పులి యేదో పొలిమేరల
తిరిగి తిరిగి పోతోంది
అలవి కాని భయమేదో
చుట్టు ఆవరిస్తోంది
వూరి బయట బావిలో
నీరు పొర్లిపోతున్నై
కొండమీది పెద్ద గుడిని
గంట దించబడుతోంది
అంగలతో వాడెవడో
నింగి కత్తిరిస్తుంటే
అంతులేని వర్షమొకటి
అవని నంత ముంచుతోంది
తలలు లేక జనమంతా
తలోదిక్కు పోతుంటే
కనిపించని వాసుకికై
సురాసురులు ఒకటైరి
కల కలకలమై కలయై
కల్లోలంగా నే లేచినట్లు
కలయా నిజమా అని నే
కలయతిరిగి చూసినట్లు