‘ఛాయ్! ఛాయ్!’ ఆ కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చాడు టీ అమ్మే కుర్రాడు.
ఆమెకి ఎప్పుడూ లేనిది వేడిగా ఏమైనా తాగాలన్పించింది.
ఎదురుగా నలుగురు కుర్రాళ్ళు. పైన బెర్తు మీద వూరికే ఎక్కికూచుని మరో ఇద్దరూ… ‘కోతి మూక! పక్క కంపార్ట్‌మెంట్ నుంచి వొచ్చి మరీ ఇక్కడే తిష్ట వేశారు వెధవలు! తెలిసిన మొహాలే. కాలేజీలో చదూకునేప్పుడు జూనియర్లు.’
దొంగ చూపులు. ఏవో పిచ్చి కామెంట్లు. వెకిలి నవ్వులు… ఏవిట్రా, వంటరి ప్రయాణం? ఏంటో, చాలా రోజులుగా కన్పించడంలేదు. ఇక్కడ వుండడంలేదా?
ఆమె తలెత్తి ఛాయ్‌వాలా కోసం చూసింది.
ఆమెది అందమైన మొహం! పెద్ద కళ్ళు. చిన్న నోరు. వొత్తైన నొక్కుల జుత్తు. కేపచీనో రంగులో మెరిసే ఆమె వొంటి మీద స్టీల్ బ్లూ శారీ. లైటు వెలుగులో నీళ్ళలా కదుల్తో… పక్కనే సీట్‌పై పరిచిన చిన్న క్విల్ట్‌మీద నిద్రపోతో నెలల పిల్లాడు.
‘ఛాయ్!’ అంటో దగ్గర్లోనే విన్పిస్తోంది.
పిలవాలా… వొద్దా… పిలవాలా… వొద్దా… పర్స్ తియ్యాలి. వెతకాలి. డబ్బులివ్వాలి. చిల్లర తీసుకోవాలి. టీ గ్లాసు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈలోపల పిల్లాడు లేస్తే…
మళ్ళీ ఈ మూక ముందు టీ తాగడం! అదో గొప్ప సర్కస్ ఫీట్! పోనీలే. లెట్ ఇట్ గో అనేసుకునేంతలో…
“హలో! ఎక్కడికి ప్రయాణం?” కార్నర్ సీట్లోంచి పలకరింపు. తల తిప్పి చూసిందామె. ‘అరె! ఇతను… తెలిసినవాడే. ఈ కోతిమూక టెన్షన్‌లో పడి చూడనేలేదు!
కాలేజిలో కెమిస్ట్రీ లెక్చరర్ తమ్ముడు. తనకంటే వో ఏడాది సీనియర్. పక్క వీధే. తన కొలీగ్ ఇంటి ఎదురింట్లో వుండేవాళ్ళు! పెద్దగొప్ప పరిచయం కాదు… కానీ.
గొప్ప రిలీఫ్‌గా అన్పించింది. ఆమె ఎక్కడికో చెప్పింది. అతనూ అక్కడికే.
“టీ తాగుతారా?!” సమాధానం కోసం ఆగకుండా టీ కుర్రాణ్ణి ఆపాడతను. “రెండు టీ ఇవ్వమ్మా.”
అతను వాలెట్ తీశాడు. ఆమె కూడా అదే సమయంలో తన పర్స్ మీద చెయ్యి వేసింది. అతను ఇబ్బందిగా మొహం పెట్టి, వొద్దన్నట్టు చూశాడు. ఆమె సరే అన్నట్టు నవ్వి వూరుకుంది. కోతి పిల్లలు గుసగుసగా కిచకిచలాడాయ్.
అతను టీ గ్లాసులు రెండూ తనే తీసుకున్నాడు. “కొంచం చల్లారాక ఇద్దామని… మరీ వేడిగా వుంది.” ఆమె ‘నిజవేఁ’ అన్నట్టు చిన్నగా తల వూపింది.
“వొక పని చేద్దాం…” ఏవిటన్నట్టు చూసిందామె.
“నేను మీ సీట్‌లో బాబు పక్కన కూర్చుంటా. మీరు ఇక్కడ నా సీట్‌లో కూర్చుని టీ తాగి కొంచం రిలాక్స్ అవ్వండి.” అతను జవాబు కోసం చూడకుండా లేచి, తన దగ్గరున్న హేండ్ టవల్‌తో సీట్ శుభ్రంగా తుడిచాడు.
ఆమె వెళ్ళి ఆ కార్నర్ సీట్లో కూర్చుంది. ఆ క్షణం ఆ సీట్ ఆమెకి ఏదో గొప్ప ప్రత్యేకంగా అన్పించింది. ఆతను ఆమె ప్లేస్‌లోకి మారాడు. ఎదురుగా కూర్చున్న కుర్రాళ్ళకి ఇతను విలన్‌లా కనిపించాడు. అప్పుడే ఆమె అతన్ని కొంచెం పరికించి చూసింది.
గంధం రంగు. కొంచెం బ్రవున్ ఐస్. గోధుమ రంగు లాల్చి, చేతికో వాచ్… చాలా మర్యాదగా కన్పించాడు ఆమె కళ్ళకి.
వీళ్ళిద్దరూ కాస్సేపు వాళ్ళకి కామన్‌గా తెలిసినవాళ్ళ గురించి కబుర్లు చెప్పుకున్నారు, టీ తాగుతో.
కుర్రాళ్ళకి సడెన్‌గా సిట్యుయేషన్‌లో వచ్చిన మార్పుకి కోపం వచ్చి వేరే ప్లేసెస్‌కి వలసెళ్ళిపోయారు.
“గుడ్ రిడెన్స్! మీరు కాస్సేపు రెస్ట్ తీసుకోండి. నేను మెలకువగానే వుంటాను. నాకు ట్రావెల్‌లో నిద్ర పట్టదు…” అంటో అతను లేచి తన సీట్లోకి మారిపోయాడు ఏదో పుస్తకం పట్టుకొని. ఆమె కూడా లేచి పిల్లాడికి పాలు పట్టించి, ఇతనికి గుడ్‌నైట్ చెప్పి నిద్రలోకి జారిపోయింది ఇతను మెలకువగా వున్నాడన్న ధైర్యంతో.
తెల్లవారింది.
వాళ్ళు దిగాల్సిన స్టేషన్ దగ్గరకొచ్చింది. ఆమెకి కంగారు మొదలైంది.
ఇదే మొదలు. పిల్లాడు పుట్టాక వొంటరిగా ప్రయాణించడం! పెద్ధ ఝాన్సీరాణీలా ఫీలయిపోయి, వొక్కతే వెళ్ళగలనని బయల్దేరింది. ఇప్పుడు తెలుస్తోంది ఎంత కష్టవోఁ, ఎంత స్ట్రెస్సో! ఛ! మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి బ్యాడ్ డెసిషన్ తీసుకోకూడదు… లోపల్లోపల తిట్టుకుంటూ సీటు క్రింద నించి బ్యాగ్ బయటికి లాగింది. పిల్లాడి సామాన్లు అన్నీ సైడ్ పాకెట్‌లో సర్దేసింది. బ్యాగ్ సీట్ కిందనించి తీసి పక్కనే పెట్టుకుంది. భుజానికి హ్యాండ్‌బాగ్ తగిలించుకుంది. ఇంతలో స్టేషన్ వచ్చేసింది.
ఈ హడావుడి అంతా చూస్తూన్న అతను లేచి “మీరు బాబుని ఎత్తుకుని దిగండి చాలు, నేను మీ బ్యాగు దించుతా. నాకేం సామాను లేదు! జస్ట్ టేకిట్ ఈజీ.” అంటో ఆమె బ్యాగు అందుకున్నాడు.
హమ్మయ్య! అనుకుని రిలీఫ్‌గా వూపిరి తీసుకుని, పిల్లాణ్ణి ఎత్తుకుని లేచిందామె. ఆమెకి ముందుగా నడచి, అతను దిగి, బ్యాగు క్రింద పెట్టి, ఆమె చేతిలోంచి పిల్లాడిని అందుకున్నాడు. ఆమె మెల్లగా మెట్లు దిగి, బాబుని తీసుకుంది.
“చాలా చాలా థాంక్స్!” ఆమె గొంతులో కృతజ్ఞత!
“భలేవారే! ఏం బరువులు మోశానని!” స్నేహంగా చిన్న నవ్వు.
అంతలో… “వొక్కదానివే చాలా ధైర్యంగా వచ్చేశావ్!” ఆమెని పికప్ చేసుకోడానికి వచ్చిన ఆమె భర్త, మెచ్చుకుంటో… భర్తని చూడగానే ఆమె కళ్ళలో మెరుపు! సంతోషం!
“మావూరివాళ్ళే! ఈయన వుండబట్టి ప్రయాణం ఈజీ ఐంది.” పరిచయం చేస్తోంటే మళ్ళీ కృతజ్ఞత ధ్వనించింది ఆమె గొంతులో!
“మరీ ఎక్కువ చెబుతున్నారు.” చిన్నగా నవ్వి “మరి వుంటాను” అని సెలవు తీసుకున్నాడు అతను.
“మంచిది. మేం కూడా వుంటాం మరి.” చేతులు వూపి వీళ్ళదారిన వీళ్ళు వెళ్ళిపోయారు.
అంతే… కథ.
వాళ్ళిద్దరూ మళ్ళీ జీవితంలో ఒకరికొకరు తారసపడలేదు.
కానీ అదేవిటో… ఆమె ఎప్పుడు ట్రైన్ ప్రయాణం చేస్తున్నా ఆ కార్నర్ సీట్లో అతను వేడి వేడి ఛాయ్‌తో ఆమెని కలుస్తూనే వుంటాడు.