కాలం
ఒక వెర్రివెంగళప్ప.
నీ ఆకాశం మీద నల్లమబ్బుతోటల్ని పరిచి
కంటిపాపదోనెల్లో జీడిపాలు పితికి
అనంతధారలతో అభిషేకం
చేయించుకోవడం వినా
వేదన ఇముడ్చుకున్న
ముత్యం విలువ దానికేనాడైనా తెలిసిందా
ఓడిపోయే నవ్వులకు ఓనమాలు దిద్దించుకుంటూ
దీపపుకుందెలో కొత్తకొత్త ఉదయాల్ని
పూయించుకోబోతుంటే
నడిమింట గుంజకు వేలాడుతూ
వెలుగు కింది నీడల్లో విలాసాన్ని వెతుక్కుంటూ
విరగబడీ తిరగబడీ అదేమైనా సాధించిందా
గడియారానికి ఆవల విప్పార్చుకునే
విచిత్ర రహస్యాల్ని దిగంబరం చేసి
బంతులాడుకుంటూ,
ఉప్పెన కోసిన తీరం మీద
విచ్చుకునే గ్రహణపు రాతిరిలోకి
జారవిడవడం తప్ప
కూరిమితో అది కోయిలై వాలిందెప్పుడు
చెమరించే శ్వాసల్ని, చీకటితో కొట్లాటల్ని
ప్రయాసపడి పాటలుగా కూడదీసుకుంటూ
నడి ఎండ పొద్దుల్లోంచి నల్లరేగళ్ళలోకి
చూపుకు దారులు చెక్కుకుంటున్నా
ముసురువానలా ఉసురునంటిపెట్టుకోవడం తప్ప
కలిసి దిద్దుకున్న కమ్మని సంభాషణలా
కలిసి వచ్చిందెప్పుడు
ఎప్పుడో ఒకసారి ఆకురాలే కాలం తర్వాత
ఆమనిలా తొంగి చూసినా, అంతలోనే
రంగురంగుల ఊసుల్ని మోసుకొనివచ్చే
తూనీగల్ని, తుమ్మెదల్ని
మూటగట్టుకుపోవడం తప్ప
ఎక్కడికక్కడ ఆగిపోతున్న ఉరవడిని
పూలరెమ్మలా చేతులు చాచి హత్తుకుందెప్పుడు
ఎడతెరిపిలేకుండా కురుస్తున్నా
ఎప్పుడూ దాహం తీర్చని వానై
జీవితపు రహదారిలో
బుడగలు తేలుతున్న బురదగుంటై
అడుగుల కింద వివర్ణాల్ని
కుమ్మరించటం తప్ప
పైరుమీద వాలి చినుకు వంపిన
పరవశాన్ని అనువదించుకున్నట్లు
మనసును తడిమే తడిగీతమై విప్పారిందెప్పుడు
కాలం
ఓ వెర్రివెంగళప్ప. అది
చడీచప్పుడు లేకుండా చొరబడి
పండుగలా పండాల్సిన సందర్భాల్ని
చీల్చి శిథిలపత్రాల్ని చేసి
నంగనాచిలా జారుకునే నల్లపిల్లి!
కాలం
ఓ వెర్రివెంగళప్ప. అది
ఎప్పుడూ జోలపాటలెరగని కడలి!
ఒరుసుకుంటూ వచ్చే అనుభవానికి
నిప్పంటించే అమానుషి!