ప్రపంచాన్ని మరిచి
అద్దం ముందు
పోలిక దొరకని మన్మథ మొలకలా
నిలబడతావు
తలను అటూ ఇటూ తిప్పి
నిన్ను చూసి నువ్వే నవ్వుకుంటావు
జుట్టు సవరించుకునీ
కనుబొమలు సర్దుకునీ
మురిసిపోతావు
కళ్ళలో కళ్ళు పెట్టుకుని
నీతో నువ్వే ప్రేమలో పడే వేళ
నీ లోపలి రూపమొకటి నవ్వుతూ
నిన్ను చూస్తుంది
నువు ఏవి దాస్తున్నావో
ఏవి ప్రదర్శిస్తున్నావో
ఎవర్ని ఎక్కువ చేస్తున్నావో
ఎవర్ని ఏమంటున్నావో
నాకూ తెలుసంటుంది
పైపూతలు తుడిచి
అసలు ముఖం చూసుకొమ్మంటుంది
నిజరూప సేవకు
వేళ చెప్పమంటుంది
దాన్ని రోజూ ఏమరుస్తావు కదా
ఒక్కసారి ఉలికిపడతావు కానీ
ఏమీ జరగనట్టు
మళ్ళీ నీ ముఖానికి మరో ముఖాన్ని జోడిస్తావు
అందమైన రంగులతో హంగులతో
నిన్ను నువ్వే గుర్తు పట్టనంతగా
ఆకారాన్ని మార్చేస్తావు
నీ లోపలి అద్దాన్ని
బలవంతంగా మళ్ళీ దాచేసి
మరో నాటక ప్రదర్శనకి
నిష్క్రమిస్తావు
కానీ నీ నాటకం మధ్యనో చివరనో
ఏదో ఒక ఉన్మత్త సన్నివేశంలో
ఆ అద్దం చేసే రొద
ఏదోరకంగా వింటూనే వుంటావు
అదీ నిజమేనని ఒప్పుకోలుగా లోలోపలైనా
తప్పక గొణుక్కుంటూనే వుంటావు