ఈ సంచికలో వినిపిస్తున్న పదహారు పాటలలో, ఒక్క రెండిటిని మినహాయిస్తే, అన్నీ ప్రైవేటు పాటలుగా రికార్డులపైన వచ్చినవి (Basic records లేక non-film records). వీటిలో సగం పాటలకి సంగీత నిర్వహణ చేసినది మాస్టర్ వేణు. ఇవన్నీ వేణు సినిమా సంగీత దర్శకుడిగా ఇంకా నిలదొక్కుకొనక ముందు HMV సంస్థలో పని చేసినప్పుడు రికార్డయినవి. వేణు స్వయంగా పాడిన రెండు పాటలు–రావోయి రావోయి రా చందమామ, ఓహో సుందరి–ఈ సంచికలో వినవచ్చు. ఇందిరామూర్తి పాడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన ‘మ్రోయింపకోయ్ మురళి’ రేడియోలో నా చిన్నతనంలో తరచుగా వినపడేది.
వైజయంతిమాల సొంతంగా తెలుగులో (నాకు తెలిసినంతలో) నాలుగు పాటలు రికార్డులుగా ఇచ్చింది. వాటిలో రెండిటికి బాణీలు కట్టింది వేణు. [మరొక రెండు పాటలు హిందీ సినిమా బర్సాత్ (1949)లోని పాటలకు తెలుగు అనుకరణలు. ఆ రెండు పాటలు మరొకసారి విందాం.]
వీడిపోయిన పూలు వాడిపోవకముందే, జవరాలి వలపే–అన్న పాటలు పాడిన గాయని ఎమ్. కృష్ణకుమారి గురించి నాకు ఎలాంటి వివరం తెలియదు. ఎవరయినా చెప్పగలిగితే సంతోషం. అలాగే బి. ఎన్. పద్మావతి అన్న గాయని గురించి కూడా. నా దగ్గరున్న HMV అక్టోబర్, 1946 నాటి క్యాటలాగులో ఈ గాయని ఫోటో, కె. ప్రసాదరావుతో (ఈయన పెండ్యాలకు సహాయకుడిగా పనిచేశారు. అలాగే 1950-1954 మధ్య కాలంలో కొన్ని సినిమా పాటలు కూడా పాడారు.) పాడిన రెండు పాటల వివరాలు ఉన్నాయి. పద్మావతి ఇచ్చిన మరొక రికార్డు నుండి రెండు పాటలు–ఈ వసంతాలలో, లోకాలనేలు దేవా–ఇక్కడ ఇస్తున్నాను.
ఆర్. బాలసరస్వతి పాడిన–గోపాలకృష్ణుడు నల్లన గోకులములో పాలు తెల్లన–పాట అందరికీ తెలిసినదే. అసలు ఈ పాట మొదట రాధిక సినిమాలో వచ్చింది. కానీ ఈ సినిమాలో పాటలు ఏవీ రికార్డులపైన రాలేదు. తరువాత కొంతకాలానికి ఈ పాటతో పాటు, సరగున రారా సమయమిదేరా–అన్న జావళిని, రెండవ ప్రక్క జోడించి HMV వాళ్ళు ఒక రికార్డు తెచ్చారు. బాలసరస్వతే పాడిన మరొక ప్రఖ్యాత గేయం: బంగారు పాపాయి బహుమతులు పొందాలి. ఇది ఇప్పటికీ చాలా తరచుగా వినపడే పాట. ఈ పాట పుట్టుకను గురించి కూడా చాలామందికి తెలిసేవుంటుంది. ఇది మంచాల జగన్నాథరావు బాలసరస్వతికి మొదటి బిడ్డ పుట్టిన సందర్భంలో బహుమతిగా రాసి ఇచ్చినది. ఈ పాట కూడా రికార్డుగా వచ్చింది. బాలసరస్వతి పాడిన ఈ నాలుగు పాటలకి సంగీత బాణీలు కట్టింది సాలూరి హనుమంతరావు.
చివరిగా ఓలేటి వెంకటేశ్వర్లు పాడిన రెండు పాటలు. ఇవి మాత్రం కమర్షియల్ రికార్డులుగా రాలేదు కానీ ఆల్ ఇండియా రేడియో వారి T. S. రికార్డులపైన వచ్చాయి. ఈ రెండు పాటలు ఇంటర్నెట్లో తేలికగానే దొరుకుతున్నా మరల వినిపించడానికి కారణం ఈ ఆడియోలు తిన్నగా డిస్కు నుండి రికార్డు చేసినవి. ’మనసౌనే ఓ రాధ’ పాట రాసింది బాలాంత్రపు రజనీకాంతరావు. రెండవది ఘంటసాల గొంతులో మీ అందరికీ తెలుసు. రచన దాశరథి.
- మనసౌనే ఓ రాధా – రచన: బాలాంత్రపు రజనీకాంతరావు, గానం: ఓలేటి వేంకటేశ్వర్లు.
- తలనిండ పూదండ – రచన: దాశరథి, గానం: ఓలేటి వేంకటేశ్వర్లు.
- సరగున రారా సమయమిదేరా – గానం: ఆర్. బాలసరస్వతి, సంగీతం: సాలూరి హనుమంతరావు.
- గోపాలకృష్ణుడు నల్లన – గానం: ఆర్. బాలసరస్వతి, సంగీతం: సాలూరి హనుమంతరావు.
- ప్రేమా ఏల కలిగెను – గానం: ఆర్. బాలసరస్వతి, సంగీతం: సాలూరి హనుమంతరావు.
- బంగారు పాపాయి – గానం: ఆర్. బాలసరస్వతి, సంగీతం: సాలూరి హనుమంతరావు. రచన: మంచాల జగన్నాథరావు.
- మ్రోయింపకోయ్ మురళి – రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం: మాస్టర్ వేణు. గానం: ఇందిరామూర్తి
- విరిసిన వెన్నెల చూపులలో – సంగీతం: మాస్టర్ వేణు, గానం: ఇందిరామూర్తి.
- దరిజేరగ రావా ప్రియుడా – గానం: వైజయంతిమాల, సంగీతం: మాస్టర్ వేణు.
- దాచినాను రావో నీకై – గానం: వైజయంతిమాల, సంగీతం: మాస్టర్ వేణు.
- రావోయి రావోయి రాచందమామ – సంగీతం, గానం: మాస్టర్ వేణు.
- ఓహో సుందరీ ఆనందరూపిణీ – సంగీతం, గానం: మాస్టర్ వేణు.
- వీడిపోయిన పూలు వాడిపోవకముందె – గానం: ఎమ్. కృష్ణకుమారి, సంగీతం: మాస్టర్ వేణు.
- జవరాలి వలపే హాయి – గానం: ఎమ్. కృష్ణకుమారి, సంగీతం: మాస్టర్ వేణు.
- ఈ వసంతాలలో – గానం: బి. ఎన్. పద్మావతి.
- లోకాలనేలు దేవా – గానం: బి. ఎన్. పద్మావతి.