1. ఆంగ్లరాజ్య ధిక్కారము
మొగలు సామ్రాజ్యము విఛ్ఛిన్నమై దేశములో అరాజకము వ్యాపించుచుండగా చిన్న చిన్న రాజులు నవాబులు స్వతంత్రరాజ్యములు స్థాపించుటకు ప్రయత్నింపసాగిరి. పాశ్చాత్యవర్తక కంపెనీవారు ఈ రాజులకు నవాబులకు సహాయముచేయు నెపమున దేశాక్రమణము చేసి తమ రాజ్యమును స్థాపించిరి.
ఈ పరిస్థితులలో దక్షిణమున హైదరాలీ టిప్పు సుల్తానులును, పశ్చిమమున మహారాష్ట్రులును, ఉత్తరమున సిక్కులును బలవంతులై స్వతంత్ర సామ్రాజ్యములు స్థాపించుటకు ప్రయత్నించి దేశాక్రమణ చేయుచున్న ఆంగ్లేయ వర్తక కంపెనీవారిని ప్రతిఘటించిరి. దేశములో అరాజకము వ్యాపింపచేసినచో నదిసులభముగా తమ వశమగునని ఆంగ్లేయులు పిండారీ మూకలను ప్రోత్సహించి చుట్టుపట్ల రాజ్యములపైకి ఎగదోలిరి. కొన్నాళ్ళకీ పిండారీ లింగ్లీషువారికెదురుతిరిగిరి. అందువలన వారితో యుద్ధములు తటస్థించినవి.
ఆంగ్లేయ వర్తక కంపెనీవారొక్కసారిగా బహిరంగముగా దేశాక్రమణ చేసి రాజ్యస్థాపనము చేయక ముందుగా కొన్ని ప్రాంతములను తమ కీలుబొమ్మలచే ప్రభుత్వముచేయించి తాము తెరవెనుక భాగవతమునాడి తరువాత తామే ప్రభువులైరి. వీరు జాగీరులు జమీందారీలు రాజ్యభాగములు సంపాదించి దివానులై ప్రభుత్వము చెలాయించు చుండగా వీరి రాజ్యాధికారమును మనదేశ ప్రజలలో వివిధ వర్గములవారును రాజులును నవాబులును ధిక్కరించి ఆయుధములు పూని యుద్ధములు చేసిరి. ఈ స్వాతంత్ర్య సమరములు 1757 నుండి 1857 వరకును జరిగినవి.
సన్యాసుల యుద్ధములు: 1760-1775
ఇంగ్లీషు వర్తక కుంపినీవారు వంగరాష్ట్ర నవాబైన సిరాజ్ ఉద్దౌలాను సింహాసభ్రష్టుని జేయుటకు 1757లో కుట్రచేసిరి. ఆ నవాబు దగ్గరవాడును సేనాపతియునైన మీర్జాఫరు ఇంగ్లీషువారి కుట్రతో స్వామిద్రోహముచేసి నవాబును వధించి తానే నవాబయ్యెను. అంతట వంగరాష్ట్రమునందు పేరునకు నవాబు ప్రభుత్వము జరుగుచున్నను నిజమునకీ విజాతీయ కుంపెనీవారే పరిపాలింపసాగిరి. ఈ దొరలు చేసిన అన్యాయమును వీరు చేయు అక్రమములును చూడగా వంగ రాష్ట్ర ప్రజలకు ఇంగ్లీషువారిపైన అసహ్యముకలిగెను.
ఒకవంక ఇంగ్లీషువారు వంగ రాష్ట్రములో తమ రాజ్యాధిపత్యమును స్థాపించుచుండగా నింకొకవంక వారి అధికారముపట్ల ప్రజలు ధిక్కారము చూపసాగిరి. ఇంగ్లీషు దొరలు నవాబు ఉద్యోగుల ద్వారా దుష్పరిపాలనము గావింపసాగిరి. వారు 1765లో మొగలుచక్రవర్తినాశ్రయించి పన్నులు వసూలుచేయు దివాన్గిరీ అధికారమును పొందిరి. క్రమక్రమముగా దేశములో నింగ్లీషుప్రభుత్వము స్థిరపడెను.
ఈ పరిస్థితులలో ఇంగ్లీషువారి యధికారమును ధిక్కరించుటలో వివిధ సంప్రదాయములకు చెందిన సన్యాసులు బైరాగులు గోసాయిలు నేకమై ప్రతియేటను ఇంగ్లీషువారి గిడ్డంగులపైనను వారి గ్రామములపైనను దండయాత్రలు చేయనారంభించిరి. ఈ పోరాటము 1763 నుంచి 1775 వరకును పండ్రెండేండ్లు జరిగెను. దీనికి సంబంధించిన రహస్య రికార్డులనింగ్లీషు ప్రభుత్వమువారు బయటపెట్టనందుననివి 1957 డిశంబరులో నవోదయ పబ్లిషర్సుచే ప్రకటించబడినంతవరకు చరిత్రకెక్కలేదు.
ఈ సన్యాసుల దండయాత్రలనుగూర్చియు సన్యాసులనుగూర్చియు చరిత్రకారులెవరికి తోచినట్లు వారు వ్రాసియున్నారు. వీరు ఆయుధపాణులై వచ్చిపడుచుందురని గ్రామస్థులనుండి బలవంతముగా సొమ్ము లాగికొని దోచుకొనుచుండిరని వీరు ఆకతాయిమూకలనియు వ్రాసిరి. అయితే ఆ కాలమున గవర్నరుగానుండి ఆ సంగతులన్నియు స్వయముగానెఱిగియుండిన వారన్ హేస్టింగ్సు ఈ సన్యాసులు వివిధ సంప్రదాయములకు చెందినవారనియు వీరు నిరంతరముగా దేశములో తిరుగుచుందురనియు వీరిలో చాలామంది వ్యాపారము చేయుచుందురనియు వీరందరును తీర్థవాసులైయున్నందువలన ప్రజలు వీరిని పూజింతురనియు వారి రాకపోకలనుగూర్చి ప్రజలవలన తెలిసికొనుటగాని వారికి వ్యతిరేకముగా సహాయము పొందుటగాని సాధ్యముకాదనియు నందువలననీ దండయాత్రలను అరికట్టుట కష్టముగానున్నదనియు 1773 మార్చి 9వ తేదీన నొక లేఖలో వ్రాసియున్నాడు. ఉత్తరహిందూస్థానమున వివిధ సంప్రదాయములకు చెందిన సన్యాసులున్నారు. సన్యాసాశ్రమ విధులను యథావిధిగా పాటింపని గోసాయిలను సన్యాసులు వ్యాపారమును చేయుచు వివిధ వృత్తులు చేయుచుందురు. సన్యాసులలో ఆయుధపాణులైన నాగ సన్యాసులు మొదలైనవారు ఇరుగుపొరుగువారితోను తమలోతామును యుద్ధముచేయుచుందురు.
సాధారణముగా తీర్థయాత్రలు చేయుచు దేశములో తిరుగుచుండు సన్యాసులు సాధువులు బైరాగులు మొదలైనవారిని గోసాయిలని వ్యవహరింతురు. సన్యాసులు సాధారణముగా అందరితోనూ మంచిగానుందురేగాని ఎవ్వరిపైనను కత్తికట్టియుద్ధముచేయరు. అట్టి వివిధ సంప్రదాయములకు చెందిన సన్యాసులు, గోసాయిలు మొదలైనవారందరునేకమై, ఇంగ్లీషువారి రాజ్యముపైన దండయాత్రచేసిరనినచో దానికేదో కారణముండవలెను. ఆ కాలమునాటి ఇంగ్లీషు కుంపిణీ ప్రభుత్వమువారి రికార్డులను పరిశీలించి బ్రజేంద్రనాథ బెనర్జీగారు 1926లో నీసన్యాసుల దండయాత్రలనుగూర్చి మోడరన్ రివ్యూ సెప్టెంబరు, అక్టోబరు సంచికలలో రెండు వ్యాసములను వ్రాసియున్నారు. అందులో ఆ రికార్డులనుండి కొన్ని భాగములను వివరించినారు. వానినిబట్టి చూడగా ఈ సన్యాసులేదోయొక సంవత్సరమున నొకటిరెండుమారులు గాక 1763లోను 1767 మొదలు 1775 వరకును ప్రతిసంవత్సరము దండయాత్రలు చేయుచుండిరని తెలియుచున్నది. ఇంతేగాక కొలదిమందిగాక వేలకొలదిగా వచ్చిపడుచుండిరి. ఆంగ్లేయ కలెక్టరులు వ్రాసిన లేఖలనుబట్టి చూడగా గ్రామస్థులీ సన్యాసులను శత్రువులుగా పరిగణింపక వీరిని మిత్రులుగనే చూచుచు వారికనేకవిధములుగ సహాయముకూడా చేయుచుండిరి. ఇంగ్లీషువారి సైనికోద్యోగుల క్రింద సన్యాసులతో పోరాడుటకు వచ్చిన సిపాయిలకు గ్రామస్థులు తోడ్పడకపోవుటయెగాక వారిని సన్యాసులకు పట్టియిచ్చుచుండిరి. అందువలననీ సన్యాసులు చేసినదియుద్ధమేగాని తిరుగుబాటుకాదు.
దండయాత్రలు సాగుచుండిన కాలమున గూడా వంగదేశములో కలకత్తా, ఢాకా మొదలగు పెద్దపట్టణములందు వందలకొలది గోసాయీలు మొదలైనవారు కాపురముండి వ్యాపారము చేసికొనుచు జనసామాన్యముతోపాటు జీవించుచుండిరి. వీరికిని దండయాత్ర చేయు సన్యాసులతో సంబంధమున్నట్లు ఇంగ్లీషు కుంపిణీ దొరలకు అనుమానముండెనుగాని వారినేమియు చేయలేకపోయిరి.
ఒకవంక సన్యాసులిట్లు దండయాత్రలు చేయుచు కుంపిణీవారి సేనలతో యుద్ధములు చేయుచు శత్రురాజ్యము మధ్యలోనున్న పుణ్యస్థలములను సేవించుచు తమ దండయాత్రలను ముగించుకొని పోవుచు గొప్ప నదులలో స్నానములు చేయుచు తమ మతాచారములను యథావిథిగా జరుపుకొనుచుండిరి. ప్రజలు వీరికాతిథ్యమిచ్చి యాదరించుచునే యుండిరి. దేశములో శాంతిభద్రతలను స్థాపించుటకు నియమించబడిన ఫౌజుదారులక్రింద వివిధ పరగణాలలోనున్న సిపాయిలు ఈ సన్యాసులను ప్రతిఘటించుటకు ఇంగ్లీషు సైనికాధికారుల క్రింద వచ్చి సన్యాసులనెదుర్కొన్నప్పుడు వారితో సంభాషణలు జరుపుచుండిరని క్రమశిక్షణము లేకుండా ప్రవర్తించుచుండిరని తమ తుపాకులను అనవసరముగా పేల్చి మందుగుండు సామగ్రిని వ్యర్థం చేయుచుండిరనియు అటుపిమ్మట సన్యాసులు వచ్చి వీరిని ముట్టడించుచుండిరనియు ఈ సిపాయిలను నమ్ముటకు వీలులేకున్నదనియు ఇంగ్లీషు సైనికాధికారులును కలెక్టరులును వ్రాయగా కలకత్తాలోని కుంపిణీ ప్రభుత్వాధికారులు మిడ్నపూరు రెజిమెంటుకు హెచ్చరిక కూడా చేసిరి. (From J. Stewart, Secretary: to Edward Baber, Resident of Midnapur, dated Fort Willam 4 Feb 1773. Secret proceedings 10.3.1773 Nos 10-11.)
ఈ పరిస్థితులను చూడగా ఆ కాలమున దేశములోని హిందూమహమ్మదీయ ప్రజలలో నన్నితరగతులవారికిని ఇంగ్లీషు కుంపిణీవారిపట్ల గౌరవముగాని భయభక్తులుగాని లేవనియు సన్యాసులపట్ల సానుభూతి యుండెననియు స్పష్టపడుచున్నది. కొందరు జమీందారులు కూడా సన్యాసులకు తోడ్పడుచున్నారనియు వారిపైన చర్యతీసుకొందు మనియు వారన్ హేస్టింగ్స్ వ్రాసెను (31-03-1773). ఇంకొక చిత్రమేమనగా నీసన్యాసులు కేవలము ఇంగ్లీషువారికి పలుకుబడియు నధికారమును కలిగియుండిన వంగదేశముపైననే యిట్లు దండయాత్రలు చేసిరికాని ఇతర దేశీయ రాజుల రాజ్యముపైనగాని నవాబుల రాజ్యముపైనగాని చేయలేదు. ఇంగ్లీషు కుంపిణీవారి యధికారమునకు లోబడిన గ్రామములపైననే వారు దండయాత్రలు చేసి కుంపిణీవారి యుద్యోగులక్రింది సైనికులతో యుద్ధము చేయుచుండిరి. సాధారణముగా పరగణా సిపాయిలు కొంతసేపు పోరాడి పారిపోవుచుండిరి. సన్యాసులు కుంపిణీవారికి రావలసిన శిస్తులు రాకుండా గ్రామముల నుండి ముందుగానే సొమ్మును వసూలుచేసికొనిపోవుచుండిరి. ఇంగ్లీషు కుంపిణీవారి నౌకరులగువారి నాశ్రయించితిరుగు జమీందారుల యుద్యోగులను వర్తకులను గ్రామస్థులను పట్టుకొని నిర్బంధించి బలవంతముగా సొమ్ముపుచ్చుకొని వదలివేయుచుండిరి. అంతేగాని ఇతరులనిట్లు పట్టుకొని బాధింపలేదు. అప్పుడప్పుడు వారు కొన్ని దౌర్జన్యములు చేసినట్లు చెప్పబడినను తరువాత కొన్ని సంవత్సరములకు పిండారీలను దోపిడిగాండ్రు చేసినట్లు పురుషులను చిత్రవధలుచేయుటగాని స్త్రీలను మానభంగములు చేయుటగాని పిల్లలను ముసలివాండ్రను హింసించుటగాని ఎన్నడూ చేయలేదు. వీరు వచ్చుచున్నారని తెలియగనే గ్రామస్థులు ఇండ్లు వదిలిపెట్టిపోవుచుండిరని కలెక్టరులు వ్రాసినమాట నిజమేగాని దానికి కారణము వారు అక్కడనున్నచో నింగ్లీషు అధికారులు తమకు సహాయము చేయుడని నిర్బంధింతురనియే! సన్యాసులకు గ్రామస్థులు కావలసిన ఆహారపదార్థములను ఇతర వస్త్రములనిచ్చి సహాయముచేయుటయెగాక వారికి దారిచూపుచు వారికి శత్రుసైనికులకు పట్టియిచ్చుచుండిరి.
సన్యాసులు తమ గ్రామములను దోచి బలవంతముగా సొమ్ము వసూలుచేసికొనిపోవుచున్నారని ఇంగ్లీషువారు వారిపైన నిందను మోపిరేగాని ఆ కాలమున శత్రువుల గ్రామములను దోచి సొమ్ము వసూలుచేయని యుద్ధములే లేవు. ఇంగ్లీషు కుంపిణీవారు కూడా వారు చేసిన అన్ని యుద్ధములందును శత్రువుల పట్టణములను కొల్లగొని దోపిడిసొమ్ము వసూలుచేసి దానిని కుంపిణీవారును వారి యుద్యోగులును కూడా పంచుకొనిరి. ఇంతేకాదు ఇంగ్లాండు రాజు కుంపిణీవారికిచ్చిన సైనికాధికారులకును సైనికునకును ఈ దోపిడీ సొమ్ములో వాటానిచ్చు విషయమును గూర్చి కుంపిణీవారు ఇంగ్లీషు రాజు వలన పొందిన పట్టాలోనే యుదాహరింపబడియున్నది (The Nabobs of Madras, Henry Dodwell, P. 65).
అందువలన సన్యాసులు ఇంగ్లీషువారిని శత్రువులుగా పరిగణించి వారి రాజ్యముపైన దండయాత్రలు చేయుచున్నప్పుడు వారి గ్రామములను కొల్లగొని దోపిడీ సొమ్ము వసూలుచేయుటలో తప్పులేదనియె యెంచవలసియున్నది. దోపిడి చేయకుండా అడ్డుపడి ఆ పట్టణాలు కొల్లగొనుటవలన తమకు రాదగిన సొమ్మును శత్రురాజునుండి వసూలుచేయు పద్ధతిని సిరాజుద్దౌలా వధింపబడిన పిమ్మట ముర్షిదాబాదులో కూడా ఇంగ్లీషువారవలంబించిరి.
సన్యాసులు కొన్నియేండ్లపాటు ఇంగ్లీషు రాజ్యాధికారమును ధిక్కరించి వంగదేశముపైన దండయాత్రలు చేయుచునింగ్లీషు సైనికాధికారుల క్రింద తమనెదిరించిన సేనలతో యుద్ధము చేయుచుండగా దీనినాంగ్లేయ చరిత్రకారులొక తిరుగుబాటు అని వ్రాయుటకు కారణము లేకపోలేదు. ఆంగ్లరాజ్యాధికారమును ధిక్కరించుచు భారతీయులు చేసియుండిన అన్ని యుద్ధములనుగూర్చియు బ్రిటిష్ సామ్రాజ్యము వర్ధిల్లుచున్నకాలమున ఆంగ్ల చరిత్రకారులిట్లే వ్రాసిరి. భారతీయులీయుద్ధములను గూర్చి స్మరించి దేశాభిమానము కలిగినచో జాతీయభావములు వర్ధిల్లుననియు అది ఆంగ్ల సామ్రాజ్యమునకు ప్రమాదకరమనియు వారియభిప్రాయము. ఆంగ్ల ప్రభుభక్తి కలిగిన భారతీయ చరిత్రకారులు నీపాఠములనే వల్లించిరి.
ఈ సన్యాసులు చేసిన యుద్ధవిధానమును పరిశీలించినచో అది ధర్మయుద్ధమేయని తేటపడగలదు. లోకసంగ్రహముకొరకును మతధర్మములను రక్షించుటకును మ్లేచ్ఛులను ప్రతిఘటించి ధర్మసంస్థాపనము చేయుటలో మహానుభావులైన సన్యాసులు కూడా రాజులకు తోడ్పడినట్లు మనదేశ చరిత్రలో కొన్ని యుదాహరణములున్నవి. దక్షిణదేశమున మహమ్మదీయులు విజృంభించి హిందూమత ధర్మములను నాశనము చేయుచుండగా విద్యారణ్యులవారు సంగమరాజపుత్రులకు కుడిభుజమై నిలిచి విద్యానగర సామ్రాజ్యస్థాపనమునకు పునాదులు నిర్మించిరి. ఔరంగజేబు చక్రవర్తి కాలమున హిందువుల మతాచారములకు రక్షణ లేకపోవగా శివాజీ మహారాజు ధర్మసంస్థాపనము కొరకు యుద్ధములు చేసి మహారాష్ట్ర సామ్రాజ్యమును స్థాపించుటలో రామదాసస్వామి తోడ్పడెను. అక్బరు చక్రవర్తి కాలమున ఆయుధపాణులైన మహమ్మదీయ ఫకీరులు నిరాయుధులైన హిందూ సన్యాసులను హింసింపగా మధుసూదనసరస్వతి చక్రవర్తికి విన్నవించినను లాభములేకపోగా ధర్మసంరక్షణము కొరకై క్షత్రియులనాహ్వానించి వారికి సన్యాస దీక్షనొసగి మతధర్మములను రక్షించు భారము వారిపైనుంచెను. అంతటవారు హిందూ సన్యాసులను రక్షించి మతధర్మమును కాపాడిరి. ఆ సందర్భమున తీర్థ, ఆశ్రమ, సరస్వతి యను మూడు సంప్రదాయములు గాక తక్కిన ఏడు సంప్రదాయములందు అనగా వన, రణ, గిరి, పర్వత, సాగర, భారతి, పురి అను సంప్రదాయములందును క్షత్రియులు ప్రవేశపెట్టబడిరి. మహమ్మదీయ రాజ్యకాలమునందు హిందూ సన్యాసయోధులు మతధర్మములకై పోరాడిన యుదాహరణములింకను కలవు.
మొగలాయి సామ్రాజ్యము విచ్ఛిన్నమై వివిధ రాష్ట్రములనేలు నవాబులు స్వతంత్రులై రాజ్యాధికారము కొరకు పెనగులాడుచుండగా వర్తకముకొరకీ దేశమునకు వచ్చిన పాశ్చాత్యులు దేశములోని రాజకీయములందు ప్రవేశించి బలవంతులై రాజ్యాక్రమణముచేయుచు తమ లాభములను చూచుకొనసాగిరి. మన రాజులు నవాబులు బలహీనులుగానున్నందున ఈ పాశ్చాత్యులు వారిని తమ చేతిలో కీలుబొమ్మలుగా నాడింపసాగిరి. దేశ ప్రజల ధనమునకు మానమునకు ప్రాణములకు రక్షణలేని స్థితికలిగెను. ధర్మార్థకామమోక్షములు అడుగంటెను. అరాజకము ప్రబలెను. దేశప్రజల మొఱలు విని వారి బాధలను మాన్పువారే లేకపోయిరి. వంగదేశమునందు ఇంగ్లీషువారు 1757లో మీర్జాఫరును గద్దెనెక్కించి తాము వెనుకనుండి భాగవతమునాడసాగిరి. ఆ కాలమున జరుగు అన్యాయములకెల్ల ఈ విజాతీయులైన పాశ్చాత్యులే కారకులని ప్రజలు గ్రహించిరి.
ఆంగ్లేయులపైన ఆ కాలమునాటి ప్రజలకు గౌరవము లేదు సరికదా అసహ్యముగానుండెను. దీనికి కారణము దేశములోని హిందూమహమ్మదీయుల మతధర్మములకు విరుద్ధములైన ఆచారములను కలిగి పంది మాంసము, గొడ్డు మాంసము తినుచు మద్యపానము చేయుచు శౌచవిధులను పాటింపక నీతినియమములు లేక తమ వ్యవహారములందు దేశీయులను మోసగించుచుండినందున పోర్చుగీసువారిని వారితోపాటు తెల్లవారినందరిని అసహ్యించుకొనుచు వారిని పరంగివారని వ్యవహరింపసాగిరి. ఇట్టి పరంగిజాతివారైన ఈ ఆంగ్లేయులు వచ్చి వంగదేశములో పలుకుబడి సంపాదించి అరాజకము వ్యాపింపజేసి ప్రజలను పీడించుచుండగా ప్రజలతో అవినాభావ సంబంధముగల గోసాయిలు మొదలగు సన్యాసులు కూడా బాధలననుభవించి పరిస్థితులు దుర్భరములు కాగా వారందఱునేకమై ఆంగ్లేయుల జాగీరు గ్రామములపైనను వారికి పలుకుబడిగల ఇతర ప్రాంతములపైనను దండయాత్రలు చేయసాగిరి. ఇదియొక మహా యుద్ధముగా పరిణమించెను.
సన్యాసుల యుద్ధకాలమునాటి వంగదేశ చరిత్రను పరిశీలించినచో 1757 మొదలు 1772 వఱకును ఆంగ్లేయులు వంగదేశమునందు ప్రభుత్వభారమును గాని దాని బాధ్యతలనుగాని వహింపక తాము వెనుకనుండి అన్ని వ్యవహారములను నవాబుగారి యుద్యోగుల ద్వారా జరుపుచు తమ లాభమును మాత్రము చూచుకొనుచుండిరని దేశములో శాంతిభద్రతలు లేకుండెనని ప్రజల ధనమునకు మానమునకు ప్రాణములకు రక్షణ లేకుండెనని, దేశములో నింగ్లీషు కుంపిణీవారి యుద్యోగులు నౌకరులు చెదపురుగుల వలె వ్యాపించి అన్ని వ్యాపారములు చేజిక్కించుకొని సుంకములు లేకుండా సర్వమక్తాగా జరుపుచు ఇతరులను చేయనివ్వక సరకులను తమకు చౌకగా అమ్మునట్లు తమ సరకులను హెచ్చువెలలకు కొనునట్లు బలవంతముచేయుచు, రైతుల వలన శిస్తులను బలవంతముగా వసూలుచేయుచు చీటికిమాటికి కొట్టి హింసించుచు వారిపైన అక్రమ నేరములు మోపి శిక్షించుచు దేశభాష తెలియని తెలుగు సిపాయిలను తెచ్చి వారి సహాయమున దౌర్జన్యము చేయుచు అమిత లాభములను మింగసాగిరి. రైతులు పారిశ్రామికులు తమ ఇండ్లువాకిళ్ళు వదలి అడవులపాలైరి. దేశములో ధాన్యము ధర పెరిగెను. 1768లో దేశములోని ధాన్యమును ఇంగ్లీషువారి తోడ్పాటుతో ఇతర ప్రాంతముల వర్తకులు ఎగుమతిచేసిరి. 1769లో దుర్భిక్షము కలిగెను. 1770లో కనివినియెరుగని కఱవు వచ్చెను. ప్రజలు తిండిలేక మలమలమాడి చచ్చిపోవుచుండిరి. కుంపిణీవారి యుద్యోగులు ధాన్యవ్యాపారము చేయుచు లాభములార్జింపసాగిరి. నిర్దయులై పన్నులు వసూలుచేయసాగిరి. వంగదేశమున మూడువ వంతు జనము చచ్చిరి. తరువాత కూడా రెండేండ్లు ప్రజలు బాధలు పడిరి. ఈ దుర్భర పరిస్థితులలో కూడా ప్రజల మొఱలాలకించు నాథుడు లేకపోయెను. తుదకు కుంపిణీవారు 1772లో ప్రభుత్వ భారము వహించిరి. కాని వారి కలెక్టరులు న్యాయాధిపతులు స్వార్థపరులై ప్రజలను పీడించుచుండిరి. కుంపిణీ పరిపాలనము కట్టుదిట్టములతో జరుగసాగెనుగాని ప్రజల బాధలు మానలేదు. (కుంపిణీ బహదూర్ అను ప్రత్యేక గ్రంథభాగమునను ఆంగ్లరాజ్యాధిపత్యము: ఆంగ్ల ప్రభుభక్తుని విమర్శనము అను ప్రకరణములందును ఆ కాలమునాటి ప్రజల బాధలు వర్ణింపబడినవి. నేను రచించిన సన్యాసుల స్వాతంత్ర్య సమరము అను చిన్న గ్రంథమునందు చరిత్ర వర్ణింపబడినది.)
వారన్ హేస్టింగ్సు 1774లో గవర్నరు జనరలుగా నియమింపబడెను. అతని పరిపాలనముగూర్చియు కార్యాలోచన సభకు ప్రజలు ఫిర్యాదులంపసాగిరి. వారన్ హేస్టింగ్సుకు కార్యాలోచన సభ్యులకు విరోధములేర్పడేను. ప్రభుత్వము సక్రమముగా సాగకుండెను. ఈ పరిస్థితులలో సన్యాసులాంగ్లేయ ప్రభుత్వాధికారమును ధిక్కరించి పోరాడి అనేక బాధలనుభవించిరి. వారనేక యుద్ధములందు జయించినను తుదకాంగ్లేయుల ఫిరంగి దళములను ప్రతిఘటింపలేకపోయిరి. ఈ యుద్ధములవలన కుంపిణీవారి పరిపాలనలోని లోపములు బయల్పడెను. దేశములో శాంతిభద్రతలు స్థాపించబడెను. క్రమపరిపాలనము నెలకొల్పబడెను.
వంగరాష్ట్రములో ఇంగ్లీషు ప్రభుత్వోద్యోగిగా పనిచేసి గొప్ప నవలలను వ్రాసిన బంకించంద్రచటర్జీగారు సన్యాసుల యుద్ధమునితివృత్తముగా గైకొని ఆనందమఠమను నవలనురచించిరి. అది దేశాభిమానపూరితములైన భావములతో నిండియున్నది. వందేమాతర గీతము అందులోనే వ్రాయబడి చరిత్ర ప్రసిద్ధికెక్కినది.
1781 నాటి తిరుగుబాటు
‘మన సైన్యములు సర్వదా అప్రమత్తతతో నున్నందువలననే దేశప్రజలు తిరుగుబాటు చేయకుండా ఉన్నారని అందఱు నంగీకరించు విషయమే. రవ్వంత అవకాశము గలిగినఁతటనే ప్రజలు తిరుగుబాటుచేయుటకు ప్రయత్నించుచుందురనుటకు నిదర్శనములున్నవి.’ అని ఫ్రెడరిక్ జాన్ షోర్ 1883 ఏప్రిల్‌లో వ్రాసి, దానికీ క్రింది యుదాహరణము నిచ్చిరి:
1781లో గవర్నరుజనరల్ అయిన వారన్ హేస్టింగ్సుకును కాశీ లేక బనారసు రాజైన చెయితు సింగుకును వివాదము జరిగిన సందర్భమున, వారన్ హేస్టింగ్స్ కాశీకి వెళ్ళెను. అప్పుడక్కడ చెయితు సింగు ఆయనపైన తిరుగుబాటు చేసెను. అంతట హేస్టింగ్సు చునార్‌గఢ్ కోటకు పోయి ప్రాణము దక్కించుకొనెను. అప్పుడు వారన్ హేస్టింగ్సు మరణించెనని ఒక పుకారు పుట్టెను. అంతట వంగ రాష్ట్రములో వివిధ మండలములందు అల్లరులు జరిగెను. ముఖ్యముగా రాజషాహి, బీర్‌భూమ్ జిల్లాలలో కుంపిణీవారి శిస్తు రివిన్యూ వసూలు చాలావరకు నిలిచిపోయెను. ఇంగ్లీషు ఉద్యోగుల యధికారము తృణీకరింపబడెను (Notes on Indian Affairs from Frederick John Shore (1837) Vol 1, p. 161).
కాశీరాజైన చెయితుసింగును కంపెనీకి 50వేల నవరసులు ఇవ్వవలసినదని వారన్ హేస్టింగ్సు కోరగా అతడు నిరాకరించెను. అతనిని నిర్బంధింపగా చెరనుండి తప్పించుకుపోయెను. వారన్ హేస్టింగ్సు పరివారముపైన కాశీరాజు సేనలు తిరుగబడెను. అంతట వారన్ హేస్టింగ్సు చునారుగఢ్ కోటకు పారిపోయి ప్రాణములు దక్కించుకొనెను. ఈ విషయమును గూర్చి ‘ది గ్రేట్ ప్రోకాన్సల్’ అనునొక చరిత్ర గ్రంథమందు సిడ్నీ సి. గ్రయర్‌గారు చక్కగా వర్ణించిరి (The Great Proconsul: Sydney C. Grier 1884 Chapter XXII).
బనారసులో కొంత అల్లరయి తిరుగుబాటు జరుగగా వారన్ హేస్టింగ్సు తన సైనికదళముతో చునార్ గఢ్ కోటకు పోయెను. కొందరాయన ఆ కోట చేరుకొనెననిరి. మఱికొందరు చేరలేదనిరి. ఇంతలో అతడు ప్రాణములను బాసెననువార్తయొకటి పుట్టెను. అది వాయువేగముతో నలుగడల వ్యాపించెను. కలకత్తాలో వారన్ హేస్టింగ్సు నివాస గృహముదగ్గర ఆ మరునాటి యుదయముననే యొక చిత్రము జరిగెను. ఆ కాలములో వారన్ హేస్టింగ్సును ప్రశంసించు హిందీ పాటయొకటి కలకత్తా నగరమున ప్రచారములో నుండెను.
హాతీ పర్ హౌదా, ఘోడే పర్ జీన్
జల్దీ బహర్ జాఁతా, మెస్తర్ హస్తీన్
అనగా, ఏనుగుపైన అంబారీ, గుఱ్ఱముపైన జీను వేసియుండగా హేస్టింగ్సు సాహేబుగారు ఊరేగుచున్నారని అర్థము. ఈ పాట బాగా ప్రచారములో నుండినట్లు 1823లో కలకత్తాలో ఇంగ్లీషు క్రైస్తవ మతాధికారిగా నుండిన బిషప్ హెబరు వ్రాసియున్నారు. కాశీలో హేస్టింగ్సు మరణించెనను వార్త పుట్టినదినమున, అనగా బనారసు సంఘటనము జరిగిన మరునాటియుదయమున కలకత్తాలో ఆయన బంగాళా దగ్గర పనిచేయునొక దేశీయ పరిచారిక ఒక బాలునాడించుచు పైపాటనే యీవిధముగా మార్చి పాడెను:
ఘోడే పర్ హౌదా, హాతీ పర్ జీన్
జల్దీ భాగ్ గయ్యా, మెస్తర్ హస్తీన్
అనగా, ‘గుఱ్ఱము పైన అంబారీ, ఏనుగు పైన జీను తారుమారుగానుండగా హేస్టింగ్సుగారు త్వరగా పరారియగుచున్నారు.’ అని దీని అర్థము. పైన చెప్పిన పాటలో హేస్టింగ్సుగారి గౌరవార్థముగా ప్రజలు పాడు మొదటి పాట 1824లో కలకత్తాలో బిషప్ హెబర్‌గారి కాలములో కూడా ప్రచారంలోనుండెనని ఆయన వ్రాసిరి.
ఈ పాట వినినయొక దొర యాదాసినిదేమని ప్రశ్నింపగా నామె హేస్టింగ్సుగారికి అపజయము కలిగినట్లు తాను వింటినని బదులు చెప్పెను! ఇంగ్లీషువారికి దూరపు సమాచారములు అందులోపలనే చాలా ముందుగా నావార్తలు ఈ దేశీయులకెట్లో తెలియుచుండుననియు, దీని రహస్యము ఇంగ్లీషువారు గ్రహింపలేకున్నారనియు ఆ దొర అక్కడివారితోననెను. ఐరోపాలో జరిగిన సంగతులనుగూర్చి, ఆంగ్లేయులకు అధికారపూర్వకముగా వార్తలు వచ్చులోపలనే ఆ సంగతులన్నీ దేశీయులు బజారులలో చెప్పుకొందురనియు, ఆంగ్లేయులకు తెలియని వార్తాసంగ్రహణ మార్గములు కొన్ని వారికి కలవనియు బిషప్ హెబరుగారు తమ జర్నలులో వ్రాసినారు.
ఈ వార్త నిజమని త్వరలోనే రుజువయ్యెను. వారన్ హేస్టింగ్సుగారి దగ్గరనుండియే తనకపజయము కలిగినట్లు ఒక సన్నని ఉల్లిపొరవంటి కాగితము పైన వ్రాసి, దానినొక బాతుకలముయొక్క మొదలు దగ్గరనున్న గుల్లలో జొప్పించి దానినొక వార్తావహుడు తీసికొనివచ్చెను. అతని యొడలిపైన గోచితప్ప వేరు వస్త్రము లేదు. దారిలో కొందఱు దేశీయ సిపాయిలు తనను నఖశిఖపర్యంతరము సోదాచేసిరనియు, ఈ బాతుకలముముక్క వారికి దొరకకుండా దాచివేయ గలిగితిననియు చెప్పుచు వాడా సందేశము నిచ్చెను.
అప్పుడు సుప్రీముకోర్టు న్యాయమూర్తిగా నుండిన సర్ ఎలిజా ఇంపేగారు జిల్లా కోర్డులను పరీక్షించుటకు పట్నా నగరమునకుపోయి తిరిగివచ్చెను. హేస్టింగ్సుగారు పరారీ అయ్యారను వార్త ఆక్కడివారందరికినెట్లో తెలిసెననియు, అక్కడి సిపాయిలు ఇంగీషువారి కొలువు వదలివేసి వెళ్ళిపోవుచున్నారనియు, చుట్టుపట్లనున్న జమీందారులు కాశీరాజుకు తమ యభినందనములను పంపించుచున్నారనియు, అయోధ్యాబీగములు కాశీరాజు కొఱకు కొంత ధనమును సైన్యమును ప్రోగుచేసి పంపిరనియు నతడు చెప్పెను.
‘ఈ దేశమున, ఉచ్చస్థితిలోనున్న ప్రభువులనాశ్రయించి స్తోత్రపాఠములు చదువుచు వారికి సర్వవిధములుగను సహాయము చేయుదురు. ఆ ప్రభువునకే దురదృష్టవశమున చిక్కులు కలిగినచో, వారాతనిని తృణీకరించి అపకారముకూడా చేయుదురు. పట్నా నగరమున సివిలు అధికారులు కొంచెము వెనుదిరుగగానే ఆ ప్రాంతములందలి నల్లవారందఱును మనకు ఎదురుతిరుగుదురు. ఇప్పటికే చాలా దుఃస్థితి కలిగినది. ముర్షీదాబాదులో కూడా సిపాయిలు చెప్పిన మాట వినుటలేదను వార్తలు వచ్చుచున్నవి. ఈ వార్త వారికెట్లు తెలిసినదో నాకు అర్థమగుటలేదు. లక్నో నగరమునందు ఇంగ్లీషు ఉద్యోగులు తమ నివాసముల దగ్గర ఫిరంగులనుంచి బందోబస్తు చేసికొనవలసినవారైరి. ఈ ముదుసలి యయోధ్యబీగములు చెయితుసింగుకు సహాయము పంపుట కూడా మనకు చుక్కయెదురైనదను భావముతోనే సుమీ!’ అని యాతడనెను.
తరువాత ఇంగ్లీషు సైనికదళములు చెయితుసింగు పైకిపోయి అతని కోటను పట్టుకొని అందులో దొరికిన 28 లక్షలను దోచుకొనిరి. అంతట శాంతి నెలకొనెను.
రాయవేలూరు పితూరి
మద్రాసు రాజధానికి 1803-1807 మధ్య గవర్నరుగా నుండిన విలియం బెంటింకుగారి అంగీకారముతో ఆ రాష్ట్రము యొక్క సర్వసేనానియైన సర్ జాన్ క్రాడక్కుగారు సైనిక నిబంధనలయొక్క పదియవ విధినిబట్టి సిపాయిలు కవాతు మైదానముపైకి వచ్చినప్పుడు అందరు నొకేవిధమైన దుస్తులను ధరించవలెననియు, వారు గడ్డములు నున్నగా గొరిగించుకొనవలెననియు, తలపైన క్రొత్తగా చర్మముతో తయారుచేయబడిన దొర టోపీలను ధరించవలెననియు, హిందువులు మామూలుగా ముఖములపై ధరించు బొట్టుగాని చెవులకు పెట్టుకొను పోగులుగాని ఉండరాదనియు శాసించెను. మహమ్మదీయులు గడ్డములను నున్నగా గొరిగించుకొనుట మతాచార విరుద్ధము. హిందువులకు బొట్టు, చెవుల ప్రోగులు తీసివేయుట మతాచారమునకు విరుద్ధము. హిందువులు చర్మమును తాకినచో మైలపడుదుమనుకొందురు. మహమ్మదీయులా చర్మము అపవిత్రమైన పందితోలు కావచ్చునను అనుమానముతో దానిని ముట్టుకొనరు (Eighteen Fifty Seven. S.N. Sen. P.2). పాశ్చాత్యులైన పరంగీలు హిందువులను మహమ్మదీయులను ఇట్లు మతభ్రష్టులుగా చేసి, పరంగీల మతములో కలపదలచినారను అనుమానము సిపాయిలందరికిని కలిగెను.
భారతదేశమున మహమ్మదీయ ప్రభుత్వకాలమునందు హిందువులను బలవంతముగా మహమ్మదీయ మతమున కలుపుకొనుచుండిరి. అందువలన నీదొరతనములో కూడా దొరలు తమ మతమున కలుపుకొందురేమోయని అనుమానముండుట సహజము. కిరస్తానీమతమనగా దొరలు ధరించు దొర టోపీలను పెట్టుకొని గొడ్డు మాంసమును పంది మాంసమును తినుట, ఘాటైన సీమ సారాయమును త్రాగుటయు, శౌచవిధుల నుల్లంఘించుటయుననియు, ఈ కిరస్తానీ మతమిట్టిపనులు చేయు పరంగీల మతమే గాని నీతి నియమములు ఆస్తిక జిజ్ఞాసయు గలట్టి మతము కాదనియు దేశీయులనుకొనుచుండిరి. అందువలన నామతమున గలసినవారందరును అస్పృశ్యులు నపవిత్రులు నను భావముండెను. తాము మతభ్రష్టుల మగుదుమను భయోద్రేకములీ సిపాయిలలో కలుగుటకీ పిచ్చియుత్తరువులే చాలియుండెను (Oxford History of India V. A. Smith. P. 610).
అంతట రాయవేలూరులోని దేశీయ సిపాయిలు 10-7-1806వ తేదీన తిరుగుబాటుచేసి, అక్కడి ఇంగ్లీషుజాతి సైనికోద్యోగులలో 19మందిని, జాతి సైనికులను 82మందిని తుపాకులతో కాల్చి వధించిరి. 91మందిని గాయపరచిరి. తరువాత ఆర్కాటు నుండి ఇంగ్లీషువారి సైనిక బలములు వచ్చి సిపాయిలను పట్టుకొని పితూరీనణచివేసిరి. ఉత్తరహిందుస్తానములోని మతావేశపరులైన వాహబీలను మహమ్మదీయులు తమ ఫకీరులను దక్షిణదేశమునకంపి ఇంగ్లీషువారిపట్ల ద్వేషభావము పురికొల్పుచుండిరనియు, అట్టి ఫకీరులలోనొకడు రాయవేలూరి బజారులలో కొంతకాలము నుండి తిరుగుచూ సిపాయిలలో నుద్రేకము కలిగించుచూ నీ ఇంగ్లీషు ప్రభుత్వము కూలిపోవునని చెప్పుచుండెననియు తెలియవచ్చెను. ఇంతేగాక ఆ సమయమున రాయవేలూరు కోటలో టిప్పుసుల్తానుగారి కుమాళ్ళును కుటుంబమువారును రాజకీయఖయిదీలుగా నుంచబడియుండిరి. వారును వారి పరిజనులు నీ సిపాయిల తిరుగుబాటుకు కుట్రచేసిరని సైనికోద్యోగులనిరి. రాజకుటుంబమువారి మనుష్యులు సిపాయిలతో రహస్యంగా మాట్లాడుచుండినట్లును, ఈ పితూరీ జరిగినప్పుడు టిప్పుసుల్తాను గారి ఆకుపచ్చ జెండా ఎత్తబడినట్లును తెలిసినది. అయినను తరువాత జరిగిన విచారణ వలన, మద్రాసు రాజధానిలో కొత్తగా ప్రవేశపెట్టబడిన సైనిక నిబంధనల వలన సిపాయిలలో కలిగిన భయోద్రేకములే ఈ తిరుగుబాటుకు ముఖ్యమైన కారణమని తెలియవచ్చెను. అటుపిమ్మట నీ నిబంధనలను జారీచేసిన సర్వసేనానిని, విలియం బెంటింకుగారిని మద్రాసునుండి పని మాన్పించిరి.
మద్రాసులో చాలాకాలము గొప్ప ఉద్యోగములు చేసిన(సర్) తామస్ మన్రోగారు 4-9-1806వ తేదీన తన తండ్రికి లేఖ వ్రాయుచు, ‘సిపాయిలు సైనికదుస్తులు ధరించినప్పుడు బొట్టుపెట్టుకొనరాదనియు, చెవులకు పోగులు ధరింపకూడదనియు, వారి బుగ్గలను నున్నగా గొరిగించుకొనవలెననియు, మీసముల నొకేరీతిగా కత్తిరించుకొనవలెననియు చేయబడిన ఉత్తరువులవలననే దేశీయ సిపాయిల పితూరీ జరిగినది. ఇది త్వరలోనే అణచివేయబడినప్పటికిని, ప్రపంచంలో నేజాతియొక్క ఆచార వ్యవహారములనుగాని తృణీకరించినప్పుడా జాతిలో కలుగు ఉద్రేకమువంటిదే యిది. మన బ్రిటీషు సైనికులందఱిని తలలు నున్నగా గొరిగించుకొనుడని శాసించినచో నేమి జరుగునో యూహింపుడు’ అని వ్రాసిరి (Life and Letters of Sir Thomas Munro, Gleigh. Vol. 1. P. 305).
దేశీయ ప్రజలను క్రైస్తవ మతమున గలుపుకొనుటకై క్రైస్తవమత ప్రచారకులు చేయు ప్రయత్నములకు కుంపిణీ యధికారులు తోడ్పడినందువలననే అది జరిగినదని క్రమక్రమముగా బయల్పడెను.
1807వ సంవత్సరములో రెవరెండ్ సిడ్నీస్మిత్తుగారు ఎడింబరో రివ్యూలో వ్రాసిన లేఖనుబట్టి, 1805 మార్చి 31 తేదీన కొందఱు మిషనరీలు మద్రాసులోని కుంపిణీ యధికారులను సందర్శింపగా వారు గ్రామములందు ప్రచారము చేయుటకు సౌకర్యములు కలిగింతుమని వాగ్దానము చేసిరనియు, క్రైస్తవమత ప్రచారపు కరపత్రములను ఉచితముగా సర్కారు ముద్రణాలయమున అచ్చొత్తించి యిచ్చుట కంగీకరించిరనియు తెలియుచున్నది. వేలూరు తిరుగుబాటుకు పూర్వము క్రైస్తవమత ప్రచారకులు సీమకు వ్రాసిన లేఖలో, తమకు మద్రాసు ప్రభుత్వమువారు మత ప్రచార విషయమున చేయుచున్న సహాయమును వివరించిరి (Rise of Christian power in India. Major B. D. Basu. p. 484.5).
ఎడింబరో రివ్యూలో నింకొక సంచికయందు, రాయవేలూరులో వధలు జరిగిన పదునైదుదినములకు మద్రాసులోని మత ప్రచారకులిట్లు వ్రాసిరి: `ఈ దేశములో స్థాపింపబడిన కుంపిణీ ప్రభుత్వమువారి వలన మాకు అన్ని విధములైన సహాయమును లభించినది. మేముగాని ఇతరులుగాని వారిని కోరిన కోర్కెలన్నిటిని వారు చెల్లించిరి. మేము యిక్కడికివచ్చుటకు వారు అనుమతిచ్చుట, మద్రాసు కోటలో మేము ప్రార్థనలు జరుపుటకంగీకరించి మాపనికి తోడ్పడుట, క్రైస్తవమత ప్రచారవర్గమువారు పనిచేయుటకవసరమైన వసతిని, నివేశనస్థలమును యిచ్చుట యను విషయములందు మనకే యిబ్బందియు కలుగకుండా కావలసిన సహాయము నెల్ల చేయుదురు. ఇది ఏసు క్రీస్తు ప్రభువు యొక్క దయయని తలచుచున్నాము. (Christianization of India. D.V. Siva Rao, Immortal Message May 1940.)
ఆ కాలమున స్వతంత్రులైన క్రైస్తవమత బోధకులు కొందరు తమ స్వంత బాధ్యతపైన మన దేశములో ప్రచారము చేయుటకు బయలుదేరివచ్చిరి. వీరు తమ యిచ్చవచ్చినరీతిగా మన మతములను దూషించుచు క్రైస్తవమతము లోనికి ప్రజలను కలుపవలెనని ప్రయత్నము చేయుచుండిరి. ఆ దేశీయల స్వభావమునుగూర్చియు వారి యాచారములనుగూర్చియు వారి దేవుళ్ళనుగూర్చియు చాలా అవమానకరముగా మాటలాడుచుండిరి. ఈ దేశీయులను కిరస్తానీమతమున కలుపుటకు కృషిచేయుట పుణ్యమను భావముతో ధనవంతులట్టి మత బోధకులను ప్రోత్సహించి పంపిరి. వారు కుంపిణీ ప్రభుత్వమువారి యుద్యోగుల సహాయముతో నిక్కడ ప్రచారము సాగించుచుండిరి. యుద్ధములు లేనప్పుడు సిపాయిలు తీరికగానుందురు గనుక వారికి మతబోధ చేయసాగిరి. తమ ప్రభువులైన కుంపిణీ బహుదూర్‌వారి జాతివారని సిపాయిలు జమేదారులు కొన్నాళ్ళు ఓపికపట్టి వీరు తమ మతమునెంత దూషించుచున్నను మర్యాదతో వినిరి. అదిచూచి వీరు మఱింత విజృంభించిరి. సిపాయిల మనస్సులో చాలా బాధకలిగెను. ఈ దుష్ప్రచారమునకు కుంపిణీవారు హర్షించుచున్నారనియు వారికి కూడా తమను మతభ్రష్టులుగా చేసి కిరస్తానీ మతమున కలుపునుద్దేశమున్నదనియు అనుమానపడిరి. అంతట నీ మద్రాసు రిగ్యులేషను నిబంధన వారి అనుమానములను స్థిరపరచెను. సిపాయిల మనస్సులకు కష్టము కలుగునట్లు వారి మతాచారములకు భంగము కలిగింపగల నిబంధనలను అమలుపరచి ఇంగ్లీషుదొరలీ రాయవేలూరు పితూరీని కొనితెచ్చుకొనిరి.
ఈ తిరుగుబాటును గూర్చి హెరియట్ మార్టిన్యూ 1857లో రచించిన బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అను గ్రంథమున నిట్లు వ్రాసెను:
రాయవేలూరు పితూరీ జరుగుటకుముందిట్టివి జరుగునను సంగతి ఆంగ్లేయాధికారులకు కొన్ని సూచనలవలన తెలిసినప్పటికిని వారెట్టి చర్యయు తీసికొనలేదు. వీరు క్రొత్తగా అమలుజరిపిన నిబంధనలలో సిపాయిల కులాచారములకు సంబంధించిన బొట్టును, చెవులపోగులు తీసివేయవలెనను నిబంధనగాక వారు క్రొత్తగా ధరించవలెనని నిర్ణయించిన దొరటోపీ వంటిది ధరించినచో సిపాయిలు ఫరంగివారివలె నుందురని వారికి తోచెను. ఈ టోపీని పెట్టించుటలో వారు తమను మతభ్రష్టులుగా చేసి తరువాత కిరస్తానీ మతమున గలుపవలెనని ఉద్దేశించిరని సిపాయిలకు తోచెను. ఆ టోపీని పెట్టుకొనుటకు నిరాకరించిన సిపాయిలను కొందరిని మే నెలలో పట్టుకొని చిళ్ళలుగల కొరడాలతో చావగొట్టిరి. ఒక్కొక్క దెబ్బతినిన సిపాయియు, అతని బంధువర్గమును మిత్రులును కుంపిణీవారిపైన క్రోధము వహించి వారిని ద్వేషించుటలో ఆశ్చర్యం లేదు. అట్లు చావగొట్టిన సిపాయిలను కొందరినింకను సైనికవిధుల ప్రకారము శిక్షించుటకు మద్రాసుకు పంపిరి. కొందరు దూరదృష్టిగల ఉద్యోగులీ నిబంధనలను అమలు జరపక ఉపేక్షించిరి.
ఈ కుంపిణీవారు నిజముగనే ఈ విషయమున కుట్రచేసిరని సిపాయిలు తలచిరి. ఈ విషయమునుగూర్చి సిపాయిలు వారి బంధుమిత్రులును చర్చించుకొనుచుండిరి. ఆ యుత్తరువులను ప్రతిఘటించి బాధలనుభవించిన సిపాయిలు వీరులుగా పరిగణింపబడిరి.
ఈ విషయములో సిపాయిలు తిరుగుబాటు చేయుటకు కుట్ర చేయుచున్నారని ఒకడు ఇంగ్లీషుదొరకు చల్లగా చేరవేసెను. అయితే ఆనాటి దొరలు దేశభాషలను నేర్చుకొను ఓపికగలవారుగారు. అందువలన ఆ దొర దీనినిగూర్చి విచారింపుడని, కుట్రదారులలోనివారికే ఆ సిపాయిని వప్పగించెను. అంతట వారితడు చెప్పునది అసత్యమని తీర్మానించి వానిని ఖైదుచేసిరి.
ఈ క్రొత్త నిబంధనలను ప్రతిఘటించుటకొక సిపాయిల రహస్యసంఘ మేర్పాటుకాబడినట్లు కొన్ని వారముల క్రిందటనే కొందఱికి తెలిసెనుగాని, వారెట్టి చర్యయు తీసికొనలేదు.
రాయవేలూరు బజారులో నాకాలమున నొక ఫకీరు తిరుగుచు నీబ్రిటిషు రాజ్యము నశించునని బాహాటముగా చెప్పుచుండెను. ఆంగ్లేయాధికారులు వీనిని లెక్కచేయలేదు (British Rule in India. Harriet Martineau, 1857. pp 205-221). రాయవేలూరు వీధులలో తిరుగుచుండిన ఫకీరు వాహబీశాఖకు చెందినవాడే. ఆ కాలమున నీశాఖవారు భారతదేశమునందు కాఫరులైన ఇంగ్లీషువారిపైన యుద్ధము చేయవలెనని మహమ్మదీయులను ప్రోత్సహించుచుండిరి.
రాయవేలూరి తిరుగుబాటు జరుగుటకు ముందుకూడా 1857లో జరిగిన భారత స్వాతంత్ర్య యుద్ధమునకు పూర్వము వలెనే మద్రాసులో ఒక గ్రామమునుండి మఱియొక గ్రామమునకు చపాతీలను గోధుమరొట్టెలను పంపుచుండిరని, అందువలన నీఆచారములో నేదోయొక అంతరార్థమున్నదని అది తెలియుటలేదని తారన్ హిల్లుగారు వ్రాసిరి (The Personal Adventures of a Magistrate during the Mutiny 1857. P 2,3. Eighteen Fifty seven S. N. Sen P. 398).
(సశేషం)