- కొంతమంది ఉన్నారీ లోకంలో.
దేవుడనే వాడే లేడంటారు. ఆధారాలు లేవంటారు. ఉంటే చూపించు అని రెట్టిస్తారు. నమ్మకాలన్నీ వఠ్ఠి మూఢ నమ్మకాలని, విజ్ఙాన శాస్త్రాల పేజీల్ని గబగబా తిప్పి అందులోని వాక్యాల కింద గీత గీసి చూపిస్తారు.
ఇన్నేసి మతాలు, ఆచారాలూ పాటించే కోట్లమంది నమ్మకాలను నిరంతరం ప్రశ్నిస్తూనూ, ఎదిరిస్తూనూ, వాటితో పోరాడుతూనూ నిబ్బరంగా సాగుతూంటారు ఈ చిన్ని గుంపులోని మనుషులు. మత మౌఢ్యం పెద్ద పులి. వేటాడుతుంది వీరిని. తల ఎత్తి ప్రశ్నిస్తున్న ఆ మెడ కొరికి చంపేస్తుంది చాలామాట్లు. అయినా ఈ భూమి మీద చిరు మొలకల్లా మళ్ళీ, మళ్ళీ పుట్టుకొస్తారు వీళ్ళు.
వారిలోని ధీశక్తివి నువ్వు. ఉన్నావో,లేవో – ఆ పరమ సత్యానివి నువ్వు. ఆ సత్యాన్ని చేరనివ్వు. నువ్వే నేనవ్వు.
- ఇక్కడ ప్రతి రాజ్యంలోనూ,ప్రతి కాలంలోనూ పిడికెడు మనుషులు పుడుతూ ఉంటారు. వాళ్ళు మనుషుల హక్కులను రాజ్యం లాక్కుని హింస పెడుతూంటే, అడ్డు పడి, వాళ్ళకు ఏ సంబంధమూ లేకపోయినా కాపాడబోతారు. మహా బలవంతమైన ఆ రాజ్య నియంతృత్వాన్ని ప్రశ్నిస్తారు, తమ సౌఖ్యాలను,ప్రాణాలను సైతం లెక్క చేయక మీదకు నడిచి వస్తున్న ఆ మహాకాయుని పైకి మడమ తిప్పని సాహసంతో తమ చిరు ఖడ్గాలని విసురుతారు. ఈ ప్రయత్నంలో తరచుగా ఉక్కుపాదాల కింద పడి నలిగిపోతారు.
ఆ పిడికెడు మనుషుల్లో ఆకాశాన్ని దాటుకుపోయే ఆత్మ బలానివి నువ్వు. నువ్వే నేనవ్వు.
- ఆధ్యాత్మిక లోకంలో ఆజానుబాహువులుగా పెరుగుతారు కొందరు. యోగం, ధ్యానమే ధ్యాసగా కొండాకోనల్లో ఒంటరిగా సంచరించే నిరాడంబర వీరులు వీళ్ళు.అందరికీ కావాల్సిన ఇళ్ళు, కార్లు, అయిదు నక్షత్రాల భోజనశాలల్లో పంచ భక్ష్య పరమాన్నాలు, మట్టి వీరికి. తోసిపారేస్తారు వాటన్నింటినీ. గాలిలో గాలిగా, ధూళిలో ధూళిగా లోకమంతా తిరుగుతూ తమలో తాముగా వెలుగుతూ ఉంటారు వీళ్ళు.
ఆ మహా యోగ శక్తివి నువ్వు. నువ్వే నేనవ్వు.
- పరిశీలనే ఈ మనుషుల ప్రాణం. ఆవిష్కరణే గమ్యం వీరికి. ఓ ప్రశ్నకి సమాధానాన్ని శోధిస్తూ ఆ శోధనకే జీవితాలను కరిగించి అచ్చు పోస్తారు వీళ్ళు. నిరంతర చిరంతన చింతనాపరులు, లోకోపకారులు వీళ్ళు.
తుదీ మొదలూ లేని ఆ జిజ్ఞాసవి నువ్వు. నువ్వే నేనవ్వు.
- చిన్నప్పుడు సినిమాకి వెళ్తేనో, ఇంటికి తాళం పెట్టి ఏ ఊరైనా వెళితే దొంగలు ఎవరైనా వచ్చి మా ఇల్లంతా దోచేసుకుంటారేమోనని ఎంత భయం వేసేదో. అప్పుడు ఓ యాభై అడుగుల ఆంజనేయ స్వామి మా ఇంటి ముందు నిలబడి కాపలా కాస్తున్నట్టు ఊహించుకునేదాన్ని. అప్పుడు భయం పోయేది. ఈ లోకంలో క్షణక్షణం ఎన్నెన్ని భయాలో తెలుసా? లెక్కపెట్టలేనన్ని.
నిర్భీతివి నువ్వు. నిబ్బరాన్నివ్వు. నువ్వే నేనవ్వు.
- ఈ ప్రపంచంలో ఇంత విషాదాన్ని, బాధని, ఏడుపులని, ఆకలిని, పేదరికాన్ని పెట్టావే? పవళింపు సేవల్లోను, భక్తుల కోరికల చిట్టాలు పరిశీలించడం లోనూ మునిగిపోయావూ? ఇవ్వన్నీ లేకుండా చేస్తామని, ఈ లోకాన్ని బాగు చేసి ఘుఘుమలాడే పూల వనాలు గాను, సంతోషాల పిట్టలు వాలే తోపు గానూ మారుస్తామని బయలుదేరుతారు కొందరు.
వారిలో కరుణవి,దయవి,హృదయ స్పందనవి నువ్వు. నువ్వే నేనవ్వు.
- నువ్వే నేనైనప్పుడు ఇంక పూజలెందుకు? ప్రార్ధనలెందుకు? నువ్వే నేనని నేను మర్చిపోయి అయోమయపు అగాధాల్లో పడ్డప్పుడు మళ్ళీ వస్తాను నీ దగ్గరకు. అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావో, అక్కడే చాప వేసుకుని నిద్ర పో. నిన్ను గుర్తు చేసుకునేటట్టు, పరుగున మళ్ళీ నిన్ను చేరేటట్టూ నువ్వే చెయ్యి.
అప్పుడిక నువ్వే నేనవ్వు.