యుగయుగాల నిశ్శబ్దం ప్రోది చేసుకున్న తపోవనం
దిగంతాలకు వ్యాపించిన పచ్చదనం
అడవిగొడుగు చీల్చుకుని అవనిని తాకాలని
రవికిరణాలు పరితపిస్తాయి
శీలవతి హృదయాన్ని తాకలేని కాముకునిలా
ఊరంతా తిరిగివచ్చి అలసి సొలసిన గాలి
అచటి కొమ్మలెక్కి ఆకులపై నిద్రిస్తుంది
వర్షపు చినుకులో, మంచు ముత్యాలో
వెదురాకుల కొసలు రాలుస్తూనే ఉంటాయక్కడ
భ్రూమధ్యంలో ప్రాణం నిలిపి
తపోమగ్నులై అక్కడొక మహర్షి.
“మునిపుంగవా!
ఈ దాసుని తమ శిష్యునిగా స్వీకరిస్తారా?
మీ పాదుకల చెంత నాకింత చోటుందా?”
జంట సూర్యులవలె ప్రకాశిస్తూ తెరచుకున్నాయి ముని నేత్రాలు.
“ఎవరు నీవు?”
“సన్యసించ వచ్చిన రాజును నేను
తెరలుతెరలుగా ముసిరిన
కనకముపై అనుకాంక్షను
కాంతపైని కాముకతను
అవనిపైని ఆపేక్షను
జ్ఞానఖడ్గంతో ఛేదించి
అబద్ధాన్ని తన ప్రపంచానికే అప్పగించి
పరమార్థాన్ని వెదుక్కుంటూ బయలుదేరి వచ్చాను
మునివర్యా కనికరించండి”
కళ్ళతో మనసు లోతుల్ని శోధించిన మునివర్యులు
ప్రశాంతంగా ప్రశ్నించారు:
“నాయనా!
వచ్చిన దారిలో నువ్వు
ఏయే శబ్దాలను విన్నావు?”
“పక్షుల కలరవాలను విన్నాను
రాలినపడిన పండుటాకులపై మృగాల
సయ్యాటలు విన్నాను
మూగవైన గట్లతో నది ఆపక సలిపే
మధుర సంభాషణలు విన్నాను
పూల తపస్సును భంగపరుస్తున్న
తుమ్మెదల ఝంకారాన్ని విన్నాను
గజరాజును వెదుకుతున్న
కరిణి ఘీంకారాన్ని విన్నాను”
మూసుకున్న కనురెప్పల వెనుక
జంట సూర్యులవంటి ముని నేత్రద్వయం మరుగయింది.
“పరిపక్వత రాలేదు కుమారా
తేలిపోయే బెండు నేలనంటదు
వెళ్ళు, ఇంకొన్నేళ్ళు గడచిరా!”
కొన్ని వేల సూర్యుల
అస్తమయాలను చూసింది గగనం
కొన్ని కోట్ల పూలను
విదిల్చి రాల్చింది వనం
ఎన్నో రేపవళ్ళు పుట్టి పెరిగి
కాలగర్భంలో కలసి కరిగిపోయాయి.
ఒకనాడు…
కురిసిన మంచు తెల్లదనం, కరిగే రాత్రి నల్లదనం
ఇంకా విడివడని ఒక ప్రభాత సమయాన
మళ్ళీ
అదే స్వరం అదే మాట –
“మునిపుంగవా!
ఈ దాసుని తమ శిష్యునిగా స్వీకరిస్తారా?”
తెరచిన ముని కళ్ళలో మళ్ళీ
జంట సూర్యుల ప్రకాశం
“ఇప్పుడు చెప్పు!
ఏయే శబ్దాలను
వచ్చిన దారివెంట విన్నావు?”
“నెలవంక పొదలుకొనే అలికిడి విన్నాను
వినువీథిని తారల గుసగుసలు విన్నాను
వికసించే పూమొగ్గల సుతిమెత్తని సవ్వడిని
ఉషస్సును చూసి తప్పుకునే
చీకటి సడిని విన్నాను
నా యెద లోతుల్లో ఉబికే
కన్నీటి జడిని విన్నాను”
ముని పెదవుల పైనుండి
జ్ఞానం తొణికిసలాడే మృదుహాసం
జాలువారింది.
“కూర్చో,
పాదుకల ప్రక్కన కాదు
పులి చర్మంపై నా సరసన”
తూర్పున
నక్షత్రాలను వీడ్కొలిపిన ఆకాశం
సూర్యునికి స్వాగతం పలుకుతోంది.
(మూలం: తమిళ కవి వైరముత్తు, కొంజమ్ తేనీర్ – నిఱైయ వానం, 2005 (కొంచెం తేనీరు – బోలెడంత ఆకాశం) కవితా సంపుటి నుంచి ‘సబ్దంగళ్ కడందు వా’ అన్న కవిత. మూల కవిత తెలుగు, తమిళ లిపిలో.)