పట్టుదలకి పర్యాయపదమయిన విక్రమార్కుడు, బేతాళుడు దాక్కున్న శవం ఉన్న చెట్టు సమీపంలోకి మళ్ళీ తన కారు తీసుకొచ్చి ఆపాడు. ఊడిపోతుందనిపించిన కిరీటాన్ని ఒకసారి తీసి మళ్ళీ పెట్టుకున్నాడు. అది సరిగా కూర్చుందా లేదా అనేది తెలుసుకోవటానికన్నట్లు, తలని అటూ ఇటూ విదిలించాడు. నడుముకు కట్టుకున్న ఉత్తరీయాన్ని తీసుకొని, ముఖం మీద పట్టని (అచ్చుతప్పు కాదు-అలవాటు) చెమటని ఒకసారి తుడుచుకున్నాడు. పాదరక్షల్ని ఒకసారి విడిచి, చెమట పట్టిన అరికాళ్ళని నేలకి తుడిచి, కాళ్ళని విదిలించాడు. పాదరక్షల్ని మళ్ళీ ధరించాడు.
మనుషుల్లో దుర్మార్గమంతా ఘనీభవించినట్లు, సద్గుణాల కిరణసంచయాన్ని అమాంతం ఒక అదృశ్యశక్తి మింగేసినట్లు, అసాంఘిక శక్తుల దైనందిన కార్యకలాపాలకి ఆశ్రయం ఇవ్వటానికి సిద్ధమయి వాటిని ఒక్కుమ్మడిగా రమ్మని ఆహ్వానం పలుకుతున్నట్లు, అతడి చుట్టూ కన్ను పొడుచుకున్నా కానరాని చిమ్మచీకటి క్రమ్ముకొని ఉంది.
పడమట అస్తమించిన ఆత్మబంధువు జ్ఞాపకాలు స్మృతిపథంలో రెక్కలు విప్పుకున్నట్లు, కనిపించే నింగిలో కనిపించీ కనిపించని కళ్ళు. అవి కని పెంచుకున్న కన్నీటి చుక్కల్లా చుక్కలు.
ఉండుండి జాలిగా వీస్తున్న గాలి. నిశ్శబ్దసంద్రంలో కదుల్తున్న అలల్లా అప్పుడప్పుడు ఒక చప్పుడు.
ఇవన్నీ సుదూరంగా ఉన్నట్లు, తన మదిలోకి దూరనట్లు, విక్రమార్కుడు నెమ్మదిగా చెట్టుని అధిరోహించాడు. అక్కడున్న శవాన్ని అమాంతం ఎత్తుకుని భుజంమీద వేసుకున్నాడు. తాను క్రిందపడకుండా, శవాన్ని క్రింద పడనివ్వకుండా కారు దగ్గరకు చేరాడు. సాదరంగా దానిని సముచితాసనంలో అలంకరింపచేసి తన గమ్యం వైపు ప్రయాణం ఆరంభించాడు. ఆ అవకాశం కోసమే తొమ్మిది వందల తొంభై ఎనిమిది అదనపు నేత్రాలతో ఎదురుచూస్తున్నట్లు, మేలుకున్న బేతాళుడు తన స్వరపేటిక సవరించుకుని సంభాషణ మొదలించాడు.
“రాజా! నీ మొహంలో ఇంతకు ముందెప్పుడూ కనపడని విసుగు, అలసట ఈసారి నా దృష్టికి స్పష్టంగా కనపడుతున్నాయి. వాటిని చూస్తుంటే, మన పాఠకరావు ఒక కథల సంపుటిని చదువుతున్నపుడు వ్యక్తపరచే హావభావాలు కళ్ళకు కట్టినట్లు నాకు మళ్ళీమళ్ళీ కనపడుతున్నాయి. నాకున్న అభినివేశమంతా లవలేశమన్నా మిగల్చకుండా వినియోగించి ఆ సన్నివేశాన్ని నీకు వివరిస్తాను. చోదకచర్యలో నిమగ్నమయిన నీ దృష్టిని మన ముగ్గురి క్షేమం కోసం దాని పైనే కేంద్రీకరించు. నేను చెప్పేది మాత్రం విరామసంగీతంలా విను.
ఎంత విరివిగా చదివినా, కథాదాహం తీరని పాఠకరావు ఆ రోజు కూడా ఏదో ఒక కథ చదువుదామని సంకల్పించాడు. ఒక కథల సంకలనం చేతిలోకి తీసుకున్నాడు. అతడే పుస్తకాన్నీ ఒక పద్ధతిలో చదవడు. అది మనిద్దరికీ తెలిసిన విషయమే! అదే రీతిలో, ఈ సంపుటిలో కూడా పేజీలన్నీ ఒకదాని వెంట ఒకటి తిరగెయ్యటం మొదలుపెట్టాడు. కొన్ని కథల దగ్గర ఒక్కో నిమిషం సేపు ఆగాడు. ఒక మిష మీద విషచషకం ఎవరో చేతికందించినట్లు ముఖం పెట్టాడు.
మరికాస్త ముందుకు జరిగి, ఒక చోట ఆగి, ‘నాదేమన్నా కెన్యానా? మారథాన్‌లో స్వర్ణపతకం సాధించడానికి!’ అన్నాడు. ఇంకొన్ని కథల్లో పేజీలవంక ఒక లుక్కు లుక్కి, ‘ఇదేమన్నా షార్ట్ డిస్టన్స్ పరుగు పందెమా? నేనేమన్నా బోల్టునా?’ అని తనని తాను క్రొశ్నించుకున్నాడు. ఇంకోచోట దృష్టి సారించి ‘పరిగెడుతూ దూకి, దూకుతూ పరిగెత్తి గమ్యం చేరటానికి నేను ఎడ్విన్ మోజెస్ కాదు కదా?’ అనుకున్నాడు. చివరకి ఒక కథ దగ్గర ఆగి, ‘ఈ ఈవెంట్‌లో అయితే పతకం నాదే!’ అని, ఆ కథని తదేకంగా చదవటం కోసం తనువునీ మనసునీ ఉన్మీలనం చేశాడు.
రాజా! పాఠకరావు ఒక పఠిత. క్రీడాకారుడు కాదు. అతడు చేయదలుచుకున్న పని, చేయగలిగిన పని కథలు చదవటం. నాలుగేళ్ళకొకసారి జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనటం కాదు. అలాంటప్పుడు పరుగు పందేల గురించి ఎందుకు మాట్లాడాడు? హర్డిల్స్ ప్రస్తావన ఎందుకు తెచ్చాడు? పతకం నాదే అని చివరకి ఎందుకు అన్నాడు?
కొందరు రచయితలు తమ రచనల్తో పాఠకులని ఒక ఆట ఆడుకుంటారు. ఆ ఆట ఆడుకోవటానికి పాఠకులు కందుకంలా ఉపయోగపడతారు. తాము రచయితలయితే తప్ప ఆ ఆట తాము ఆడాలనుకున్నా పాఠకులు ఆడలేరు. అంతకు మించి కథలకీ, క్రీడలకీ నాకు తెలిసి ఎలాంటి పొంతనా లేదు. పోలికా కనపడదు. అలాంటప్పుడు తాను చేస్తున్న పనికీ, మాట్లాడుతున్న మాటలకీ సమన్వయం లేకుండా ఇలా పాఠకరావు ఎందుకు ప్రవర్తించినట్లు?”
ఈ క్వోరీలకి సమాధానాలు తెలిసి కూడా నువ్వు మౌనంగా ఉన్నావనుకో, క్వారీలో బండరాయిలా ఉన్న నీ తల బేబీ చిప్స్‌లా వేనవేల ముక్కలు కాగలదు.”
తన మాటల్ని ఆపిన బేతాళుడు ఇక ఈ వేడికి తాళలేను అన్నట్లు, వడగాడ్పులాంటి ఒక నిట్టూర్పును ఒక్క ఊపులోనే నిగిడించాడు.
ఇదంతా విన్న, విక్రమార్కుడు తప్పనిసరి పరిస్థితుల్లో తన నోరు విప్పి ఇలా చెప్పాడు.
“బేతాళా! ఒక సైనికుడిలా కథలు చదువుతున్న పాఠకరావుని, నువ్వు సినికుడిగా మారి చూస్తున్నావు. అందుకనే అతడి పాట్లు, నీకు పొరపాట్లుగా కనపడుతున్నాయి. దాంతో, నీకు రాకూడని అనుమానాలన్నీ వస్తున్నాయి. అతడి ప్రవృత్తిపట్ల సంశయనివృత్తి కావాలంటే, నేనివ్వబోయే ఈ వివరణ నువ్వు శ్రద్ధగా ఆలకించాలి.
పేరా అంటే ఏ సాహితీ ప్రక్రియలో అయినా, చెప్పదలుచుకున్న విషయం పట్ల ఒక అభిప్రాయాన్ని కలిగించటానికో, ఒక భావాన్ని వ్యక్తపరచటానికో రాసే వాక్యసమూహం. దీనికి భిన్నంగా ఇపుడొస్తున్న కొన్ని కథల్లో పేరాలు ఒక భావాన్ని ప్రతిఫలించటానికి బదులు విభిన్నభావాల సంచయంగా రూపుదిద్దుకుంటున్నాయి. దాంతో అవి చాలా పెద్దగా ఉంటున్నాయి. వ్యాసఖండికలని తలపుకి తెస్తున్నాయి.
పాఠకరావు చేతికి తీసుకున్న కథల సంపుటిలో ఉన్న కథల్లో అలాంటి పేరాలు చాలా ఉన్నాయి. పాఠకరావుకు ఒక్కోటి ఒక్కో మారథాన్‌లా తోచాయి. కెన్యా క్రీడాకారులు ఈ పరుగుపందెంలో సుప్రసిద్ధులు. అందుకనే, అతడు ‘నాదేమన్నా కెన్యానా? ఇలా మారథాన్‌లో స్వర్ణపతకం సాధించడానికి!’ అని తనని తాను ప్రశ్నించుకున్నాడు.
ఇంకొన్ని కథల్లో ఒకే భావాన్ని ప్రతిబింబించే వాక్యాలను కలిపి ఆ కథారచయితలు ఒక పేరాగా ఉంచకుండా, వాక్యానికొక పేరాగా రాశారు. వాటిని చదవటం అంటే ఒకే భావవ్యక్తీకరణ వెంట అదే పనిగా ఆగకుండా పరిగెత్తటం. ఆ పేరాలని చూసి, పాఠకరావు మరో ప్రముఖ క్రీడ అయిన వంద మీటర్ల స్ప్రింట్ అనే పరుగు పందేన్ని, అందులో విశ్వవిఖ్యాతి చెందిన జమైకా క్రీడాకారుడు ఉసైన్ బోల్ట్‌ని గుర్తుకు తెచ్చుకున్నాడు.
మరో కథలో ఇంకో రచయిత ఒకే వాక్యాన్ని ఒకటికి మించి పేరాగ్రాఫులుగా రాశాడు. వాటిని చూసి అతడికి హర్డిల్స్ అనే మరో రకమయిన పరుగు పందెం జ్ఞప్తికొచ్చింది. అందుకే అతడు ఆ క్రీడలో సాటి లేని మేటి అయిన అమెరికా క్రీడాకారుడు ఎడ్విన్ మోజెస్‌ని స్మరించుకున్నాడు.”
ఇక అతడు చదవటానికి ఎన్నుకున్న కథ గురించి: అందులో పేరాలు ఒక ప్రామాణికతకి లోబడి, నిర్దిష్ట వేగంతో చదవటానికి అనుగుణంగా రాయబడ్డాయి. అందుకని ఆ కథాపఠనంలో తుది విజేతని తానే అవుతానని పాఠకరావుకి అనిపించింది. కనుకనే, ‘పతకం నాదే’ అని అన్నాడు. ఆ కథ చదవటంలో లీనమయ్యాడు.”
విక్రమార్కుడికిలా మౌనభంగం కాగానే, కోట్లకు కోట్లరూపాయలు బ్యాంక్‌ల దగ్గర అప్పు తీసుకుని మాయమయిన బిజినెస్ టైకూన్‌లా, బేతాళుడు ఉన్నట్లుండి మాయమయ్యాడు. విక్రమార్కుడి కారులోంచి ‘ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు!’ అనే పాట మొదలయింది.
(సశేషం)
(గమనిక: సుమారుగా ఆరు పేజీల్లో ఎనిమిది పేరాలతో రాసిన ఒక కథనూ, దాంతో పాటు ఇంచుమించు పద్నాలుగు పేజీల్లో 191 పేరాలున్న మరో కథనూ చదివిన అనుభవంతో రాసిన కథ ఇది. భావప్రకటనకి అనుగుణంగా మొదటి కథలో ఎనిమిది పేరాలని పునర్నిర్మిస్తే అవి ఇరవై మూడుకి పెరిగాయి. రెండో కథలో 191 నుంచి 154కి పడిపోయాయి.)