బేతాళ కథలు: కథన కుతూహలం-8

పట్టుదలకి మారుపేరయిన విక్రమార్కుడు, తన పేరుప్రతిష్టలకు భంగం కలిగేలా ఎదురవుతున్న వరస అనుభవాలకు బెదిరిపోకుండా తిరిగి ఎప్పటి చోటికే తన కారులో వచ్చాడు. కారులోంచి నెమ్మదిగా దిగి పరిసరాలని పరీక్షించాడు. చుట్టూ చిమ్మచీకట్లు. తలపైకెత్తి చూస్తే మిణుకుమిణుకుమంటూ వేనవేల చుక్కలు. ఎంత ప్రయత్నించినా వాటి వెలుగురేఖలు నేలకు చేరలేకపోతున్నాయి. చీకటితో వేసారిన తనలాంటి బాటసారికి దారి చూపించలేకపోతున్నాయి. సహజకాంతికి క్షామం ఏర్పడినపుడు కృత్రిమవెలుగు మీద ఆధారపడటమే క్షేమం. అలా అనుకోగానే అతడికి ఒక అనుమానం వచ్చింది. కొంచెం కొంచెంగా బేతాళుడి భావసుగంధం తనకు కూడా అంటుకుంటోందా? తన ఆలోచనకి విక్రమార్కుడు తనలో తాను ఒకసారి నవ్వుకున్నాడు. తన కారు ఇస్తోన్న వెలుతురు వంక అతడు కవితాపూర్వకంగా చూశాడు.

చెట్టు కొమ్మల మీదకు ఎక్కి బేతాళుడు దాక్కున్న శవాన్ని భుజం మీద వేసుకుని నెమ్మదిగా దిగి తన కారు దగ్గరకు నడవసాగాడు. ఈ రోజెందుకో విక్రమార్కుడి మనసు మనసులో లేదు. ఏదో ఆలోచనలో ఉండి, డ్రైవింగ్ సీట్లో శవాన్ని కూచోబెట్టి, పక్కసీట్లో తాను కూచోబోయాడు. అది గమనించిన బేతాళుడు నోరు విప్పనే విప్పాడు.

“రాజా! నన్ను కారు తోలమని కాదు కదా నీ ఉద్దేశం?” అని అడిగాడు. విక్రమార్కుడు సమాధానం ఇవ్వకముందే, “నేను కారు తోలితే నా తోబుట్టువులకు ఆశ్రయమీయటానికి మరికొన్ని శవాలు తయారవుతాయి. అప్పుడు నీకు మోయటానికి కావలసినన్ని…” అని ఉన్న పళంగా మూడు చుక్కలు అడ్డం రావటంతో ఆగిపోయాడు. తెలుగు కథల్లో ఎక్కడ పడితే అక్కడ, అర్థంపర్థం లేకుండా కనపడటం వాటికి అలవాటే.

కారు నడిపే పని బేతాళుడికి అప్పగించే ఉద్దేశం తనకు లేదన్నట్లు విక్రమార్కుడు తలని అడ్డంగా ఊపాడు. తమ ఇద్దరి పరస్పరస్థానమార్పిడి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తిచేశాడు.

“రాజా! పరధ్యానంలో ఉంటే ఇలా జరగకూడని పొరపాట్లే జరుగుతుంటాయి. తెలివిగలవారు వాటిని వెంటనే సరిదిద్దుకుంటారు. లేని వాళ్ళు చేసిన పొరపాట్లనే మళ్ళీమళ్ళీ చేస్తుంటారు. దీనికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. పాఠకరావుతో నాకున్న అనుభవాలలో మరొకటి ఇంకో ఉదాహరణ. శ్రమ తెలియకుండా ఉండటానికి అది చెపుతాను విను.

మన పాఠకరావు చదవటానికి ఆ రోజు కూడా మార్కెట్ లోకి ఏ పత్రిక కొత్త సంచికా రాలేదు. అందుకని, అలవాటు ప్రకారం తన దగ్గర ఉన్న కథల సంపుటాల్లో ఉన్న ఒకదాన్ని తెచ్చుకుని చదువుదామని కూర్చున్నాడు. ఆ సంపుటిలో మొత్తం పదమూడు కథలున్నాయి. అన్నిటికన్నా చిన్న కథ పన్నెండు పేజీలు ఉంది, పెద్ద కథ పద్దెనిమిది పేజీలు ఉంది. పుస్తకంలో పేజీలు మొత్తం నెమ్మదిగా తిరగేశాడు. ఈసారి గణనయంత్ర సహాయం తీసుకోకుండానే, నోటితో చేతివ్రేళ్ళ సహాయంతో ఏదో లెక్కించాడు. దగ్గరున్న పెన్సిలుతో అనుక్రమణికలో ప్రతి కథ పేరు ఎదురుగా ఏవో అంకెలు వేశాడు. మధ్యమధ్యలో ‘వీలు కాలేదా?’ అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. ‘వీలెందుకు కాదు? మనసుపెట్టి ఉండరు!’ అని తనకి తానే సమాధానం చెప్పుకున్నాడు. నాకు కించిత్ కూడా అర్థం కాని ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత, పోయినసారిలా అన్నిటికన్నా చిన్న కథ చదవకుండా, పెద్ద కథ చదవటం మొదలు పెట్టాడు.

రాజా! పేజీలు తిరగేస్తూ పాఠకరావు లెక్క పెట్టింది ఏమిటి? పెన్సిలుతో రాసిన అంకెలు దేనికి సంబంధించినవి? అతడు తనకు తాను వేసుకున్న ప్రశ్నలకూ, చెప్పుకున్న సమాధానాలకూ అర్థం ఏమిటి? లోగడలా కాకుండా, చివరకు పెద్ద కథనే చదవటానికి ఎందుకు నిర్ణయించుకున్నట్లు? తాను కథని ఎన్నుకునే విధానాన్ని ఉన్న పళంగా మార్చుకున్నాడా? లేదూ పరధ్యానంలో ఉండి ఈ పొరపాటు చేశాడా?

ఈ ప్రశ్నలకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో, కవిత్వతత్వం లేని కొందరి వచనకవిత్వంలో వాక్యాల్లా నీ తల ముక్కలు ముక్కలు అవుతుంది సుమా!”

బేతాళుడి మాటలు విన్న విక్రమార్కుడు, తనలో తాను ఒకసారి నవ్వుకున్నాడు. (క్షమించండి. ఆయనకు ఇంకో రకంగా నవ్వటం చేతకాదు.) తర్వాత నెమ్మదిగా జవాబు చెప్పటం మొదలుపెట్టాడు.

“బేతాళా! నువ్వనుకున్నట్లు పాఠకరావు ఎలాంటి పరధ్యానంలోనూ లేడు. ఎలాంటి పొరపాటూ చేయలేదు. అతడిలో నువ్వనుకునే మార్పూ రాలేదు. కాకపోతే, ఒక కథని ఇంతసేపే చదవాలనే నియమం ఈసారి అతడు పెట్టుకోలేదు. అందుకే, కథ ఎన్నుకోవటానికి ముందు అతడు తన గడియారం వంక అసలు చూసుకోలేదు.

ఇకపోతే అతడు నోటితోనూ, వ్రేళ్ళతోనూ ఏమి లెక్కించాడనే దాని గురించి:

కథ అంటే ఒకప్పుడు ఒక సంఘటన. ఒక జీవితశకలం. ఇప్పుడు కథ నిర్వచనం మారింది. ఇతివృత్తం విస్తృతి పెరిగింది. దాంతో కథలోకి విభిన్నపాత్రల ప్రవేశం, నిష్క్రమణ జరుగుతోంది. సందర్భాన్ని బట్టి సంఘటనాస్థలి సైతం మారుతోంది. ఆ మార్పులకి అనుగుణంగా కథ కొన్ని సన్నివేశాలుగా విభజింపబడితే, ఆ విభజన కథలో రాబోయే మార్పును స్వీకరించడానికి పాఠకులని మానసికంగా ముందుగానే సంసిద్ధం చేస్తుంది. వారికి కథామార్గం సుగమమవుతుంది. ఆ విభజన లేకపోతే కథల్ని ఏకఖండికగా చదవాల్సి వస్తుంది.

ఈ రకమయిన సన్నివేశ విభజన అనేది అధ్యాయాల రూపంలో నవలల్లో ఉంటుంది. కథల్లో వీటి అవసరం లేదని కొందరు నమ్ముతుంటే, కథల్లో కూడా అవసరమే అని ఇంకొందరు భావిస్తున్నారు. కొందరు మధ్యేమార్గంగా కథనంలో రాబోయే మార్పును పాత్రల మాటలద్వారా సూచిస్తున్నారు.

ఎందుకనో తెలీదు కాని, పాఠకరావు సన్నివేశాలుగా విభజింపబడ్డ కథలని చదవటానికే ఎక్కువ ఇష్టపడతాడు. అందుకని తన చేతిలో ఉన్న సంకలనంలో ఏ కథలో ఎన్ని సన్నివేశాలున్నదీ లెక్కపెట్టుకున్నాడు. ఆ అంకెని లేదా సంఖ్యని కథల పేర్లకి ఎదురుగా పెన్సిలుతో రాసుకున్నాడు. ఇదంతా అయింతర్వాత తాను రాసుకున్న సమాచారం వంక ఒకసారి చూసుకున్నాడు. దాని ప్రకారం, అన్నిటి కన్నా చిన్న కథ పన్నెండు పేజీలే ఉన్నా, ఆ కథ మొత్తం ఒకటే భాగంగా ఉంది. ఇంకో కథ పధ్నాలుగు పేజీలున్నా అందులో రెండే భాగాలు ఉన్నాయి. అన్ని పేజీలున్న కథలని ఇంకా ఎక్కువ భాగాలుగా విభజించటం ‘వీలు కాలేదా?’ అని అన్యాపదేశంగా ఆయా రచయితలని ఉద్దేశించి ప్రశ్నించాడు. ‘వీలెందుకు కాదు? మనసుపెట్టి ఉండరు!’ అని తనకి తానే సమాధానం చెప్పుకున్నాడు. చివరకు, తక్కువ సన్నివేశాలున్న తక్కువ పేజీల కథని వదిలేసి, ఎక్కువ సన్నివేశాలున్న ఎక్కువ పేజీలున్న కథని చదవటానికి ఎంచుకున్నాడు.”

అలా విక్రమార్కుడికి మౌనభంగం కాగానే, ఎన్నికలో గెలవగానే నియోజకవర్గంనుంచి అదృశ్యమయిన ప్రజాప్రతినిధిలా, వాగ్దానాల కళేబరంతో సహా బేతాళుడు మాయమయ్యాడు. విక్రమార్కుడి కారు లోంచి “ఆశ నిరాశను చేసితివా, రావా చెలియా రాలేవా!” అనే పాట మొదలయింది.

(సశేషం)

(గమనిక 1: ఈ కథారచయిత ఈ మధ్యన చదివిన 336 కథల్లో ఒకే భాగంగా నడిచిన కథలు 138 అయితే, సన్నివేశ విభజన జరిగిన కథలు 198. ఈ 198 కథల్లో ఉన్న భాగాలు 953. కథకు ఇంచుమించు 5 భాగాలు. 18 పేజీల ఒక కథంతా ఒకే భాగంగా ఉంటే, 13 పేజీల మరో కథ 23 భాగాలుగా ఉంది.

గమనిక 2: 2010 సంవత్సరంలో ఒక ప్రముఖ వారపత్రిక దీపావళి సంచికలో ప్రచురించబడ్డ ఒక కథలో 87 పేరాలకు గాను, 209 చోట్ల ఎలిప్సిస్ అనబడే మూడు చుక్కలున్నాయి.)


టి. చంద్రశేఖర రెడ్డి

రచయిత టి. చంద్రశేఖర రెడ్డి గురించి: ఖమ్మం జిల్లాలోని వైరాలో జన్మించిన చంద్రశేఖర రెడ్డి ఉద్యోగవిరమణానంతరం వైరాలోనే విశ్రాంతజీవనం గడుపుతున్నారు. పుస్తక పఠనం, చిత్రలేఖనం, సంగీత శ్రవణం ఆయన అభిరుచులు. ...