఏం చెయ్యలేకపోయింది. అంత వరకూ చదివిన చదువు ఉచితం. అప్పట్లో ఆడపిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజులుండేవి కావు. కాలేజిలో చేరేటప్పుడు, టర్ము మధ్యలో ఒక సారి ఫీజు కట్టాల్సుంటుంది. ముందుకు చదివేది ఒద్దని మా నాయన అడ్డు చెప్తే మా దేవక్క ఏం చెయ్యకుండా ఉంటుందా? ఆమె వేరే ఆలోచన చేసి పెట్టుకుంది. ఆ సంవత్సరమే మా స్కూల్లో సెకెండరీ గ్రేడ్ టీచర్స్ ట్రయినింగ్ కోర్సు ప్రారంభించారు. దాన్లో సీటు తెచ్చుకుని చేరింది. అప్పట్లో అమ్మాయిలు ఉద్యోగం చెయ్యటమంటే, టీచర్ గానీ, ఆస్పత్రి నర్సుగా కానీ మాత్రమే చేసేవారు. అందుకని మా నాయన ఏమీ అనకుండా ఊరుకున్నారు. ఆయన నిశ్శబ్దానికి కారణం తనకు మా అక్కంటే ప్రత్యేకమైన అభిమానం కావచ్చు. లేదా తను చదువు ఉచితమే కాక, ప్రభుత్వం వాళ్ళకు నెలసరి చిన్న స్టైపెండు కూడా ఇచ్చేది, అందుకని కూడా ఏమో.
అప్పటికి నేను మూడవ తరగతి అదే స్కూల్లో చదువుతున్నాను. మా చిన్నక్కలిద్దరూ కూడా అదే స్కూల్లో చదివారు. అందరం కలిసి స్కూలుకు పోయే వాళ్ళం. మా దేవక్క అప్పుడప్పుడూ మా క్లాసుకు డిమాన్‌స్ట్రేషన్ క్లాసులు తీసుకోవడానికి వచ్చేది. తను మొత్తం గంట సేపూ పాఠం చెప్తుంటే, మా క్లాసు టీచర్ ఎదురుగా కూర్చుని పరిశీలించడం, తను పాఠం చెప్పిన దాని మీద మార్కులు వెయ్యటం చేసేవారు. మా అక్క ఎన్నో సార్లు మా తరగతికి క్లాసు తీసుకుని ఉండింది. కానీ నాకు మాత్రం ఆమె చెప్పిన అరటి చెట్టు, ఆవు పాఠం మాత్రం ఎప్పటికీ గుర్తుంటాయి.
తను ట్రెయినింగ్ ముగించేటప్పటికి మా ఊర్లో మొదటి ప్రైవేట్ నర్సరీ స్కూలొకటి కొత్తగా పెట్టినారు. మా దేవక్క అందులో ఉద్యోగం సంపాదించింది. తను ఎస్ఎల్‌సీ ముగించినప్పటినుంచీ మా నాయన ఆమెకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. ఎందరో వచ్చి ఈమెను చూశారు. వాళ్ళడిగే కట్నకానుకల దగ్గిర మామూలుగా పేచీ వచ్చేది. లేదా అన్నీ సరిపోతే ఆ సంబంధం ఏదో రకంగా మా నాయనకు నచ్చేది కాదు.
ఆ ఏడు మా మామయ్య కూతురు మా ఇంట్లో ఉండి చదువుకోవడానికి వచ్చింది. తనతో పాటు, మా చిన్నక్కలనిద్దర్నీ కూడా కాలేజిలో పి.యూ.సి లో చేర్చారు. అప్పటికి ఇంజనీరింగ్ ముగించి తను చదివిన కాలేజిలోనే ఉద్యోగం సంపాదించి చేస్తున్న మా అన్నయ్య మాటకు ఇంట్లో నాయన దగ్గర విలువ పెరిగింది. తన చెల్లెళ్ళు బాగా చదువుకోవాలని ఆయన ఇష్టం. అదే అదునుగా మా దేవక్క తనూ పైకి చదువుకుంటానని హఠం చేసి సాధించుకుంది. అప్పుడు ఎస్ఎస్ఎల్‌సీ పదకొండేళ్ళు, పియూసి ఒక ఏడు చదివేవాళ్ళం. తను పియూసి ముగించే లోపల దేవక్క పెళ్ళి కుదిరింది.
బావగారు అప్పుడే బిఏ ముగించి కొత్తగా స్టేట్ బ్యాంకు, హైదరాబాదులో ఉద్యోగం చేస్తుండేవారు. నేనూ, మా అమ్మా వెళ్ళి వాళ్ళిద్దరినీ హైదరాబాదు జీవితానికి సెటిల్ చేసి వచ్చాము. వాళ్ళ పెళ్ళయ్యేటప్పటికి నా వయసు నేను పుట్టినప్పుడు మా దేవక్క వయసు ఒకటే. మా బావకు చెల్లెళ్ళు లేరు. నన్ను బాగా చేరదీసి వెంట తిప్పేవారు. ఆ ఏడు మేం నాయన ఉద్యోగం బదిలీ వల్ల కర్నూల్లో ఉన్నాము. మా బావగారి కాలేజి చదువంతా కర్నూల్లోనే. ఇద్దరం సైకిల్ రిక్షాలో కూర్చుని కర్నూలంతా తిరిగేవాళ్ళం. తన ఫ్రెండ్స్ ఇళ్ళకంతా నన్ను వెంటబెట్టుకుని పొయి “మా మరదలు,” అని గర్వంగా పరిచయం చేసేవారు. ఎందుకో తెలీదు కానీ, అప్పట్లో మగవాళ్ళంతా కుట్టించిన తెలుపు కాటన్ బట్టలే వేసుకునేవారు. తమాషాగా నాకోసం ఒకసారి తెలుపు సిల్క్ బట్ట కొని, టైలర్ దగ్గరిచ్చి, ఒక పంజాబి డ్రస్సు కుట్టించారు. (అప్పట్లో సల్వార్-కమీజు డ్రస్సును పంజాబి డ్రస్సు అనేవాళ్ళు.) ఆ డ్రస్సు ఇంటికొచ్చిన రోజు, మా అమ్మతో నాకు బాగా చీవాట్లు పడ్డాయి, అల్లుడితో నాకోసం ఖర్చు పెట్టించానని ఆమెకు కోపం.
మా బావగారి ఉద్యోగరీత్యా వాళ్ళు ఆలూరు, నంద్యాల, కర్నూలు పట్టణాల్లో తిరిగారు. ప్రతి చోటికి నాకు స్కూలు సెలవులు వచ్చినప్పుడల్లా నేనూ, మా అమ్మా కలిసి దేవక్క ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆమె పెద్ద కొడుకు, తర్వాత ఇద్దరు కూతుళ్ళు పుట్టినప్పుడు, తను మా ఇంటికి పురుడు పోసుకోవడానికి వచ్చినప్పుడల్లా నాకు స్కూల్లో పరీక్షలు జరుగుతుండేవి. అక్క పెద్ద కూతురు భాగ్య పుట్టినప్పుడు, బాబు శ్రీను నా దగ్గర బాగా చేరిక అయ్యాడు. నా వయసు వాడికి పిన్నమ్మ అనటానికి తగినట్లు కనిపించక నన్ను ‘పిన్నమ్మక్కా’ అని పిలిచేవాడు. నా హైస్కూలు రోజుల్లో మా అక్క పిల్లలు ముగ్గురి బాల్యం గడిచింది. పదేళ్ళ తర్వాత పుట్టిన నా కూతురు శివాని పసితనంలో తన స్కూలు సెలవులన్నీ వాళ్ళతో గడిపేది.
అప్పట్లో మాకు ‘డే కేర్ సెంటర్లు’ అనేవి తెలీవు. ఉద్యోగం చేసే తల్లుల పిల్లలకు ఇంట్లోనే చూసుకునే పనివాళ్ళో, తమ అమ్మా-నాన్నలో, అత్తా-మామలో ఉండాల్సిందే. మా శివానికి అలాంటి ఏర్పాట్లేం ఉండేవి కాదు. అందుకని స్కూలుకు సెలవులొస్తే, తీసుకుపొయి కర్నూల్లో దేవక్క ఇంట్లో దించి వచ్చేవాళ్ళం. అలా తనకు పెరిగే వయసులో దేవక్క పిల్లల వల్ల తోబుట్టువుల్లేని లోటు కూడా తీరింది. మా అక్క అప్పుడు కొన్ని సంవత్సరాలు దగ్గర్లో ఉన్న ప్రైమరీ స్కూల్లో పనిచేసేది. కర్నాటకలో, ఆంధ్ర ప్రదేశ్‌లో స్కూలు సెలవుల సమయంలో కొంచం తేడా ఉంటుంది. శివాని అక్కడికి వెళ్ళేటప్పటికి అక్క స్కూలు ఇంకా జరుగుతుంటుంది. పొద్దున్నే తయారయి శివాని కూడా పెద్దమ్మ వెంట స్కూలుకు వెళ్ళేదట. మాలో ఎవరో ఒకరం దాన్ని పిలుచుకురావటానికి వెళ్తే, ఒక రోజంతా మాతో మాట్లాడేదికాదు శివాని. మా మీద కోపం వదిలేసి వెళ్ళామని. “వాళ్ళక్కలిద్దరు, అన్న కలిసి చిన్న పిల్లను చేసి ఏడ్పించినా ఏం బెదురుకోదు. అందరికీ ధైర్యంగా బదులిస్తుంది,” అని గర్వంగా చెప్పేది వాళ్ళ పెద్దమ్మ మాత్రం. రిటైరవడానికి కొన్నేళ్ళు ముందర మా బావగారికి హైదరాబాదుకు బదిలీ అయింది. అప్పటికి వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయి మనుమడు, మనుమరాళ్ళు పుట్టడం అయింది. శివాని చదువులో బిజీ అయి పెద్దమ్మ ఇంటికి రాకపోకలు తగ్గిపోయాయి. ఏ పండుగకో పబ్బానికో ముగ్గురం కలిసెళ్ళి నాలుగు రోజులుండేవాళ్ళం.
అమ్మ ద్వారా మా కందరికీ లభించిన ఆస్టియో ఆర్థ్రయిటిస్ కోసం టోటల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేసుకుంది అక్క. ఆస్పత్రి నుంచీ ఇంటికొచ్చిన తర్వాత ముగ్గురమూ వెళ్ళి చూసి వచ్చాము. పెళ్ళిళ్ళు అయి వెళ్ళి పోయిన కూతుళ్ళిద్దరూ వచ్చి చూసుకున్నారు. నెల రోజుల తర్వాత ఒక రోజు మధ్యాహ్నం ఆఫీసులో ఉండగా, బావగారు ఫోన్ చేశారు. “మీ అక్క వెళ్ళిపోయిందమ్మా విజయా!” అని. వింటున్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొంచంసేపు పట్టింది. తరువాత తెలిసింది. ఇంటికొచ్చి బాగానే ఉన్న మా అక్కకు కొన్నిరోజులుగా ఊపిరి తిత్తుల బలహీనత వల్ల, ఊపిరి పీల్చుకోవడం, భారమయి మళ్ళీ ఆస్పత్రిలో చేర్చారట. మూడు రోజులు ఆసుపత్రి, ట్రీట్‌మెంటు అయినతర్వాత, ఆ రాత్రెప్పుడో వెళ్ళిపోయింది మా దేవక్క.
అమ్మ పోయిన తర్వాత, ఏం కష్టమొచ్చినా దేవక్క వైపు తిరిగేదాన్ని. ఇప్పుడేం చెయ్యాలో తెలియలేదు. అయిదేళ్ళ తర్వాత, నేను అదే సమస్యతో నా మొదటి టోటల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేసుకోవలసి వచ్చింది. మా దేవక్క కూతురు భాగ్య నా ఆపరేషన్‌కు ఆస్పత్రిలో చేరేముందు అడిగింది, “ఈ ఆపరేషన్ తప్పదు కదా పిన్నమ్మా!” అని భయంగా. తన మనసులో తచ్చాడుతున్న భయాలేమయుండచ్చో నేను అర్థం చేసుకోగలను.