నీతో ఉన్న ఆ కాసేపు

మరికాసేపు అంటాడతను
ఇంకాసేపు ఓపేది ఎలా?

తనతో ఉన్న ఆ కాసేపు
మోడైన మనసు
పచ్చటి చెట్టవుతుంది
గుండెల్లో కిలకిల మంటుందదేంటో

తనతో కబుర్లు చిగురిస్తే
పెదాలపై విడని నవ్వుల మొగ్గలు
బుగ్గల్లో వెచ్చగా ఎర్రగులాబీలు

తనతో నడుస్తూ ఉంటే
కబుర్లన్నీ మారాకు వేస్తాయి
ఒక్కో మొగ్గ పూవై విరుస్తుంది
తన నుండి వీచే గాలిని కప్పుకుని
పూలన్నీ పరిమళం అద్దుకుంటాయి

ఒక్కోసారి తను చాటుగానైనా సరే
కళ్ళతో నన్ను మెత్తగా కోసినపుడు
ఉన్మాది చెట్టు గజగజలాడి
పూలన్నీ జలజల రాల్చేస్తుంది

అటువంటి వేళల్లో
తన జేబులో కొన్ని కబుర్లు పోసి
నా గుండెచప్పుడు జతగా చేసి
కొన్ని పూలను గుప్పిట్లో మూసి
సాగనంపుతాను

ఇక
మరికాసేపంటే… పూవులు వాడవా!