నాకు నచ్చిన పద్యం: కైలాసాన్నే కాదన్న వీరవనిత

కథలూ కవిత్వమూ అంటే చాలా జాగ్రత్తగా చెక్కాలని, అయితే మృదువుగానో లేదా పదనుగానో ఉంటేనే అవి మన మనసుని తాకుతాయని, మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం. ఇప్పటి దాకా ఈ వ్యాస పరంపరలో చూసిన పద్యాలన్నీ ఇంచుమించుగా ఆ కోవకు చెందినవే. వీటన్నిటికీ భిన్నంగా, చాలా కటువుగా, ఒక రకంగా చెప్పాలంటే బండగా, అయినా బలంగా తాకే ఒక కథని ఈసారి చెప్పుకుందాం. సుకుమార స్వభావులు చదివి తట్టుకోలేరేమో, కాస్త గుండె దిటవు చేసుకొని ముందుకు సాగడం మంచిది. ఆ కథలో ఒక వ్యక్తి పలికే ఘాటైన మాటలివి:

ద్వి. అనవుడు, “నట్లగు నగు నాటదాన
     ననియె చూచెదవయ్య! యయ్య నీ మాయ
     లెఱుగుదు నెఱుగుదు నే బేల గాను
     కఱకంఠ! యిది యేల కథలు వన్నెదవు?
     నను జూచి సిరియాలు డని తలంచితివొ?
     పనియు లే దారగింపక పోవరాదు
     ప్రామిడియై మేడుపడియెడు దాన
     గామి నీ వెఱుగవే కడయింటి పొడువ
     కామించి సుతు జంపి క్రమ్మఱ బిలువ
     గామారి! నీ యిచ్చు కైలాస మొల్ల;
     దన ద్రోహమున జేసి తా బోయె బొలిసి
     గొనకొని యా ద్రోహి గూడునే తలప?”

తెలుగు కావ్యాలతో పరిచయం ఉన్నవారికి కూడా ఈ ఛందస్సు ఏమిటో చప్పున తెలియకపోవచ్చు. అయినా తెలుగు భాషలో చాలా ప్రాచీనమైన ఛందస్సు ఇది. జో అచ్యుతానంద, జోజో ముకుంద గీతం తెలియని తెలుగువాళ్ళు ఇంకా ఉండరనే అనుకుంటాను. ఆ గీతం ఈ ఛందస్సులోనే ఉంది. మామూలుగా పద్యానికి నాలుగు పాదాలైతే, దీనికి రెండే పాదాలు. అందుకే దీని పేరు ద్విపద. మూడు ఇంద్రగణాలు, తర్వాత ఒక సూర్యగణం- అనే లక్షణం తెలియనివాళ్ళు కూడా హాయిగా ఏడవకు ఏడవకు నా చిట్టి తండ్రి, ఏడిస్తె నీ కళ్ళు నీలాలు గారు అని పాడుకోడానికి వీలైన ఛందస్సు ఇది.

పాటల్లో పాడుకొనే ఈ ఛందస్సుకు కావ్యస్థానం అందించిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. పైగా, అదియునుగా కైహికాముష్మికద్విపద హేతువవుట ద్విపద నాగ బరఁగు అంటూ- ఐహిక ఆముష్మికములనే రెండు స్థానాలకు (పదము అంటే స్థానం అనే అర్థం కూడా ఉంది) హేతువు అవుతుంది కాబట్టి దానిని ‘ద్విపద’ అన్నారు అనే చిత్రమైన వ్యుత్పత్తిని చెప్పి ఈ ఛందస్సుకు ఉత్కృష్టమైన స్థానాన్ని అందించాడు. పాల్కురికి సోమనాథుని కాలం పన్నెండవ శతాబ్ది చివర, పదమూడవ శతాబ్ది మొదటి భాగం. ఇతను గొప్ప పండితుడు, తత్త్వవేత్త, కవి. విస్తృతమైన తన రచనలతో వీరశైవ మతాన్ని విస్తరింపజేశాడు. అనుభవసారము, చతుర్వేద సారము, బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, చెన్నమల్లు సీసాలు, బసవ రగడ, బసవోదాహరణం, ఇంకా మరెన్నో రగడలు, ఉదాహరణలు, గద్యలు, తెలుగు, సంస్కృత, కన్నడ భాషల్లో చేశాడు. భక్తి రచనలే కాకుండా, వీరశైవ మతానికి వేద ప్రామాణ్యాన్ని అందించడానికి రుద్రభాష్యము, సోమనాథ భాష్యము (దీనికే బసవరాజీయం అని కూడా పేరు) అనే రెండు గ్రంథాలను సంస్కృత భాషలో రచించాడు. ఈ భాష్య రచనల ద్వారా శ్రుతి స్మృతి పురాణేతిహాసాల ప్రమాణాలతో శైవ మతాన్ని సమర్థించాడు సోమనాథుడు.

ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ సోమనాథుడు రచించిన బసవపురాణం లోనిది. బసవడు వీరశైవ మతాన్ని ఉద్ధరించి దానికి రాజపోషణ అందించి వ్యాప్తి తీసుకువచ్చిన వ్యక్తి. ఇతను బిజ్జల రాజు కొలువులో దండనాయకునిగా పనిచేశాడు. తమిళనాట వ్యాప్తిలో ఉన్న శైవ మతం నుండి వీరశైవ మతాన్ని స్థాపించింది ఈ బసవేశ్వరుడే అని కొందరి నమ్మకం. వీరశైవులు ఇతన్ని నందీశ్వరుని అవతారంగా కొలుస్తారు. బసవేశ్వరుని కథ ప్రధాన నేపథ్యంగా, వీరశైవ మత ప్రాశస్త్యాన్ని చాటే అనేక భక్తుల కథల సమాహారం బసవపురాణం. ఇది వ్యాస విరచితమైన అష్టాదశ పురాణాల మార్గంలో నడిచే రచన కాదు. జైన సంప్రదాయంలో కనిపించే పురాణం దీనికి ఆధారం. జైన పురాణ ప్రభావంతోనే తమిళనాట శైవ మతంలో పెరియపురాణం వెలిసింది. ఆ దోవలో వచ్చినదే బసవ పురాణం కూడా. పెరియపురాణంలో కనిపించే భక్తుల కథలు కొన్ని బసవ పురాణంలో కూడా కనిపిస్తాయి. శైవ వైష్ణవ మతాలు రెండూ భక్తిని ఆధారం చేసుకొని వ్యాప్తి చెందిన మతాలే. భక్తి అంటే భగవంతునిపై పరిపూర్ణమైన విశ్వాసం, ఆత్మార్పణ. అయితే వైష్ణవులది చాలా వరకూ మృదువైన, మధురమైన భక్తి. విష్ణువు శాంతాకారుడు, మోహనాకారుడు కదా. మరి శివుడో – అతను రుద్ర స్వరూపుడు, వీరభద్రుడు! అందుకే కాబోలు శైవులది కాస్త తీవ్రమైన భక్తి. దాన్ని అతి తీవ్ర స్థాయికి తీసుకుపోయినది వీరశైవం. ఆ భక్తి తీవ్రతని తట్టుకోవాలంటే అప్పుడప్పుడు ఆ శివుడే తబ్బిబ్బవుతాడు, ఇక మామూలు మానవుల సంగతి వేరే చెప్పాలా! వీరశైవ మతంలోని మరొక ప్రత్యేకత, లింగ జంగమాలకున్న అత్యంత ప్రాధాన్యం. వీరశైవులు శివుడిని లింగ రూపంలోనూ, జంగమ రూపంలోనూ కొలుస్తారు. లింగమంటే గుడిలోనో, కనీసం పూజా మందిరంలోనో పెట్టి పూజించే మూర్తి కాదు. గొలుసు చివర తగిలించుకొని, నిరంతరం మెడలో ధరించే లింగం. జంగములు మానవ రూపంలో ఎల్లప్పుడూ అంతటా సంచరించే శివ స్వరూపులు. వాళ్ళని ఎటువంటి సాంఘిక కట్టుబాట్లు బంధించలేవు. జంగముల సేవ వీరశైవులకు అన్నింటికన్నా ముఖ్యమైన ఆచారం. ఆ సేవలో వారు ఇసుమంత అపచారాన్నయినా సహించరు. దాని కోసం ఎంతకైనా తెగిస్తారు. అలాంటి తెగింపుగల ఒక భక్తురాలు నిమ్మవ్వ. పై ద్విపద ఖండికలో ఉన్న మాటలు ఈ నిమ్మవ్వవే.

నిమ్మవ్వ కథ చెప్పుకొనే ముందు సిరియాళుని కథ చెప్పుకోవాలి. భక్త సిరియాళుని కథ ప్రసిద్ధమైనదే. ఇది తమిళ పెరియపురాణంలో ఉంది. శ్రీనాథుని హరవిలాసంలో కూడా ఈ కథ వస్తుంది. సిరియాళుని భక్తిని పరీక్షించడానికి శివుడు జంగముని రూపంలో అతని ఇంటికి వస్తాడు. సిరియాళుడు వీరశైవ వ్రతాచారుడు. జంగముడు కోరినది ఏదైనా తీర్చక తప్పదు. వచ్చిన జంగముడు తనకు నరమాంసం వండి వడ్డించాలని కోరుకుంటాడు. అప్పుడా సిరియాళు ‘సర్వలక్షణ గుణవంతుడైన వరపుత్రుడు నాకున్నాడు. ఇంక నరమాంసం కోసం పొరుగింటికి పోవాల్సిన అవసరం కూడా లేదు. తప్పక వండి పెడతాను రండి,’ అని అతన్ని ఇంటికి ఆహ్వానిస్తాడు. వ్రతాచారంలో సిరియాళుని భార్య సంగళవ్వ కూడా అంతటి వీర వనితే! జరిగింది సిరియాళుని నోట విని, ‘నువ్వెందుకు సంకోచిస్తావు, అలాగే వండి పెడతా’నని చెప్తుంది. ఇద్దరూ కలిసి తమ ఒక్కగానొక్క కొడుకుని చంపి అతని మాంసాన్ని వండి వడ్డిస్తారు. తినడానికి కూర్చున్న శివుడు వాళ్ళని ఇంకా పరీక్షించడానికి, విస్తట్లో శిరోమాంసం లేకపోవడాన్ని గుర్తించి, ‘అది లేకుండా ఎలా తింటాను, దాన్ని దాచేసుకున్నారా?’ అని అడుగుతాడు. అదేమీ లేదని, తల కేశదుష్టం అని సందేహించి వండలేదని చెప్పి, దాన్ని కూడా వండి వడ్డిస్తారు. అప్పుడు శివుడు సిరియాళుని సహపంక్తి భోజనానికి కూర్చోమంటాడు. సరేనని కూర్చుంటాడు. ఇంతా అయ్యాక, ‘నీ కొడుకుని కూడా పిలువు భోజనానికి, పిల్లలు లేని ఇంట అన్నదానం స్వీకరించ’నని పట్టుబడతాడు ఆ కపట జంగముడు. అప్పుడు సిరియాళుడు కొడుకుని పిలవమని భార్యకి చెపుతాడు. సంగళవ్వ నాలుగు దిక్కుల చూస్తూ కొడుకుని రమ్మని ఎలుగెత్తి పిలుస్తుంది. అప్పుడా బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లి కౌగిలిలో చేరిపోతాడు. శివుడు తన నిజస్వరూపంతో ప్రత్యక్షమై ఆ దంపతులను దివ్య విమానంలో కైలాసానికి తీసుకువెళ్ళిపోతాడు. ఇది సిరియాళుని కథ. అటు పెరియపురాణం లోను, ఇటు హరవిలాసం లోను, ఇంత దాకనే ఉంటుంది ఈ కథ. అయితే సోమనాథుడు ఈ కథను ఒక చిన్న మలుపు తిప్పి దీనిని నిమ్మవ్వ కథతో అనుసంధానం చేశాడు.

కైలాసం చేరిన సిరియాళునికి ఒకింత గర్వం కలుగుతుంది. వ్రతాచారానికి కన్నకొడుకునే బలిచేసి కైలాసవాసం పొందిన తనవంటి భక్తుడు మరెక్కడా ఉండడు కదా అని ఆ గర్వం. ఆ సంగతి శివుడు గ్రహించి, చిఱునవ్వు నవ్వుతూ అతని చెయ్యి పట్టుకొని మళ్ళా భూలోకానికి తీసుకు వస్తాడు. సరాసరి నిమ్మవ్వ అనే భక్తురాలి యింటికి వస్తారు జంగముల రూపాలలో. వచ్చిన వాళ్ళకు అతిథి మర్యాదలు చేస్తుంది నిమ్మవ్వ. వాళ్ళకు పంచ భక్ష్య పరమాన్నాలు వండుతుంది. ప్రయాణపు బడలిక అనే మిషతో శివుడు, సిరియాళుడు పడుకోడానికి వెళతారు. పూజ సామగ్రిని కొనడానికని బయటకు వెళుతుంది నిమ్మవ్వ. గోవులు కాచి, అలసటతో ఆకలితో వచ్చిన ఆవిడ కొడుకు, వంటింట్లోకి దూరి, బాల్య చాపల్యంతో ఒక బూరె తీసుకొని నమలడం మొదలుపెడతాడు. అంతలో నిమ్మవ్వ తిరిగివచ్చి, జంగములకు చేసిన ప్రసాదాన్ని కొడుకు తీసుకు తినడం చూసి సహించలేక, ‘ఛీ కుక్కా!’ అని తిట్టి శివద్రోహం చేసిన వాడు బతకకూడదని, పచ్చి చెక్కలు తెచ్చి కొడుకు తలను మోది చంపేస్తుంది. చచ్చిన పీనుగుని చరచరా ఈడ్చుకుపోయి పెంటకుప్పలో పడేస్తుంది. తిరిగి వచ్చి, ఏమీ కానట్టు వంట ప్రయత్నాలలో పడుతుంది. ఇదంతా శివుడు సిరియాళునికి చూపిస్తాడు. అతను చూసి ఆశ్చర్యపోతాడు. సరే వంట పూర్తయ్యాక వాళ్ళని భోజనానికి పిలిచి వడ్డిస్తుంది నిమ్మవ్వ. శివుడు మళ్ళీ తన నాటకాన్ని మొదలుపెడతాడు. ‘ఇంతకు ముందే ఇక్కడ నీ కొడుకుని చూశాను. పాపం అలసిపోయి వచ్చినట్టున్నాడు. పిల్లలను ఆకలితో ఉంచి ఎవరైనా అన్నం తింటారా. వాడిని కూడా భోజనానికి పిలువు’ అంటాడు. అప్పుడు నిమ్మవ్వ అతనికిచ్చిన ఘాటైన జవాబులో భాగమే పైన ఇచ్చిన పద్యఖండిక.

అట్లు అగు, అగు (అవునవును అలాగేనేం!). నాతో ఆడుకుందామని చూస్తున్నావు కదా నువ్వు? ఓ అయ్యా! నీ మాయలన్నీ నాకు తెలుసు తెలుసు లేవయ్యా! నేనేం అమాయకురాలిని కాను. ఓ కఱకంఠుడా! ఇలా కథలెందుకు అల్లుతావు. నేను కూడా సిరియాళుడిని అనుకున్నావేమో. నీ నాటకాలు నా దగ్గర సాగవు. ఇప్పుడు నువ్వు తినకుండా వెళ్ళడానికి లేదు. నీ కుటిలత్వానికి (ప్రామిడి) లొంగి మోసపోయే (మేడుపడు) దాన్ని కాను నేను. అయినా నా సంగతి నీకు తెలియదా. పరలోకం పైనున్న వ్యామోహంతో కొడుకుని చంపి మళ్ళీ వెంటనే పిలిచే దాన్ని కాను నేను. నువ్వు ఇచ్చే కైలాసం నాకు అక్కరలేదు (ఒల్లను). తాను చేసిన శివద్రోహం కారణంగా వాడు చచ్చిపోయాడు (పోలసి అంటే చచ్చి అని అర్థం). ఆ ద్రోహిని తిరిగి పిలిచే ప్రసక్తే లేదు– అని కుండబద్దలు కొట్టేస్తుంది నిమ్మవ్వ. ఈ మాటలు వినేసరికల్లా సిరియాళుడు బాధతో సిగ్గుతో నిశ్చేష్టుడై తలవంచుకుంటాడు. ఆమె భక్తికి మెచ్చిన శివుడు తన నిజస్వరూపంతో దర్శనమిస్తాడు. అయినా ఆవిడ ఎక్కడా తగ్గదు! అంటుంది కదా –

అఱిముఱి చన్నుపా లర్థించి ఏడ్చు చిఱుత చే నొక పిండికఱుడిచ్చి తల్లి
తన చన్ను మఱపించుకొనిపోయినట్లు చనరాదు…

చనుబాల కోసం ఏడుస్తున్న పిల్లాడికి ఒక పిండిముద్ద ఇచ్చి మాయ చేసే తల్లిలా నన్ను మాయ చేసి పోదామని అనుకుంటున్నావా. నీకు మూడు కళ్ళు ఉన్నా లేకున్నా, నువ్వు హర రూపంలో వచ్చినా నర రూపంలో వచ్చినా నాకు ఒకటే. అంచేత నీ చమత్కారాలు చాలించి నే పెట్టిన భోజనాన్ని బుద్ధిగా ఆరగించి వెళ్ళు – అని శివుడినే గదమాయిస్తుంది ఆ మహా భక్తురాలు!

అదీ నిమ్మవ్వ కథ, ఆమె వ్యక్తిత్వం, వీరభక్తి తత్త్వం. వీరశైవులు కాని వారికి ఆమె ప్రవర్తన చాలా విచిత్రంగా, మొరటుగా, జుగుప్సగా, మూర్ఖంగా అనిపించడం సహజమే. అయినా ఆమెలోని తెగింపు, ఒక లెక్కలేనితనం మనల్ని బలంగా తాకుతుంది. అంత సులువుగా జీర్ణించుకోడానికే కాదు మరిచిపోడానికి కూడా కుదరని వ్యక్తిత్వం ఆమెది. తను నమ్మిన వ్రతం ముందు కొడుకే కాదు కైలాసమైనా ఆమెకు తృణప్రాయమే. ప్రపంచంలో తల్లికి బిడ్డతో ఉన్న బంధంకన్నా సహజమైన దృఢమైన బంధం మరొకటి ఉండదు. ఆ బంధాన్ని తెంచుకోవడం అంత సులువు కాదు. అలాంటి బంధాన్ని కూడా అతి సహజంగా వదులుకుంది సిరియాళుని భార్య సంగళవ్వ. కానీ గర్వపడ్డది మాత్రం సిరియాళుడు! కొడుకు అనే లౌకిక బంధాన్నే కాదు, కైలాసమనే పారమార్థిక ఫలాన్ని కూడా వ్రతనిష్ఠకై కాదనుకున్న వీర వనిత నిమ్మవ్వ. అందుకే పరమశివునితో కూడా పరమధైర్యంగా అలా ఎదిరించి మాట్లాడగలిగింది.

వీరశైవుల కథనాలన్నీ చాలా వరకూ ఇలాగే ఉంటాయి. సూటిగా, ఎలాంటి కవితాత్మక సున్నితత్వాలకు చోటివ్వకుండా, ఆ కథలను చెపుతాడు పాల్కురికి సోమనాథుడు. కావ్యం కాంతాసమ్మితమని, పురాణం మిత్ర సమ్మితం అని ప్రసిద్ధమైన మాట ఒకటుంది. అంటే కావ్యం భార్యలా రమ్యంగా మంచిని చెపితే, పురాణం ఒక మంచి మిత్రునిలా ఉపదేశిస్తుందని అర్థం. అయితే నాకు తోచిన ప్రత్యేకత ఏమిటంటే, బసవపురాణం అటు రమ్యంగా కానీ, ఇటు మిత్రునిలా సున్నితంగా కానీ, ‘ఉపదేశించే’ రచన కాదు. వేదాల మాదిరి ‘ఆదేశించే’ కథలు!

వైష్ణవం, భక్తిని ఒక ఉన్నతమైన లోకోత్తరమైన భావనగా అభివర్ణిస్తుంది. భక్తిని ఒక అలౌకికమైన రసంగా ఉన్నతీకరించినది వైష్ణవ భక్తి సంప్రదాయమే. వీరశైవం అలా కాదు. అందులో భక్తి ఇహకర్మలలో ఒక భాగమే. ఒక రకంగా చెప్పాలంటే వీరశైవుల భక్తి నేలవిడిచి సాము చెయ్యదు. దీనికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం. భాగవతంలో- మందార మకరంద మాధుర్యమున దేలు, అనే పద్యం ప్రసిద్ధమే. విష్ణుభక్తిలోని దివ్యత్వాన్ని, మాధుర్యాన్ని, ఉగ్గడించడానికి ప్రహ్లాదుడు తండ్రికి చెప్పిన పద్యమిది. ఇందులో చివర ‘అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి నితరంబు జేర నేర్చు’ అంటాడు ప్రహ్లాదుడు. ఇదంతా చాలా అమూర్తమైన, అలౌకికమైన భావం. సరిగ్గా ఇలాంటి పద్యమే బసవపురాణంలో కూడా వస్తుంది. ఇవి బసవడు బిజ్జలునితో చెప్పే మాటలు:

పరమేశు భక్తియన్ సురతరువుండ హరుభక్తియన్ కనకాచలంబుండ
గామారి భక్తి చింతామణి యుండ సోమార్ధధరు భక్తి సురధేను వుండ
బగుతు డాసించునే పరధనంబునకు? మృగపతి యెద్దెస మేయునే పుల్లు?
క్షీరాబ్ధిలోపల గ్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావంగ?
జూత ఫలంబులు సుంబించు చిలుక భ్రాంతి బూరుగు మ్రానిపండ్లు గన్గొనునె?
రాకామాల జ్యోత్స్న ద్రావు చకోర మాకాంక్ష సేయునే చీకటి ద్రావ?

యరుదగు లింగ సదర్థుల యిండ్ల వరవడు నాకొక సరకె యర్థంబు?
పుడమీశ మీ ధనంబునకు జేసాప నొడయల కిచ్చితి నొడయల ధనము
పాదిగ దఱిగిన భక్తుండ గాను గాదేని ముడుపు లెక్కల జూడు మనుచు

ఇక్కడ సందర్భం పూర్తిగా లౌకికమైనది! తన భాండాగారంలోని డబ్బు జంగములకు దోచి పెడుతున్నాడని బసవనిపై వచ్చిన ఫిర్యాదును బిజ్జలుడు విచారిస్తున్న సందర్భం. బసవనిపై మోపబడిన నేరాన్ని బిజ్జలుడు నమ్మి అతన్ని నిలదీస్తాడు. అప్పుడు బసవడు చెప్పిన సమాధానం ఇది. ఇందులో జాగ్రత్తగా గమనిస్తే, బసవడు చెపుతున్నది శివభక్తి వల్ల కలిగే ఐహిక ప్రయోజనాలే! ఇందులో ఎక్కడా అమూర్త భావన లేదు. శివభక్తి తనకు సకల సంపదలను తెచ్చిపెడుతుందని, అంచేత అతనికి రాజధనంతో పని లేదనీ చెప్పడానికి ఆ ఉపమానాలన్నీ వాడుకున్నాడు బసవడు. చివరకు ‘కావాలంటే లెక్కలు చూసుకో’ అనే పూర్తి లౌకికమైన విషయంతో పూర్తవుతుంది ఆ సంభాషణ!

వైష్ణవ, వీరశైవ భక్తితత్త్వాలలోని ఈ వైవిధ్యానికి కారణం బహుశా వాటి వెనుకనున్న సాంఘిక వ్యవస్థలలోని భేదమే కావచ్చు.

పాల్కురికి సోమనాథుడు రాజాస్థానాలలో పండిత కవుల కోసం కాకుండా, సామాన్య జనుల కోసం, దేశీయమైన ఛందస్సులో, జానుతెనుగులో, బసవపురాణం, పండితారాధ్య చరితం వంటి రచనలు చేశాడని చాలామంది విమర్శకులు అభిప్రాయపడ్డారు. పైగా అలాంటి ప్రయోగాన్ని సంప్రదాయ కవులు ఆమోదించక అణగద్రొక్కారని, అందుకే ద్విపద ఛందస్సుకు విస్తృత కావ్య గౌరవం దక్కలేదనీ కొందరు వాపోతూ ఉంటారు కూడా. అయితే ఇందులో నాకు పూర్తి సత్యం ఉన్నట్టు తోచదు. పాల్కురికి తన రచనలను ద్విపద ఛందస్సులో కూర్చిన మాట నిజమే. స్వయంగా ‘ఉరుతర గద్య పద్యోక్తుల కంటె సరసమై పరగిన జానుదెనుంగు చర్చింపగా సర్వసామాన్య మగుట గూర్చెద ద్విపదలు గోర్కి దైవాఱ’, అని స్వయంగా చెప్పుకొన్నాడు. అయితే ఆ మాటలను మనం యథాతథంగా స్వీకరించాల్సిన అవసరం ఏముంది? అతని రచనలను పరిశీలించి, వాటినతను ఎవరికోసం చేశాడు, ఎలాంటి భాషలో, ఎలాంటి శైలిలో నడిపించాడు అని తెలుసుకోవడం సరైన పని. దీనికి విస్తృతమైన పరిశోధన అవసరం. ప్రస్తుతానికి ముఖ్యమైన మూడు విషయాలను స్థాలీపులాక న్యాయంగా ప్రస్తావించి యీ వ్యాసాన్ని ముగిస్తాను. ఆసక్తిగల పరిశోధకులు దీనిని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. పరిశీలించాల్సిన మూడు అంశాలు – సోమనాథుడు వాడిన భాష, ద్విపదను నడిపించిన తీరు, కావ్య రచనా శైలి.

బసవపురాణంలో భాషను పరిశీలిస్తే, అది జనసామాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయోగించిన భాష కాదని కచ్చితంగా తెలుస్తుంది. బసవపురాణంలో చాలా చోట్ల దేశీయమైన పదాలు, పలుకుబళ్ళు కనిపించే మాట నిజమే. అంత మాత్రం చేత రచన మొత్తం జనసామాన్యానికి అందుబాటులో ఉంటుందని అనుకోవడం పొరపాటు. కావ్య ప్రారంభమే ఇలా ఉంటుంది:

శ్రీ గురుదేవు నంచిత గుణోత్తంసు యోగీంద్ర హృదయపయోజాత హంసు
బరమ కృపామూర్తి భక్త జనార్తిహరు ద్రిజగత్ స్ఫూర్తి నానంద వర్తి
భవరోగ విచ్ఛేది భక్త వినోది, శివతత్త్వ సంపాది జిరతరామోది

ఇలా సాగుతుంది. ఇది జన సామాన్యానికి అర్థమయ్యే భాషా? పోనీ కావ్యం మొదలు ఇలా ఉంది అనుకొందామన్నా, ఇలాంటి తత్సమ సమాస భూయిష్టమైన రచన కావ్యం మొత్తమ్మీద చాలా చోట్ల కనిపిస్తుంది. అందువల్ల ఇది కేవలం పామరజనం కోసం రచింపబడిన కావ్యం అనుకోవడం సరికాదు.

ఇక ద్విపద ఛందస్సు విషయానికి వస్తే, ఈ వ్యాసం మొదట్లో చెప్పినట్టుగా, అసలది పాటలు కట్టడంలో ఉపయోగించే మాత్రా ఛందస్సు. పాటలలో నడక ప్రధానం కాని, గణ యతి ప్రాసలు కాదు. మాత్రా బద్ధమైన ఛందస్సుని గణ బద్ధంగా మార్చి ద్విపదకు ‘మూడు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం’ అనే లక్షణం చెప్పారు లాక్షణికులు. పాటల్లో అది కుదరదు. ఉదాహరణకు ‘ఏడవకు ఏడవకు నా చిట్టి కన్న’ అనే పాదంలో ద్విపద గణ లక్షణం భంగమయింది. అయినా మాత్రా ఛందస్సుగా అది ద్విపదే! సోమనాథుడు ద్విపద ఛందస్సును గణబద్ధ ఛందస్సుగానే స్వీకరించాడు. మాత్రా ఛందస్సులో నడక ప్రధానం కాబట్టి, అందుకోసం మధ్యలో యతి స్థానం దగ్గర, పాదాంతంలోను, పదం పూర్తి కావాలి. కానీ సోమనాథుని ద్విపదలో చాలా చోట్ల అది కనిపించదు. ఉదాహరణకు ‘ఇమ్ముల సింహాసనమ్మిడి తత్ క్షణమ్మ విభూతి వీడ్యమ్ము లర్పించి’ అనే పద్య పాదాలలో ‘తత్ క్ష’ అన్న దగ్గర పాదం విరిగింది! ఇలా చాలా ఉదాహరణలు చూపించ వచ్చును. కాబట్టి బసవపురాణం జనసామాన్యులు పాటల్లాగా పాడుకోదగ్గ రచన కాదు. ఈ కావ్యం ఇటు దేశి సంప్రదాయమైన గేయ స్వరూపానికీ అటు మార్గ సంప్రదాయమైన పఠన యోగ్యతకూ చెందని విధంగా తయారయిందని నా అభిప్రాయం.

ఇక కావ్య రచనా శైలిని చూస్తే, అది ముమ్మూర్తులా మార్గ సంప్రదాయాన్ని అనుసరించింది. కావ్య ప్రారంభాన్ని శ్రీ-కారంతో చేసి, నాందిలో నమస్క్రియ చేసి, మొత్తం పురాణాన్ని ఆశ్వాసాలుగా విభజించాడు. ఇవన్నీ కావ్య సంప్రదాయ విశేషాలే. ప్రతి ఆశ్వాసం శ్రీకారంతోనే మొదలవుతుంది. బసవ స్తోత్రంతో, ‘సుకృతాత్మ పాలకురికి సోమనాథ సుకవి ప్రణీతమైన’దని చెప్పుకుంటూ, ముగుస్తుంది. కావ్యం మొదట సుకవి స్తుతి (శివకవుల గురించి), కుకవి నింద (ఇతర కవుల గురించి) కూడా ఉన్నాయి! అందువల్ల బసవపురాణాన్ని సోమనాథుడు కచ్చితమైన మార్గ కావ్య సంప్రదాయంలోనే నిర్మించాడు అన్నది సుస్పష్టం.

ఈ మూడు విషయాలనూ దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే, సోమనాథుడు ఏ మార్గంలో ఎవరికోసం ఈ కావ్యం రచించినట్టు? మార్గ సంప్రదాయంలో పండితుల కోసమే రచించిన కావ్యం అని భావించక తప్పదు. అందువల్ల కావ్య సంప్రదాయంలో వచ్చిన శాస్త్రవిమర్శ దీనికి వర్తింపజెయ్యడం తప్పు కాదు. అలా చేసినప్పుడు అది కావ్యంగా నిలుస్తుందా అన్నది పరిశీలించ వలసిన ప్రశ్న. మొత్తం మీద, సోమనాథుడు అనుసరించిన ద్విధా మార్గం వలన, అటు దేశి వ్యవహారంలో కాని, ఇటు మార్గ సంప్రదాయంలో కాని, ఇది నిలువలేక పోయిందన్నది నా ప్రతిపాదన. ఇంతకు ముందే విన్నవించుకున్నట్టు, దీని గురించి మరింత విస్తృత పరిశీలన అవసరం.