బంగారం కన్నా మెరుగైన నీకు
గట్టిగా వెల కట్టలేను
ఎల్లప్పుడూ నీ చల్లని తోడు
నీడలా నా వెంట వుండాలి
బాల్యంలో నేను
చిట్టిచేతులతో తాకాను నిన్ను
నా లేత పాదాలను నువ్వు
ముద్దాడి హత్తుకున్నావు
వాన కురిసి వెలిస్తే
పిచ్చికగూళ్ళుగా మలిచాను నిన్ను
మా ఇంటి గోడలు నాలుగూ
ప్రేమతో నిలబెట్టావు నువ్వు
దివంగత వంశీకుల అవశేషాలను
గుండెల్లో దాచుకున్న అనురాగమూర్తీ!
డాలర్లు డాబూ దర్పం ఇవ్వొచ్చు
నీ కమ్మని వాసన పసలే తేలేవు
చంద్రుని రాయి, అంగారకుని ధూళి
నీ ముందు బలాదూరే
అందుకే అవి మ్యూజియంలకు పరిమితం
నువ్వే నాకు ఎప్పుడూ సన్నిహితం
చితుకుల చితిలో నైనా
నీ సాంగత్యమే కోరుతాను నేను
నాకిష్టమైన నా వూరిమట్టీ!
పరమపదసోపానమంటే
పుట్టినమట్టిలో గిట్టడమా?!