మురికి

ఎవరో మట్టి గొట్టుకుపోయిన బాటసారి.. నెత్తురు
చారికల పేలికల బట్టలు వేళ్ళాడుతూ..
బవిరిగెడ్డం మాటున మొహాన్ని దాచుకుని..
లోపల మండుతున్న
కొలిమికో,
ఎక్కడో కోసుకున్న గాయానికో కళ్ళు
ఎర్రబారి..
ఎక్కడినుంచి?..ఏమయింది?..
చిరుగాలికి ఒక
దుఃఖపు మేఘం వలె కదిలి సర్దుకుని..
నీరసానికో,
ఉద్వేగానికో వణుకుతూన్న గొంతుతో..
ఒక దానికోసం చూస్తున్నాను..
కల్మషం లేని కలుషితంగాని
సత్యమైనది స్వచ్ఛమైనది..
ఏ పోలికకూ అందనిది..
దొరుకుతుందని చేరవస్తుందని నాకై ఎదురు
చూస్తుంటుందని వెతికాను వేచాను వేసట బాటలు
పట్టాను..
అన్నీ చుట్టూ పోగేసుకుని.. అన్నీ
వదుల్చుకుని.. చేసిందేదో.. చేయనిదేదో..
అన్నీ దాని కోసమే..పాపం దొరకలేదా?..
బతుకే తపమయితే
వరమెప్పటికయినా సిద్ధించదా..
కాలమూ దూరమూ
కలగలిసిన సమయాన స్థలాన కోరుకున్నది
కనిపించింది..
కానీ..
పాపిష్టి కళ్ళతో దిష్టి పెట్టలేక.. పాడు చేతులతో పట్టుకోలేక..
మురికి
చేతులతో ముట్టుకోనూలేక..
అప్పటికి తెలిసింది
నేను
తగనని..
తలవంచుకు తిరిగొచ్చేశా..
అతడు ఆ విఫల
క్షణం వద్దనే ఇంకా నిలిచినట్టు..
చూపులు
దించుకుని..
ఒక నిట్టూర్పుతో కప్పేసుకుంటూ..


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...