భారత స్వాతంత్ర్య సమరములు: 1757-1857

(మొదటిభాగంఇక్కడ చదవండి.)

1. బర్మా యుద్ధము

ఇంగ్లీషు కుంపినీవారి స్వాధీనములోనున్న వంగదేశపు సరిహద్దులలోనున్న అస్సాము రాజ్యమును బర్మారాజు సైన్యములాక్రమించగా ఇంగ్లీషువారికి కన్నుకుట్టెను. అంతట ఆ సరిహద్దులలో ఇంగ్లీషువారికి బర్మావారికి తగవులు ప్రారంభమయ్యెను. 1823 నవంబరులో ఇంగ్లీషువారి ఓడను ఒక సైనికాధికారిని బర్మావారు పట్టుకొన్నందువలన బర్మావారిపైన కుంపినీవారి గవర్నరు జనరల్ అమహరెస్టు యుద్ధము ప్రకటించెను. ఆ సమయమున వంగదేశములోని దేశీయ సిపాయిలు సముద్రము మీద ప్రయాణము చేసినచో తమ కులమువారు వెలివేయుదురని బర్మాకు పోవుటకు నిరాకరించిరి. మద్రాసులోని దేశీయ సిపాయిలు ఎట్టి అభ్యంతరము చెప్పక సముద్రయానము చేసిరి. ఆప్రకారమింగ్లీషువారు పంపిన నౌకాదళములు 1824 మే 10వ తేదీన రంగూను రేవుదగ్గర లంగరు వేసెను. అక్కడి ప్రజలు భయపడి అడవులలోనికి పారిపోయిరి. ఇంగ్లీషు సైన్యము రంగూనును పట్టుకొని ఆవానగరములో నున్న బర్మారాజుపైకి పోవదలచిరి కాని అడవులలోనున్న బర్మా ప్రజలు వారిపైన రహస్యయుద్ధము చేసి చాలా నష్టము కలిగించిరి. ఈ లోపుగా బర్మారాజు తన సేనానాయకుడైన మహాబొందూలా అధికారము క్రింద పంపిన సైన్యము అస్సాము సరిహద్దున గల నాప్ నదిని 1824 మే నెల ప్రారంభములో దాటి రామూకొండల దగ్గర ఇంగ్లీషు సైన్యమునోడించి వారి సేనాధిపతిని చంపెను. అంతట ఈ మహాబొందూలా సేనలు వచ్చి కలకత్తాపైన పడుచున్నవను వార్తలు ప్రబలి కలకత్తాలోని ఇంగ్లీషువారేగాక భారతదేశములోని కుంపినీరాజ్యము లోనివారెల్లరు హడలిపోయిరి. అయితే ఆ సమయమున రంగూను నింగ్లీషువారు పట్టుకొన్నందున బందూలాను వెనుకకు రమ్మని బర్మారాజు ఆజ్ఞాపించుటవలన ఇంగ్లీషు కుంపినీవారు బ్రతికిపోయిరి.

ఈ బర్మాయుద్ధము నందింగ్లీషువారికి కలిగిన అపజయమువలనను హిందూదేశములోని ప్రజలందును ప్రభుత్వమునందును కలిగిన భీతావహమునుగూర్చి 1824 జూన్ 8వ తేదీన సర్ చార్లెస్ మెట్‌కాఫ్‌గారు గవర్నరు జనరలుకు వ్రాసిన ఉత్తరమువలన తెలియుచున్నది.

“బర్మావారింత బాగా యుద్ధము చేయగలుగుదురని మనమనుకొనలేదు. మొదటి విజయము వారికి కలుగగానే వారికి చాలా బలము చేకూరినది. మనము మొదటిలోనే ఓడిపోయినందువలన మనసైన్యమును క్రుంగదీసినది. అపజయమెంత స్వల్పమైనదనుకొన్నను దీని ఫలితములు చాలాముఖ్యమైనవి. భారతదేశములోని కుంపినీవారి బ్రతుకంతయు మన సైన్యముల నిరంతర విజయములపైన నాధారపడియున్నది. ఇతరదేశములలోవలెగాక హిందూదేశ ప్రజలలో నిది చాలా కలవరము కలిగించెను. మనము తగినంత సైన్యమును యుద్ధరంగము దగ్గరనుంచుకొనలేదు. ఇట్టి సమయములో శత్రువులు మనలను ఓడించి మనపైకి వచ్చుచున్నారను వార్త ఢాకానగరములోను దూరములోనున్న కలకత్తాలోను గల ప్రజలలో భీతి కలిగించెను. సిరాజుద్దౌలా కాసీముబజారును కలకత్తాను పట్టుకొన్నప్పటినుండి ఇంతవరకింత భయము మనవారికెన్నడును కలుగలేదు. వంగదేశపురాజ్యపు తూర్పు పొలిమేర పొడవున మనకిప్పుడు బర్మావారితో పోరాటము కలిగినది. మన శత్రువులైన బర్మావారికి మంచి సైనికబలమేగాక ఉత్సాహముకూడా ఉన్నది. మనము కూడా తగిన సైనికబలమును చేర్చి ఈ పరాజయమును కూడదీసికొనవలెను. ఎంతటి చిన్న ఓటమి కలిగినను దానిని మనము కూడదీసికొనకపోయినచో హిందూదేశములో నింక మనము నిలువలేము. మనకు ఈషణ్మాత్రము పరాజయము కలిగిననూ ఆ వార్త హిందూదేశములో నన్ని ప్రాంతములకు త్వరలో వ్యాపించును. ఇంతకాలము మనము అణచియుంచిన కోట్లకొలది జనులందరు మనలను కూలద్రోయుటకు ప్రయత్నింతురు.”

అతడింకను ఇట్లు వ్రాసెను: “మన సైనిక బలమువలననే మన సామ్రాజ్యమీదేశములో నిలిచియున్నది. ఈ పునాదికేమాత్రము దెబ్బతగిలినను మనకు ఉపద్రవము రాగలదు. మనకెంత చిన్న ఓటమి కలిగినా ఆ పునాదికి దెబ్బతగిలినట్లే.

మనమెప్పుడు బలహీనులమై పడిపోవుదుమాయని హిందూదేశములోనివారందరును నిరంతరము ప్రతీక్షించుచున్నారు. మనము నాశనమైన దినమున హిందూదేశములోనివారందరును సంతోషించి ఉత్సవములు చేయుదురు. ఇటువంటివారీదేశమున లక్షోపలక్షలుగానున్నారు. మనము క్రిందికిజారుట మొదలిడినచో నికమనకు దిక్కుండదు. ఒక్కసారిగా మన రాజ్యము కూలిపోవును.

మన బలమంతయు దేశీయ సిపాయిల భక్తివిశ్వాసములపైన నాధారపడియున్నది. మనము ఎన్నడును ఎక్కడను ఓడిపోకపోరాడి జయపరంపరలను పొందుచున్నంతకాలమే వారికి మనయెడల భక్తివిశ్వాసములుండును. మనకెక్కడనైనను అపజయము కలిగినచో వారి భక్తివిశ్వాసములడుగంటును.” అని సర్ చార్లెస్ మెట్కాఫ్ వ్రాసినాడు (Rise of Christian power, B. D. Basu. బ్రిటిష్ మహాయుగము, సం.2, పే. 909-910).

1824 తిరుగుబాటు – సిపాయిల వధ

హిందూదేశములో నింగ్లీషుకుంపినీవారు దేశీయ సిపాయిల సహాయమువలననే రాజ్యాక్రమణము చేసి దానిని నిలువబెట్టుకొనుచుండిరి. దేశీయ సిపాయిలు చాలా భక్తివిశ్వాసములతో కుంపినీవారి సేవచేయుచుండిరి.

ఈ దేశీయ సిపాయిల శాంతస్వభావము రాజభక్తి వినయవిధేయతలు, వారి గుణగణములను ఇంగ్లీషు సేనాధిపతులనేకులు ప్రశంసించియున్నారు. నిన్ను కొలువునుండి తీసివేసినామని అనుటకంటె దేశీయసిపాయికి వేరే అవమానము శిక్ష అవసరములేదు. అయినను వీరికి తగిన జీతబత్తెములు లేవు. సౌకర్యములు లేవు. మామూలు రోజుకూలివానికిచ్చు మొత్తముకన్నను దేశీయ సిపాయికి తక్కువ జీతమిచ్చుచుండిరి. పాశ్చాత్య సైనికులు సేనలో చేరగానే వారికి ముందుగా కొంత మొత్తము సరంజామాకొరకిత్తురు. వారుండుటకు సర్కారువారు బారకీచులను కట్టించి వారిని మాంసాహారముతో మేపుదురు. దేశీయ సిపాయిలు తలదాచుకొనుటకు ఎక్కడనో ఒక గుడిసె చూచుకొని అన్నవస్త్రములకు ఇబ్బందిపడుచు మీసములురాని తెల్లవారుద్యోగులై నెరసిన గెడ్డములుగల ముదుసలి దేశీయ సిపాయిలను చీటికిమాటికి తిట్టి చిన్నతప్పిదములకు కూడా ముక్కోణములకు కట్టి, కొరడాలతో చావగొట్టుదురు. దేశీయ సిపాయి ఎన్నాళ్ళు సేవచేసినను సుబేదారు మేజరు పదవికన్న హెచ్చుపదవినివ్వరు. ఇంగ్లీషు సైనికుడు త్వరలోనే గొప్ప జీతబత్తెములు గల కెప్తానులు కర్నలు జనరలు పదవిని పొందుదురు. తెల్లవారుచూపిన అవిధేయతను కప్పిపుచ్చుచుందురు.

పాశ్చాత్య సైనికులకు దేశీయ సిపాయిలకు గల తారతమ్యము అటులుండగా ఆ కాలములో బొంబాయి మద్రాసులోని దేశీయ సిపాయిల సైన్యమునకున్న జీతబత్తెములు వంగదేశములోని దేశీయ సిపాయిలకు లేకుండెను. ఐరోపా సైనికుడు తన మూటను తాను మోసికొని వెళ్ళడు. వారికొరకు బండ్లు ఎడ్లు గుఱ్ఱములు ప్రభుత్వమువారేర్పరచిరి. దేశీయ సిపాయి తన తుపాకిని 60 రౌండ్లు మందుగుండు తోటాల సంచిని తన బిచానా వంటసామాను దుస్తులు సహా పెద్దమూటను వీపున మోసికొని ఎన్ని మైళ్ళ దూరమైన నడువవలసియుండెను. అందువలన ఈ సిపాయిలకు గుండెజబ్బుచేసి వంగిపోవుచుండిరి. యుద్ధసమయములోను పోరాడుటకును దేశీయ సిపాయిలను బెదిరించి లొంగదీయుటకు తప్ప వంగదేశములోని ఇంగ్లీషు జాతి సైనికులు ఇతరకార్యములను చేయుటకు నుపయోగింపకుండిరి. వీరు సాధారణముగా పనిచేయక తప్పించుకొనుచుండిరి. ఎండలోను వర్షములోను పనిచేయలేకుండిరి. గవర్నరు జనరలుకును సర్వసేనాధిపతికిని పహరాకూడా దేశీయ సిపాయిల రెజిమెంటువారే చేయుచుండిరి. కలకత్తాలో గవర్నరు జనరలు భవనమునకు కాపలావారిలో దేశీయ సిపాయిల పటాలమువారు సగముమంది మిగిలినవారు ఇంగ్లీషువారునుండిరి. అయితే వీరు ఎండ తప్పించుకొని నీడలో కాలక్షేపముచేయుచుందురు. సైనికశాఖ కార్యాలయములోని రికార్డులను కూడా దేశీయ సిపాయిలే చేరవేయుచుండిరి. ఇంగ్లీషుజాతి సైన్యమెక్కడికి తరలివెళ్ళినను వారితోపాటు చాకిరిచేయుటకు దేశీయ పటాలములను పంపుచుందురు. 

దేశీయ సిపాయిలు తమ యిబ్బందులను పైయధికారులకెన్నోసారులు చెప్పుకొని మొఱపెట్టినను వారి బాధలనెవ్వరును తీర్చరైరి. ఇట్టి పరిస్థితులలో 1824లో బర్మాయుద్ధము తటస్థించినది. బారకుపూరులోనున్న 47వ దేశీయ పటాలమును యుద్ధరంగమునకు నడువవలసినదని ఉత్తరువులువచ్చెను. వారు సముద్రముపైన ప్రయాణములు చేసినచో వర్ణభ్రష్టులగుదుమను భయమువలన నాటుదారిని పోవుటకంగీకరించిరి. అయితే వారి సామానులను రవాణాచేయుటకుగాని వారికాహారపదార్థములు సరఫరా చేయుటకుగాని తగిన ఏర్పాటులను కుంపినీ ప్రభుత్వమువారు చేయక ఆ సిపాయిలనే తగు ఏర్పాటులు చేసికొనవలసినదనిరి. ప్రయాణపు ఖర్చులను సిపాయిలు భరించుకొందుమని చెప్పినను మిలిటరీశాఖకు సంబంధించిన ఎడ్లను బండ్లను ఇచ్చుటకు వీలులేదని సరఫరాశాఖవారనిరి. ఈ పరిస్థితులలో మెట్టదారిని పోవీలుగాక సముద్రముమీదుగనే వీరిని కలకత్తానుండి రంగూనుకు పంపదలచినారను ఒక వార్త సిపాయిలకు తెలిసెను. ఈ పటాలములోనివారందరు ఉన్నతకులములకు చెందిన బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన హిందువులు. వీరు సైనికకొలువులో చేరినపుడే తమను సముద్రయానము చేయుడని కోరరాదను షరతును తమ పూచీకత్తులో వ్రాసియుండిరి. ఆ షరతుకు భిన్నముగానిప్పుడు తమను సముద్రయానము చేయుడని కోరుట అన్యాయమని వారు అందుకంగీకరింపరైరి.

1824 అక్టోబరు 30వ తేదీన ఈ పటాలమును మైదానము మీద వరుసగానిలువబెట్టిరి. మూమూలుగా వీపులపైన వేసికొను మూటలనేల వేసికొనలేదని అధికారియడుగగా అవి పాతవై చిరిగిపోయినవని వారు నెమ్మదిగా చెప్పి తమకుగల ఇతర కష్టములను మఱలనొకమారు చెప్పుకొనిరి. ఓడలమీద పోవు షరతు తాము వ్రాసియిచ్చిన పత్రములలో లేదుగనుక తాము సముద్రయానముచేయజాలమనిరి. బండ్లు తోలువారికి ఇతరులకు రెట్టింపు బత్తెములనిచ్చుచున్నందున తమకు కూడా అట్లు దయచేయింపుడనిరి. క్రొత్తదేశములో అన్ని వస్తువులు ప్రియముగానుండునని తెలియుచున్నదనియు అందువలన తమకు హెచ్చు బత్తెమునివ్వనిదే బ్రతుకజాలమనిరి. అంతట సైనికాధికారి అప్పటికూరకొని వారిని వెళ్ళిపొమ్మని చెప్పి పైయధికారులకీసంగతి చెప్పెను. ఆ మరునాటికి కలకత్తానుండి రెండు ఇంగ్లీషు పటాలములు ఫిరంగిదళము మరికొంత సైన్యము బారకుపూరులో దిగెను. నవంబరు 1వ తేదీన 47వ దేశీయ సిపాయిల పటాలమువారినందరిని మఱల మైదానము మీద నిలువబెట్టి కలకత్తా నుండి వచ్చిన సైన్యమును వారిచుట్టు నిలిపియుంచి వారివెనుక ఫిరంగులను బారుచేసియుంచిరి. అప్పుడాదేశీయ పటాలమువారు తమకు పట్టబోవు గతి గ్రహింపలేక తమ కష్టములను గూర్చి పారశీకభాషలో వ్రాసిన ఒక విన్నపమును సర్వసేనాధిపతియైన పేజెట్‌గారికి సమర్పించిరి. పేజెట్‌గారు చాలా కఠినుడు. సిపాయిలు తమ కష్టములనుగూర్చి చెప్పుకొనుటయె ఒక తప్పుగానెంచెను. అందులో ఒకవంక బర్మా యుద్ధము ప్రారంభమై కుంపినీరాజ్యమునకు ఘోరవిపత్తు వచ్చునట్లుండగా సైన్యములోని సిపాయిలిట్లు పేచీలుపెట్టుట తమ మతాచారములకు విరుద్ధమని సముద్రప్రయాణము చేయనిరాకరించుటయు కేవలము క్రమశిక్షణావిధులకు భంగముకలిగించునని వీరిని తగినరీతిగా శిక్షించవలెనని తలచి వారిని ఫిరంగులతో కాల్చివేయవలసినదని ఉత్తర్వుచేసెను. అట్టిది జరుగునని కలలోనైన అనుకొనని ఆ దురదృష్టవంతులైన సిపాయిలు చిందరవందరయి పారిపోవుచుండగా వారిని ఫిరంగిగుండ్లు తుత్తునియలుచేసివైచెను. ఈ వార్త హిందూదేశములోని దేశీయ సిపాయిల పటాలములవారు విని లోలోపల బాధపడిరి. అప్పటికేమనకపోయినను ఈయన్యాయము వారిలో తీవ్రమైన ద్వేషమును రగుల్కొల్పెను (Eighteen Fifty Seven, Surendranath Sen PP 3-5).

1824 తిరుగుబాటు – ప్రజలు

భారతదేశమునకు ప్రభువులైన ఆంగ్లేయ వర్తక కంపెనీవారు మిత్రభేదము చేసి, మోసము చేసి, దౌర్జన్యము చేసి, భారతదేశము నాక్రమించినారనియు, కేవలము ధనకాంక్ష చేత నెన్నో యన్యాయములు చేసిరనియు, వారి తాబేదారులును దుష్పరిపాలనము చేసి ప్రజలను పీడించి ధనము లాగుచుండిరనియు, భారతీయులకన్న తామధికులమను స్వాతిశయముతోను, అహంకారముతోను మెలగుచు ప్రజలను నీచముగా జూచుచు అవమానించుచుండిరనియు, అందువలన ప్రజలలో విరోధభావము వ్యాపించి ఈ యాంగ్లేయ పరిపాలనము నుండి వెలువడుటకు తరుణము కొరకు వేచియుండిరనియు ఆ కాలమున భారతదేశమున నుద్యోగము చేసిన దొరలలోనే కొందరు అనుభవజ్ఞులు వ్రాసియున్నారు. అట్టివారిలో ఫ్రెడరిక్ జాన్‌షోరుగారొకరు. ఈయన ఉత్తరహిందుస్థానమున 17 సంవత్సరములు జిల్లాజడ్జి ఉద్యోగము చేసి భారతదేశ స్థితిగతులను గూర్చి 1832-1835 మధ్య ఇండియా గెజెటు పత్రిక కనేక వ్యాసములు వ్రాసిరి. అవి 1837లో Notes on Indian Affairs అను పేరున రెండు సంపుటులుగా ప్రకటింపబడినవి.

ఆంగ్ల ప్రభుత్వము పట్ల భారతీయుల భావములను గూర్చి 1833 సం. ఏప్రిలు 6వ తేదీన వారిట్లు వ్రాసిరి: “భారతదేశ వ్యవహారములను గూర్చి నేను వ్రాయుటలో ఇంగ్లీషుపరిపాలకులపట్ల భారతీయులభావము లెట్లున్నవను విషయమును గూర్చి నేను పలుమార్లు సూచించియున్నాను. పలువురనుకొనునట్లే ప్రజల భావములు మన కనుకూలముగా లేవని స్పష్టముగా చెప్పియున్నాను. ఈ విషయమును గూర్చి మనలో ఉన్నంత అజ్ఞానము పొరపాటు అభిప్రాయములు నింకేవిషయమునను లేవు.

ఇంగ్లీషు పరిపాలన ప్రజానురంజకముగా నున్నదనియు, ఆంగ్లేయుల శీలమును గూర్చి భారతీయప్రజలకు చాల మంచియభిప్రాయము కలదనియు చాటుచుండుటయు, దేశీయరాజుల ఆక్రమములును వారి నిరంకుశత్వమును ప్రజాపీడనమును గూర్చియు చెప్పి, ఈ తారతమ్యమును జూపి, ప్రశంసించుచుండుటయు ఇంగ్లీషువారికి పరిపాటి యైపోయినది.  

మన ఆంగ్లేయ ప్రభుత్వముపట్ల ప్రజలు అసంతృప్తిని జెందియుండుటకు గల కారణములలో ముఖ్యమైనవానిని కొన్నిటిని సూచించెదను. అన్నిటికన్న ముఖ్యకారణము నేనీవరకు వ్రాసినట్లుగా ఆంగ్లేయుల స్వాతిశయము, జాత్యహంకారము దేశీయులతో కలసిమెలసి ప్రవర్తించినచో తమ గౌరవమునకు భంగకరమను దురభిప్రాయముతో ప్రజలతో సంబంధము లేకుండా తొలగియుండుట. ఈ ప్రవర్తనమే ప్రజల యాంతరంగికభావములు మనవారికి తెలియకపోవుటకు కారణముగ నున్నది. దేశీయులతో సంబంధము లేక మన ప్రపంచములోనే మనము మెలగుచున్నందున మన భావములు ప్రవర్తనమును సంకుచితములై స్వార్థపరత్వము వర్ధిల్లి ఇష్టానిష్టములు పెరిగిపోయినవి. కేవలము ధనకాంక్ష వలనను లాభము పొందు దురుద్దేశ్యముతోను మనల నాశ్రయించి తిరుగు భారతీయులు కొందరు సర్వదా మనలను స్తుతించుచు మనలోపములకు దుర్గుణములకు దోహదము చేయుచుందురు. మానవ స్వభావమును గ్రహించుటలో భారతీయులు కడు నేర్పరులు. గొప్పవారిపై నాధారపడి జీవించు వృత్తికులములవలెను, కాసావారివలెను వీరాంగ్లేయోద్యోగుల నెల్లప్పుడును పొగడుచు ఈ దేశమును గూర్చి వారికి గల దురభిప్రాయములు సరియైనవేయని తాము నమ్ముచున్నట్లు నటించుచు తమ్మునేలు ప్రభువుల ముఖవిన్యాసముల కనుగుణంగా నడుచుచుందురు. మెరమెచ్చులు మొగము మెప్పులు చేసి వారినుబ్బించుట ఈ స్వార్థపరుల కవసరమైన కృత్యమే కదా!

తమ స్వదేశీయులీద్రోహుల నేవగించుకొనుచున్నను ప్రభుత్వము వలన వీరు లాభము పొందుదురు గనుక, ప్రభుత్వము యొక్క అనుగ్రహము పొందుటకు వీరు అవలంబింపని విధానములుండవు. వీరు సత్యమును తారుమారుచేయుటలో నాశ్చర్యములేదుగాని, ఈ వ్యక్తుల నీచత్వమును బాగుగా నెఱిగియుండి వీరిని గర్హించు ఈ ప్రభుత్వమువారు వీరి యభిప్రాయములను తిన్నగా విమర్శింపకయే వీరిని స్వీకరించుటమాత్రము ఆశ్చర్యకరముగనే యున్నది. అనుదినము జరుగుచున్న విషయమే యిది.

అధికారగర్వమున మునిగియుండక, ప్రజలతో కొంచెము కలసిమెలసి చరించినవారికి మాత్రము ప్రజల యాంతర్యము బాగుగా తెలియును. ఈ విషయమును గూర్చి కొంచెము నిష్పక్షపాతముగా యోచించినచో నీ ప్రజల కిట్టి విరోధభావములుండుటలో నాశ్చర్యము లేదని తెలియగలదు. ఏలనగా నీబ్రిటిష్ పరిపాలనమున ప్రజల స్థితి యెట్లున్నదో చూడుడు: యుద్ధము యొక్క అదృష్ట ఫలితములవలననో, లేదా తమకేవిధముగాను సంబంధము లేని రాజకీయమైన ఏర్పాటులను బట్టియో ఈ ప్రజలు మన పరిపాలన క్రిందకి వచ్చినారు. ఇంక మనపరిపాలనావిధాన మన్ననో కేవలము స్వార్థపరత్వముతోనూ స్వాతిశయముతోను గూడి వారినేలుచున్నది. ఈ ప్రజల కన్నుల యెదుటనే క్రమక్రమముగా ఆయేటికాయేడు వీరి యధికారమును గౌరవమును సంపదయు క్షీణించిపోవుచున్నవి. వీరినేలిన దేశీయరాజులు రాజప్రతినిధులు నాశనమైపోవుచున్నారు. ఆంగ్లప్రభుత్వమువారి దురాశవలన దుష్పరిపాలనవలన జనసామాన్యము దరిద్రులగుచున్నారు.

ఇంగ్లీషువానికి ప్రసాదింపవీలుగల ప్రతియుద్యోగము దేశీయులకు లేకుండచేసిరి. ఈ దేశ వ్యవహారములను పూర్వము వంశపారంపర్యముగ చక్కబెట్టుచుండిన ప్రతి దేశీయ సంస్థయు నాశనము చేయబడినది. పూర్వమీదేశ ప్రజలు తమ వివాదములను పరిష్కరించుకొనుటకేర్పడిన పంచాయతీ ధర్మసభలు తీసివేసి, అసమర్థమును అత్యధిక ధనవ్యయకారణమునైన యొక కొత్త న్యాయపరిపాలనావిధానమును స్థాపించినారు. న్యాయపరిపాలనమను పేరును గూడ ఇది సార్థకపరచుట లేదు. దీనివలన అన్యాయములును ప్రజాపీడనమును దేశములో పెచ్చుపెరిగినవి. ఈ బ్రిటిషు ప్రభుత్వము వలన భారతీయులనుభవించు సౌఖ్యములివి. ఆంగ్లేయవ్యక్తులవలన వారు పొందు గౌరవాదరణములైన బాగున్నవాయని చూచినచో దేశీయులతోడి సామాన్య సంభాణములందు కూడా ఈ యాంగ్లేయులు గర్వమును గనబరచుటయు స్వాతిశయభావములను గనబరచుటయు తమ పట్ల మర్యాదగను గౌరవముగను బ్రవర్తించు దేశీయుల నీ యాంగ్లేయులు లెక్కసేయక తృణీకరించుట నీచముగ జూచి అగౌరవపరచుట గూడ సర్వసామాన్యముగ జరుగుచున్నవని నే నీవరకే చెప్పియున్నాను. ఈ భారతీయులెంతో శాంతముగను ఓరిమితో నీ యవమానములను తిరస్కారములను భరించుచున్నారు. ఆంగ్లేయోద్యోగులలో నెవరైన కొందరు ప్రజలపట్ల సానుభూతి గనబరచువారున్నను ఆంగ్లపరిపాలనా విధానమును బట్టి ఉద్యోగులను తరచుగా బదలాయింపులు చేయుచుందురు గనుక అట్టి ఉద్యోగులతోస్నేహ భావమును పెంపొందించుకొనుటకు ప్రజల కవకాశములు కలుగవు. ఆంగ్లేయుల ప్రవర్తనను బట్టి చర్యలనుబట్టి వారిపట్ల భారతీయులు స్నేహభావము కలిగి యుండుటకు హెచ్చు అవకాశములున్నవో లేవో గ్రహించుటకు చరిత్రకారుల రచనలు ముఖ్యముగా జేమ్సుమిల్లు గారి హిందుదేశచరిత్రను చదువవచ్చును.

ఈ భారతీయులు మనలను ద్వేషించునది మనము విజాతీయుల మైనందువల్ల మాత్రమునగాని, వారిని మనము జయించినందునగాని కాదు. జయింపదలచిన దేశములోని ప్రజలను రూపుమాపదలుచుకున్న ఘోరమైన సందర్భమున దప్ప ప్రపంచములోని దేశాక్రమణల చరిత్రలో నెచ్చటను కనివిని యెరుగని విధముగ నీపాలితప్రజలను దరిద్రులుగను పతితులుగను జేసినామను కారణముననే వారు మనలను ద్వేషించుచున్నారు (పే. 148). నేననేక దేశీయ స్వతంత్రరాజుల రాజ్యములు తిరిగి జూచితిని. అన్నిటికన్నను ముఖ్యముగా బ్రిటిష్‌వారి యధికారమునకులోబడుటను వారు హర్షించుటలేదని నేను గట్టిగా చెప్పగలను (పే. 151). సర్వకాల సర్వావస్థలయందు మన సైన్యములప్రమత్తత వహించియున్నందువలననే దేశమున తిరుగుబాటు జరగకుండ నున్నదను సంగతిని అందరు అంగీకరించకున్నారు. అవకాశమున్నప్పుడెల్లను అధికారతిరస్కారము కనబడుచునే యున్నదనుట కనేక ఉదాహరణములున్నవి. ప్రతి తిరుగుబాటుకును కల్లోలమునకును నేదో యొక కారణముండితీరునను సంగతి విచారించినవారికి తెలియగలదు. అసంతృప్తికి నిజమైన కారణములు లేని తిరుగుబాటులరుదుగా నుండును. ఇటీవల జరిగిన కోల్ తిరుగుబాటులో చాల మానవప్రాణములు నష్టమైనవి. ప్రభుత్వమునకు చాల సొమ్ము వ్యయమైనది. అప్రియమైన సంగతులనెంతకప్పిపుచ్చినను, ఎందరు దానిని కాదనినను ఈ తిరుగుబాటునకు నిజమైన కారణము రాజోద్యోగులగు దేశీయులు చేసిన ప్రజాపీడనము, దోపిడియునని బయల్పడినది. ఈ యుద్యోగులు లంచములు గ్రహించి, తమ యధికారమును దుర్వినియోగము చేసి కొందరికి మద్దతుచేసిరి. 

1824లో ఉత్తరహిందుస్థానములోని (upper provinces) బ్రిటిషురాష్ట్రము లన్నిటిలోను కలిగిన కల్లోలములకు గూడ నిదియే నిజమైన కారణము. కొంచముగనో గొప్పగనో ప్రభుత్వము పట్ల ప్రజలకు విరోధభావము చూపని జిల్లా యొక్కటియైనను లేదని చెప్పవచ్చును. దీనికి కారణములు చూపుటకు కొందరు ప్రయత్నించిన సంగతి నేనెరుగుదును. బర్మా యుద్ధములో మనకు అపజయములు కలిగినందున మన సైన్యముల నక్కడికి బంపవలసివచ్చుటయే కారణమనియు తిరుగుబాటు చేసి సాగిన ముఠాలవారు దోపిడికొరకు తిరుగు యెవరో బందిపోటుగాండ్రేగాని అసంతృప్తి చెందిన ప్రజలుగారనియు చెప్పజూచిరి. ఇవన్నియుగూడ కారణములేయని యంగీకరింపవచ్చునుగాని మన పరిపాలనమున నీదేశీయులంత సౌఖ్యము అనుభవించుచున్నచో మన యధికారమును ధిక్కరించుటలో వీరందరునింత యుత్సాహముతో నేల నేకీభవించుచున్నారు? ఉత్తర పరగణాలలోనెల్ల ఒక్క ముఖ్యభూస్వామియైనను ప్రభుత్వమువారికి సాయముచేయ రాలేదేమి?

దోపిడిసొమ్ములో కొంత పాలు పొందవచ్చునను నాసతో కొందరు బందిపోటుగాండ్రీ తిరుగుబాటులో చేరినమాట నిజమేయని యొప్పుకొందము. అయితే ప్రజల ప్రవర్తన మెట్లున్నది? ఈ దోపిడి దొంగలకు మొదటి గెలుపు కలుగగానే దేశములోని ప్రజలలో పై తరగతులవారు కూడా చాలామంది వారితో కలసిరి. అంతట నీసమూహము యొక్క యుద్దేశ్యము కేవలము దోపిడిగాక ప్రభుత్వాధికార ధిక్కారముగనే పరిణమించినది. దేశమందంతటను అమితోత్సాముతో “ఈ ఇంగ్లీషువారి రాజరిక మంతరించినది! ఇంగ్లీషువారు నాశనమైపోవుదురుగాక!” అను కేకలు ప్రతిధ్వనించెను. కల్లోలము నణచుటకు తోడ్పడు పద్ధతి ఈ ప్రజలలో లేదనియు, ఆ పనిని మన పోలీసువారికి సైన్యములకే వదలి ప్రజలు తొలగియున్నారనియు చెప్పి, సరిపెట్టుకున్నందువలన లాభము లేదు. స్వదేశరాజ్యములలో కల్లోలములు జరిగినప్పుడు పలుకుబడి కలవారు తమ పరిజనులను, రైతులను ప్రోగుచేసి ప్రభుత్వమునకు బాసటయై నిలిచిన యుదాహరణము లెన్నియైన నీదేశచరిత్రలో కనపడుచున్నవి. పైన చెప్పిన కల్లోలముల సమయమున మాత్రమిందుకు భిన్నముగా జరిగినది. ప్రజలు కేవలము దూరముగా తొలగి యూరకొని మాత్రమే యుండలేదు. సర్వసాధారణముగా ఇంగ్లీషు మేజస్ట్రేటుల చుట్టుచుట్టు తిరుగుచుండువారుగూడ ఈ కల్లోలము ప్రారంభము కాగానే వివిధ మేజస్ట్రేటులను వదలిపెట్టి, తమ ప్రదేశములలో తమ పలుకుబడి నుపయోగించు నెపమున తమతమ యిండ్లకు జని అక్కడ మనుష్యులను ప్రోగుచేయసాగిరి.

కాని ఈ మనుష్యుల నెందుకు ప్రోగుచేసిరి? తాము సంసిద్ధులైయుండి తరుణము రాగానే తమ ప్రభుత్వమునకు వ్యతిరేకముగా నుపయోగించుటకే! ఇట్టివారు కొంతమంది యట్లెదురు తిరిగిరి. శాంతిభద్రతలను కాపాడుటకు ఆ సమయమున వెంటనే తగుచర్య తీసికొనకపోయియుండినను, పితూరిదారులకును, ప్రభుత్వ బలములకును జరిగిన మొదటిపోరులో అదృష్టవశమున ప్రభుత్వమునకు కలిగిన జయము చేకూరకుండినను, లేదా కొలది దినముల ఆలస్యము జరిగి యుండినను తీవ్రమైన పెద్ద తిరుగబాటు బయలుదేరియుండి దాని నణచుటకు మనకు ఉత్తర పరగణాలలోగల సైన్యములనెల్ల ఉపయోగింపవలసి వచ్చియుండును-మన యధికారము భగ్నమై యుండును. ఆ సమయమున ప్రభుత్వము వారికి వివిధజిల్లాల యధికారులకు జరిగిన ఉత్తరప్రత్యుత్తరములను నేను జూచియున్నాను. సహరాన్‌పూరునుండి వచ్చిన జాబులో నిట్లు వ్రాయబడినది. ’దోపిడిగాండ్ల గుంపొకటి ముందుగా లూటీ కొరకు బయలుదేరినది. వారికి కొంత జయము చేకూరగనే ఆగుంపులో నితర గ్రామస్థులు చేరిరి. మరికొన్ని దోపిళ్ళు జరిగినవి. అంతట కొలదిదినములలో వీరిసంఖ్య 1200 మందికి పెరిగినది. ఆ జిల్లాలలోని ప్రధానభూస్వామి వీరితో చేరినాడు. వీరిని తనకోటలోని కాహ్వానించి బహిరంగముగనే ప్రభుత్వమును ధిక్కరించినాడు. ఈ పితూరీదారులో నొకడు రాజబిరుదు దాల్చినాడు. ఆసమయమున ఆంగ్లేయ ప్రభుత్వసైన్యము వచ్చి తారసిల్లినది. ఇట్లు జరుగుట కింకొక దిన మాలస్యమైనను పితూరీలో మూడువేలమంది చేరియుందురు. అప్పటికే పితూరీలో చేరుటకొరకు ఏబదిమంది మొదలు మూడువందలమంది వరకుగల ముఠాలేర్పడి యుండెనని బయల్పడినది. మన సైన్యములకు మొదటి తాకిడిలో నపజయము కలిగియుండినచో యెంత బీభత్సము జరిగియుండెడిదో చెప్పశక్యముగాదు’. ఈపైన చెప్పిన సంగతులు ప్రభుత్వమువారు కాదనలేదు సరికదా, నిజమేయని ఒప్పుకున్నారు. ఈ కల్లోలమున శ్రమపడినవారిని మెచ్చుకున్నారు. ఇది గొప్పయదృష్టమే. ఏలన స్థానికోద్యోగులనవసరముగా తొందరపడినారనియు అవసరమైనదాని కన్న ఎక్కుడు తీవ్రమైన చర్యలు తీసికొన్నారనియు చెప్పుచుండుట ప్రభుత్వమువారికి అలవాటు. తిరుగుబాటు యొక్క లక్షణములలో నొకటి అనుమానమును పెంపొదించుట. ప్రభుత్వము యొక్క స్థితిగతులంత బాగుగలేవను పుకారు బయలుదేరెను.

ఓరిమిగల వంగదేశీయులకన్న శూరత్వముగల ఉత్తరపరిగణాలవారిలో మాత్రమే ఈ భావములున్నవనుకొనుట పొరపాటు. దిగువరాష్ట్రములలో గూడ తిరుగబాటు సూచనలు పొడసూపియే యున్నవి. వారన్ హేస్టింగ్సుకును కాశీరాజుకును తగవులు కలిగిన కాలమున ఒకమారు వారన్ హేస్టింగ్సు చనిపోయెనను పుకారు బయలుదేరెను. అంతట వంగరాష్ట్రములో అనేక జిల్లాలలో ముఖ్యముగా రాజషాయి, బీర్భూమ్ జిల్లాలలో కల్లోలములు బయలుదేరెను. రివిన్యూ వసూలు చాలారోజుల వరకును ఆగిపోయెను. ఆంగ్లేయోద్యోగుల యధికారము కొన్నాళ్ళు ఎందుకును పనికిరాకపోయెను (158-161).

ఆంగ్లేయులీ దేశప్రజలలో నేమాత్రపు పలుకుబడి కలరనునది దీనికి దగ్గర సంబంధము గల విషయము. బ్రిటీష్ ప్రభుత్వమువారు అవలంబించిన విధానమువలన ప్రజలపైన సివిలు ఉద్యోగులకు పలుకుబడి యుండుట కవకాశములు కనబడుటలేదు.

దేశములోని రాజుల యధికారమును ఆంగ్లేయులు తీసివేసిరి. వారి సంస్థానములు ఎస్టేటులు లాగికొని, వారికి మనువర్తులిచ్చి, మూలకూర్చుండబెట్టిరి. ఏ కార్యము చేయుటకు నుత్సాహము లేక ఏ సందర్భములోను పైకివచ్చుట కవకాశము లేకుండనున్నారు. పరువుప్రతిష్ఠలుగల భూస్వాముల పైన అత్యధికశిస్తులు విధించుటవలనను వారసులమధ్య పంపిణీవలనను వారు దారిద్ర్యమున బడిపోయినారు. విడదీసి పాలించుమను కుటిలరాజ్యనీతి పరిపూర్ణరూపము దాల్చినది. కొలదిమంది వర్తకులు అంగళ్ళవారు తప్ప ఉత్తర రాష్ట్రములలో ధనవంతులగు దేశీయులే కరవైరి. ఆంగ్లేయ ప్రభువులు వీరితో సంబంధము లేకుండ వేరుగానుందురు. అందువలన అమెరికాలోని నీగ్రోబానిసలకును వారి తెల్లయజమానికిగల సంబంధమే యిక్కడి దేశీయులకును ఆంగ్లేయప్రభువుల మధ్య ఏర్పడినది.

ఇట్టి స్థితిలో నాంగ్లేయులకీ ప్రజలలో నెట్టి పలుకుబడియుండును? భయము వల్ల నేర్పడిన భక్తియేగాని ప్రేమవలన నేర్పడిన విశ్వాసము లేదు. తమ అధికారమును సంపదను హరించి తమ్ము నాశనము చేసిన ఈ ఆంగ్ల ప్రభుత్వము నీ ప్రజలు ప్రేమింతురా? తమ గౌరవమును తీసివేసి అధోగతిలోనికి దింపినవారిని వీరు మన్నింతురా? ఇట్లు చెడినవారి బంధుగులు స్నేహితులు పరివారజనములు వీరిని జూచి జాలిపడి లోలోపల మనలను తిట్టకుందురా? పూర్వకాలమున నెన్నడును లేనంత హెచ్చుగా పన్నులు విధింపబడుచుండగా, జనసామాన్యముగూడ వీరందరితోపాటు మనలను జూచి ద్వేషించకుందురా? ప్రజలకు పరిపాలనము నందావంతయైన ప్రసక్తిలేకుండ జేయుటయేగాక జనులలో ఉన్న తరగతుల నీవిధముగా నాశనము చేసి, ఈ దేశమున బ్రిటిష్‌ పరిపాలనమును స్థాపించుటవలననిది తప్పనిసరియైనదని చెప్పజూతురు. కానీ ఆంగ్లేయులీదేశము నాక్రమించుటవలన నీయకృత్యములు చేయవలసినపని యెంతమాత్రమును లేదు. దేశములోని ఉన్నత తరగతులకును ముఖ్యముగా పెద్ద భూస్వాములకును వారికిదివరకుండిన అధికారములు సందర్భానుసారముగా కొంత మార్పుజేసియైన పరిపాలించుటలో వారి నుపయోగించుకొని యున్నచో మనము వారి ద్వేషమునకు పాత్రులము కాకుండ నుండుటయేగాక ఆపద సమయమున మనము వారి సహాయము యొక్క లాభమును పలుకుబడి యొక్క లాభమును వారి బందుగులు స్నేహితులు పరిజనుల తోడ్పాటును గూడ పొందియుందుము. భారతీయుని చేతిలో నెట్టి యధికారముగాని యుండుటను సహింపని ధోరణి పెచ్చుపెరిగి, యిట్టి విపరీతస్థితికి తెచ్చినది. ఒక రాష్ట్రము మనచేతులలో పడగనే ఈ దుఃఖపుస్థితి నెట్టి తారతమ్యము లేక అందరికిని దాపురించుచున్నది. మనకు సాయముచేసినవారు మనల నెదిరించినవారుగూడ మనవలన సమానాదరణమునే పొందుచున్నారు. దేశప్రజలందరు నీమాట చెప్పుకొనుట నేను స్వయముగా వినియున్నాను (162-163).

భారతదేశమున బ్రిటిష్‌ ప్రభుత్వముయొక్క స్థిరత్వమును గూర్చి కొన్నిమాటలు చెప్పెదను. ఆంగ్లపరిపాలన మీదేశమున కదల్చుటకు వీలులేనంత గట్టిగా స్థిరపడినదని చాలామంది యభిప్రాయము. మన యధికారముపట్ల తిరుగుబాటు కలిగిన కలుగవచ్చునుగాని, అది చాలా దూరపు సంగతియని తలచి ఆ సంగతినే ఆలోచింపరు. దేశీయ ప్రభుత్వములలో నైకమత్యము లేకపోవుటవలనను తగిన బలముగల పరరాజ్య ప్రభుత్వములు లేకపోవుట వలనను మనకేభయమునులేదని యనుచుందురుగాని, కొందరు మాత్రమింకొక విధముగా తలచుచున్నారు. సమర్ధులైన గ్రంథకర్తలు చాలమంది అట్టిపరిస్థితి త్వరలోనే కలుగవచ్చనియు అభిప్రాయపడియున్నారు*. మన సామ్రాజ్యము ఒక గొప్పవరదలో మేటవేసిన ఇసుకతిప్పవలె నేర్పడినది. స్వతస్సిద్ధముగా దీనిలో స్థిరత్వము లేదు. దీనిని స్థిరపరచుటకు వలసిన పనులును మనము చేయలేదు. మనము దీని చుట్టు గట్లు వేయలేదు. గొప్పవేళ్ళు పారి గట్టిచేయగల వృక్షములు నాటలేదు. ఈ సామ్రాజ్యమువైపునకు దృష్టి మరల్చినవారందరును కేవలము దీని నుండి ఎంత బంగారము తవ్వి ఎత్తుకొనిపోవ వీలుగలదా యనిమాత్రమే ఆలోచించినారు. క్రొత్త ఇసుక ప్రోగులు పోసి, మరమ్మతు చేయుటకప్పుడప్పుడు కొందరుద్యోగులను నియమించిరి. ఇది తాత్కాలికముగా కొంత ఉపయోగించినను, ఈ మహానిర్మాణము దాని యొక్క బరువుకే అది కృంగిపోవునట్లున్నది. లేదా, మరియొక మహాప్రవాహ సమయమున కోసుకుపోవునట్లున్నది. హాలెండు దేశములో సముద్రములోనికి కట్టిన ’డైకు’లను గట్టి అడ్డుకట్టలలో నొకటి ఒక యెలుక కన్నమువలన పాడై కొట్టుకొనిపోయినది. ఈ దేశమునకు వాటిల్లగల ముప్పు దేశీయరాజుల గూడుపుఠాణీవలనగాని ముందుగా ఆలోచించి చేయు తిరుగుబాటువలన గాని కలుగునని నేను తలంపను. మనమెవ్వరము అనుకొనని సమయమున నది తటస్థించును. ఏదో యొక చిన్న కలవరములో నది యుద్భవించును. తమ్ము అణచుటకు పంపబడిన చిన్న సైన్యమును పితూరీదారులోడించిన అదృష్టములలో నది యుద్భవించును. అంతట అంటుకొనిన అడవివలె భావములు చెలరేగి, ఆర్పుటకు వీలులేనట్లుగా దేశములో నంతటను వ్యాపించును (165-166).

(*1833లో షోరుగారు చెప్పిన జోస్యము త్వరలోనే ఫలించినది. 1857లో భారత స్వాతంత్ర్యసమరము జరిగినది.)

బ్రిటిష్ పరిపాలనము శ్రేష్టమైనదను సంగతియు దానివలన ప్రజలు పొందుచున్నారను లాభములను మనము గోడలపైన చిత్రించు స్వకపోలకల్పితపు సంగతులేగాని, వేరుకావు. ప్రజలు ఘోషించుచున్న బాధలను అన్యాయములను మాన్పగలవారు ముందుగనే ఈ హెచ్చరికను గమనింపవలెను. ఈ దేశాక్రమణమును జేయుటలో నేయన్యాయములున్నను దీనినిప్పుడు మన చేతులలో నుంచుకొనుటలో మాత్రము పరమార్థము నాలోచించవలెను. ప్రజల యభీష్టములకు వ్యతిరేకముగా సైనిక బలముచేతగాక, ప్రజానురంజకముగా వారి భక్తి విశ్వాసములను పొందుట మూలముననే మనము వారి నేలవలెనని 1838లోనే షోరుగారు వ్రాసియున్నారు.

(సశేషం)