కొలమానం

దూరాన్ని మైళ్ళలో చెబుతాం.

భారాన్ని కిలోల్లో తూస్తాం.

నీటిని లీటర్లలో కొలుస్తాం.

కాలాన్ని సెకండ్లలో లెక్కిస్తాం.

చావుని గణించడం ఎలా? బాధతోనా? వేదనతోనా? ఎలా? డౌటొచ్చింది కత్తిమేకకి. మీరు సరిగానే విన్నారు. అది ‘కత్తిమేకే’, ‘కంచిమేక’ కాదు.

కత్తిమేక పుట్టగానే బొడ్డుకోసి ఎవరూ దానికాపేరు పెట్టలేదు. దానికాపేరుని ఓ కుర్రమేక పెట్టింది. దాని వెనక పెద్ద ప్రహసనమే నడిచింది.

మేకకి సంబంధించినంతవరకూ చావు అనేది, కత్తికీ దాని కుత్తుకకీ మధ్య కార్యకారణ సంబంధం. ఇందులో వాదోపవాదాలకీ తర్కోపతర్కాలకీ తావు లేదన్నది కత్తిమేక ప్రగాఢ విశ్వాసం. చావుని దూరం లాగో, భారం లాగో, కాలం లాగో, వేగం లాగో కొలవడం సాధ్యం కాదని, అన్నీ కలగలిపిన ఓ క్రొత్త ప్రక్రియని కనిపెట్టాలని, చావుని బెత్తడు దూరం నుంచి తప్పించుకొన్నప్పుడే కత్తిమేక నిశ్చయించుకొంది.

మేకకి ఇలాటి అతి తెలివితేటలు ఎక్కడనుంచొస్తాయి, వెటకారం కాకపోతే? అని కొంతమందికి చాలా సందేహాలే రావొచ్చు.

ఏం… ఎందుకు రాకూడదు? అది అన్ని మేకల్లా నానాగడ్డీ తిని బలిసిన మేక కాదు. మఠంలో మేకవన్నెపులుల మధ్య మసిలిన అజ్ఞాని అంతకంటే కాదు. మేనిఫెస్టోల మహత్తు తెలిసిన ఆత్మజ్ఞాని.

దానికి మేషత్వం వుంది. దానికి దానమ్మాబాబూ ద్వారా సంక్రమించిన మెదడుంది. ఆ మెదడు ఎల్లప్పుడూ దాని మోకాళ్ళని తడుముకొంటుంది. దానికీ దేహముంది. అప్పుడప్పుడూ ఆ దేహం ఉప్పు, వర్ర వగైరా కలగలిసిన మసాలాని కోరుకొంటుంది. ఇంకా మనిషికి లేని తోక మేకకుంది. దానితో అది తన మానమర్యాదలని మసిపూసి మారేడురొట్ట చేసుకొంటుంది.

మేకకి ఇంకా అవీ ఇవీ బోలెడన్ని వున్నా… వాటి అవసరం దానికి ఇంతవరకూ రాలేదు. అందుకే, అవి వున్నాయన్న సంగతిని అది మర్చిపోయింది. ఆ అవసరం వస్తే… మరిచిపోయిన సంగతులేవో బహుశా అప్పుడు దానికి గుర్తుకురావచ్చేమో!


‘కస్సాక్… స్సాక్… స్సాక్… స్సాక్…’

కత్తికి సానబడుతున్న కఠోర సంగీతం. చావుకేక రాగం. నెత్తుటి కీర్తన.

ఒకటి కాదు రెండు కాదు, వందల కుంకుడు గింజల్లాటి కళ్ళు. వాటికి రెట్టింపు మడతబందుల్లాంటి కాళ్ళు. కత్తి పదునంచు కుంకుడు గింజల్లో తళుక్కుమంటోంది. బందులదొడ్డికీ, వధ్యస్థలికీ మధ్య వంద బారల దూరం. అక్కడి తెగనరుకుడు, ఇక్కడకి హారీపోటర్ సినిమాలా కనిపిస్తోంది.

‘కసా కసా’ పైకీ కిందకి కదులుతున్న కత్తి. అది మాత్రమే కనిపిస్తోంది మేకల కళ్ళకి. అంతకు మించి అవి పైకి ఎప్పుడూ చూడలేదు. చూసే సాహసం చేయలేదు. అది చావంటే వున్న భయంతోనా? కత్తి మీద వున్న భక్తితోనా? అన్నది వాటి విజ్ఞతకే వదిలెయ్యడం ఉత్తమం.

కత్తికీ, మేక మెడకీ మధ్య వున్నది కాలమా? వేగమా? భారమా? దూరమా? ఎప్పట్లాగే ఆలోచనల్లోకి జారిపోయింది కత్తిమేక.


సర్ మంటూ గాలిని చీల్చుకొస్తున్న కత్తికి స్పీడ్ బ్రేకర్‌లా, ఓ అనామక మేక మెడ అడ్డు తగిలింది. అంతే… మేక మెదడుకీ, దాని మడతబందులకీ మధ్య తంత్రులు తెగతెంపులయ్యాయి. గిలగిల్లాడుతున్న దాని దేహం మొగలాయీ కలలు కంటోంది.

అక్కడ జరుగుతున్న దాన్ని, ఏమీ జరగనట్టే చూస్తున్న కొన్ని అయోమయం మేకలు ఎప్పటిలాగే పోచుకోలు కబుర్లు చెప్పుకుంటున్నాయి.

“కటికోడు. టైటిల్ ఎలావుంది?” అడిగిందో బక్కమేక, ప్రక్కనున్న చుక్కమేకని.

“బాంది… కద రాత్నావా? కవిత్వం రాత్నావా?” కుతూహలం ప్రదర్శించింది చుక్కమేక.

వాటి మాటలకి గతాన్ని నెమరేస్తూ కులాసాగా కునుకుతీస్తున్న ముదరమేకకి మెలుకువ వచ్చేసింది. దిగ్గున లేచి, ‘యూ ఇడియట్స్!’ అన్నట్టు రెండిటి వైపూ ఉఱుముఱిమి చూసింది. ఎదరకాళ్ళని ముందుకి చాపి, వాటిని సగానికి వంచి, మెడని అటూ ఇటూ తిప్పి బద్ధకంగా వళ్ళు విరుచుకొంది. తర్వాత మామూలుగా నిలబడి బక్కమేకనీ చుక్కమేకనీ చూసి సన్నగా నవ్వింది. మేకనవ్వు భలేగుంటది మార్మికంగా. మేక నెమరేసినా నవ్వుతున్నట్టే వుంటుంది.

‘మెమ్మెమ్మే’ అని గొంతు సవరించుకొని… “కుర్రసన్నాసుల్లారా! కతలు, కవిత్వం రాయడమేటిరా? కత చెప్పాల! కవిత్వం చూడాల!” ఆవులిస్తూ ఖాళీగా వున్న మరోవైపు పడుకోవటానికి కదిలింది. అక్కడున్న మేకలన్నిటిలోకీ తానే పెద్ద మేధావినని ముదరమేకకి మహాబలుపు.

అది ఇలా కదిలిందో లేదో… అలా వచ్చిన రెండు చేతులు దాని చెవులు పట్టుకుని బరబరా కత్తిగారి దర్బార్‌లోకి లాక్కుపోయాయి. దాంతో బక్కమేకా చుక్కమేకా అవాక్కయ్యాయి. కాస్సేపు తలవంచి పైకీ కిందకీ ఖుషీగా కదులుతున్న కత్తి వైపు దొంగచూపులు చూశాయి. మళ్ళీ తామేమీ చూడనట్టే రెండూ ఒకదాని కళ్ళల్లో మరొకటి కళ్ళు పెట్టి మాటల్లో పడ్డాయి.

“ఇది నేనసలూహించలే!” ఆశ్చర్యం ప్రకటించింది బక్కమేక.

“దీని కాళ్ళు బలంగా కావిడిబద్దల్లా వున్నాయి, ‘పాయా’కి బాగుంటాయని… ఇందాకా వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. అప్పటికైనా జాగ్రత్తపడాలి కదా! పేద్ద బడాయికి పోయి వాళ్ళ ముందుకెళ్ళి మరీ అంగాంగ ప్రదక్షిణ చేసింది. తొందరపడి ముందరే పరమపదించింది,” నిట్టూర్చింది చుక్క మేక.

“నువ్వైనా, నేనైనా, ఇంకెవరైనా, మేక పుట్టుక పుట్టాకా… ఎవరోకరికోసం, వాళ్ళు వరడైనా, నరుడైనా గిట్టక తప్పదు.” వేదాంతం వల్లించింది బక్కమేక.

“ఏంటీ డైటింగా? మరీ సన్నబడ్డావు!” వాతావరణాన్ని తేలిక చేసే పనిలో పడింది చుక్కమేక.

“ఆ…” అంది బక్కమేక సిగ్గుపడుతూ.

“అయితే… నువ్వు కూడా నీ చావుని మా అందరికన్నా ముందరే ఆహ్వానిస్తున్నావు.”

“నేన్నాజూగ్గా వున్నానని నీక్కుళ్ళు!”

“నీ తలకాయ్.”

“హే… ఏం మాట్లాడ్తున్నావు?”

“మనల్ని ఇక్కడ కుక్కేసి, పొట్టలనిండా రొట్ట ఎందుకు కూరుతున్నారు?”

‘ఏమో’ అన్నట్టు తలెగరేసింది బక్కమేక.

“ఒబీసిటీ కోసం. నిరాహారదీక్ష చేసి నువ్విలా గంటకో గ్రాము తగ్గిపోతున్నావని తెలిస్తే, ముందే వేసేస్తారు.”

“హమ్మో…” గబగబా బక్కమేక, రొట్ట దగ్గరకి పరిగెడుతుంటే… ప్రక్కనే వున్న ఓ గొర్రె తుమ్మింది.

“శుభమా అని మేత మెయ్యడానికి వెళుతుంటే తుమ్ముతావా? యూ బ్లడీషీప్!” బక్కమేక మాటల్లో జాతివివక్ష బుస్సుమంది.


రోజుమారింది.

సీను మారలేదు.

కత్తి వేగంగా మెడని తాకబోతుంటే…

“ఆగు…” గద్దించింది కత్తి మేక.

దాని మాటలో బెరుకు లేకపోవడం, కళ్ళల్లో చురుకు తగ్గకపోవడం కత్తిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇలా ఆఖరి నిమిషంలో మెడలు ప్రాధేయపడ్డం, కత్తికి కొత్తేమీ కాదు. ఆ సమయంలో కళ్ళల్లో బెదురూ, కాళ్ళల్లో వణుకూ కామన్. మాటలో ‘బాబ్బాబ్బన్న’ వేడుకోళ్ళుంటాయి. అయితే కత్తిమేక వ్యవహారం కొంచెం కొత్తగా వుంది.

“ఏం…” మెడకి బెత్తెడు దూరంలో ఆగింది కత్తి.

“నా బదులు ఇంకో మేకనిస్తాను నన్నొదిలెయ్.”

“నువ్వేం చేస్తావ్?”

“డాక్టర్‌తో అపాయింట్‌మెంటుంది. ఆంత్రాక్స్ అని అనుమానం. అన్నట్టు ఇక్కడ డాక్టరుండాలికదా! కనబడడే?” మెడ పొడుగు చేసి అటూ ఇటూ చూసింది.

“ఆ… ఆ… వుండాలి. వాల్ పోస్టర్స్ వెయ్యడానికి బయటకి వెళ్ళుంటాడు…” గతుక్కుమన్న కత్తి, మాటల కోసం తడుముకొంది.

“…”

“ఇంకా ఇక్కడే నిలబడ్డావే, పక్కకి తప్పుకో!”

కత్తిమేక క్రీగంట కత్తిని చూస్తూ స్టైల్‌గా అక్కడ నుంచి కదిలింది.

వరసగా మేకల తలలు తెగిపడుతున్నాయి.

కత్తికీ మెడకీ మధ్య వున్న అప్పు తీరిపోయాకా తలలకి బాధ తెలియడం లేదు.

వధ్యస్థలి నుంచి చాకచక్యంగా తప్పించుకొచ్చిన కత్తిమేకని చూసి, దాని మిత్రమేక చకితురాలయ్యింది. ‘ఇదెలా సాధ్యం?’ అని పడుకొని, వంగుని పరిపరి విధాల ఆలోచించింది. ఇక ఉండబట్టలేక…

“ష్… ష్, ఇదిగో బ్రదరూ” బందుల దొడ్డి బయట విహరిస్తూ లేత ఆకులని పలకరిస్తున్న కత్తిమేకని పిలిచింది.

“నాకూ… తప్పించుకునే కిటుకు చెప్పవా ప్లీజ్!” గుసగుసగా అడిగింది.

“ఇందులో ప్రత్యేకంగా చెప్పడానికి ఏం వుంది? ఏదో కట్టుకథ చెప్పడమే… ఫినిష్!”

కత్తిమేక చెబుతుంటే, మిత్రమేకతో పాటూ ఓ దొంగమేక కూడా ఆ రహస్యం వినేసింది. మొహంలో ఎక్కడా ఆ సంగతిని కనిపించనీయకుండా మనస్సులోనే గంతులేసింది. మిగతా మేకలన్నిటినీ తోసుకుని వెళ్ళి, ముందు వరసలో నిలబడి కనిపించిన ప్రతి మేకకీ కన్నుకొట్టడం మొదలెట్టింది.

రెండు చేతులొచ్చి దొంగమేకని బర్రుమని ఈడ్చుకువెళదామనుకునే లోపే… వాటికి ఆ అవకాశం ఇవ్వకుండా తనే జంకూ గొంకూ లేకుండా వెళ్ళి కత్తి కింద నిలబడి విజిలేసింది.

కత్తి మూరెడు దూరంలో వుండగా….

“ఆగు!” అంది దర్పంగా.

“ఏం… ” అంటూ హుంకరించింది ఆగిన కత్తి.

“ఇంకో మేకనిస్తాను నన్నొగ్గెయ్,”

“ఏం? ఎందుకలా?”

“ఇంటి దగ్గర మా మామగారున్నాడు. ఆయనకో కట్ట తంగేడు రొట్ట ఇచ్చి వస్తాను,” ఆవూ పులి కథని మోడ్రనైజ్ చేస్తూ చెప్పింది దొంగమేక.

ఏ మేక ఎలాటిదో, అది కథ చెబుతుందో, కహానీ చెబుతుందో, ఇలాటివన్నీ తెలుసుకోవడానికి కత్తికి కన్నూ ముక్కూ కాళ్ళూ వ్రేళ్ళూ లాంటి పరికరాలేం లేవు. కానీ కనిపించని నాలుకుంది. అది చాలు, దేన్నయినా ఈజీగా పసిగట్టెయ్యడానికి.

“వావ్… నైస్!” అంటూ ఆగిపోయిన కత్తి నాలుక చప్పరిస్తూ పైకి లేచింది. నిజానికి నరికేటప్పుడు కరుగ్గా వున్నా, కత్తిది చాలా మెత్తటి మనస్సు. తోలు వలిచేటప్పుడు తరచూ ఆ సంగతి బయటపడుతూ వుంటుంది. కానీ చూసే మెడలకి తప్ప, తోలు వలిపించుకునే పీకలకి ఈ విషయం తెలీకపోవడం మేకతాళీయం.

‘నేనింక బయట పడ్డట్టే…’ అనుకున్న దొంగమేక, అక్కడనుంచి కదలబోతుంటే సర్ మంటూ కిందకి దిగిన కత్తి దాని మెడకి కనెక్ట్ అయ్యింది.

అది చూసి షాకైన మిత్రమేక కత్తిమేక వైపు బేలచూపులు చూసింది.

“కథ చెప్పమంటే… ఏకంగా సినిమా చూపించింది. అందుకే అసువులు బాసింది. యూ డోంట్ వర్రీ. నేను చెప్పినట్టు చెయ్యి.” ధైర్యం నూరిపోసింది కత్తి మేక.


కధలు చెప్పి తప్పించుకొన్న కత్తిమేక మిత్రబృందంతో బందులదొడ్డి వెలవెలబోతోంది.

బందులదొడ్డిని మళ్ళీ కళకళ్ళాడించడానికి వచ్చిన కొత్తమేకలు లారీల్లోంచి ‘మేమే’ పాటలు పాడుతున్నాయి.

“ఒకట్రెండు… మూన్నాలుగు… ఐదారు…”

“ఏంటి లెక్కపెడ్తున్నావు?” కుర్రమేకని అడిగింది గడ్డంమేక.

“మనం ఎంత మందిమి మిగిలామా అని…” చెప్పింది కుర్రమేక తమ జనగణనని ఆపకుండా.

“మిగలడమా? హ్హు… కత్తి నుంచి తప్పించుకోవడం అంటే చావునుంచి తప్పించుకోవడం కాదు. బతుకుని పొడిగించుకోవడం. చంపేవరకూ కత్తి మన మెడమీద వ్రేళ్ళాడుతూనే వుంటది,”

“ఈరోజుతో భూమ్మీద మనకి ఆకులు చెల్లిపోయినట్టేనా?”

“తప్పదు. కత్తికీ పీకకీ వున్న అనుబంధం అలాటిది. మౌనంగా వెళ్ళి మెడ వంచడమే.”

“ఆకులు, అలములు, చెట్లు, చేమలు వీటన్నిటినీ వదిలి మనం అంతరించిపోతామా? నాకు భయమేస్తోంది మామా. ఈ కత్తి మనల్నే ఎందుకు చంపేస్తోంది? మనకంటే రెండుకాళ్ళ జంతువులు కోకొల్లలుగా వున్నాయి కదా! హాయిగా బతుకుతున్నాయి కదా?” గగ్గోలు పెడుతోంది కుర్రమేక.

“అవి చస్తే, ఎవరికి ఉపయోగంరా? ఎవడన్నా కోసి కూరొండుకోగలరా? మన చావులో పరోపకారం వుంది.” ఊరడించింది గడ్డంమేక.

“అంతేనా! ఉప్పూకారం, గడ్డీ గరంమసాలా కూడా వున్నాయా?” దూరంనుంచి ఆలకిస్తున్న కత్తిమేక గొణుక్కుంటూ అక్కడకి వచ్చింది.

“ఏంట్రా అల్లుడూ… పొద్దుపొద్దున్నే ఏంటి అల్లరి?”

“నాకు బతకాలని వుంది మామా!” బావురుమంటూ దాని పొట్టలో బుర్రెట్టింది కుర్రమేక.

“ఉరుకో… ఊరుకో…”

“నేను చూడాల్సింది, అనుభవించాల్సింది చాలా వుంది,” కుర్రమేక గారం గుడుస్తుంటే… దాని లేతకొమ్ములు కత్తిమేక మెత్తటి పొట్టలో చురుక్కుమని గుచ్చుకుంటున్నాయి. దాన్ని ఎలా ఓదార్చాలో అంతుబట్టక కత్తిమేక మీనమేషాలు లెక్కపెడుతోంది.

బక్కమేక, చుక్కమేక, కుర్రమేకని ప్రక్కకి తోసుకుంటూ పోయి కత్తిమేకకి వెసులుబాటు కల్పించాయి.

కత్తి యథాప్రకారం కొలువు దీరింది.

“అటు చూడండి,” గంభీరంగా అంది కత్తిమేక.

మేకలన్నీ కొలువుదీరిన కత్తివైపు కలవరంగా చూశాయి.

“రోజూ కనిపించేదే. ఏం వుంది చోద్యం?” వెక్కిరింపుగా అంది తిక్కమేక.

“మనం ఇప్పటిదాకా కత్తినే చూస్తున్నాం. దాన్ని చూసే భయపడుతున్నాం…”

మేకలు మౌనంగా కత్తినీ, కత్తిమేకనీ మార్చి మార్చి చూస్తూ వింటున్నాయి.

“…కానీ ఈరోజు కత్తిని పట్టుకున్నవాడు కనిపిస్తున్నాడు.”

“కొత్తగా వీడెందుకు వచ్చాడు మధ్యలో?” పాయింటు లాగింది చుక్కమేక.

“వీడు మధ్యలో వచ్చినవాడు కాదు. ఆది నుంచీ వున్నవాడే. మనం ఆపదలో పడితేగానీ అసలైనవాడు కనబడలేదు.”

మేకలన్నీ కొంచెం మెడలని పైకి లేపి చూశాయి.

కత్తితోపాటూ కత్తిని పట్టుకున్న చేయి కనబడింది.

“కత్తి దానంతట అది మనల్ని నరకడం లేదు. కత్తితో వాడు మనల్ని నరుకుతున్నాడు. తప్పు కత్తిదనుకున్నాం. కాదు మనదే. తలపైకెత్తి చూడకపోవడం. భయంతో తలదించుకోవడం. మన ఎముకల్లో మూలుగు బదులు భయం దూరింది.”

“దీన్నే సంధిప్రేలాపన అంటారు!” తిక్కమేక కోపంగా తలాడించింది. దాంతో దాని కొమ్ము గడ్డంమేకకి చురుక్కుమని గ్రుచ్చుకొంది.

“అబ్బ… చచ్చాను! తిక్కతిక్కగా వుందా?” బాధగా అరచింది గడ్డంమేక.

“చూసుకోలేదు…”

“తల తెగాకా ఇంక చూడ్డానికి ఏం ఉంటదిలే…”

“దీని కొమ్ముపోటు కన్నా ఆ కత్తివేటే నయం. మొన్న నన్నూ అలాగే పొడిచేసింది. చచ్చాననుకున్నాను.” బక్కమేక గడ్డంమేకకి వత్తాసు వచ్చింది.

బక్కమేక మాటలకి కత్తిమేక ఓసారి తలతిప్పి అర్థవంతంగా నవ్వి, మళ్ళీ కత్తి వైపు తల తిప్పింది.

“కత్తిని ఆడించేవాడొక్కడే. కానీ వేటేయించుకునేవాళ్ళం వందలు, వేలు, లక్షలా!” చిర్రుబుర్రులాడింది కుర్రమేక.

“…”

“మనం పదిమందే కదా ఇక్కడ మిగులత! కత్తినైనా, కత్తినాడించేవాడినైనా ఇంక పీకేదేముంది? మన చావు మనం చస్తే, ఇంకో కొత్తమంద వచ్చి ఇక్కడ మెడ వంచుతుంది,” తిక్కమేక గుక్క తిప్పుకోకుండా ఉపన్యసిస్తోంది.

“…”

కత్తికి సానపెట్టి, పదును పరీక్షించిన కసాయి వచ్చి బందులదొడ్డి తలుపు తెరిచాడు.

“ఖామోష్!” గట్టిగా అరిచింది కత్తిమేక.

మేకలన్నీ గప్‌చిప్ అయిపోయాయి.

“అంతా నేను చేసినట్టే చెయ్యండి, కమాన్ క్విక్!” నాలుగడుగులు వెనక్కి వేసింది.

కసాయి మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు. చేతిలో కత్తి విలాసంగా నాలుక ఆడిస్తోంది.

“రడీ…”

“రడీ. డీ.. డీ…” మేకలన్నీ కోరస్‌గా అరిచాయి.

“కుర్రమేక వన్ టూ త్రీ… అనగానే అందరం పరిగెత్తుకెళ్ళి కుమ్మేద్దాం, నా కొడుకుని… కే?”

“కె కె కె!” కేరింతలు కొట్టాయి మేకలన్నీ.

“వన్…”

కుర్రమేక లెక్క మొదలెట్టింది.

“టూ…”

కసాయి దగ్గరకొచ్చేస్తున్నాడు.

“త్రీ…”

అంతే! గేలప్ అందుకున్న మేకలన్నీ వెళ్ళి మూకుమ్మడిగా కసాయిని కసకసా పొడిచేశాయి.

జరిగిన దాడి చూసిన కత్తి బిత్తరపోయింది.

కసాయి బాధగా కత్తిని త్రిప్పుతూ మేకలని కట్టడి చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ… లాభం లేకపోయింది. చేతిలోని కత్తి జారి కిందపడింది.

“మావా, నువ్వు కత్తి!” అంది కుర్రమేక.

కసాయినీ కత్తినీ తొక్కుకుంటూ మేకలు మేతకి బయలుదేరాయి.


ఇది జరిగిన చాన్నాళ్ళకి కత్తికి, మళ్ళీ కత్తిమేక కనిపించింది. ముందు అది అదేనా? కాదా? అని అనుమానమొచ్చినా… గుర్తు పట్టింది. కానీ అదే కత్తిని గుర్తు పట్టలేక పోయింది. వార్ధక్యం వల్ల కత్తిమేక చూపు మందగించింది.

చుట్టూ వున్న నాలుగైదు మేకల మధ్య సాగిలబడి, సాధువులాగా ఏదో మేతోపదేశం చేస్తోంది.

“గురూగారూ… ఇంతకీ చావుకి నిర్వచనం కనిపెట్టారా? కొలమానం ఏంటి?” సందేహం వచ్చిన ఓ శిష్యమేక గొంతు సవరించుకొని అడిగింది.

“సందేహాలే చావుక్కారణం. చావంటే మెడకాయమీద తలకాయ లేకపోవడం. చచ్చేదాకా సాగదీయడమే దాని కొలమానం…” అంటూ ఏదో మకతికగా చెప్పడంతో మేషబృందం కత్తిమేక కాళ్ళని పరవశంతో నాకాయి.

“నీ మొహం. నువ్వూ నీ చావు తెలివితేటలూ! చావుకి కాలమానమే కానీ కొలమానం లేదు.” గంభీరంగా అంటూ తమ మధ్యకి వచ్చిన కత్తిని చూసి అక్కడున్న మేకలన్నీ తలోదిక్కుకీ పటాపంచలయ్యాయి.

లేచి పరిగెత్తే ఓపిక లేకపోవడంతో కళ్ళు విప్పార్చి చూసిన కత్తిమేక కత్తి ముందు మెడ వంచింది.

కత్తిమేక వైపు జాలిగా చూసిన కత్తి, దాని మానాన దాన్ని వదిలేసి పరిగెడుతున్న మేకల వెనకపడింది.