చం. తొలికవి కంటి పాదములు, తోగిడిగిళ్ళు వసిష్ట నప్తకున్
సలిపి, మయూర ముఖ్యులగు సంస్కృత సత్కవి పాళి కంజలుల్
వలగొని యిచ్చి, యాంధ్రమున ప్రాక్కవి తల్లజ శబ్దశాసనా
దుల గడు భక్తిమై గొలిచి, తోచిన భావములన్వెలార్చెదన్
‘తెలుగు’ను గూర్చి చింత బహు తీవ్రముగా నెరియింప పొక్కుచున్!ఉ. ‘భాషను రక్షసేయవలె భావితరాలకు; ప్రాగ్యశస్వి’ యన్
ఘోష దిగంతముల్ దగులు – ఘూర్ణితముల్ క్రియలౌ; చమత్కృతుల్
భూషిత మిశ్రశబ్దచయపూర్ణములౌ వికృతాకృతుల్; కటా!
ఓషధు లౌనె ప్రాణమిడ! నూపిరి దీసెడు కొన్ని పత్రికల్!ఉ. పుంపుల సంధి తుంపులయి పోయెతెలుంగున వార్తలందు, బల్
తెంపరు లైన లేఖకుల తీరుకు వే బలియైన శీర్షికల్
కంపులుగొట్టు; వృద్ధి యిదికాదు; సమాసము లేర్పరించుచో
నింపు రహింపకున్న నిహిహీ యని నవ్వదె వాగ్వధూటియే!ఉ. గోళ్ళకు రంగు వేసికొన, గూరల పోపులు వేయుటెట్లనన్
గాళ్ళకు లత్తుకద్దుకొన, గట్టెడు బట్టలకంగుచుంగులన్
మేళ్ళగు రీతులన్గరప మేకొను పత్రిక లేల భాషలో
చాళ్ళగు సంప్రదాయముల సౌరుల నేర్పవు? భాష పండెనో!తే. తెలుగు రుచులంచు పచ్చళ్ళు, తిమ్మనములు
జేయుటెట్లను శిక్షణ సిద్ధపరచు
కంటె మేలగు – భాషలో గల మెలకువ
లూది నాటంగ – జనమున కాదినుండి!మ. మన పూర్వాంధ్ర కవి ప్రణీతములు రమ్యానేక శబ్దార్థ యుక్
ఘనముల్ కావ్యము లాంధ్రభారతికి రంగన్నాట్య రంగంబులై
మను; నా భంగిమలన్ బ్రవేశమును స్థేమంబొప్ప లేబ్రాయమం
దనుసంధింపగ జేయగావలెను విద్యారంగమందున్నతుల్
గని – యీ భ్రష్టసమాస లేఖనములన్ గర్హించుచున్ బూనికన్!సీ. పద్యమాధ్యమరధ్య ప్రాముఖ్య మెడలించి
భాష రక్షణ సేయ వలనుపడదు
హృద్యపద్య క్షేత్ర సేద్యంబు సేయక
విద్యార్థికిని బుద్ధి విరియబోదు
శబ్దార్థ సంపృక్త సౌందర్యలహరి సు
స్నాతుడైననె గాని జడత పోదు
సూరివర్యుల కృతుల్ జొరనీక మెదడులో
వ్యాకరణంబు పై పట్టు రాదుతే. బరగు ‘నౌచిత్య’మంచొక పద్ధతి గద!
దాని బాటింప నెల్లెడ దగునుగాదె!
‘వృద్ధి సేతుము భాష’నంచిద్ధమతులు
తమకుదోచిన గారడీల్ దగునె సలుప?తే. గిడుగు నడుగున నడుగిడి నడువ దొడగి
నడుమ నేమాయె! పదములు నటునిటునయి
భ్రష్ఠబాటల బట్టుట పాడి యగునె
తీవ్రవత్తిడి యెటనుండి తెరువు దాకె?తే.హరితకలలను గనుచును నడుగులిడిరొ!
ఉగ్రనీడల మతి దప్పి యుంటిరేమొ!
జనకొలువు జేర – జాగ్రత జారిపోయి
పాదబాటల బట్టిన పతనమబ్బు!శా. పోపో నీళ్ళకు బల్చనైన ‘తెలుగున్’ పోషించి రక్షించుకోన్
మాపుల్ రేపులు పత్రికల్, ప్రభుత యేమాత్రంబుపేక్షింపకే
ప్రాపుంగూర్చి ప్రయత్నముల్ సలిపి మారాకుల్ మరిన్ హత్తగా
నోపున్; స్వైరత భ్రష్ఠ రూపమిడ నౌనో! సుంత యోజింపుడీ!తే. తరువు గదుపగ ధారగా ధరణి రాలు
పారిజాతంపు సుమముల పగిది నాడు
పలుకరింపగ విద్యార్థిఁ పద్యరాజి
నిండి ప్రవహించె: ఈనాడు గుండె లవియు !ఉ. ఇప్పటికైన కన్దెరచి ఇంపగు భాషను నిల్పుకొంటకై
యొప్పెద రేని నూతన ప్రయోగములన్ విడనాడి పూర్వపుం
గొప్పకవుల్ రచించినవి కొల్లలు పద్యపు గద్యపుం గృతుల్
మప్పుడు బళ్ళ, ‘టీవి’లను, మానక పత్రికలన్, శుభంబగున్!