పెదలంక ప్రెసిడెంట్ పేరిచర్ల పెద పరశురామరాజుగారి ప్రవర్తన ఈ మధ్య చాలా విచిత్రంగా వుంటోంది. కూర్చున్న చోట కూర్చోలేకపోతున్నారు. నిలబడ్ద చోట నిలుచోలేకపోతున్నారు. ఒంటరిగా వుండలేక నలుగురిలో మసలలేక నరకయాతన అనుభవిస్తున్నారు.
ఎవరి మొహమూ ఆయనకి చూడాలనిపించడంలేదు. తన మొహం ఎవరికీ చూపించాలనిపించడంలేదు. బయటకి వెళ్ళాల్సివస్తే మొహం మీదుగా ఓ కండువా కప్పేసుకుంటున్నారు. మెళుకువగానే వున్నా నిద్దట్లో వున్నట్టు ఉలికులిక్కిపడుతున్నారు. మనిషి గజగజ వణుకుతున్నారు. తనలో తనే నవ్వుకుంటూ తనలో తనే ఏడ్చుకుంటున్నట్టు కనిపిస్తున్నారు.
వారం పదిరోజులుగా ఇదే తంతు, పెద పరశురామరాజుగారిది.
కంటికి నిద్ర లేదు, కడుపుకి తిండి లేదు. ఎప్పుడూ పరధ్యానంగానే వుంటున్నారు. ఒకరి చేత వేలెత్తి చూపించుకునే మనిషికాదు. ఎవరిచేతా ఛీకొట్టించుకున్న సందర్భం లేదు. కోడిపందెం కూడా చూడలేనంత సున్నిత మనస్కుడు ప్రెసిడెంట్‌గారిలో వచ్చిన ఈ మార్పుకి కారణం ఏమిటో? ఎంత బుర్రలు బద్దలుకొట్టుకున్నా ఊళ్ళోవాళ్ళకీ ఇంట్లోవాళ్ళకీ కూడా అర్థం కావడంలేదు.
ఇంటికొచ్చి చూసెళ్ళిన డాక్టర్లేమో ఏ జబ్బూ లేదంటున్నారు.
సెంటు వాసనతో, ఇస్త్రీ నలగని షరాయి లాల్చీలతో తిరిగే ఆయన, అవి మాసి కంపుకొడుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు.
ఎప్పుడూ మొహంమీద చిరునవ్వుతో కనిపించిన ప్రతి ఒక్కరినీ నోరారా పలకరించే ఆయన, ఎదుటి మనిషిని చూడ్డానికే భయపడుతున్నట్టు చూపులని నేలలో పాతేసుకుంటున్నారు.
ఆకుపచ్చరంగులో కాంతులీనే ఆయన బుగ్గలు పీక్కుపోయి గుబురుగడ్డంతో నిండిపోయాయి. చెంపల్లోనూ గడ్డంలోనూ మీసంలోనూ తెల్లవెంట్రుకలు తళుక్కుమంటున్నాయి. ఏ జబ్బూ లేకపోయినా లంకణాలు చేస్తున్న దీర్ఘకాల రోగిలా కనిపిస్తున్నారు.
గుండెల్లో ఏదో బాధ గూడుకట్టుకొన్నట్టుంది. అది కళ్ళల్లో కనిపించనీయకుండా వుండడానికి ఆయన మథనపడుతున్నట్టుంది. ఎంతమందిలో వున్నా ఆయన కళ్ళు నడింపల్లోరి టెంకని చూస్తే చాలు, బెదిరిపోతున్నాయి.
అతని మాట వినబడితే చాలు, ఆయన గుండె అదిరిపోతోంది. తనలోకి తనే కుంచించుకుపోతున్నారు. అయినా ఆ విషయం మూడోకంటికి తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎప్పుడూ ఆయన వెన్నంటే వుండే పాలేరు వెంకడు దీన్ని కనిపెట్టాడు. అయితే, ఎవరి దగ్గరా వాడు బయటపడలేదు.
అదేంటో, పల్లెల్లో కొన్ని పేర్లు చిత్రంగా పుట్టుకొస్తాయి. ఎంత చెరిపేసుకుందామన్నా అవి చెరగవు. టెంక అసలు పేరు నడింపల్లి మనోహర్రాజు. ఊరిలోని చలాకీ కుర్రాళ్ళల్లో ఒకడు. మామిడి, తాటి టెంకలని లంకల్లోనూ రోడ్లపక్కనా గోదావరి తీరంలోనూ పాతడం అతని సరదాల్లో ఒకటి. అందుకే చిన్నప్పట్నుంచీ అతని పేరు టెంకై, పెద్ద ఎదిగినా పెళుసుగట్టి, పీచుగట్టి కూర్చుంది.
ఈ మధ్యనే టెంక, చుట్టుపక్కల నాలుగూళ్ళ కుర్రోళ్ళతో కలిసి గోదావరి ఆర్ట్స్‌ని స్థాపించి, సాంఘిక నాటకాలేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. పరశురామరాజుగారు కళాప్రియుడు కావడంతో ఆ నాటక సమాజానికి తన వంతు చేయూత అందిస్తున్నారు.
‘మరి మనరాజుగారు సర్పంచిగా పగ్గాలు స్వీకరించిన ఈ మూడేళ్ళలోనూ ఆయన చేసిన సేవలని తుయ్యాలంటే ఊళ్ళో వున్న తక్కిళ్ళూ, ఆయన చేసిన అభివృధ్ధిని కొలవాలంటే మన ఇళ్ళల్లో వున్న కుంచాలూ చాలవని ఇందుమూలంగా తెలియచేసుకుంటున్నా…’ తన సన్మాన సభలో కరణంగారి ప్రసంగం ఎంత గొప్పగా సాగుతున్నా వేదిక మీదున్న పెద పరశురామరాజుగారికి రుచించడం లేదు. మొహం మీదుగా కప్పుకున్న కండువాని కొంచెం పక్కకి జరిపిన ఆయన ఎదురుగా వున్న జనంలో ఒక్కొక్కరినే పరీక్షగా చూస్తున్నారు. ఆ జనంలో టెంక కనిపించకపోవడంతో ఆయన గుండె ఎందుకో ఝల్లుమంది. పాలేరు వెంకడిని చూపులతోనే పిలిచారు. ఆయన ఆ కనుసైగ భాషని అర్థంచేసుకోవడంలో వాడు మహా దిట్ట.
“ఆ నడింపిల్లోరి శంకెక్కడున్నాడ్రా? చూడు. ఇక్కడ కనబట్లేదు… ఊల్లోనే వున్నాడా?”
“సంకెవరండి? టెంక కదా!” అడిగాడు వెంకడు. ఈయనకి మతిమరుపుకూడా వచ్చేసిందా… అని సందేహిస్తూ.
“అదే అదే… టెంక. చూడు,” అయోమయంగా చూస్తూ చెప్పారు.
“అలాగేండి…” అంటూ వెంకడు వెళ్ళిపోయాడు.
వెళుతున్న వెంకడి మనసులో ఎన్నో అనుమానాలు ముసురుకుంటున్నాయి. రాజుగారి ప్రస్తుత పరిస్థితికీ ఈ నడింపిల్లోరి టెంకబాబుకీ ఏదో మెలికుంది. ఏంటదీ? టెంక మాటెత్తితేనే ఈయన ఉలుకులికిపడుతున్నారు. టెంకగారేమో అస్సలు ఏమీ తెలనట్టే వుంటాడు. ఆ బాబు కూడా చాలా మంచోడు. అందరితో కలివిడిగా వుంటూ ఊరికేదో ఉపకారం చేద్దాం అనే బాపతే తప్ప అల్లరి చిల్లర రకం కూడా కాదు. అసలేమై వుంటది? ఆలోచిస్తున్న వెంకడు రాజుగారిలో ఈ మార్పు ఎప్పుడ్నుంచొచ్చిందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఆ వేళ… నాలుగూళ్ళనుంచీ వచ్చిన డ్రామా యాక్టర్లతో ప్రెసిడెంటు పేరిచర్ల పెద పరశురామరాజుగారి మకాం మహాసందడిగా మారింది. ఊరిలో జనం డ్రామావాళ్ళని సినిమా యాక్టర్లని చూసినట్టు విరగబడి చూస్తున్నారు.
డ్రామా పేరు ‘భ్రమ’. నడింపల్లోరి టెంక దానికి డైరెక్టరూ ఆర్గనైజరూ అన్నీనూ.
ఇంకా ఊళ్ళో ఫకీర్రాజుగారి పుచ్చూ, గాడిలంకోరి గిద్దా నాటకంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హీరోయిన్, నాటకాల రేణుక. కాకినాడ నుంచి రావాలి. కోలంకలో బస్సుదిగే రేణుక కోసం ప్రెసిడెంట్‌గారి సవారీబండిని పంపారు ఆర్గనైజర్లు. రేణుకని మేకప్ లేకుండా చూడ్డానికి కొంతమంది ఔత్సాహికులు అద్దె సైకిళ్ళమీద పొద్దున్నే అక్కడకి పోయారు.
గోదావరి ఆర్ట్స్ వారికిది తొలి ప్రదర్శన. హీరోయిన్ రేణుకకి మాత్రం ఆఖరి ప్రదర్శన. సినిమాల్లో అవకాశాలు రావడంతో ఆ అమ్మాయి ఫేమిలీతో సహా మద్రాసెళ్ళిపోతోంది, రేపో ఎల్లుండో.
తబలా కొట్టేవాళ్ళూ, హార్మోనీ వాయించేవాళ్ళూ రామచంద్రపురం నుంచి మధ్యాహ్నమే దిగేశారు.
మైక్ సెట్టు బిగించేసిన టెంట్ సామాన్లవాళ్ళు లైటింగ్ అరేంజ్‌మెంట్లు చూస్తున్నారు.
‘మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ… గోదావరి ఆర్ట్స్ వారి తొలి ప్రదర్శన భ్రమ, భ్రమ, భ్రమ!’ అని చెబుతూ అక్కడకొచ్చిన ప్రతివాడూ మైక్ పట్టుకొని తమ ముచ్చట తీర్చేసుకుంటున్నారు.
షో టైమ్ దగ్గరపడేకొద్దీ నడింపిల్లోరి టెంక నానా హైరానా పడుతున్నాడు.
నాటకంలో హీరోయిన్ ఒక్కత్తే; కానీ హీరోలు ఇద్దరు. వాళ్ళిద్దరూ ఇప్పటిదాకా జాడా జవాబూ లేకుండాపోయారు.
అన్ని విధాలా పబ్లిసిటీ ఎక్కువైపోవడంతో చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనం బళ్ళమీద బయలుదేరి వచ్చేస్తున్నట్టు సమాచారం వస్తోంది. పౌరాణిక నాటకాలాడాలంటే… దేవీనవరాత్రో, గణపతి నవరాత్రో లాంటి పండగలో పబ్బాలో రావాలి. సాంఘిక నాటకం అయితే చేతిలో ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు ఆడేసుకోవచ్చు. ఆడియన్స్ వన్స్ మోర్ అంటే, ఒకో సీన్నీ రెండేసిసార్లూ మూడేసిసార్లూ కూడా ఆడుకోవచ్చు.
‘రండి… చూడండి… నేడే… గోదావరి ఆర్ట్స్ వారి… తొలి ప్రదర్శన భ్రమ, భ్రమ, భ్రమ!’ అంటూ మైక్‌లో ముప్పైమూడోసారి ముచ్చట తీర్చుకుంటున్నాడు ఫకీర్రారి పుచ్చు.
“ఒరేయ్ బావా! పిల్లంక నుంచి రామకృష్ణా, మాచరయ్యా ఇంకా రాలేద్రా. ఏమైపోయారో, ఓసారి ఎవరినైనా పంపింస్తావేంటీ?” పుచ్చు దగ్గరకొచ్చి చెప్పాడు టెంక.
“కొడవళ్ళట్టుకొని కోతలకి పోయారంట ఎదవలు!” మైక్‌లోనే చెప్పేశాడు పుచ్చు.
“అదిగోరోయ్! ఆల్లే ఏమో, సైకిల్ మీదొస్తున్నారు అల్లదిగో చూడు!”
అక్కడకొచ్చి సైకిల్ ఆపాడు మాచరయ్య. చేను కోసొచ్చిన కొడవళ్ళు రామకృష్ణ చేతిలో వున్నాయి.
“బూచోళ్ళా ఈ గడ్డాలేంట్రా? మీరు హీరోలమనుకుంటున్నారా? విలన్లమనుకుంటున్నారా? గియ్యించుకొని తగలడలేపోయేరా?” మందలించాడు టెంక.
“భలేటోరే! కోతలు కోసి, పంట మాసూలు చేసేదాకా గడ్డాలు గియ్యించడం మా ఇళ్ళల్లో ఆనవాయితీ లేదండి. ఇంకో నెల్రోజులింతే… ” చెప్పాడు మాచరయ్య.
“ఆలస్యంగా వచ్చిందే కాకుండా ఎదవ సెంటిమెంట్లూ మీరూను. ఎదురు చెప్పారంటే చెప్పుచ్చుకుని కొట్టేస్తాను. ఒరేయ్ బావా! గిద్దగాడ్ని పంపి అన్నారంగాడిని పిలిపించరా,” పుచ్చుకి పురమాయించాడు టెంక.
“ఇప్పటికిప్పుడు ఈళ్ళ గడ్డాలు తెగాలంటే బ్లేడ్లూ కత్తులూ చాలవు. కొడవళ్ళే కరక్ట్. కోతలు కోసినట్టు ఒకళ్ళ గడ్డం ఒకళ్ళు కోసేసుకోండహే, పనైపోద్ది…” అంటూ వెటకారం చేసిన ఫకీర్రారి పుచ్చు, “ఒరే గిద్దా! అన్నారంగాన్నంట అర్జంటుగ పట్టుకురారా…” అని పురమాయించాడు.
“నాక్కాళీ లేదు. రిహార్సిల్స్ చేసుకుంటున్నాను,” చెప్పాడు గిద్ద.
“నీ తొక్కలో శవం ఏషానికి రిహార్సిల్ ఒకటి. చెప్పింది చెయ్యాపోతే ఆ కేరెక్టరు కూడా నేనే ఏసేస్తాను,” హెచ్చరించాడు పుచ్చు.
“సాటి కళాకారులని చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకునే రకంరా మీరూ…” విసుక్కుంటూ అన్నవరంని తీసుకురావడానికి వెళ్ళాడు గాడిలంకోరి గిద్ద.
కోలంకలో బస్సు దిగిన రేణుక, పెద్ద ట్రంకు పెట్టెతో సవారీ బండెక్కింది. ఆ పెట్టెలో నాటకంలో కట్టాల్సిన చీరలూ, కోటింగు కొట్టుకోడానికి కావాల్సిన పౌడర్లూ స్నోలూ లాటివి వున్నాయి.
చెవులకి పెద్ద పెద్ద రింగులూ, ఎగురుతున్న రింగురింగుల జుట్టూ, చూడ్డానికి మంచి కైపుగా కనపడుతోంది రేణుక.
రేణుకని చూసి, ‘చందమామలా అందంగుంది… బాగుంది.’ అనుకున్నాడు బండి తోలుకెళ్ళిన వెంకడు.
‘సినేమా యాట్టర్లా బలేగుందిరా గుంట!’ అనుకుంటూ స్టయిలుగా బండిలో కూర్చున్న రేణుకని చూస్తున్నారు జనం.
నిక్కర్లేసుకున్న కొంతమంది కుర్రాళ్ళు బండి వెనక పరిగెడుతూ గిత్తలు గేలాపు అందుకోవడంతో పరుగెత్తలేక ఆగిపోయారు. రేణుక చిన్నాచితకావాళ్ళ పక్కన వేషం వెయ్యదు. ఆవిడ రెమ్యునరేషనే ఏకంగా వెయ్యినూటపదహార్లు. టెంకమీద వున్న ప్రత్యేకమైన అభిమానంతో కాదనలేక కొత్త ట్రూప్ అయినా ఒప్పుకుని వచ్చింది. అందంలో జమున, అభినయంలో సావిత్రి అన్న పేరుంది ఆ అమ్మాయికి.
‘రిహార్సిల్స్‌కి వచ్చినప్పుడు చూసేన్రా. ఆ పిల్లని చూస్తే భ్రమేసిందిరా…’ బండి తోలుతున్న వెంకడి చెవుల్లో ప్రెసిడెంటుగారి మాటలు రింగురింగుమంటున్నాయి.
‘పెసిడెంటు పెద పరశురామరాజు ఆజానుబాహువు. ఆరడుగుల అందగాడు. ఆయన కోరి కబురెడితే ఏ ఆడదైనా కాదనలేనంత ఆకర్షణ ఆయనగారి కళ్ళల్లో. కానీ ఆయన అలాంటి మనిషి కాదు. ఇంతవరకూ పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. కానీ ఇన్నాళ్ళకి, నాటకాల రేణుకమీద మనస్సుపడ్డారు. పడ్డారంటే… ఆ పడ్దంలో అర్థం వుంది మరి. ఆ మనిషి అందమలాటిది. ఆ మనిషి వంటి తీరలాటిది. వంపు సొంపులలాటివి. బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుట్టింతాయవి,’ మనస్సులో అనుకుంటున్న వెంకడు ఓరగా రేణుక వైపు చూశాడు.
కోతకొచ్చి బంగారం రంగులో బరువుగా వాలిన వరిచేలనీ, వేగంగా వెనక్కెళుతున్న కొబ్బరి చెట్లనీ చూస్తూ ఆనందిస్తోంది రేణుక. పిల్లగాలికి ఆమె ముంగురులు మొహం మీద గిరికీలు కొడుతున్నాయి.
రోడ్డు మీద ఎవరో అడ్డంగా రావడంతో చక్రంలో కొరడాకర్ర పెట్టాడు వెంకడు.
‘టక్టక్ టక్…టక్టక్ టక్…టక్టక్ టక్…’ అందది.
“విచిత్రంగా వుందే సౌండు, ఇంకోసారను…” అడిగింది రేణుక.
‘టక్టక్ టక్…టక్టక్ టక్… టక్టక్ టక్…’ మళ్ళీ వినిపించి, “అమ్మాయిగారు, ఆ కనిపించే పొలవంతా మా రాజుగారిదేనండి. రాజుగారు మా వూరికి పెసింట్ కూడానండి,” రేణుకతో మాట కలిపాడు వెంకడు.
“ఆహా…”
“మా రాజుగోరినెప్పుడన్నా చూసేరాండి? అప్పుడే కక్కుళ్ళు కోసిన కొడవల్లా వుంటారండి.”
“…”
“మా టెంకగారు మాచరయ్యగాన్ని మెయినీరోగా బుక్ చేసేసేరు కానండి, అసలు మా రాజుగారిచేత ఈరో ఏసం ఏయింతే… ఆరూ మీరూ జమునా హరనాద్ జంటలా భలేగుందురండి!”
“…”
“మా చిన్నయ్యగారొక్కసారి కూడా ఈ సవారీ బండి ఎక్కలేదండి. అలాటిది మీకోసం బండి అంపేసేరండి. ఆ మజ్జన రిహాసిల్లుకొచ్చినప్పుడు మిమ్మల్ని చూసేరంటండాయన.”
“ఇంకా ఎంతదూరం?” అడిగింది రేణుక. ఆమె గొంతులో ఎలాంటి మార్పూ లేదు.
“ఊల్లోకి వచ్చేసావండి…” అంటూ వెంకడు గిత్తల పగ్గాలు లాగి వదిలాడు. అవి పరుగులోంచి నడకలోకి దిగాయి.
రోడ్దుకి అటూ ఇటూ వున్న ఇళ్ళలోంచి ఆడామగా అన్న తేడా లేకుండా బయటకి వచ్చి నాటకాల రేణుకని ఆసక్తిగా చూస్తున్నారు.
“మా రాజుగారు ఆళ్ళ మకాంలోనే మీకు ఇడిది ఏర్పాటు చేసేరండి…” రేణుకకి ప్రెసిడెంటుగారి మీద ఆసక్తి కలిగించటానికి ఎన్ని పాట్లు పడాలో అన్ని పాట్లూ పడుతున్నాడు వెంకడు.
దాగరలో కూర్చున్న అన్నవరాన్ని ఫకీర్రారి పుచ్చూ, గాడిలంకోరి గిద్దా అటొకళ్ళూ ఇటొకళ్ళూ పట్టుకుని మోసుకొచ్చి ప్రెసిడెంటుగారి మకాంలో టెంక ముందు కుదేశారు.
“అదేంట్రా! ఆడి కాళ్ళు ఎలకలు కానీ కొట్టేసేయా? ఇలా మోసుకొచ్చేరు?” ఆశ్చర్యంగా అడిగాడు టెంక.
“రాను మొర్రో రానంటుంటే ఇంక తప్పక ఇలా కుక్కి పట్టుకొచ్చేసేం,” చెప్పాడు గిద్ద.
“ఒరేయ్ అన్నారం, కొంచెం ఈళ్ళకి గెడ్డాలు అయ్యీ గీసి పారెయ్యరా! మేకప్పెయ్యడానికి లేటైపోతోంది,” చెప్పాడు టెంక.
“నాలాంటి ప్రేక్షక శిఖామణి వర్ధమాన నటులకి గడ్డం గియ్యాలా? అసంభవం!” అన్నాడు అన్నవరం దాగరలోంచి లేస్తూ.
“ఏం, ఎందుక్కుదరదు? కత్తెవడన్నా ఎత్తూపోయేడా?” ప్రశ్నించాడు పుచ్చు.
“కర్ణుడికి కవచకుండలాల్లా, ఈ అన్నవరం అమ్ములపొదిని కత్తెప్పుడూ అంటిబెట్టుకునే వుంటది. అదికాదు విషయం. అసుర సంధ్య దాటేకా కత్తి పట్టుకోవడం, జుట్టు గొరగడం మా ఇంటావంటా లేదు. అది మొత్తం ఊరికే అరిష్ఠం!” అటూ ఇటూ తిరుగుతూ నాటకీయంగా అన్నాడు అన్నవరం.
“డైలాగులు బానే చెబుతున్నావురా. ముందే తెలిస్తే నీ చేత కూడా ఓ క్యారెక్టర్ వేయించేద్దును…”
“ఇప్పటికైనా ఇంటి టాలెంట్‌ని కనిపెట్టేరు సంతోషం. ఆలస్యం చెయ్యకుండా మీరు నా వేషం గురించి ఆలోచించండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను.”
“అన్నట్టు, ఓ శవం కేరక్టరుందిరా. అదయితే నువ్వు జీవించెయ్యొచ్చు…” చెప్పాడు టెంక.
“వేషం ఏదయినా ఫర్వాలేదు. జీవించాలా జీన్నోద్దరణ చెయ్యాలా అన్నది నేను చూసుకొంటాను. కళామతల్లి సేవలో మీరింతగా మమేకమయ్యారు కాబట్టి, అరిష్ఠం సంగతి కాస్సేప్పక్కనెట్టి, వీళ్ళ గెడ్డం అంతు తేల్చేస్తా. అవసరమైతే ఆ తర్వాత శాంతులు అయీ చేయించుకొందాం,”
“అలాగే కానియ్!” చెప్పాడు టెంక.
“శవం క్యారెక్టర్ ఇస్తానని నా చేత స్టేజీ, కుర్చీలూ ఎయ్యించావు? నాలుగేలెగిరిపోయింది. చెప్పాలంటే ఈ నాటకానికి పొడ్యూసర్నే నేను. ఇప్పుడా క్యారెక్టర్ అన్నారంగాడి ఎదాన కొట్టావు. అసలెలా కనపడతానాన్రా మీ కంటికి? స్టేజీ చుట్టూ గేదెల్ని కట్టించేత్తాను. నాటకం ఎలా ఆడతారో అప్పుడు చూత్తాను…” కయ్యిమంటూ లేచాడు గిద్ద.
“ఒరేయ్ ఆగరా. మన పుచ్చుగాడితో తిరిగి తిరిగీ నీ వళ్ళంతా చిడుం పట్టేసినట్టుంది. నాటకం మజ్జలో నీకు దురదేసి గోక్కున్నావనుకో, శవమేంటీ అసయ్యంగా ఇలా గోక్కోవడం ఏంటని జనం టమాటాలు, కోడిగుడ్లెట్టి కొట్టేస్తారు. అందుకే ముందు జాగ్రత్తగా నీ పోర్షన్ మార్చేను,” చెప్పాడు టెంక, పుచ్చుకి కన్నుకొడుతూ.
“అయితే నన్నేం చేయమంటావు?” గద్దించాడు గిద్ద.
“తెరెత్తే ముందు ప్రార్ధనలో పెదాలు కదిపిదీగాని, శుక్లాంభరదరం అంటూ…”
“చత్! స్టేజ్ మీద కనపడాలి కానీ తెరెనకాల పెదాలు కదపడం, నడుం ఊపడంలాటి తతంగాలు నాకొద్దు.”
“పోనీ, హీరోయిన్‌తో డ్యూయెట్ పాడుకోరా…” చిరాగ్గా అన్నాడు పుచ్చు.
“ఇదేదో బాగుంది. స్టేజ్ ఏయించినోడికి ఈ మాత్రం స్పెషలుండాలి.”
“హీరోలిద్దరికీ చెరో రెండు సాంగులూ వున్నాయి. అదెలా కుదురుద్ది?” అభ్యంతరం చెప్పాడు టెంక.
“వుంటే వుండనీవోయ్. డ్రీమ్ సాంగ్ ఏసుకుంటాం. నీ సొమ్మేవన్నా పోద్దా?”
“సరే, అలాగే ఏడు. సాంగ్ కదా, హీరోయిన్ మీద ఎక్కడపడితే అక్కడ చెయ్యేసేద్దామనుకుంట్నావేమో, ఆ అమ్మాయసలే స్ట్రిక్ట్… చిదగ్గొట్టేత్తది. ఆడూ ఈడూ అని కూడా చూడదు. బావా, ఆ ఎదవలిద్దరికీ కూడా ఈ సంగతి చెప్పు.” హెచ్చరించాడు టెంక.
అప్పుడే బండి దిగిన రేణుక ఆ మాటలు విని, “ఏంటి డైరట్రుగారూ, హీరోయిన్ని పట్టుకొని అందరిముందూ విలన్ని చేసేస్తున్నారు?” నవ్వుతూ అంది.
“దిగేవా! ప్రయాణం ఎలా సాగింది? మావోడు నీతో స్పెషల్ సాంగ్ పెట్టమంటున్నాడు. నాటకానికి వీడే ప్రొడ్యూసర్. ఏంచేద్దామా అని ఆలోచిస్తున్నా.” నానుస్తూ అన్నాడు టెంక.
“చేసేదేముంది? ఎంతైనా ప్రొడ్యూసర్, అందులోనూ సరదాపడుతున్నాడు. అలాగే కానియ్యండి.” అంటూ లోపలకి నడిచింది రేణుక.
ఆమె వెనకే ట్రంక్ పెట్టి పట్టుకొని నడుస్తున్న వెంకడు, దూరంగా ఎవరితోనో మాట్లాడుతున్న ప్రెసిడెంట్‌గారి కళ్ళల్లో కళ్ళు కలపడంతో, ఆయన చూశానన్నట్టు తల పంకించారు.
ఆలోచనల్లోంచి బయటపడేటప్పటికి వెంకడు నడింపిల్లోరి ఎత్తు అరుగుల ఇంటి ముందు తేలాడు. పందెం పుంజుకి తవుడు వుండలు పెడుతున్న టెంకని చూస్తూ మౌనంగా నిలబడ్డాడు.
“ఏంట్రా ఎంకా? ఏదీ కానేళ ఇలా వచ్చేవు?” పలకరించాడు టెంక.
“ఏం వుందండి? పెసింటుగారిని చూస్తుంటే భయమేత్తంది. ఆ నాటకం రోజునుంచే ఆయనిలా తయారయ్యేరు,”
“ఏమయ్యిందంటావు?” అంటూ లేచాడు టెంక.
“ఏమోండి… మీకేవన్నా తెలుసేమో అనుకుంటన్నాను,”
“రామ!రామ! నాకేం తెలదురా! ఆయన నాటకం మొదట్లోనే లేచెళ్ళిపోయారు. ఏమయ్యిందని అడుగుదామని మర్నాడు ఇంటికొస్తే, ఇంట్లోవుండే లేరని చెప్పి పంపించేశారు. తర్వాత నీకెంత తెలుసో నాకూ అంతే తెలుసు!” నిట్టూర్చాడు టెంక.
“ఎలా అండి మరి తెలుసుకోడం? రోజురోజుకీ ఆయన చిక్కి శవమైపోతున్నారు…” వాపోయాడు వెంకడు.
“ఆయనంతట ఆయన చెబితే తప్ప ఇంక మనకి తెలిసే మార్గమే లేదు.” తేల్చేశాడు టెంక.
ఆరు నెలలపాటు ఉలుకూపలుకూ లేకుండా మంచాన పడ్ద ప్రెసిడెంట్ పెద పరశురామరాజుగారు, అరుగుమీద నుంచి ఎదురుగా కనిపించే సవారి బండిని చూస్తూ చూస్తూ తన నలభయ్యవ ఏట పరమపదించారు. ఆయన ఎందుకు అలా కృంగి కృశించిపోయారో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఆయనకి గాలి సోకిందని ఒకరు, రాకూడని జబ్బేదో వచ్చిందని ఇంకొకరు, చెయ్యకూడని తప్పేదో చేసి పశ్చాత్తాపంతో మంచంపట్టారని మరొకరూ- ఇలా ఎవరికి వారే తాము అనుకున్నదే నిజమన్న భ్రమలో మునిగితేలడం మొదలెట్టారు. వారి పాలేరు వెంకడికి మాత్రం ఇలాంటి భ్రమలు ఏమీ లేవు. అనుమానాలు మాత్రం చాలానే వున్నాయి. పెద పరశురామరాజుగారు భ్రమపడ్డ నాటకాల రేణుకకి ఈ విషయం ఏమన్నా తెలుసేమోనన్న అనుమానం వాడిని పదే పదే వేధిస్తోంది.
ఆ రేణుక వాడికి ఎప్పుడు కనపడాలి? వాడి అనుమాన నివృత్తి ఎప్పటికి జరగాలి? లేకపోతే వెంకడి అనుమానాలు కూడా భ్రమేనేమో…