రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

సహజ గాయని ఎస్. వరలక్ష్మి

రచన: పరుచూరి శ్రీనివాస్
మార్చి 2010

నాకు చిన్నప్పటినుండి బాగా తెలిసిన, నేను ఇష్టపడిన గాయనుల కంఠాలు రెండు. అవి బాలసరస్వతి, ఎస్. వరలక్ష్మిల కంఠాలు. బాలసరస్వతిగారు తరచుగా రేడియోలోనో, సభల్లోనో, టి.వి. ఛానెళ్ళలోనో కనిపిస్తూ, వినిపిస్తూ వుండటంవల్ల ఆవిడ సినీ, సంగీత జీవితాన్ని గురించిన వివరాలు మనకీనాడు బాగానే తెలుసు. అలాగే ఆవిడ పాడిన పాటలు కూడా తేలికగానే దొరుకుతున్నాయని చెప్పాలి.


ఎస్. వరలక్ష్మి
1927 – 22సెప్టెంబర్ 2009

ఎస్. వరలక్ష్మిగారి విషయానికొస్తే ఆవిడ గురించి మనకు తెలిసింది తక్కువ. ఆ కొద్ది కూడా కంపల్లె రవిచంద్రన్ ఆరేళ్ళ క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ‘జ్ఞాపకాలు’ శీర్షిక క్రింద చేసిన ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నది. ఆ ఇంటర్వ్యూలోనే ఆవిడ “నేను పబ్లిక్ ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తుంటాను” అని చెప్పుకున్నారు. కారణాలేమయినా మనకు లభ్యమవుతున్న కొద్ది సమాచారం ముఖ్యంగా సినిమాలకు, సినిమా పాటలకు సంబంధించినది. కానీ ఆవిడ రేడియోలో పాడిన లలిత సంగీతం గురించి, రికార్డులపై వచ్చిన అపురూపమైన ప్రైవేటు పాటలగురించి ప్రస్తావించిన వారు తక్కువ. ఆ పాటలను కొన్నింటినైనా ఈమాట పాఠకులకు పరిచయం చేయాలన్న వుద్దేశ్యంతోనే ఈ నాలుగు మాటలు చెప్పదలచుకున్నాను.

కానీ మొదటిగా ఒక సినిమా పాట – ‘మీర జాలగలడా’. దీని వెనకున్న కథ కాస్త పెద్దది.

మీర జాలగలడా నా యానతి

//eemaata.com/Audio/Mar2010/S.Varalakshmi_SrIkRshNatulAbhAram_1955_Sthanam-Narasimharao_meerajaalagalaDaa.mp3మీర జాలగలడా నా యానతి

‘గంధర్వ గోత్రాన పుట్టిన తెరవేలుపులు’ అనే వ్యాసంలో (’మోహిని’ – ఆంధ్రప్రభ విశేష ప్రచురణ, రెండవ భాగం, 1999) వి.ఎ.కె. రంగారావు గారు ఎస్. వరలక్ష్మి గురించి ఇలా రాశారు: “‘మీర జాలగలడా’ ఆమె పాడిన తీరు అద్వితీయం. రికార్డులపై ఆ పాట స్థానం నరసింహరావు, కపిలవాయి రామనాథశాస్త్రి పాడగా విన్నాను. స్టేజిమీద టి.జి. కమల అనబడే కమలా చంద్రబాబు, సినీనటి జమున పాడటం కన్నాను. తెరమీదనే పి. సుశీల, కొద్దిమార్పుతో ఎస్. జానకి నేపథ్యంతో జముననూ, జయలలితనూ ఈ పాట పాడగా చూశాను. జానకి పాటలో మెరుపు మెలికలున్నాయి. సుశీల పాటలో మాధుర్యం, కమల సాధనలో ధీరత్వం, జమునలో ఉత్సాహం, రామనాథశాస్త్రిలో సంగీత సామర్ధ్యం బుజ్జగిస్తాయి, బుదిరిస్తాయి. ఈ పాట తమది చేసుకున్న స్థానం స్థానే సత్య, ముఖ్యంగా ‘వై’ దర్భికి అన్నచోట వెక్కిరింపుతో సహా సాక్షాత్కరిస్తుంది. ఒక్క ఎస్. వరలక్ష్మి పాటలోనే యివన్నీ కలిసి కట్టుగా వుంటాయి. ఈ సినిమాలో ఆమె పాడిన ఏ పాటా రికార్డుకెక్కకపోవడం, ఆ సినిమా యిప్పుడు దొరకకపోవడం దురదృష్టం.”

రంగారావు గారు ఇంత గొప్పగా పొగిడారంటే ఎలాగయినా సంపాదించవలసినదే అని సర్వ ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో ఈ సినిమా ఆడియో ఒక నాటకాభిమాని ద్వారా పొందటం జరిగింది. ఆయన పాతికేళ్ళ క్రితం ఈ సినిమాలోని పాటలమీద ప్రేమతో సినిమా ప్రింటు అద్దెకు తెచ్చుకుని, ఒక 16mm ప్రొజెక్టర్ మీద వేసుకుని ఆడియో ట్రాక్ రికార్డు చేసుకున్నాడు. ఆయన చేసిన ఈ గొప్ప సేవకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే! తరువాత ఈ పాటను మిత్రులు మధుసూధనశర్మగారు ‘సరెగమ’ (HMV) వారికోసం సంకలన పరిచిన ఎస్. వరలక్ష్మి పాటల్లో కూడా చేర్చడం జరిగింది.

//eemaata.com/Audio/Mar2010/S.Varalakshmi_Toleti-Venkatareddi_Ghantasala_kanavOyi-vasantamu-rEyi.mp3 కనవోయి వసంతము రేయి //eemaata.com/Audio/Mar2010/S.Varalakshmi_Toleti-Venkatareddi_Ghantasala_Navavasanta-valapu-poolabaala.mp3 వలపు పూలబాల //eemaata.com/Audio/Mar2010/Saluri-S.Varalskhmi_aanandamE-ledaa_non-Film_1943_Lyrics-unknown_Saluri.mp3 ఆనందమే లేదా (సాలూరితో)

“‘నవ వసంత వలపు పూల’ అన్న గేయం పాడిన కంఠం మాత్రం మన గాయకీమణులందరిలోకీ మకుటాయమానమైనదగిన స్త్రీ గాత్రం” అన్నారు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావుగారు. అదే రికార్డుపైన వచ్చిన మరో మంచి పాట ‘కనవోయి వసంతము రేయి’. ఈ రెండు పాటలకు సంగీతం: ఘంటసాల, సాహిత్యం: తోలేటి వెంకటరెడ్డి.

సాలూరి రాజేశ్వరరావుగారి సంగీతంలో బసవరాజు అప్పారావుగారి సంస్మృతి కార్యక్రమంలో పాడిన ఒక గొప్ప పాట ‘ఆనందమే లేదా’. తరువాత రికార్డుగా వెలువడింది. ఈ పాటను తెలుగు స్వతంత్ర, 1953 ఆగస్టు 21 సంచికలో రజనీకాంతరావుగారు విశ్లేషిస్తూ “ఒకే స్థాయిలో ఒకరు ఒక స్వరమూర్ఛనలో పాడుతుంటే అదే సాహిత్యాన్ని రెండవవారు అవే స్వరాలు కాక, వాటికి సంవాదులైన వేరుస్వరాల మూర్ఛనలో పొదిగిన మట్టులో ఒకేసారి మేళవించి పాడారు. అటువంటి ఫణితి మళ్ళీ రాలేదు. కాని ఆ విధమైన గానంలో పాల్గొనడానికి మంచి ధారణ, స్థైర్యమూ, సునిశితమనస్సూ కావాలి. వరలక్ష్మి కివన్నీ కరతలామలకాలే” అన్నారు.

1940-1955 మధ్య కాలంలో రేడియో సంగీత నాటికల్లోను, గీతావళి కార్యక్రమాల్లోను వరలక్ష్మి గొంతు వినిపిస్తుండేది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి విద్యాపతి నాటకంలో అనూరాధ పాత్ర ధరించి ‘ఆషాఢం అభిసారిక, ఆత్మేశ్వరుడెవరో’ ఇత్యాదిగా రెండు మూడు గేయాలు పాడినట్లు జ్ఞాపకమని రజనిగారే చెప్పారు.

యాభయవ దశకం మొదటి భాగంలో రేడియోలోనే రికార్డయిన (ఆల్ ఇండియా రేడియో వారి T.S records ద్వారా) ఒక మూడు పాటలు: 1. ఊపరే ఊపరే ఉయ్యాల (సంగీతం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, రచన: వింజమూరి శివరామారావు), 2. గణగణగణ జయగంట, 3. నడిచి నడిచి (మల్లిక్ తో కలిసి). ఇలానే ఇంకో ప్రైవేటు రికార్డుపైన వచ్చిన మరో మంచి పాట [మధురముగా ఈ ప్రశాంత …] గడచిన గాథలు ఏవో నామదిలో …

//eemaata.com/Audio/Mar2010/S.Varalakshmi_AllIndiaRadio-TSRecord_Lyricist-Unknown_Music-Unknown_oopareoopare-uyyaala.mp3 ఊపరే ఊపరే ఉయ్యాల //eemaata.com/Audio/Mar2010/S.Varalakshmi_AllIndiaRadio-TSRecord_Lyricist-Unknown_Music-Unknown_gaNagaNa-jayaganTa.mp3 గణ గణ జయగంట //eemaata.com/Audio/Mar2010/S.Varalakshmi-Mallik_AllIndiaRadio-TSRecord_Lyricist-Unknown_Music-Unknown_naDichinaDichi.mp3 నడచి నడచి (మల్లిక్‌తో)//eemaata.com/Audio/Mar2010/S.Varalakshmi_unknown_unknown_madhuramugaa-ee-praSaanta.mp3 మధురముగా ఈ ప్రశాంత…

ఊపరే ఊపరే ఉయ్యాల పాట కోసం పాలగుమ్మి విశ్వనాథం గారు వెతుకుతుంటే అందివ్వగలగడం, ఆ తరువాత హెచ్. హేమవతిగారు ‘నిదురపో హాయిగా’ అన్న జోలపాటల సంకలనంలో (ఆడియో కాసెట్) పాడటం ఈ మధ్య కాలంలోని ఒక మంచి జ్ఞాపకం.

(చివరి మూడు పాటలకు సంబంధించిన రచన, సంగీతకర్తృత్వపు వివరాలెవరైనా అందించగలిగితే కృతజ్ఞుణ్ణి.)

రజనీకాంతరావు గారే అన్నట్లు “కర్నాటక సంగీతంలోని గాఢ ఫణితులుగాని, హిందుస్తానీ బాణీలోని బిరకాలుగాని, లలిత సంగీతంలోని మధుర ధోరణులుగాని, అశ్రమంగా అతి సహజంగా దొర్లిపోయే కంఠం ఆమెది. [పొందిన] శిక్షణ తాను స్వయంగా సంగీతకచ్చేరీలు చేసేటంతవరకూ రానీక, సినిమాలలోను, రేడియోలలోను లఘుగీతఫణితులు పాడగలగడంతో ఆగిపోయింది. లేకపోతే తెలుగునాటికి ఈమెయే మొదటితరగతి గాయకురాలై ఉండేది.”

    
   

28అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    విష్ణుభొట్ల లక్ష్మన్న March 1, 2010 8:22 pm

    ఈమాటలో ఈ మధ్య సంచికల్లోని విశేషాలను పూర్తిగా చదవాలనే నా కోరిక చచ్చిపోతున్న రోజుల్లో ఈ వ్యాసం ఈమాట పై మరికొంత ఆశక్తిని పెంచింది.

    శ్రీనివాస్ కు ధన్యవాదాలు.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  2. 2
    బ్రహ్మానందం గొర్తి March 1, 2010 8:39 pm

    శ్రీనివాస్ గారూ,

    అపురూపమైన పాటలందించారు. అక్షరాలని స్పష్టంగా ఉచ్చరిస్తూ పాడేవాళ్ళలో వరలక్షి ఒకరు. స్పష్టతకి శ్రావ్యత చేరితే ఆ పాట కలకాలం నిలుస్తుందన్నదానికి ఉదాహరణ, తిమ్మరుసు చిత్రంలో “లీలా కృష్ణా” పాట. ఈ పాట చివర్లో “మైమరిచిన చెలి మాటే లేదని – ఓరగ చూస్తూ ” అనే చోట విరుపులతో పాడడం వినడానికి తేలికగా అనిపించినా పాడడం మాత్రం సులభం కాదు.
    మంచిపాటలందించారు. ధన్యవాదాలు.

  3. 3
    Rohiniprasad March 1, 2010 8:50 pm

    లతా మంగేశ్కర్ పాటలు పాడడం మొదలుపెట్టాక మహిళల గొంతులకు character అనేది లేకుండా పోవడం “మంచి” లక్షణంగా రూపొందింది. అద్భుతమైన కంఠంతో ఏ హీరోయిన్‌కైనా, ఏ సందర్భానికైనా సరిపోతుందనిపించే శైలి ఆమెకు ఉండడం అన్నివిధాలా లాభించింది. ఈ లాభం ఆమెకూ, హీరోయిన్లకూ, వినేవారికీ అందరికీ ఉపయోగపడింది.
    లతాకన్నా ఎక్కువ “పర్సనాలిటీ” ఉన్న గొంతుతో ఆశా భోంస్లే రెండోస్థానంలోకి వచ్చింది.
    ఆ తరవాత అంతకు ముందునుంచీ పాడుతున్న శంశాద్, నూర్జహాన్, సురైయాలూ, తరవాత వచ్చిన గీతాదత్ మొదలైనవారికీ పాడే శైలిలో ప్రత్యేక వ్యక్తిత్వం ఉండడం కాస్త ప్రతిబంధకంగా అనిపించసాగింది. అందుకే వారంతా ఒక్కో రకం పాటలకే పనికొస్తారనే భావన బలపడింది. తెలుగులో సుశీల సరిగ్గా లతా పద్ధతిలోనే తయారయింది.

    నూర్జహాన్, సురైయా ఇతరులకు ప్లేబాక్ పాడలేదు కనక వారికి ఇది పెద్ద సమస్య కాలేదు. మనవారిలో భానుమతిదీ, ఎస్ వరలక్ష్మిదీ కూడా అదే పరిస్థితి. వీరిలో వరలక్ష్మి మరెవరికైనా పాడడానికి సిద్ధపడేదేమో తెలియదు కాని ఆమెకు కూడా “ప్రత్యేకంగా” వినిపించే గొంతు ఉండేది. అయితే ఆమె గానపటిమ అసామాన్యమైనదని ఏ పాట విన్నా తెలిసిపోతుంది. ఆమె చివరి రోజుల ఆర్థిక ఇబ్బందుల గురించి రావి కొండలరావు బాగా రాశారు.

    ఆమెను తలుచుకునే అవకాశం కల్పించిన శ్రీనివాస్ అభినందనీయుడు.

  4. 4
    rama bharadwaj March 2, 2010 1:49 am

    శ్రీనివాస్ గారూ!! నా అభిమాన గాయని s.వరలక్ష్మి గారు. చాలా ప్రత్యేకమైన కంఠం ఆమెది. “లీలా కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా!!” నేను తరుచూ hum చేసుకునే పాటల్లో ముఖ్యమైనది. ఆవిడ పాటలే కాదు తన ధాటీ ఐన కంఠం తో పద్యాల్ని కూడా ఎంతో బాగా చదివేది. పద్య పఠనంలో పి.లీల గారిదీ , యస్ . వరలక్ష్మి గారిదీ ప్రత్యేకమైన బాణీ!! శాస్త్రీయ సంగీతం లోనూ ఆమె కంఠం పాలువాయి భానుమతి గారిలాగా విశిష్టమైనది.

    సినిమా రంగం వారూ..సంగీత రంగం వారూ ఏమాత్రం గుర్తుంచుకోని ఆమెని మీరు గుర్తుపెట్టుకుని స్మరించారు. ఎంతో సంతోషం!! రోహిణీ ప్రసాద్ గారు అబిప్రాయ పడినట్టు లత లాగా సుశీల లాగా పాడేవాళ్ళూ మనకి దొరుకుతారు . కానీ ఆయన ఉదాహరించిన ఇతర గాయనుల్లో ఉన్న విశేషం మరి మన యస్ . వరలక్ష్మిగారి గొంతులోనూ ఉంది.

    ఈమాటలో ఆసక్తిని కల్గించే రాతలు తగ్గిపోతున్న తరుణంలో మీ పరిచయ వ్యాసం నిజంగా తేటగా ఉంది.ఆ మంచి గాయనికి మీ వ్యాసం తో గొంతు కలిపి నేను కూడా నా నమస్కారాలు అందజేస్తున్నాను.

    రమ.

  5. 5
    mOhana March 2, 2010 12:33 pm

    చాలా చక్కని వ్యాసాన్ని, అంతకంటె చక్కని పాటలను అందజేసిన శ్రీనివాస్‌గారికి కృతజ్ఞతాంజలులు. ఎస్‌. వరలక్ష్మి నిజముగా సుస్వరలక్ష్మియే. ఈమె తమిళ సినిమాలలో కూడా చక్కగా పాడేవారు. వీరపాండ్య కట్టబొమ్మన్‌లో శివాజీ గణేశన్‌తో నటించి పాడారు. వీరు నాగేశ్వరరావు పెళ్లిలో ఫాడారట. బాలమురళీకృష్ణ మొదటి సినిమా పాట ఈమె చిత్రములోనే అట. ఈమె భర్త శ్రీనివాసన్‌గారి సహోదరుడే సుప్రసిద్ధ తమిళ కవి కణ్ణదాసన్‌. ఆసక్తిగల వారికి సేవాసదనములో సుబ్బులక్ష్మిగారితో ఈమె చిత్రాన్ని ఇక్కడ చూడగలరు.

    విధేయుడు – మోహన

  6. 6
    Rohiniprasad March 2, 2010 1:29 pm

    నీ సరి మనోహరి అనే యుగళగీతంలో చరణం ముగించడానికి వరలక్ష్మి వేసిన “సంగతి” ఆమె పాటలోని “పవర్” కు అద్దంపడుతుది. ఆ గమకాన్ని ఘంటసాల చేత పాడించకుండా ఆమెకే ఇవ్వడం యాదృచ్ఛికం కాదు.

  7. 7
    rama bharadwaj March 2, 2010 2:48 pm

    అవును రోహిణీ ప్రసాద్ గారూ! సముద్రాల సీనియర్ రాసిన పాట అది. నాకు ఆ పాట కూడా భలే ఇష్టమ్ . ఇంకా చాలా ఉన్నాయి. శ్రీనివాస్ గారు చేర్చినవి తరుచూ వినిపించనివి. వినిపించే వాటిల్లో మీరు చెప్పిన “నా సరి మనోహరి” వరలక్ష్మి గారి మరో మంచి పాట.
    రమ.

  8. 8
    Gopikrishna March 2, 2010 3:02 pm

    నా అభిమాన గాయనులు బాలసరస్వతి, ఎస్.వరలక్ష్మి, లీల గార్లు. వీరిలోని వరలక్ష్మి గారి గురించి శ్రీనివాస్ గారు వ్రాసిన వ్యాసము బహు చక్కగా ఉన్నది. క్లుప్తంగా ఉంటూనే నాకు తెలియని చాలా విషయములు తెలియునట్లు చేసినది. రోహిణీప్రసాద్ గారి అభిప్రాయము చాలా సూటిగా స్పష్టముగా ఉన్నది.

    కృతజ్ఞతలతో
    గోపీకృష్ణ

  9. 9
    Raghu Echempati March 3, 2010 12:02 am

    చాల థన్యవాదములు ఈ పాట లకు.

    రఘు

  10. 10
    Prashanthi Mulumudi March 3, 2010 7:14 am

    I love the quality of her voice.

    aavida paadina manchi manchi paatha paatalu kottaga telisaayi! meeku chaala dhanyavaadaalu Sreenivaas gaaru!

    “nava vasantha” paata sounds like a hindi tune. Does it have a Hindi counterpart?

  11. 11
    Bhanu March 3, 2010 9:16 am

    నమస్కారం అండి,

    వరలక్ష్మి గారి పాటలు ఎంతో బాగున్నాయి. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
    చిత్తూరు నాగయ్య గారి గురించి కూడా చెప్పగలరని ఆశిస్తున్నాను. ముఖ్యంగా యోగి వేమన చిత్రం నుంచి “ఇదియేనా. ఇంతేనా”, “అందాల నా జ్యొతి”, “జీవహింస మానండి” , త్యాగయ్య నుంచి “నిధి చాల సుఖమా”, “ఎందరో మహానుభావులు” వినడానికి ఎంతో బాగుంటాయి. అంతే కాదు, పాడుకోవటానికి కూడా ఎంతో బాగుంటాయి.
    ఆ మహానుభావుడి గురించి ఒక వ్యాసం రాస్తారని ఆశిస్తున్నాను.
    ఇట్లు,
    భాను ప్రకాశ్

  12. 12
    Dr. P. Kumar Babu March 3, 2010 12:21 pm

    Dear Srinivas
    Hats off to you. I have been searching for S.varalakshmi songs in the lalita geyalu and other sites. Thanks for providing the songs. As I am interested to save them and keep them with me, can you please tell me how to download them?

    Yours
    Dr. Kumar Babu
    (pkumarbabu@yahoo.com)

  13. 13
    Sreenivas Paruchuri March 3, 2010 2:34 pm

    గమనిక: సొంతడబ్బా
    నాగయ్య గారి గురించి నవతరంగం.కాం లో రాశాను. ఎస్‌. వరలక్ష్మి గారి గురించి త్వరలో యిక్కడే వివరంగా రాసే ప్రయత్నం చేస్తాను.
    — శ్రీనివాస్

  14. 14
    Bhanu March 4, 2010 1:33 am

    ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.
    నాగయ్య గారి గురించి రాసిన వ్యాసం బాగుంది. ఆయన సంగీత ప్రతిభ గురించి రాయగలిగితే ఎంతో కృతజ్ఞుడ్ని.

  15. 15
    T K Venugopal March 4, 2010 2:10 pm

    గణ గణ అనే పాట “అదిగదిగో గగనసీమ.. అందమైనా చందమామ అదేనోయీ” అనే పాట ను గుర్తుకు తెచ్చింది.

  16. 16
    Ramesh Srirangam March 4, 2010 11:14 pm

    యేదో ప్రత్యేకత ఉన్నది ఆమె గొంతులో.ఎంతో శ్రమతొ చక్కటి శ్రావ్యమైన గీతాలు అందించారు.ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.

  17. 17
    ramaanaath March 4, 2010 11:21 pm

    శ్రీనివాస్
    బలే ఉంది. నాదమ్మొక్కటి పిక్కటిల్లె దిశలన్ నవ్యామృతావ్యాహతాస్వాదమై.. షట్పదీ నాదమో.. కలకంఠనాదమో… వివరింపగా రాదు.. పరమానందానుసంధానమై.. ( పెద్దన).. ఇంత హడావుడి లేకుండా ఓసారి పై పాటలు వింటే చాలు.. పై పద్యం లో చివరి రెండు ముక్కల తో సరిపెట్టుకోచ్చు.

    బాలరాజు లో “వరుణా” అన్న పాట కూడా బలె ఉంటుంది ఎవరినే తో పాటు. వీలుంటే దయచేయించండి.
    రమానాథ్

  18. 18
    aksharamohanam March 5, 2010 8:36 am

    అద్బుతం మీ ప్రయత్నం. నెనరులు మీకు..

  19. 19
    భూషణ్‌ March 5, 2010 12:56 pm

    వరలక్ష్మి గారు అద్భుతమైన గాయని. “రాజట రాజ ధర్మమట” అనే పద్యం “లవకుశ” సినిమాలో ఆమె పాడుతున్నప్పుడు, ఆమె చేతి లోంచి త్రిశూలం లాక్కుని, రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళాలంత కోపం వచ్చేది. 🙂
    మొన్నామధ్య ఆమె పాడిన పాట ఏదో విన్నాను. “నమో పార్వతీ వల్లభా దీనబంధూ” అన్న ముక్కలు గుర్తున్నాయి. ఘంటశాల గారితో కలిసి పాడినట్టు గుర్తు. ఆ పాటలో వరలక్ష్మి గారు ఒక చోట వత్తు పాడనట్టూ, ఇంకో చోట ఇంకేదో తప్పుగా వున్నట్టూ గుర్తు. ఎవరైనా ఈ పాటకి ఇంటరునెట్టులో లింకు ఇచ్చేటట్టయితే, మళ్ళీ ఆ పాట విని, ఆ రెండు విషయాలూ స్పష్టంగా చెప్పగలను. ఇదంత గొప్ప తప్పేమీ కాదు. విషయం తెలియడానికి మాత్రమే చెబుతున్నాను. నా మీద విరుచుకు పడకండి. నేనూ ఆవిడ అభిమానినే. 🙂

    భూషణ్‌, హోసూర్‌

  20. 20
    jagadeeshwar reddy March 10, 2010 3:42 am

    శ్రీనివాస్‌గార్కి నమస్కారాలు.
    చానాళ్లయింది … మిమ్మల్ని చూసి, పలకరించి కూడా. ఎస్‌.వరలక్ష్మిగారిపై మీ మనసులోని మాట చదివి చాలా సంతోషం కల్గింది. ముఖ్యంగా (ఈ మాటలో) ఆమె ఫోటో అపురూపమైంది. చివరి దశలో ఆమెను ఎవరూ చూడలేదు. దాదాపు ఇలాగే ఉంటారనిపించింది. అందుకుగాను ఆ ఫోటోని సంపాదించినవారిని ముందుగా అభినందించాలి.
    ఇప్పటికీ రాత్రుళ్లు పడుకోబోయేముందు హెచ్‌.ఎం.వి. వాళ్లేసిన వరలక్ష్మిగారి ‘గోల్డెన్‌ హవర్‌’ కేసెట్‌ పెట్టుకుని వింటూ అలౌకిక ఆనందాన్ని స్వంతం చేసుకుంటాను. ఆ పాటల్ని మధుసూధన శర్మగారు (హెచ్‌.ఎం.వి. వారికి) అందించడం … మనం శర్మగార్కి ఋణపడివున్నాం అనిపించింది. (అన్నట్లు ఆ మధ్య శర్మగారి జ్ఞాపకాలు ఆంధ్రజ్యోతి ఆదివారంలో వచ్చాయి. వీలుంటే సంగీతాభిమానులకోసం ఈమాటలో ఆ జ్ఞాపకాల లింకు ఇవ్వగలరా…)
    ఆ కేసెట్లోంచి ఒక్క పాట తీసేయలేం. ఏ పాటవిన్నా… మల్లీశ్వరిలో చేదబావి దగ్గర మల్లితో కమలాబాయి అంటుందే ‘కయ్యిమని పచ్చిరాగంలా పాడేయడమే’ అని… అలా ఉంటాయన్నీ. నాకు తెలిసి ఆమెలా పాడేవారు లేరు … ఆమె పాటల్ని ఇమిటేట్‌ చేయడం సాహసం కూడా. ‘చందమామా … ఓ చందమామా జాలిలేదా నీకు నాపైనా… ‘పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు నాకు.
    అభినందనలతో …
    మీ గొరుసు

  21. 21
    bhaarati April 24, 2010 11:07 pm

    బాలరాజు సినిమాలో ” రూపమునీయరయా,” అన్న రాగమాలిక శ్రీనివాస్‌ గారికి దొరకలేదా? లేదా, ఆపాట పాడింది వరలక్ష్మిగారు కాదా, చెప్మా?
    సందేహనివృత్తికోసం వేచి చూస్తూ,

    భారతి

  22. 22
    Sreenivas Paruchuri May 9, 2010 4:06 am

    భారతి-గారు,
    “ఆవిడ పాడిన […] ప్రైవేటు పాటలగురించి [మాత్రమే చెప్పాలన్న] వుద్దేశ్యంతో” పై నాలుగు మాటలు రాసాను. “రూపము నీయరయా” అన్న రాగమాలిక పాడింది వరలక్ష్మిగారే.! “బాలరాజు” సినిమా ఆడియో, వీడియోలు చాలా తేలికగా దొరుకుతున్నాయి. ఒకవేళ మీకు ఆ పాట దొరకని పక్షంలో నాకు రాయండి. నేను పంపగలను. .

    భవదీయుడు,
    శ్రీనివాస్

  23. 23
    SIVARAMAPRASAD KAPPAGANTU June 20, 2010 8:24 am

    వరలక్ష్మిగారు పాడిన అనేక పాటలు పాత తెలుగుపాటలు వెబ్సైటులో ఉన్నాయి:
    http://www.oldtelugusongs.com/cgi-bin/search2/search.pl

  24. 24
    Harita June 25, 2010 2:10 am

    వరలక్ష్మి గారి పాటలంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా మహా మంత్రి తిమ్మరసు సినిమా లోని ‘లీలా కృష్ణా’ పాట చాలా చాలా బాగా పాడారు. “అలక ఏమో అని దరి రాకుండిన జాలిగా చూసేవేలనో” అన్న వాక్యం లో జాలి అనే పదాన్ని పలికిన తీరు నభూతో భవిష్యతి.

    ఆమె నటన గురించిన చర్చ కాకపోయినా చెప్పాలనిపిస్తోంది. మా నాన్నగారు అనేవారు, ఏడుస్తూ డైలాగులు పలకడంలో ఇద్దరే ఇద్దరు దిట్టలు తెలుగు సినిమాలో అని. ఒకరు సావిత్రి గారు కాగా మరొకరు వరలక్ష్మి గారు. ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వర మహత్యం సినిమా లో శ్రీనివాసుడు శిలగా మారినపుడు సావిత్రి, వరలక్ష్మి ల మధ్య సంభాషణ లో ఈ సంగతి బాగా తెలుస్తుంది.

  25. 25
    Nilagiri Jayasankar July 30, 2011 1:07 pm

    ఎన్నొ చక్కని విషయాలు తెలుసుకొనె అవకాశము దొరకినది. మీకు నా ధన్యవాదాలు.

    జయశంకర్

  26. 26
    Veeranarasimharaju April 4, 2013 12:15 pm

    సుస్వర లక్ష్మి ఎస్ వరలక్ష్మి

  27. 27
    DEVULAPALLI SRINIVASA MURTI August 20, 2015 7:40 am

    రియమైన మిత్రులందరికీ …
    అలనాటి మేటి గాయకనటీమణి గురించి కొన్ని అపురూపమైన విశేషాలతో బాటు ఆవిడ ఆపపించిన కొన్ని అపురూపమైన పాటలతో పొందుపరిచి మనముందుంచిన వ్యాసకర్త అభినందనీయులు .

  28. 28
    చౌదరి.యం.వి. August 20, 2015 9:03 am

    చాల కొత్త విషయాలు తెలియజేశారు,చాల మంచి పాటలు వినిపించారు,ధన్యవాదాలు…

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • రజనితో రేడియో ఇంటర్‌వ్యూ
  • తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు
  • టి. జి. కమలాదేవి
  • చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2
  • బుఱ్ఱకథ నాజర్‌గారి రెండు ఇంటర్‌వ్యూలు

ఇటువంటివే…

  1. అలనాటి నటి ఎస్. వరలక్ష్మితో ముఖాముఖీ
  2. సి. ఎస్. ఆర్. ఆంజనేయులు: కొన్ని పాటలు, పద్యాలు
  3. మధుర గాయని బతుకు పాట: పుస్తక పరిచయం
  4. గురువుల సంస్మరణ కొనసాగిస్తున్న గాయని ప్రభా అత్రే
  5. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్.

మార్చి 2010 సంచికలో ...

  • 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక
  • అంధకారం
  • అసమర్థుని జీవయాత్రేనా?
  • అసమర్ధుని జీవయాత్రే!
  • ఇతిహాసాలూ, ప్రబంధాలూ
  • ఈమాట మార్చి 2010 సంచికకు స్వాగతం
  • ఓ బుజ్జి కుక్క పిల్ల
  • గుండుగొమ్ములనుమానం – 2
  • తడిస్తే కదా తెలిసేది!
  • తెలగాణెము
  • నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను
  • సహజ గాయని ఎస్. వరలక్ష్మి
  • సా విరహే తవ దీనా
  • సామాన్యుని స్వగతం: టెలిఫోనుతో నా అనుభవాలు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

సామాన్యుని స్వగతం: టెలిఫోనుతో నా అనుభవాలు
పాడిందే పాట అను ఒక పునశ్చరణ

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.