విముక్తి

మళ్ళీ ఆట మొదలెట్టడమెందుకని అంటూనే
ఇన్ని పల్లేరుగాయల్ని నువ్వు నా చేతుల్లో పోసినప్పుడు
నొప్పికంటే ఎన్నో రెట్లు సంతోషాన్నిచ్చావని
అబద్ధమే చెప్పాను.

అయినా, నిజం చెప్పడానికి నాకు నువ్వు ఏమవుతావని?
తడి ఆరిన కళ్ళ వెనుక
ఆటలో నిన్ను గెలిపించి అబద్ధం నాకు మిగిల్చిన
పొడిబారిన ఊదా రంగు పొరవి తప్ప?

ఎర్ర రాతి కొండల వెంబడి దిక్కుతోచక తిరుగుతూ
నా ప్రేమను కనుమలలో పాతిపెట్టేసిన
ఆ క్షణంలోనేనా విముక్తి కోసం నువ్వు ప్రార్థనలు చేసింది?

ఆకాశంలో నీ రూపురేఖలతో మబ్బులు
నోళ్ళు తెరిచి నా వైపుకి అప్పుడప్పుడు దూసుకు వస్తాయి
నీడలు కూడా వెంటరాని ఉన్మాదంలో బ్రహ్మజెముడు పొదల్లోకి ఎన్నిసార్లు ఉరికానో.

ఒకరోజు నా పరుగుకి అడ్డుపడి ఒక పాపాయి
నా వెనుక దిగంతాల అవతలకి తేరిపార చూస్తూ అడిగింది:
“ఎటో బయల్దేరినట్లున్నావు. బట్టలన్నీ సర్దుకున్నావా?”
“మ్మ్…”
వేళ్ళ మధ్య చిక్కుకున్న ముళ్ళను పీకి పడేస్తూ అన్నాను.
చేతులు బార్లాచాపి నవ్వుతూ అడిగింది:
“గుడ్. మరి నీ వస్తువులన్నింటినీ సర్దుకున్నావా?”
“మ్మ్…”
వేళ్ళ మధ్య మిగిలిన ఖాళీ నరనరాన్నీ సన్నగా కోస్తూనే ఉంది.

పెళుసుబారిన నా చేతుల్ని తన చెంపలకు ఆనించుకుంటూ,
చిలిపిగా అడిగింది: “మరి నీ నవ్వులనో?”
ముప్పిరిగొన్న ఉన్మత్తప్రేమలో పగలబడి నవ్వేసి పాపాయిని హత్తుకున్నాను
మా కేరింతలకు చెదిరిపోయి ఆకాశంలో తోడేళ్ళు నునులేత పువ్వులై విరిశాయి.