మనభాష – మనపద్యం

వర్షసహస్ర భాసి, రసవత్కమనీయ పదార్ధ, నైకధో
త్కర్ష, శివే తరాపనయ గౌరవగౌర, తెలుంగు పద్యమౌ!
ఆర్ష మహాధ్వగంత మహితాత్ముఁడు నన్నయ దొట్టి నేఁటికిన్
హర్షవివర్ధనుల్ కవులు, ఆ ఘన విద్య సమాదరింప, సం
ఘర్షణ లేల! పద్యరసగంగ విగాహితులై తరింపఁగా!

తల్లియందంపు టద్దమై దనరు తెలుఁగు
సొబగు దెలియక కష్టమం చోకిలించు
నేటియువతకు గురువులౌ మేటివారి
పాటవంబున పాడయ్యె భాష బ్రదుకు!

భాషకు దిక్కులేనపుడు పద్యము నెవ్వఁడు గుర్తువట్టు? సం
భాషణలో సగంబు పెరభాష విభూషగ నాగరుల్ సదా
పోషణ సేయుచో తెలుఁగు పోదటె కంపల బడ్డ కాకియై!
శేషము సున్నగాగలదు శిక్షణ యిప్పటినుండి లేనిచో!

నన్నయనుండి చిన్నయకు, నాచన సోమునినుండి పోన్నిగం
టన్నకు మధ్య వర్తిలిన యాంధ్రపు టందము బుర్రబుర్రలో
తిన్నగ నాటగా బడమి తెల్లము భాషను నేర్పు వేళ, మ్రా
గన్నిడి యొజ్జలున్ బ్రభుత కాలము బుచ్చిన మాతృ హత్యయౌ!

పొట్టకూటికి నేర్చిన పొరుగు భాష
నట్ట నడిమింటి దయ్యమైనది గదయ్య!
తెలుఁగునేలను పెరభాష తెగులదేల?
నీరుగలిపిన పాలు గానేల తెలుఁగు!

మరల తలలుంచి, యోజింప మఱచి తరచు
యాంత్రికంబుగ బ్రదుకుట యలవడు టను
తల్లి భాషకు తగుచోటు దక్కదయ్యె
దీనిగమనించి దిద్దుకో తెలుఁగువాడ!

శబ్దార్థ సిద్ధులౌ సంయమి త్రయి కృతం
        బాంధ్ర భారత వేద మధ్యయనము
భాషాభిషక్కులౌ ప్రాక్కవీంద్ర స్తోమ
        రసరమ్య కృతుల పారాయణంబు
నైఘంటికములయు నానార్థ పద కోశ
        పరిశీలనా శీల పరిణతి యును
ఆధునాతనాచార్య మధుర వాగ్ని ర్మాణ
        ఫణితు లనుశీలించు ఘన గుణంబు

నియతి బూనుచు నిత్యంబు ప్రియముతోడ
వ్రతము నిష్ఠను నెరపెడు గతిని, గృషిని
సలుపుగావుత విద్యార్థి సముదయంబు
ప్రభుత దోహదమిడుత నీ భాష పొదల!

వారికా దర్శ మూర్తులై భారవాహు
లగుచు నధ్యాపక వ్రాత మమరుగాత!
భాష నిలిచిన, పద్యంబె భద్ర గజము
ఆంధ్రభారతి కౌపవాహ్యంబు,నిజము!