ఈ సంచికలో మరి కొన్ని లలిత గీతాలు విందాం. వీటిలో చాలా వరకు 1980కి ముందు నాటివి. ఈమని శంకరశాస్త్రి గారు రేడియోలో చాలా కాలం పనిచేసినా అది తెలుగు దేశానికి దూరంగా ఢిల్లీ స్టేషన్లో కావడంతో ఆయన తెలుగు పాటలకు ఎక్కువగా సంగీతం కట్టలేదు. ఆ మాటకొస్తే ఆయన తెలుగులో చేసిన లలితగీతాలు నా దగ్గరున్నవి రెండే. మొదటిది, ఒదిగిన మనసున పొదిగిన భావము అన్న గీతం మే 2017 సంచికలో
ఈ సంచికలో వినిపిస్తున్న మరొక అరుదైన పాట ఆర్. (ఉడతా) సరోజిని పాడిన, తూగాడు-తరంగాల అన్న, మల్లవరపు విశ్వేశ్వరరావు రచన. ఈ పాటకు బాణీ కట్టినదెవరో ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు. అలాగే, విలాసాలు చిలికే అనే పాట సాహిత్యం ఎవరిదో కూడా.
తరువాత ఓలేటి వెంకటేశ్వర్లు బాణీలు కట్టిన మూడు పాటలు: విసిరేసెను తూరుపును ఒక శుక్రతారను (ఛాయాదేవి, ఓగిరాల), కలలో నీలిమగని (భుజంగరాయశర్మ సాహిత్యం, గానం: మల్లాది సూరిబాబు), చూడచూడ నీరూపము సుందరమై యొప్పు దేవ (బసవరాజు అప్పారావు సాహిత్యం, వేదవతి ప్రభాకర్). కలలో నీలిమగని అన్న పాట మొదటిగా విజయవాడ కేంద్రంనుండి ఈమాసపు పాటగా ప్రసారం అయ్యింది.
తతిమ్మా పాటలకొస్తే, ఉప్పొంగి పోయింది గోదావరి (అడవి బాపిరాజు సాహిత్యం, బృందగానం); వెన్నెల వెన్నెల (దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం, పాలగుమ్మి విశ్వనాధం సంగీతం, బృందగానం) అందరికీ బాగా తెలిసినవే. చివరిగా ఒక దాశరధి రచన, చిన్ని మల్లెపూవులో (సంగీతం: రాజారావు, గానం: వైదేహి).
- చిన్ని మల్లెపూవులో – రచన: దాశరథి. సంగీతం: రాజారావు. గానం: వైదేహి.
- చూడచూడ నీరూపము – రచన: బసవరాజు అప్పారావు సంగీతం: ఓలేటి వెంకటేశ్వర్లు. గానం: వేదవతి ప్రభాకర్
- కలలో నీలిమ గని – రచన: భుజంగరాయశర్మ. సంగీతం: ఓలేటి వెంకటేశ్వర్లు. గానం: మల్లాది సూరిబాబు.
- తూగాడు తరంగాల – రచన: మల్లవరపు విశ్వేశ్వరరావు. గానం: ఆర్. సరోజిని.
- ఉప్పొంగి పోయింది గోదావరి – రచన: అడవి బాపిరాజు. గానం: కోరస్.
- వెన్నెల వెన్నెల – రచన: దేవులపల్లి. సంగీతం: పాలగుమ్మి విశ్వనాథం. గానం: కోరస్.
- విలాసాలు చిలికే – సంగీతం: ఈమని శంకరశాస్త్రి. గానం: మల్లిక్, కోమల.
- విసిరేసెను తూరుపు – సంగీతం: ఓలేటి వెంకటేశ్వర్లు. గానం: ఛాయాదేవి, ఓగిరాల.