శిక్ష

‘ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః బలదేవానంద సాగరః ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ… ధ్రీ ధ్రీ ధ్రీ…’

“కెవ్…”

గుండెలవిసేలా ఆర్తనాదం వినపడ్డంతో న్యూఢిల్లీ స్టేషన్ నుంచి సంస్కృత వార్తలు చదువుతున్న బలదేవానంద సాగరులవారు ఉలిక్కిపడ్డారు. ఆకాశవాణి ఫ్రీక్వెన్సీ తెగిపోయ బర్ర్… రర్రర్ అనడం మొదలెట్టడంతో ఆరోజు పెదలంకలో శ్రోతలకి సంస్కృత వార్తలు కరవయ్యాయి.

దీనంతటికీ కారణం…

స్నానం చేస్తున్న చిరంజీవి చేతిలోంచి కొత్త లైఫ్‌బాయ్ సబ్బు జర్రున జారిపోవడమే. జారిపోయిన లైఫ్‌బాయ్ జారిపోయినట్టుండకుండా పోయి పోయి వాడి కుడికాలి చిటికెన వ్రేలుని చితగ్గొట్టేసింది.

దాంతో ‘కెవ్’మన్న ఓ భయంకర ఆర్తనాదం ఆకాశమే హద్దుగా వాడి నోటినుంచి వెలువడింది.

ఆ కర్ణకఠోర, ఆర్తారావానికి దిక్కులు పిక్కటిల్లాయి.

వీధిలో వార్తలు విడమరచి చెబుతున్న మర్ఫీ రేడియోకి కంఠనాళాలు బిగుసుకుపోయి, మాట పడిపోయి డుర్… డుర్‌రని దగ్గడం మొదలెట్టింది.

గున్నమామిడి గుబురుకొమ్మల్లో కాయల్ని దొంగచాటుగా కొరికి తింటున్న రామచిలకలు బెదిరిపోయి, ఏంచేయాలో తెలీక తలోవైపూ పారిపోయాయి.

దూళ్ళపాకలోని అల్లుడూ మామా గిత్తలు ఆశ్చర్యంగా చూరుకిందనుంచి ఏం జరిగిందో చూద్దామని ప్రయత్నించినా మెడ తాళ్ళు లాగిపెట్టెయ్యడంతో అంబా అంటూ మోరలెత్తి విషాదాన్ని ప్రకటించాయి.

కూద్దామని రెక్కలు టపటపా కొట్టుకుంటున్న కొత్తగా కూతట్టిన కుర్ర కోడిపుంజుకి ఆ కూత గొంతులోనే అడ్డడి పోవడంతో అది ఉక్కిరిబిక్కిరయిపోయింది.

బియ్యంలో రాళ్ళేరుతున్న వాళ్ళ పిన్ని పూర్ణ చేతిలోంచి ఆ బియ్యంపళ్ళెం కిందపడిపోయి టంగ్ టంగ్‌మంటూ గిరగిరా తిరగడం మొదలెట్టింది.

పైత్యం విరగడానికి పరగడుపునే వేడి వేడిగా అల్లం రసం చప్పరిస్తున్న వాళ్ళ అమ్మని పూసిన కొమ్మ బంగారమ్మ చేతిలోని ఇత్తడి గ్లాసు భయంతో గజగజ వణికి ఆ రసాన్ని కాస్తా ఆవిడ తెల్లచీరచేత గడగడా తాగించేసింది.

మంచినీళ్ళు తోడుతున్న నారాయుడి పెళ్ళాం చేతిలోని చేదతాడు పట్టుదప్పి అది నూతిలోకి బుడుంగున జారిపోయింది.

పెరట్లో ఇంత ఘోరం జరిగి, పశుపక్ష్యాదులతోపాటూ ప్రకృతి యావత్తూ తల్లడిల్లిపోతున్నా వీధి వసారా గదిలో తన్నిపెట్టి పడుకున్న చిరంజీవి మేనమామ రామన్నయ్య మాత్రం కించిత్తు కూడా చలించలేదు. ప్రసారంలో ఏర్పడ్డ అంతరాయంతో బర్ బర్ మంటున్న రేడియోని పలికించడానికి దాని డిప్ప మీద టపటపా కొడుతూ ఉండిపోయాడు. ఇదంతా రోజూ జరిగే భాగోతమే కదా! అన్నట్టు…

“ఏమయ్యిందమ్మా?” అంటూ బంగారమ్మగారూ,

“ఏమయ్యిందిరా?” అంటూ పూర్ణ,

ప్రశ్నలతో పాటే ఉన్నచోటు నుంచి ఒక్క ఉదుటున చిరంజీవి వైపు దూసుకొచ్చేశారు.

“ఈ దున్నపోతుముండ నా ఏలిరిచేసిందేవ్ పూన్నా…” అంటూ ఆరున్నొక్కరాగం అందేసుకున్నాడు. కింద పడ్డ సబ్బుని రెండో కాలితో తన్నుతూ.

చిరంజీవి నిలబడ్డ పీట అప్పటికే సబ్బునీళ్ళతో జిడ్డు పట్టేయడంతో సబ్బుని తన్నిన కాలు జర్రున జారి పీట మీద కుదిమట్టంగా కూలబడిపోయాడు. మొదటిదానికన్నా జారిన కాలు మరీ అవమానం చెయ్యడంతో ఏడుపు మొదట్నుంచీ మళ్ళీ వినసొంపుగా మొదలయ్యింది.

“ఇంకొకళ్ళు రుద్దుకొన్న సబ్బు నాకొద్దంటూ కొత్త సబ్బు తీసుకున్నావ్, అదలా గట్టిగానే ఉంటది మరి!”

“ఇలా ఎలా పడిపోయావురా! ఏదీ చూడనీ…” అంటూ కిందబడ్డ చిరంజీవిని ఎత్తుకొని కొంచెం దూరంగా తీసుకొచ్చి నిలబెట్టింది పూర్ణ.

ఒంటికాలిమీద నిలబడ్డ చిరంజీవి వంటిమీదనున్న సబ్బునీళ్ళని శుభ్రంగా కడిగి చూసేసరికి చితికిన చిటికెన వేలుమీద పిసరంత రక్తపు చారిక కనిపించింది.

అది చూసిన బంగారమ్మగారు “శుబ్రంగా సున్నిపిండి నలుచుకుని చెయ్యకుండా ఎదవ సబ్బులూ షోకులూనూ… చూడు ఏం జరిగిందో! మీ అమ్మకిప్పుడు ఏం సమాధానం చెప్పాలి?” అంటూ చిరంజీవి మీద చిర్రుబుర్రులాడారు.

“అబ్బ మీరుండండమ్మా… దెబ్బ తగిలి వాడేడుస్తుంటే మీ ఉపన్యాసాలూ మీరూనూ! అప్పకిదేమన్నా ఇప్పుడు కలొచ్చేస్తదా… ఏంటి?” అంటూ చిరంజీవిని తీసుకుపోయి వంటగది గుమ్మం దగ్గర ముక్కాలి పీటమీద కూర్చోబెట్టింది పూర్ణ.

బంగారమ్మగారు తన రంగుమారిన సన్నచీరని పర్రుమంటూ చింపి, ముక్కాలిపీట పక్కనే నేలపీటమీద చతికిలబడ్డారు.

“ఆ కాఫీపొడుండబ్బా పంచదారగిన్నీ ఇలా పట్రా…” అంటూ పూర్ణకి పురమాయించారు.

అల్లం రసం వొలికి కర్రులుపడ్డ ఆవిడ చీరని ఎంత ఉతికిస్తే మాత్రం తెల్లబడుతుంది కనుక. ఇంక దాని బతుకు ఆ దెబ్బలకీ ఈ దెబ్బలకీ ఇలా కట్లు కట్టుకుంటూ తెల్లారాల్సిందే పాపం.

“అమ్మమ్మో… నెప్పెట్టేత్తంది. చచ్చిపోతానో ఏంటో!” అనుమానం పడ్డాడు చిరంజీవి.

“ఈ మాత్రం దానికే చచ్చిపోతారేమిట్రా సన్నాసని? అసలే నీ పేరు సిరంజీవి. సిరంజీవిలేం చచ్చిపోరు.” భరోసా ఇచ్చారు బంగారమ్మగారు.

“మరి త్రిలోచన్రాజుగారు కొత్తెం మీద కొబ్బరికాయ పడితే చచ్చిపోలేదేటి?”

“అదేరు… ఇదేరు… దిక్కుమాలిన ప్రశ్నల్తో చంపూ తినకు…”

చింపిన గుడ్డలో కాసింత కాఫీ పొడి, కూసింత పంచదార వేసి చిరంజీవి చిటికెన వేలికి బంగారమ్మగారూ పూర్ణా కలిసికట్టుగా కట్టుకట్టి సత్వర చికిత్సనందించారు. కట్టు కట్టిన తర్వాత వాడి చిటికెన వేలు కాస్తా బొటనవేలి బాబంతయ్యింది.

“అటూ ఇటూ గంతులెయ్యకుండా కుదురుగా కూర్చో… అదే తగ్గిపోద్ది.” హెచ్చరించారు బంగారమ్మగారు.

పూర్ణ చెయ్యందిస్తే నెమ్మదిగా కుంటుకుంటుకుంటూ వెళ్ళి లాగూ చొక్కా తొడుక్కున్నాడు.

“ఆ పుతకం ఇలా పడెయ్ బళ్ళోకి పోయొత్తా,” అన్నాడు దువ్వెనతో తలకి ఎంటీవోడిలా బుట్ట తీసుకుంటూ.

“అప్పుడే తగ్గిపోయిందేంటి? రెండ్రోజులు బడీ గిడీ అక్కల్లేదు. కుదురుగా ఇంట్లో కూర్చో. తగ్గాకా వెళ్దువు గానిలే…”

“ఇంట్లో కాలీక్కుచ్చొని ఏంజెయ్యాలి? ఉల్లిపాయలు కానీ ఒలాలా?”

“ఉల్లిపాయలూ ఒలొద్దు, ఉసిరికాయలూ కోయొద్దు. ఇంచక్కా పడక్కుచ్చీలో కూచ్చొని పాటలు పాడుకో,” అంటూ పూర్ణ అక్కడే ఉన్న తువ్వాలుతో వాడి తలకి ముచ్చటగా పగిడీ చుట్టింది.

“పంచి కూడా కడతావా?” మురిపెంగా అడిగాడు.

పాగా కర్రనున్న కండువా లాగి, వాడి నడ్డి చుట్టూ రెండు తిప్పులు తిప్పిన పూర్ణ పంచెకట్టుని మమ అనిపించిండంతో దసరాబుల్లోడులా ఫీలైపోయిన వాడు వీధిలోకి వెళ్ళి దర్జాగా వాలుకుర్చీని అలంకరించాడు.

“ఏదయా… మీదయా మామీద లేదు…” అంటూ దసరా పద్యాన్ని లంకించుకున్నాడు.

“పగటి వేషగాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు?” వసారా గదిలోంచి మేనల్లున్ని చూస్తున్న రామన్నయ్య అరిచాడు.

“నువ్వు కాస్సేపు ఊరుకో అన్నయ్యా! ఇప్పుడు వాడు మళ్ళీ బాకా ఊదడం మొదలెడితే, రేపు మధ్యాహ్నం దాకా ఆపడు!” హాల్లోంచి బతిమాలుతున్నట్టుగా చెప్పింది పూర్ణ.

దసరా పద్యాలకి బ్రేక్ ఇచ్చి, తనని పగటి వేషగాడన్న రామన్నయ్య వైపు కొరకొరా చూసిన చిరంజీవి కిర్…కిర్…కిర్…మని కిర్రు చెప్పుల చప్పుడు వినిపించడంతో వాకిలి వైపు తల తిప్పాడు.

కాకీ నిక్కరూ ఖద్దరు బనీనూ తొడుక్కున్న చిన్నబ్బులు దారంటా నడుచుకుంటూ పోతున్నాడు. వాడు అసలే వంకర. వళ్ళంతా వెటకారమే. ఆ సంగతి ఊళ్ళో వాళ్ళందరితో పాటూ చిన్నవాడైనా చిరంజీవికీ బాగా తెలుసు. అయినా తాను కూర్చున్న కుర్చీకి, కట్టుకున్న పంచెకి, చుట్టుకున్న పగిడీకి ఆమాత్రం ఈమాత్రం మర్యాద ఆపాదించాలన్న దుగ్ధ మనస్సులో ఇంతై అంతై వటుడింతై అన్నట్టు పెరిగిపోగా గొంతులోకి ఎక్కడలేని పెద్దరికాన్ని అరువు తెచ్చుకొని…

“ఒరే… అబ్బులూ… ” అని ఏదో పెద్ద పనున్నట్టు పిలిచాడు.

చిరంజీవిని చూసిన చిన్నబ్బులుకి మదిలో బోలెడన్ని చిలిపి ఊహలు ముసిరి లోపలకి వచ్చాడు.

“దా కూర్చో… ఏంటి సంగతులు? ఎక్కడకి బైల్దేరావు?” ఆరాగా అడిగాడు చిరంజీవి.

“దాట్లోరి దున్నపోతు ఈనిందంటే దూడకి తాడేద్దామని వెళ్తున్నానండి. అరిజంటు పనేమైనా వుందా? వుంటే చెప్పండి ఫర్లేదు. మీ తర్వాతే ఎవరైనా…” అన్న చిన్నబ్బులు అరుగుమీద స్థంభానికి ఆనుకుని కూర్చుంటూ, “పూర్ణమ్మగారు కాంత టీచుక్క పెట్టి అంపండి. చిరంజీగారి పనిలో బిజీగా వున్నాను…” లోపలకి చూస్తూ అరిచాడు.

“పెన్మెత్సోరి పెరట్లో పాము గుడ్లెట్టిందంట, పొదిగేసి ఒత్తావేటీ? ఆళ్ళతో ఈళ్ళతో ఆడినట్టు నాతో ఏళాకోలాలాడకురోయ్… వళ్ళు మండిపోద్ది!” వేలితో హెచ్చరిస్తూ అన్నాడు చిరంజీవి.

ఆ దెబ్బతో రెండు మూడు కేజీల ఖంగుతినేసిన చిన్నబ్బులు కొంపదీసి ఎవరైనా విన్నారా ఏంటి? అన్నట్టు అటూ ఇటూ దొంగచూపులు చూశాడు.

“ఏరా జబ్బు కట్టేసిందా? కుర్రోళ్ళ జోలికీ చేతిలో కర్రున్నోళ్ళ జోలికీ వెళ్ళకూడదంటారు అందుకే…” వసారా గదిలోనుంచి రామన్నయ్య మాట వినిపించడంతో అటు తలతిప్పిన చిన్నబ్బులు “మీరిక్కడే వున్నారేంటి? భూవికి జానా బెత్తెడు లేరు కానీ ఈయనకి కడుపు నిండా కబుర్లేనండి! ఎక్కడనుంచొస్తాయో? వసెక్కువ పోసేసినట్టున్నారు పెద్దయ్యగారు!” అన్నాడు చిన్నబ్బులు, మాడిపోయిన మొహానికి వెకిలినవ్వు పులుముకుంటూ.

“అల్లరికి అమ్మా నాన్నా కింద తయారయ్యేడీమధ్య. ఊళ్ళో గొడవలన్నీ ఈడికే కావాలి!” చెప్పాడు రామన్నయ్య.

“యాండె చిరంజీగోరూ! అమ్మమ్మగారింట్లో కూర్చొని ముప్పొద్దులా మేస్తన్నా మనిషి సాగడం లేదేటండి మీరు? పిండేసి కాలవ తవ్వు… తవ్వెయమంటారా? చెరుకుగడలా రివ్వునెదిగిపోతారు!” అన్నాడు చిన్నబ్బులు. బనీను జేబులోంచి పొగాకు బొండం తీసి చుట్ట చుట్టుకుంటూ.

“చాలా ఎక్కువ చేత్నావురా! ఇయ్యాళ నువ్వు నా చేతిలో అయిపోయేవుండు నీపని చెప్తా…” అంటూ చిన్నబ్బులుని కొట్టడానికి కుర్చీలోంచి లేచిన చిరంజీవి, పంచె కాళ్ళకడ్డంబడ్డంతో ముందుకు తూలిపడ్డాడు.

చిరంజీవిని కిందపడకుండా పట్టుకున్న చిన్నబ్బులు “అందుకే తన కోపమే తన శత్రువు అంటారు. బళ్ళో మేట్టారు చెప్పలేదా?” అన్నాడు.

వాడి చేతుల్లోంచి విడిపించుకున్న చిరంజీవి అవమానభారంతో బుసకొట్టాడు. పంచె, పగిడీ ఊడబీకి పారేసి వాడిని పిష్షుం…పిష్షుం… అని కసిదీరా రెండు గుద్దులు గుద్ది, చేతులు నెప్పెట్టడంతో “నీ పనిలా కాద్రా, కొరడా కర్ర తెస్తానుండు…” అంటూ లోపలకి పరిగెత్తాడు, వేలిక్కట్టిన కట్టూడిపోయినా పట్టించుకోకుండా.

“కొరడా సంగతి తర్వాత, ముందు మాయగార్ని అన్నయ్యని కాకుండా మాయా అని పిలడం నేర్చుకోండి. జనం కంఫ్యూజన్‌తో చత్తనారు!” వెనక నుంచి అరిచాడు చిన్నబ్బులు.


కొరడా కర్ర గురించి వెతికిన చిరంజీవికి అదెక్కడుందో కనిపించలేదు. ఈ సూరిగాడెదవెక్కడ పెట్టేశాడో దాన్ని. సూరిగాడు గుర్తుకురాగానే వాడికి ముంజకాయలు గుర్తుకువచ్చాయి. అవి గుర్తుకురాగానే చిన్నబ్బులని మర్చిపోయి సూరిగాన్ని వెతుక్కుంటూ తోటలోకి పరిగెత్తాడు.

“సూరీ… సూరీ…” అని గట్టిగా పిలిచాడు నడుస్తూనే.

వాడు ‘కూ’… అనలేదు. ‘కూకూ’ అనలేదు.

ఈవేళప్పుడు, ఎక్కడకి పోయేడు? ఇంటి దగ్గరుండడే… పోనీ చూసొద్దాం. ఏంపోతది! అని అటు పరిగెత్తాడు.

దారి పొడవునా వాడికి బోలెడు పెత్తనాలు. తనెక్కడకి బయలుదేరానా అన్న సంగతి మర్చిపోయి, కనిపించిన వాళ్ళందరి బుర్రలూ గంటా రెండు గంటల పాటూ తినేసి, కాస్సేపటికి అసలు విషయం గుర్తొచ్చి, సూరిగాడింటి ముందు ప్రత్యక్షమయ్యాడు.

సూరిగాడి తాటాకింటి చుట్టూ కొబ్బరాకుల దడి వుంది. తలుపు తోసుకొని లోపలకి పోయాడు. ఎక్కడా మనిషి అలికిడి లేదు. పెరట్లో కొబ్బరి చాపలతో కట్టిన స్నానాల గది వుంది. దానికో గోనె బరకం పైనుంచి తలుపులాగా వేళ్ళాడుతోంది. లోపల నుంచి నీళ్ళ చప్పుడుతో పాటూ గాజుల సవ్వడీ వినిపిస్తోంది.

“సూరీ… సూరీ…” పిలిచాడు చిరంజీవి.

“…”

“సావిత్రీ… సావిత్రీ…”

“ఎవరండీ… సిరంజీబారా… ఎవరో అనుకొని హళ్ళిపోయేను!” స్నానాల గదిలోంచి సూరిగాడి పెళ్ళాం సావిత్రి బెదురు గొంతుతో బదులు పలికింది.

“నేనే! ఏడే నీమొగుడు? ముంజకాయలు కొడతానన్నాడియ్యాల. లోపలేంజేత్నావు నువ్వు? మీ అమ్మెక్కడకి పోయింది? ” ప్రశ్నల వర్షం కురిపించేడు.

“పైకోసుకుంట్నానండి. ఆ లంజిముండని, ఈది గుమ్మంలో కూకోమన్నాను. లేదా? పెత్తనాలకి ఎక్కడకి పోయిందో! రానీండి చెబ్తాను…”

స్నానాల గదిలోంచి బయటకి వస్తున్న నురగ నీళ్ళు చిరంజీవి కంట్లో పడ్డాయి.

“ఏం సబ్బే అది, లైబ్బోయేనా? జాగ్రత్త, చేతిలోంచి జారితే వేలు చిదిగిపోద్ది!”

“కాదండి… లచ్చు!”

“లచ్చా! అదెలా వుంటదది… ఎప్పుడూ చూల్లేదు. ఏదీ… ఓసారి చూపించు.”

“అయబాబోయ్! లోపలకి రాకండె, బాబ్బాబు…” లబలబలాడింది లోపలనుంచి సావిత్రి.

“వత్తే ఏం అవుద్ది…వస్తనా!”

“వద్దండి… చిన్నపిల్లలిలా రాకూడదు.”

“పెద్ద పిల్లలు రావొచ్చా! నేనూ పెద్దోన్నే… రెండక్లాసు!”

“మీకు చెప్పడం నా వల్ల కాదు. రాకండే… వత్తే నా మీదొట్టే, వట్టు తీసి గట్టుమీదెట్టడాల్లేవ్!” అస్త్రం ప్రయోగించింది సావిత్రి.

“సావిత్రీ… లచ్చేంటే తాతనాన్న వాసనొస్తంది!” అడిగాడు ముక్కెగబీలుస్తూ.

లోపల చన్నీళ్ళ స్నానం చేస్తున్న సావిత్రికి వళ్ళంతా చమట్లు పట్టినట్టయ్యింది… వాడి ప్రశ్నకి.

“తాతనాన్నోసనేటండే?”

“అదే… నూజ్జాన్…పిటాపురం సెంటు బుడ్డోసన…”

“అలా ఎందుకొత్తది? లచ్చు లచ్చే… నూజ్జాన్ నూజ్జానే! అది సబ్బూ ఇది సెంటూ. మీరింటికెళ్ళి పోండి. సబ్బు నేను తెచ్చి చూపింతా నానాక. నా బుజ్జి కదూ…” బామాలింపుగా అంది.

“నేనేం చూట్టంలేదులే. అరుగుమీదే కదలకుండా కూచ్చున్నా. భయపడ్త్నావెందుకు?”

“నేను బట్టలు కట్టుకోవాలి. పోనీ, ఆ ఈదేపుకెళ్ళి మాయమ్మొచ్చిందేమో చూడండి.”

“నాకేం… నేను చూడను.” అన్న చిరంజీవి అరుగు మీద బోర్లించిన గంప కనిపించడంతో అటు నడిచాడు.

“సావిత్రీ… గంప కింద కోడి గుడ్డెట్టిందేమో! చూడనా?”

“అయ్యబాబోయ్ వద్దండే! మీకు దన్నవెడతాను మీరెళ్ళిపోండేబాబూ. లమ్మా… లమ్మా…” గట్టిగా అరవడం మొదలెట్టింది.

వాళ్ళమ్మ ఉలక లేదు పలకలేదు.

గంప ఎత్తి చూసిన చిరంజీవి అక్కడ కోడిపెట్ట బదులు తాతనాన్న బెల్టు చెప్పులు కనిపించడంతో ఆశ్చర్యచకితుడయ్యాడు.

‘సావిత్రి మంచిదనుకున్నాను. దొంగముండన్న మాట! తాతనాన్న చెప్పులు దొబ్బుకొచ్చేసింది. అందుకేనేమో… నేను రాగానే భయపడి చస్తంది! దాచెయ్యమనేమో అమ్మా అమ్మా అని చీరుకుంటోంది. నాదగ్గరా నీ దొంగేషాలు… హన్నా! ఎవరూ చూడకుండా ఈ చెప్పులు ఇంట్లో వేసుకుని తిప్పుకుంటూ తిరుగుదామనా? పాపం తాతనాన్న చెప్పుల్లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో… ఎన్ని ముల్లు గుచ్చూ పోయాయో ఏంటో! అర్జంటుగా ఇవి పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చెయ్యాలి’ అని తీర్మానించుకున్నాడు.

అటూ ఇటూ చూసేసరికి అరుగుకి ఓ మూల తడపలకట్ట కనిపించింది. ఇంటిలోపల నుంచి నూర్జహాన్ సెంట్ వాసనొస్తోంది. ‘ఈ దొంగముండ తాతనాన్న సెంటు సీసా కూడా దొబ్బుకొచ్చేసిందేమో… ఎక్కడ దాచేసిందో ఏంటో? కనిపెడదాం.’ అని లోపలకి వెళ్ళేంతలో తలుపులు రెండూ దబాల్న మూతడిపోయేయి. ‘ఇదేంటిది దయ్యం కానీనా?’ అన్న అనుమానంతో చిరంజీవి గుండెలు దడదడలాడాయి. లోపలకి వెళ్ళే ప్రయత్నం విరమించుకొని రెండు తడపలని గబ గబా తాడులా ముడేసి, దానికి తాతనాన్న చెప్పులని కట్టేసి, చప్పుడు చేయకుండా ముగ్గొట్టాన్ని ఈడ్చినట్టు ఈడ్చుకుంటూ పోయాడు.

ఆదరా బాదరాగా తడి వంటికి చీర చుట్టుకొనొచ్చిన సావిత్రికి చిరంజీవి ఎక్కడా లేడు. అటు ఇటూ గాబరాగా వెదుకుతుంటే అరుగుమీద తిరగేసున్న గంప కనిపించి, అక్కడ చెప్పుల్లేకపోవడం చూసి అది బిక్కచచ్చిపోయింది.

“చంపేశాడు కుర్రెధవ! వెళ్ళిపోయేడా?” అని అడిగారు, తలుపుచాటు నుంచి బయటకి తొంగిచూసిన తాతనాన్న.

“వానొచ్చి ఎలిసినట్టెళ్ళిపోయేరు. ఎళతా ఎళతా నా కొంపముంచడానికి మీ చెప్పులట్టూ పోయేరు!” ఏడుపొక్కటే తక్కువ సావిత్రికి.

“ఇప్పుడెలా? అసలే కొత్త జోళ్ళు. జోడు లేపోతే ఒక్కడుగెయ్యలేన్నేను…” అన్నారు తాతనాన్న ఆందోళనగా.

“ఏమో… అంతా కలిపి నా కాపరం చెడదొబ్బీలా వున్నారు. మా యమ్మేది?”

“సిగరెట్ పెట్టి తెమ్మని పంపేను.”

“గోదాట్లో దూకాల్సింది. ఇంకా ఇక్కడే గుడ్లెడత్నారేం? ఎంతో దూరం ఎల్లుండరు. ముందా జోళ్ళు తీసుకోండి. లేపోతే ఊరంతా రేడియో వార్తల్లా చెప్పుకుంటాపోతారు. ఆ చిన్రాజు సంగతి మీకు తెలదా? వట్టి వసపిట్ట! అడిగినోళ్ళకి, అడగనోళ్ళక్కూడా ఎజ్జిబిసనెట్టేత్తారు…” తాతనాన్నని వెనక నుంచి తొందర పెట్టింది సావిత్రి.

అదురుతున్న గుండెలతో చెప్పుల్లేని కాళ్ళతో తాతనాన్న బయటకి వెళుతుంటే, బెదురు కళ్ళతో సావిత్రి అలా చూస్తూ వుండిపోయింది.


సూరిగాడి చేతిలో కత్తిని కన్నార్పకుండా చూస్తున్నాడు నారాయుడు. పదునుతో దాని అంచు తళతళ్ళాడుతోంది.

“ఏటేస్తే ముంజకాయలా తలకాయ తెగిపడిపోవాల్సిందే!” అంచుని వేలితో రాస్తూ కసిగా అన్నాడు సూరిగాడు.

“కంగారుపడకు. అన్నాట్లికీ చంపడమే శిచ్చ కాదు.” సూరిగాడికి నచ్చచెప్పి వాడి కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నాడు నారాయుడు.

“లేదు. చంపాల్సిందే! నీ పెళ్ళాం పక్కలో ఎవడన్నా దూరితే నువ్వూరుకుంటావేమో. నేనంత చేతకాని ఎదవని కాదు.” కోపంతో సూరిగాడి కళ్ళు ఎరుపెక్కాయి.

“మన బంగారం మంచిదైతే కద్రా…”

“అది తప్పు చేసినా నేను దాన్ని చంపలేను. ఆ తాతరాజుని చంపి, అది చేసే తప్పునాపుతాను!”

“ఇడాకులిచ్చింకో పెళ్ళి చేసుకో పోనీ…”

“అదంటే… నాకు ప్రాణం! నేనొదల్లేను.”

“అది లేపోతే బతకలేనంట్నావు. ఆ తాతరాజుని చంపితే నువ్వు జైలుకెళతావు. నువ్వక్కడ, అదిక్కడ. ఖూనీ చేసి నువ్వు ఊడబొడిచేదేముంది?”

“…” సూరిగాడు మాట్లాడలేదు.

“ఆళ్ళకి బుద్దొచ్చేలా ఏదొకటి చేద్దాం. పెద్దోన్ని చెబుతున్నా నా మాటిను.”

“ఒరేయ్ సూరిగా… ఇక్కడున్నావా? నీకోసం ఊరంతా వెదుకుతున్నానహే…” అంటూ వెనక నుంచి చిరంజీవి మాట వినపడ్డంతో ఇద్దరూ మాటలాపి అటు తిరిగారు.

చిరంజీవి తడప కట్టి లాక్కొస్తున్న చెప్పులని చూశారు ఇద్దరూ.

“ఏటండి బావుగారూ, చెప్పులు కాలికేసుకుని రావొచ్చుకదా! అలా ఈడ్చుకొత్నారేం?” అన్నాడు నారాయుడు.

“ఒకళ్ళ వస్తువులు ఒకళ్ళు వాడ్డం ఏటహే అసయ్యంగా! అందుకే ఈడ్చుకొస్తనాను.” అన్నాడు చిరంజీవి చిరాగ్గా.

“ఈ చెప్పులెవరియ్యండైతే?” అడిగాడు సూరిగాడు.

“ఇంకెవలియ్యి, తాతనాన్నియ్యి! మీ సావిత్రి దొబ్బుకొచ్చేసి గంపకింద దాచేసుకొంది. దొంగముండ! ఆయనకిచ్చేద్దామని తెస్తనా…”

సూరిగాడూ నారాయుడూ ఒకరిమొహాలు ఒకరు చూసుకున్నారు.

నారాయుడి కళ్ళల్లో సూరిగాడికి ఏదో మెరుపు కనిపించింది.

వాళ్ళ పక్కనే పడున్న ముంజకాయ గెలని చూడగానే చిరంజీవికి ఏనుగెక్కినంత సంబరమేసింది.

“ఏరా, ముంజకాయలు కొట్టేసావేంటి? ఇంటికి తెచ్చేయ్. వళ్ళంతా చిరాగ్గా వుంది. అర్జంటుగా తానం చెయ్యాలి. పొద్దున్న సగం సగం తానమే చేసా. ఇగో, ఈ తాతనాన్న చెప్పులు ఆయనకిచ్చెయ్…” అంటూ చెప్పులు సూరిగాడికి అప్పజెప్పి చిరంజీవి ఇంటి వైపు నడిచాడు.

“చిరంజీబాబు చిన్నోడైనా నీ సమస్యకి గొప్ప పరిష్కారం చూపించేడ్రా!” అన్నాడు చిరంజీవి వెళ్తున్న వైపే చూస్తున్న నారాయుడు.

“ఏంటీ?” ఆసక్తిగా అడిగాడు సూరిగాడు.

“ఈ చెప్పులు తాతరాజుకివ్వకు. నువ్వే ఏసుకుని తిరుగుతుండు. నీ కాలికున్న తన చెప్పులని చూసినప్పుడల్లా తాతరాజు సిగ్గుతో చితికిపోవాల. నీ కాలికింద తన చెప్పులు నలుగుతున్నాయన్న ఆలోచన వచ్చినప్పుడల్లా అవమానంతో ఆయన మనస్సు విలవిల్లాడిపోవాల. ఎవరికి చెప్పుకోగలడు, నువ్వేసుకున్నాయి నా చెప్పులేనని! మింగలేడు కక్కలేడు. ఆయనే కాదు, ఇంటి గుమ్మంలో ఈ చెప్పుల్ని చూసినప్పుడల్లా నీ పెళ్ళాం కూడా వణికిపోతా వుంటది. దాని మీద వున్న నీ ప్రేమ నిఖార్సయ్యిందే అయితే అదింక జన్మలో ఆ తాతరాజు పేరెత్తదు.”

ఏదో అర్ధమయినట్టు చూశాడు సూరిగాడు. వాడి పెదాలపై చిరునవ్వు విరిసింది.

తడపకి కట్టున్న చెప్పులని విప్పాడు.

ఎప్పుడూ చెప్పుల్లేకుండా తిరిగే వాడు తాతనాన్న చెప్పులని కాలికేసుకున్నాడు.

ఎందుకో ఎక్కడ లేని బలమూ వచ్చినట్టనిపించింది. ప్రపంచాన్ని జయించినంత ఆనందం వాడి కళ్ళల్లో…

“సిరంజీబారో! కూ…” అంటూ కేక పెట్టాడు.

“కూ… కూ…” నిలబడ్డ చోటనుంచే బదులు పలికాడు చిరంజీవి.

“వత్తనానుండండుండోయ్…” అంటూ పరుగుపరుగున వెళ్ళి, అమాంతంగా చిరంజీవిని గాల్లో గిరగిరా తిప్పి మేకపిల్ల ఎక్కించుకున్నాడు.

వాడెందుకలా చేశాడో చిరంజీవికి ఏమాత్రం అర్ధం కాలేదు.

దూరంగా చూస్తున్న నారాయుడి కళ్ళకి ఓ సన్నటి నీటి పొర అడ్డొచ్చింది.