బేతాళ కథలు: కథన కుతూహలం – 5

వైఫల్యాలు విదిలించి కొట్టినా పట్టుదల వదలని విక్రమార్కుడు, వాలుకు కొట్టిన బాలులా తిరిగి ఎక్కడనుంచి కొట్టబడ్డాడో అక్కడికే వచ్చాడు. కృష్ణపక్షసంద్రంలో మునిగిన క్షపాకరుడు నింగితీరం మీదకు చేరటానికి ఇంకా కొన్ని రోజుల సమయముంది. నిగూఢ రహస్యాలెన్నో దాచుకున్న మస్తిష్కంలా, పరిసరాలనిండా గాఢాంధకారం ఆవరించి ఉంది. ఆత్మ నిష్క్రమించడంతో నిష్ప్రయోజనమయిన ఒక మానవ దేహం నిశ్చలస్థితిలో చితిశయ్య మీదకు చేరింది. బంధుమిత్రులు ఇంతకుముందు ఎప్పుడూ చూపెట్టని ప్రేమతో ఏర్పాటు చేసిన అగ్నిజ్వాలల కౌగిలింతలలో అది భస్మీపటలం అవుతోంది.

దిక్కుతోచని మృగధూర్తక కూత ఒకటి ఒడలు గగుర్పొడిచేలా ఆగి ఆగి కూతవేటు దూరంనుంచి వినవస్తోంది. దానికి మరో శ్వాన దీనాలాపన నీడ లేని తోడయింది. భీతి గొలుపుతున్న ఆ దృశ్య ప్రభావానికి భయభ్రాంతమయి వణకుతున్నట్లు తారకలు మిణుకుమిణుకుమంటున్నాయి. చూడలేక కళ్ళని మూసుకున్నా, చూడాలనిపించే ఉత్సుకతని అణచుకోలేక చుక్కలు అప్పుడప్పుడు రెప్పలు విప్పుతున్నాయి.

వీటికి వేటికీ చలించని దృఢచిత్తంతో, విక్రమార్కుడు కారు వెలుతుర్లో చెట్టుమీదకు ఎక్కి బేతాళుడు ఉన్న శవాన్ని భుజం మీద వేసుకుని క్రిందకు దిగాడు. కొంచెం దూరంగా ఆపిన తన కారులో శవాన్ని కూర్చోపెట్టి, గమ్యం వైపు తన ప్రయాణం ప్రారంభించాడు. కదలికలకు మేల్కొన్న బేతాళుడు ఎవరికీ కనపడని తన కళ్ళని తెరిచి ఒక్కసారి చుట్టూ చూశాడు. కారులో తాను, తన ప్రక్కన విక్రమార్కుడు. స్పృశ్యాస్పృశ్యంగా అలవాటయిన అదే దృశ్యం. బేతాళుడు గొంతు సవరించుకొని మాట్లాడ్డం మొదలుపెట్టాడు.

“రాజా! నిద్రపోకుండా నువ్వు నాకోసం రావటం, నన్ను నిద్రపోనివ్వకుండా నీతో మోసుకుపోవటం. దీనికి ఆది ఎక్కడో నాకు తెలుసు. అంతం ఎప్పుడో, నీకయినా తెలుసో లేదో నాకయితే తెలీటంలేదు. ఈ లోపులో, ఏ కథ చదవటానికి ఎప్పుడు ఎలాంటి ప్రయత్నం చేస్తాడో తెలీని పాఠకరావుతో నాకు కలిగిన మరో అనుభవాన్ని నీతో పంచుకుంటాను. భావదాసులా బాధే సౌఖ్యమనే భావన రానిచ్చి నేను చెప్పేది ఆలకించు.

దిక్కుతోచని పాఠకరావు, ఈసారి ఇంకో కథల సంపుటంతో, తన చదువుబల్ల (గమనిక: బాగా తెలిసిన తెలుగు పదాలకి సైతం ఆంగ్లపదాలు వాడే కొందరు, దీన్ని రీడింగ్ టేబుల్ అని అర్థం చేసుకోవాలి) దగ్గర ఆసీనుడయ్యాడు. ఒక్కసారి బలంగా ఊపిరి పీల్చుకుని పుస్తకం పేజీలు తెరిచాడు. విషయసూచిక దగ్గర అరచెయ్యి ఉంచి, లోపలి పేజీల్లోకి వెళ్ళాడు. ఒక పేజీ పైన కుడిమూలన లంబకోణ త్రిభుజాకారంలో కొంతమేర కాగితాన్ని మడిచాడు. ముందుకు, వెనక్కు అలా ఇంకో పదమూడుసార్లు జరిగాడు. వెనక్కి వచ్చిన ప్రతిసారీ ఒక కాగితాన్ని కుడి వైపో, ఎడమ వైపో మడిచాడు. అరచేతిని వెనక్కు తీసేసుకుని, ఒక్కొక్క మడత దగ్గర ఆగి ఒక్కో నిమిషంసేపు చదివాడు. మధ్యలో ఒక మడతని అలానే ఉంచాడు. ‘హమ్మయ్య! ఇన్నాళ్ళకి ఒకళ్ళు ప్రయత్నించారన్నమాట!’ అని పెద్దగా అన్నాడు. అదనపు నటుల తోడ్పాటు లేకుండా, నాయికానాయకులు అభినయించిన ఒక యుగళగీతాన్ని సరికొత్త తెలుగు సినిమాలో చూసిన అనుభూతిని పొందాడు. ఆ ఆనందంతోనే వేగంగా ముందుకూ వెనక్కీ వెళ్ళి మిగిలిన పేజీల్లో మడతల్ని తీసేశాడు. మడత అలానే ఉంచిన పేజీ దగ్గరకు వెళ్ళి ఓ అరగంట దాకా ఆ కథ చదవడంలో లీనమయ్యాడు. ఆ తర్వాత మిగిలిన కథల్లోకి వెళ్ళాడు.

రాజా! పాఠకరావు ప్రవర్తన నీకెలా అనిపిస్తోందో తెలీదు. నాకు మాత్రం వింతగా ఉంటోంది. కాలక్షేపానికి చదివే కథని ఎన్నుకోవటానికి, ఇన్ని తిప్పలా? మొదట ఏ కథని చదవాలో అనేది నిర్ణయించుకోవడానికి ఒకసారి అవలంబించిన పద్ధతిని అతడు ఇంకోసారి అనుసరించకపోవడానికి కారణం ఏమిటి? ఆ మడతలు దేనికి నిదర్శనం? ‘హమ్మయ్య! ఇన్నాళ్ళకి ఒకళ్ళు ప్రయత్నించారన్నమాట!’ అన్న మాటల అంతరార్థం ఏమిటి? ఆ మాట తర్వాత అతడికి పట్టలేనంత ఆనందం ఎందుకు కలిగింది? అంత కష్టపడి మిగిలిన కథల దగ్గర పెట్టిన మడతల్ని ఒకటొకటే ఎందుకు తీసేశాడు? మడత అలాగే ఉంచిన కథనే ఎందుకు చదివాడు? తర్వాతనే మిగిలిన కథల్లోకి ఎందుకు వెళ్ళాడు?

రాజా! ఈ ప్రశ్నలకు నాకు నీ దగ్గర్నుంచి జవాబు కావాలి. తెలిసి కూడా ఉద్వేషపూర్వకంగా (ఇది ఉద్దేశం, ద్వేషం కలగలిపిన ఒక సరికొత్త భావన) జవాబులు తొక్కిపట్టావో, మేకప్ లేని పాతతరం కథానాయకుడికి తన అసలు మొహాన్ని చూపిన పాపానికి ఒక నిలువుటద్దం ఏమయిందో నీ తల కూడా అదే అవుతుంది.”

బేతాళుడి ప్రశ్నలని విని విక్రమార్కుడు తనలో తాను నవ్వుకున్నాడు. కాసేపు ఆలోచించి తన గొంతు విప్పాడు.

“బేతాళా! రోజుకో విభిన్నమయిన కథని చదవాలని, పాఠకరావు తాపత్రయం. అదే అతడు ఒక్కోరోజు ఒక్కోరకంగా ప్రవర్తించటానికి కారణం. అంతకు మించి ఇందులో వింత ఏమీ లేదు. అంతే కాదు, కాలక్షేపానికి కథలు చదివేవాళ్ళు అవి విసుగు కలిగిస్తే, వాటిని విసిరేసి ఇంకో కాలక్షేపాన్ని వెతుక్కుంటారు. కాని అదే కథాప్రపంచంలోకి మాటిమాటికీ వెళ్ళరు. అందుకని పాఠకరావు కాలక్షేపానికి మాత్రమే కథలు చదువుతున్నాడన్న అపోహని వెంటనే నీ మనసులోంచి తొలగించు.

ఇక నీ ప్రస్తుత ప్రశ్నలకి వస్తే, కథనరీతులు మూడు రకాలు. ఉత్తమపురుష, ప్రథమపురుష, మధ్యమపురుష. సాధారణంగా ఉత్తమపురుషలో కథ ‘నేను’ పరంగా నడుస్తుంది. దాన్ని ‘మేము’తో కూడా నడపవచ్చు. కాని, అలా నడిచే కథలు అరుదు. దీంట్లో బహుళ ఉత్తమపురుష అని ఇంకో విభాగం. ఆ తరహాలో ఉన్న కథలు కూడా తక్కువే.

ప్రథమపురుషలో మళ్ళీ మూడు ధోరణులు. బాహ్య, పరిమిత, సర్వజ్ఞ. అవడానికి ఇవి ఒక చెట్టు కొమ్మలే అయినా, వీటి పోకడలో చాలా వైవిధ్యం ఉంది. ఈ మూడు పద్ధతుల్లో కూడా కథని రచయిత నేపథ్యంలో ఉండి చెపుతాడు. ఏ రకంగా చెప్పడానికి ప్రయత్నించాడనేదాన్ని బట్టి, ఏ కథనరీతి ఉపయోగించాడో తెలుసుకోవచ్చు. కొంచెం పరీక్షగా చదివితే ఆ రీతిని ఎంత లోపరహితంగా వినియోగించుకున్నాడనేది కూడా గ్రహించవచ్చు.

మధ్యమపురుషలో కథ ‘నువ్వు’ పరంగా కానీ, ‘మీరు’ పరంగా కానీ చెప్పబడుతుంది. ఈ తరహాలో చెప్పబడే కథలు చాలా అరుదు. మధ్యమపురుషలో ఎవరయినా కథ రాస్తే, తన మనోజిహ్వతో చవిచూడాలని పాఠకరావు చిరకాల వాంఛ. దాని కోసం అతడి అన్వేషణ అప్రతిహతంగా కొనసాగుతోంది.

దాంట్లో భాగంగానే, అతడు ఏ కథ ఏ పేజీలో మొదలయిందో చూసుకుని ఆ పేజీని మడత పెట్టాడు. ఆ తర్వాత ప్రతి కథనీ ఒక్కో నిమిషంసేపు చదివాడు. ఒక కథ ఏ రీతిలో మొదలయిందీ, ఆ కథ కాస్తా చదవగానే అతడికి తెలిసింది. ఆ ప్రయత్నంలో ఉన్నపుడు అతనికి మధ్యమపురుషలో రాయబడిన కథ ఒకటి కనపడింది. అందుకే అతడు ‘హమ్మయ్య! ఇన్నాళ్ళకి ఒకళ్ళు ప్రయత్నించారన్నమాట!’ అని పైకి అన్నాడు. తాను వెతుకుతున్న కథ దొరికినందుకు తెగ సంతోషపడ్డాడు. ఆ కథ మొదలయిన పేజీకి తాను పెట్టుకున్న గుర్తును అలానే ఉంచేసి, మిగిలిన కథలకు పెట్టిన గుర్తులను తీసేశాడు. ముందుగా తాను ఎన్నుకున్న కథని చదివి, తర్వాత మిగిలినవాటి పనిపట్టాడు.”

ఇలా విక్రమార్కుడికి మౌనభంగం కాగానే, తెలుగు చిత్రసీమ నుంచి హిందీ చిత్రసీమకి వలస వెళ్ళి అట్నుంచటే వెండితెరమరుగయిన కొందరు యువనటీమణుల్లా బేతాళుడు సత్వరం మాయమయ్యాడు. విక్రమార్కుడి కారులోంచి ‘దేవుడికేం హాయిగ ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు!’ అనే పాట మొదలయింది.

(సశేషం)

(గమనిక: నేను ఒక పరిశీలన కోసం చదివిన 453 కథల్లో, ఉత్తమపురుషలో రాయబడిన కథలు 198 కనపడ్డాయి. ప్రథమపురుష ఉపయోగించబడిన కథలు 254 ఉన్నాయి. మధ్యమపురుషలో మాత్రం ఒకే ఒక కథ కనపడింది.)


టి. చంద్రశేఖర రెడ్డి

రచయిత టి. చంద్రశేఖర రెడ్డి గురించి: ఖమ్మం జిల్లాలోని వైరాలో జన్మించిన చంద్రశేఖర రెడ్డి ఉద్యోగవిరమణానంతరం వైరాలోనే విశ్రాంతజీవనం గడుపుతున్నారు. పుస్తక పఠనం, చిత్రలేఖనం, సంగీత శ్రవణం ఆయన అభిరుచులు. ...