అనాథ

అలల్లోంచి తప్పిపోయి
ఇసుక మేటలో చిక్కుకుపోయిన
నీటి చుక్కలా వాడు
భూమ్మీద ఒంటరిగా మిగిలిపోయాడు.

వాడి దేహమంతా దుఃఖమే
కన్నీరు ఎక్కడ తుడుచుకుంటే
అక్కడ ఇంకొంచెం అంటుకుంటుంది
వాడి లోకమంతా చీకటే
కనురెప్పలు కత్తిరించుకుని చూసినా
వెలుగు చుక్క ఎక్కడా కనబడదు.

ఎవరు చేసినా చెయ్యకపోయినా
ఆకలి మాత్రం వాడితో
అనునిత్యం స్నేహం చేస్తుంది
తోడెవరున్నా లేకున్నా
నిద్ర నీరసం వచ్చి వాడితో
మగత కలలు పంచుకుంటాయి.

కిక్కిరిసిపోయిన జనం మధ్య కూడా
వాడికి తోడు ఒంటరితనమే
వాడి చూపుల దారిలో ఎవరూ నడవరు
ఏ కంటిపాపలోనూ వాడు నవ్వడు.

ఎన్నో ముఖాలు కనిపిస్తాయి
వాడి చుట్టూ వాడిలాగే వాడికి
ఏ ముఖంలోనూ తన ముఖం తాలుకు
గుర్తింపు ఎప్పుడూ ఎందుకు కనబడదో
అర్థం మాత్రం అసలు కాదు వాడికి.