1.
నల్లని గంగ
గొంతుకలో ఊగే
నాలిక
పంచవటి శిఖలో
రెప్ప వేయని
కన్ను
సుదూర నిశిలో
పరుచుకున్న
కురులు
బేలూరు మఠం
మెట్ల మీద
కూర్చున్న
ఛాయ
దక్షిణేశ్వర్
గర్భగుడి వైపు
చీకటి ముసురులో
ఉండి ఉండి
వినిపించే
గజ్జెల చప్పుడు
కాళి.
2.
నీడ నీడలో
కరిగిపోయి
చీకటి రేగుతున్న
రాత్రి
దొడ్డి దోవ
దొంగల్ని తరిమి
తల్లో
తుమ్మెదలకు
మత్తు మందు తాగించి
లోకపు పచ్చి వాసనలను
కప్పి పెడుతున్న
రాత్రి
కన్ను పొడుచుకున్నా
కానరాని చీకట్లలో
కరుకు గొంతుకతో
గాలి హూంకరిస్తున్న
రాత్రి
వేయి చేతులతో
ఆద్యా శక్తిని
ఆవహించుకుని
వేయి రేకులుగా
విచ్చుకుంటున్న
రాత్రి
మనో యవనికపై
కాళీ నర్తనకై
నాల్క సాచిన
రాత్రి
నీడ నీడలో
కరిగిపోయి
చీకటి రేగుతున్న
ఈ రాత్రి.