వెంకట సత్య స్టాలిన్

హెచ్చరిక!

అయ్యా/అమ్మా! ఈ గ్రంథమునందు మీ జ్ఞానమును పెంచి, మీ మెదడును వ్యాకోచింపజేయు మహత్తర విషయములేవియును లేవు. మీకు ఆయురారోగ్య అష్టయిశ్వర్యములను కలుగజేయు ఇంగ్రాడియెంట్సేవియును ఇందు కానరావు. ఇది కేవల నిర్మలానందప్రదాయిని. మీరు హాయిగా, సంతోషముగానున్న సమయమున ఇందొక పది పేజీలు చదివిన, ఆ యానందము మూడింతలై మిమ్ము సుఖపెట్టును. మీ హృదయములో బాధ గూడుకట్టుకొన్నప్పుడు ఈ పుస్తకము తెరచి ఒక్క ఐదు పేజీలు చదవగనే, మీ శరీరములో కలుగు యా పులకరింతల వేడిమికి ఆ బాధ కరిగి ద్రవమై ఆపై యావిరి రూపమున బయటకు వెళ్ళి మీకు గాలిలో తేలియాడుచున్న యనుభూతి కలుగును. కోవిడ్-19 ప్రత్యేక వైద్యశాలలయందు దీనిని చదివించిన, రోగులకు శీఘ్ర ఉపశమనము కలుగునని ప్రయోగముల ద్వారా నిరూపితమైన సత్యము. ఇక సాగండి.

తెలుగు సాహిత్యం మొత్తంలో విశిష్ట హాస్యరచయిత స్థానాలు కేటాయిస్తే అందులో మొదటి మూడు స్థానాలు శ్రీరమణగారివే. ఏ సందేహమూ లేదు. ముళ్ళపూడి వేంకటరమణ నీడలోనే ఉండినా ఎప్పుడో ముళ్ళపూడిని దాటేశాడీ శ్రీరమణ. అది హ్యూమరా, పేరడీనా, సెటైరా… ఏదైనా కానివ్వండి నాలుక్కాలాలు ఒకటికి పదిమార్లు చదువుకోవడానికి, చదువుకున్న ప్రతిసారీ హాయిగా నిండుగా నవ్వుకోవడానికీ పనికివచ్చే రచనలు శ్రీరమణవి. అయితే వీరికి రావలసినంత పాపులారిటీ రాలేదనే నా ఉద్దేశం. ఇప్పటికీ, మిథునం సినిమాగా వచ్చాక కూడా, వెంకటరమణ, శ్రీరమణ ఒక్కరే అని భావించే పాఠకులు గణనీయంగానే ఉన్నారు.

అయితే, ఇంత సత్తా కలిగిన వీరు ఇప్పటిదాకా ప్రచురించిన పుస్తకాల సంఖ్య సరిగా 12 మాత్రమే. ఈ వెంకట సత్య స్టాలిన్ పదమూడవది. తాటికాయంత తలకాయలో వేపకాయంత గుజ్జుకూడా లేని రచయితలు పుంఖానుపుంఖంగా సంవత్సరానికి నాలుగైదు పుస్తకాలు రాసి ప్రచురించి పారేస్తుంటే తమ యాభై సంవత్సరాల సాహిత్యవ్యాసంగంలో, ఇంతశక్తి ఉండీ ప్రచురించింది పదమూడు పుస్తకాలే అంటే ఆశ్చర్యం కదూ! అయితే రాశి తక్కువైనా వాసిలో వారు ఉన్నత శిఖరాలని ఎప్పుడో చేరారు. వారి మిథునం కథను, అదేమీ చిన్నకథ కాదండీ-నలభై పేజీల కథ, బాపూగారు ఒక రాత్రంతా స్వదస్తూరీతో వ్రాసి శ్రీరమణకు అభినందనగా ఇవ్వడం, బాపూగారే ఆ వ్రాతప్రతిని అమెరికాలో జంపాల చౌదరిగారికి పంపడం, వారు దాన్ని నెట్‌లో ఉంచడం సామాన్య విషయాలు కాదు. మహర్షి లాంటి బాపూ తమ కథకు బొమ్మ వేయడమే మహా భాగ్యంగా భావిస్తారు రచయితలంతా. అలాంటిది ఒక కథనంతా స్వదస్తూరీతో వ్రాశారంటే అది వారి మనసుకెంతగా హత్తుకుపోయుండాలి! పుస్తకాలను చక్కగా మార్కెటింగ్ చేసుకుని ఎన్నిలక్షలైనా సంపాదించవచ్చుగానీ ఇంతటి గౌరవం దక్కుతుందా! ఒక మిత్రుడిద్వారా నేను విన్న విషయం… అంతో ఇంతో సాహిత్యవాసన కలిగిన ప్రతి ప్రవాసాంధ్రుడి ఇంట్లోనూ కచ్చితంగా కనిపించే పుస్తకాల్లో మిథునం ఒకటి అని.

గొప్పలు చెప్పుకోవడం, ఎవరి అనుభవాలనో విని పేటెంట్ కొట్టేయడం, నేమ్ డ్రాపింగ్… ఇలాంటి లక్షణాలుండే వ్యక్తులు మనకు తరచూ తగుల్తూనే ఉంటారు. ఒప్పుకోడానికి మనసొప్పదు గానీ మనలోనూ ఆ లక్షణాలు లవమో, లేశమో ఉండనే ఉంటాయి. అయితే ఇలాంటి లక్షణాలన్నింటికీ పరాకాష్ఠ, ఎవరెస్ట్ శిఖరం అనదగ్గ కేరెక్టర్ మన వెంకట సత్య స్టాలిన్. ఈ పాత్రను పిట్టలదొర పాత్రతో పోల్చారు శ్రీరమణ. ఇది శ్రీరమణకు మాత్రమే సాధ్యమైన సృష్టి. శ్రీరమణకు మాత్రమే సాధ్యమైన శైలి. శ్రీరమణకు మాత్రమే సాధ్యమైన సున్నిత హాస్యం. శ్రీరమణకు మాత్రమే సాధ్యమైన చమత్కారాలు, విరుపులు. ఈ వెంకట సత్య స్టాలిన్ కాలాతీత వ్యక్తి. భాషాతీత వ్యక్తి. దేశాతీత వ్యక్తి. ప్రపంచం మొత్తంలో అతను కాలుమోపని ప్రదేశం లేదు. శ్రీరమణ ఊహ, కల్పనల పరిధి విస్తృతిని అంచనా వేయగలమా! ఆ కల్పనకు అతనిచ్చే భాషారూపం సమకాలీనుల్లో మరెవరికైనా సాధ్యమా! ఇవి నవ్యలో ప్రచురించడం మొదలయ్యాక, ఆ రోజుల్లో పిల్ల వసుచరిత్రలు పుట్టినట్లుగా, డజన్లకొద్దీ పిల్ల స్టాలిన్లు పురుడుపోసుకున్నారు. కానీ పర్వత సదృశుడైన మన శ్రీరమణ స్టాలిన్ ప్రాభవంలో నిలవలేకపోయారు.

స్టాలిన్ వయసెంతో తెలియదు. వారన్ హేస్టింగ్స్ ఇండియా గవర్నర్ జనరల్‌గా ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా ‘టేక్ ది కామెంట్స్ ఆఫ్ అవర్ స్టాలిన్’ అనేవారట. పాపం. వారన్ హేస్టింగ్స్ ఇండియా గవర్నర్ జనరల్‌గా ఉండిన కాలం 1772-85. పి.వి. నరసింహారావుగారు ప్రధానిపదవి స్వీకరించాలా, తిరస్కరించాలా అని సంశయంతో ఊగిసలాడుతున్నపుడు మన స్టాలిన్ ‘అవకాశం వచ్చింది మీకు కాదు, దేశానికి’ అని చెప్పాకే పి.వి. ఆ పదవిని స్వీకరించారు. అది 1991. ఈ రెండు సంఘటనల మధ్య కాలం 220 సంవత్సరాలు. అవతల ఒక యాభై వేసుకున్నా మనకు దర్శనమిస్తున్న ఈ స్టాలిన్ జీవిత కాలం రమారమి 270 సంవత్సరాలు.

స్టాలిన్‌కు తెలియని భాష లేదు. బంకించంద్ర చటర్జీ వందేమాతరం గీతాన్ని స్టాలిన్‌కు చూపిన తర్వాతే, అతను సూచించిన మార్పులు చేసి మరీ ప్రచురించారు. అరవింద ఘోష్‌కు సావిత్రి సత్యవంతుల ఇతివృత్తం కావ్యంగా వ్రాయమని సలహా ఇచ్చింది మన స్టాలినే. వ్రాతప్రతిని చదివి మార్జిన్లో స్టాలిన్ చేసిన సూచనల ప్రకారం అరబిందో ఆ కావ్యంలో మార్పులు చేశారు. బెంగాలీ భాషలో ఎనిమిది రకాల మాండలికాలు స్టాలిన్‌కు కరతలామలకమట. తన సాహిత్యాన్ని తెలుగువారంతగా ఆదరించడానికి కారణం స్టాలినే అని శరచ్చంద్ర తరచూ అనేవారు. అది మాత్రం ‘చాలా ఇబ్బందిగా’ ఉండేదట మన స్టాలిన్‌కు. తను వ్రాస్తున్న బాలవ్యాకరణంలో ఏవో కొన్ని సందేహాలను చీటీపై వ్రాసి మనిషితో పంపాడు పరవస్తు చిన్నయసూరి. ఒకచేత్తో పులిహోర కలుపుతూనే ఆ సందేహాలను యథాలాపంగా నివృత్తి చేశాడు స్టాలిన్. కాశీమహారాజావారి అరుగు మీద కూర్చుని మదన్ మోహన్ మాలవ్యాతో సంస్కృతంలో చర్చిస్తే ఇతను వాడిన ప్రాకృత పదాలు మాలవ్యాకు అర్థం కాలేదట. రాజాజీ తన రామాయణ రచనగూర్చి మెరీనా బీచ్‌లో కూర్చుని స్టాలిన్‌తో చర్చించేవారు. సరోజినీ దేవి తన కవితా సంపుటి గోల్డెన్ త్రెషోల్డ్‌కు అబిప్రాయం వ్రాయమని స్టాలిన్‌ను కోరిందట. తీరా ఆ అభిప్రాయం ‘అసలు కవితల్నే మింగేసేట్లు’ ఉండడంతో ప్రచురించలేదట. రవీంద్రుడు నోబుల్ బహుమతి వచ్చాక స్వీడన్ నుంచి గీతాంజలి ప్రతులను వి. ఎస్. స్టాలిన్, ఇండియా అని వ్రాసి పార్సల్ చేస్తే చీరాలలో ఉన్న స్టాలిన్‌కు అందిందట.

అతను నేర్వని శాస్త్రం లేదు. ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మిని కుంజమ్మాళ్ అనే పిలిచేవాడు. సుబ్బులక్ష్మి అమ్మ, అమ్మమ్మలు సంగీతంలో తమ సందేహాలను స్టాలిన్‌ను అడిగి నివృత్తి చేసుకునేవారు. భీమ్‌సేన్ జోషి, హరి చౌరాసియాలతో సంగీత చర్చలు జరిపేవాడు స్టాలిన్. చౌరాసియాను హరీ అనే పిలిచేవాడు. రాజ్యాంగ నిర్మాణంలో బాబా సాహెబ్ అంబేద్కర్‌కు సూచనలు ఇచ్చాడు. మన భారతీయ ఇతిహాసాలలోని యుద్ధతంత్రాలను నేటి కాలానికి ఆచరణసాధ్యంగా మలచి వ్యూహరచన చేయమని జనరల్ కరియప్ప స్టాలిన్‌ను కోరాడు. గగనతలంలో ఈథర్ అనే పొర గురించి పరిశోధనలో జగదీష్ చంద్రబోస్‌కు స్టాలిన్ సహకరించాడు. 1879లో సాలార్ జంగ్ చెంగిజ్ ఖాన్‌కు చెందినదిగా చెప్పబడుతున్న ఒక పురాతన గుర్రపు నాడా అమ్మకానికి రాగా అది అసలేనా, నకిలీయా అని తెలుసుకోవడానికి సలహా కొరకు స్టాలిన‌ను సంప్రదించాడట. స్టాలిన్ చెంగిజ్ ఖాన్ గుర్రపు నాడా సైజు ఇది కాదని తేల్చేశాడు. జెనీవాలో స్టాలిన్ ప్రసంగిస్తున్నాడని తెలిసి, జనాలు బండ్లు కట్టుకుని వచ్చి, అన్నాలు వండుకుతింటూ ఎదురుచూశారు. ఆ సభలో స్టాలిన్ అందర్నీ కళ్ళు మూసుకోమని, వయొలిన్ మీద సప్తస్వరాలను ఒక్కొక్కదాన్నే పట్టుకుని స్వరప్రస్తారం చేస్తుంటే వాళ్ళకు ఏడురంగులూ కనిపించాయి. ఆ వయొలిన్‌ను జెనీవా సెంట్రల్ మ్యూజియంలో అద్దాలపెట్టెలో భద్రపరచారు. అక్షాంశరేఖాంశాలను చూచుకుని భూమిలోపల ‘పన్నెండువేలు కాదుగానీ, పదకొండువేల అడుగులవరకూ’ ఏమున్నాయో పసిగట్టి, చూసినట్లు చెప్పగలడు స్టాలిన్. ఐన్‌స్టయిన్ e=mc2 సూత్రాన్ని భారతీయ వేదవిజ్ఞానంతో సమన్వయపరచింది స్టాలినేట. అందుకని అతనికి దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని జమ్‌షెడ్‌జీ టాటా సూచించాడు. అయితే స్టాలిన్ ఎప్పుడూ తనకు పేరును కాని, బిరుదులు గానీ కోరుకోడు గనుక ఆయన్ను బిరుదులకు ఒప్పించడం అసాధ్యం అన్నారట కె. ఎం. మున్షీ.

స్టాలిన్ పరిష్కరించలేని సమస్య లేదు. సబర్మతి ఆశ్రమంలో జిన్నాతో సంప్రదింపులు అనగానే స్టాలిన్ పేరు మొదట వినిపించేది. ఎడ్వర్డ్ చక్రవర్తి పట్టాభిషేకం సండర్భంగా సత్కరించ అర్హులైన భారతీయుల పేర్లు చెప్పమని బ్రిటీష్ మహారాణి స్టాలిన్‌ను కోరింది. అయితే స్టాలిన్ పెట్టిన షరతు ‘ఎట్టి పరిస్థితుల్లోనూ తనపేరు అందులో ఉండగూడదని’. బ్రిటన్ నుంచి సరకులు, వంటవారితో వస్తున్న ఓడ రాక ఆలస్యమైంది. 12000 మంది అతిథులకు విందు. పరువు పొయ్యేలా ఉంది. వైస్‌రాయ్‌కి దిక్కుతోచక స్టాలిన్‌ను హుటాహుటిన రప్పించాడు. అలెగ్జాండ్రియా ఓడ డెక్‌పై అంతమందికి లడ్డూ, పులిహోరతో సహా విందుభోజనం సిద్ధం చేశాడు స్టాలిన్. అలహాబాద్ హైకోర్టులో ఒక క్లిష్టమైన కేసు. డిఫెన్స్ లాయరు మోతీలల్ నెహ్రూ. కేసు ఎలా నడపాలో అంతుచిక్కక స్టాలిన్‌ను పిలిపించాడు మోతీలాల్. స్టాలిన్ ఐదు నిమిషాల్లో చిక్కు విడగొట్టి ‘ఉండచుట్టేశాడు’. యూరీ గగారిన్ అంతరిక్ష యాత్రకు ముందు, అతనికి మనో నిబ్బరం కలిగించడానికి స్టాలిన్‌ను రష్యాకు పిలిపించారట. టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ అధిరోహణ మొదలుపెట్టే సమయానికి అక్కడే ఉన్న స్టాలిన్ నార్కేకు పర్వతారోహణలో మెలకువలు, తీసుకోవలసిన జాగ్రత్త్తల గురించి చెప్పాడు. ఫ్రాంక్‌ఫర్ట్ యూనివర్సిటిలో జరిగిన అణుశాస్త్ర సమావేశంలో న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలెక్ట్రాన్లు త్రిమూర్తులకు ప్రతీక అని ప్రతిపాదిస్తూ తూర్పు జర్మనీ భాషలో గంటా పన్నెండు నిమిషాలు అనర్గళంగా ప్రసంగించాడు. నిజాం తన రాజ్యాన్ని భారతదేశంలో కలిపేట్లు నచ్చచెప్పవలసిందిగా సర్దార్ పటేల్ స్టాలిన్‌ను అభ్యర్థించాడు. కానీ ఇవన్నీ బయటకు చెప్పుకోవడం స్టాలిన్‌కు ఇష్టం ఉండదు.

ఇవండీ స్టాలిన్ విశ్వరూపానికి కొన్ని మచ్చుతునకలు. ఇంత వ్రాసినా, కొండను అద్దంలో చూపడమే. ఈ పుస్తకాన్ని, అదీ ఒక్కసారి కాదు, మూణ్ణాలుగుమార్లు చదివితే, అప్పుడు మీకు స్టాలిన్ విశ్వరూపం అవగతమౌతుంది. 15 సంవత్సరాలుగా సమాధిలో ఉన్న ఈ వెంకట సత్య స్టాలిన్‍ను, బయటకు తీసి, మళ్ళీ జవజీవాలనిచ్చి, ఇలా మన ముందు నిలిపిన యువకుడు శ్రీ మోదుగుల రవికృష్ణ ఎంతో అభినందనీయుడు. వయసు 50 దగ్గరలో లేకున్నా, అతని ఆధ్వర్యంలో, సంపాదకత్వంలో ఇప్పటికే 50 పైగా గ్రంథాలు వెలుగులోకి వచ్చాయి. అన్నీ ఆణిముత్యాలే. ఒక నిశ్శబ్ద సాహితీ కృషీవలుడు.