వేడికోలు

మనవిసేతును: తెనుగున జననమంది
నుడువనేర్చిన ఘనతకు నోచమంచు
పొరుగు భాషల విదులును పొగిలినారు;
వారి గని లోన లజ్జింప వలదె మనము!

చెవుల బడుటనె పులకల చివురు దొడుగ
దెలుపు పలుకుల పెరయైన తెలుగుభాష
తల్లి మనకని పిల్లల తల్లులార!
నిసుగులకు కూర్మి యుగ్గున నింపుడమ్మ!

ఆటలనుండి వచ్చి ప్రియమారగ హత్తెడు చిట్టి కూనలన్
బాటలగంధులార! మురిపంబున నెత్తి మరింత హత్తి మీ
మాటల పాటలన్ శ్రమను మానుప జేయుడు మాతృ భాషలో
పాటవ భావసంపదకు వాహికలైన పదాల ధారలన్!

బడుల నుండి మరలి బాలబాలికలెల్ల
శలవులందు కాల మెలమి గడుప
పలుకు పలుకు నందు నొలికెడు తేనెలు
గలుగు తెలుగు గఱపి గడన గనుడు!

బడిని విద్యార్థి తెలుగున బలికేనేని
బడిత చేబూని బదులీయవలదు తల్లి!
కడుపు నింపనె యాంగ్లంబు గావలెనని
చెప్పకయె చెప్పుచుండి యీ చేత లేల?

విలువలు మారె మారె నని వెఱ్ఱిగ నన్నిట నాటగాండ్లకున్
జిలుగు తెరన్ జిగేలు మను జీవులకున్ వెల గట్టి కోట్లలో
కల తమసంబు బెంచుటకు కారణమైన విచిత్రసీమలన్
మెలగగ నీకుడీ! యచట మిక్కిలి బుద్ధుల భాష డిందెడిన్

చేతులారంగ తెలుగును జేయ హత్య
దివురుచున్నవి పత్రికల్ దినము కొన్ని!
వాక్యనిర్మాణ చాతుర్యవాంఛ వ్యాక
రణము దొరగుచు కావ్యలక్షణము మరచి!

ఒక వాక్యంబు రసాత్మకం బయిన కావ్యోత్కర్ష నందంచు బూ
ర్వ కలావేదులు చెప్పినారు గద, యౌరా! దానినిన్ దృష్టి నూ
నక చిత్రాతి విచిత్ర వాక్యముల నానా మార్గముల్ ద్రొక్కు శీ
ర్షికలన్, వార్తల దుస్సమాసముల నిస్సీ! చూడ దుఃఖంబగున్!

భ్రష్ట భాషకు చేయూత పత్రికలిడ
కంచెలే చేల మేయగ గడగినట్లు;
గాన దుష్పత్రికల దెస గానకుండ
గాచుకొనరమ్మ పిల్లల గరితలార!

బండబూతులు వ్రాసి పాండిత్యముగ జూపి
        జనులను గికురించు సరసులకును
తిండిగింజలకునై తెలుగును చిత్రహిం
        సలపాలు సలిపెడి సజ్జనులకు
ఇతరుల రచనల నే మార్గ ముననేని
        మసిబూసి తమవను మాన్యులకును
ఉద్ధరింతు మటంచు నుబుసుపోకకు సారె
        సభలలో ఘోషించు సాధువులకు

దూరమున సంతు నుంచుడు; వారి దఱియ
నున్న మతి పోయి యున్మాదముప్పతిల్లు;
తెలుగు రక్షింప బడబోదు; తెరగు మారు
అయ్యవారిని జేయబో నగును గ్రోతి!

వదలినచో నిక దొరుకవు
యిదివరకటి కవులు వ్రాసి యిచ్చిన నిధులన్
పదిలముగ దాచి ప్రేముడి
తదుపరి తరములకు నిడెడు తహతహ వలయున్!

నిసుగుల కెక్కగా దెలుగు నిమ్మకు నీరిడునట్లు నీటుగా
నసువుల లోతులన్ దగులునట్లొనరింతురుగాక మీరు; బా
నసమున నోగిరంబును మనః ప్రియ పద్ధతి గూర్తురెట్టు లే
కసవు మెసంగనీక; కలకాలము వర్థిల దెల్గుతల్లులై!