ముందుమాట
భరతుడు, మాతంగముని రూపకల్పన చేసిన అతి ప్రాచీనమైన భారతీయ సంగీతాన్ని సంగీతమకరందం అనే గ్రంథం రాసి నారదుడు దానికి ఒక శాస్త్రీయత కల్పించాడని పూర్వీకుల నమ్మకం. (బరోడా కేంద్ర గ్రంథాలయ సంస్థ వారు ఈ సంస్కృత గ్రంథాన్ని ప్రచురించారు.) ఆ సంగీత మకరందంలో రాగ, తాళ విభజనల గురించిన ప్రస్తావన ఉంది. సంగీతంలో రాగాలు మార్గ, దేశి అని రెండు రకాలు. మార్గ అంటే గ్రాంథీయం లేదా శాస్త్రం అనీ దేశి అంటే జానపదం అని అర్థం తీసుకోవచ్చు. యావత్తు భారతదేశంలో ఈ విభజన పద్ధతి అనుసరించినట్టు కనిపిస్తుంది.
శార్ఙ్గదేవుడు రచించిన సంగీత రత్నాకరము (1210 – 1247) అప్పట్లో లభించిన విపులమైన సంగీత గ్రంథం. అందులో రాగ, తాళ విభజన క్రమ పద్ధతిలో జరిగింది. ఆ తరువాత కాలంలో పర్షియా నుండి ముస్లిం దండయాత్రలు మొదలయ్యి, భారతదేశంలో వాళ్ళు పరిపాలన సాగించడం మొదలు పెట్టేక పర్షియన్ సంగీత ప్రభావం మన సంగీతమ్మీద పడింది. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో అక్బర్ పరిపాలనా కాలంలో సంగీతంలో పెనుమార్పులొచ్చాయి. హిందూస్తానీ సంగీతమ్మీద అతని ఆస్థాన గాయకుడు తాన్సేన్ ప్రభావం చెప్పనలవి కాదు. సరిగ్గా అదే కాలంలో (1500 – 1550) దక్షిణాన రామామాత్యుడు కర్నాటక సంగీత శాస్త్రానికి రూపురేఖలు దిద్దాడు. ఉత్తరాది నుండి సంగీత విద్వాంసుల రాకపోకలు చెప్పుకోతగినంత లేకపోయినా హిందూస్తానీ రాగాలు కొన్ని కర్ణాటక సంగీతంలోకి వచ్చాయి. ఉదా. నవరోజు, జైజైవంతి (ద్విజావంతి), మేఘరంజని, పీలూ వంటివి కర్ణాటక సంగీతంలోకి ప్రవేశిస్తే, కానడ, ఆభోగి, చారుకేశి వంటివి హిందూస్తానీలోకి వెళ్ళాయి. కాకపోతే రెండూ వేర్వేరు సంగీత పద్ధతుల్ని పాటించడం వల్ల ఈ ఎగుమతి దిగుమతులు చెప్పుకోతగినంతగా జరగలేదు. కొంతకాలం తరువాత ముస్లిములు దక్షిణ భారతంలోకి చొచ్చుకొచ్చారు. కృష్ణదేవరాయల కాలానికే పోర్చుగ్రీసు వారు, మెల్ల మెల్లగా ఫ్రెంచ్, డచ్ వాళ్ళూ దక్షిణ భారత దేశంలోకి ప్రవేశించారు. సరిగ్గా అదే సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా తూర్పు నుండి ఇంగ్లీషువాళ్ళు మెల్లగా దక్షిణం వైపూ వచ్చారు. చిత్రం ఏవిటంటే బ్రిటీషు పాలనా సమయంలో కూడా పాశ్చాత్య సంగీత ప్రభావం ఈ రెంటిపైనా అంతగా లేదు. వేటికవే తమపోకడలని నిలుపుకుంటూ రాణించాయి.
ఎప్పుడయితే ప్రాంతాల మధ్యా, రాజ్యాల మధ్యా సంబంధాలు తెగిపోయాయో అప్పటునుండీ ఈ రెండు సంగీతపద్ధతులు — హిందూస్తానీ, కర్ణాటక — రెండు పాయలుగా విడిపోయాయి. సంగీత బాణీలు కూడా కాలక్రమేణా వేరుపడి పోయాయి. హిందుస్తానీ సంగీతంపై పర్షియన్, సూఫీ కవుల ప్రభావం పడితే, కర్ణాటక సంగీతమ్మీద భక్తి కవుల ప్రభావం కనిపించింది. కర్ణాటక సంగీతానికి భక్తి వాహకంగా మారింది. భక్తికీ, మోక్షానికీ సంగీతం ఒక సాధనం అయ్యింది. ఈ పరంపరలోనే అనేకమంది వాగ్గేయకారులు కర్ణాటక సంగీతాన్ని విస్తరించారు. తదనంతరం రామామాత్యుడు, వేంకటమఖి, మేళకర్త రాగ విభజన చేసి సంగీతానికి ఒక శాస్త్రీయతని తీసుకొచ్చారు. అనేకమంది సంగీత కారుల కృషితో కర్ణాటక సంగీతం తనదైన ఒక బాణీనీ, విలక్షణతనీ పొందింది. హిందూస్తానీ, కర్ణాటక సంగీతాల మధ్య కొన్ని సారూప్యతలున్నా, తేడాలు కూడా కూడా పుష్కలంగా ఉన్నాయి.
ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వ్యాపార నిమిత్తమై కలకత్తా వచ్చిన ఇంగ్లీషు వాళ్ళు దక్షిణాదిన పట్టు సాధించడానికి చాలా కాలమే పట్టింది. చిత్రం ఏవిటంటే బ్రిటీషు పాలన సమయంలో కూడా పాశ్చాత్య సంగీత ప్రభావం (వెస్ట్రన్ మ్యూజిక్) ఈ రెంటిపైనా అంతగా లేదు. వేటికవే తమ తమ పోకడలని నిలుపుకుంటూ రాణించాయి. కానీ అక్కడక్కడ కొంతమంది పాశ్చాత్య సంగీత ధోరణిలో కొన్ని పాటలు కట్టారు. కర్ణాటక సంగీతజ్ఞులకి వెస్ట్రన్ మ్యూజిక్ పరిచయం 1800 కాలంలోనే ప్రారంభమయ్యింది. ఇంగ్లీషు బ్యాండుతో చాలామంది సంగీత కారులకి పరిచయం ఉంది. ప్రముఖ వాగ్గేయకారులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్ ఇంగ్లీషు బ్యాండ్ ప్రభావంతో కొన్ని పాటలు కట్టారు. ఈ వ్యాసం ప్రధాన లక్ష్యం ఏయే పాటలు లేదా కృతులలో పాశ్చాత్య సంగీతపు పోకడలు కనిపిస్తాయో పరిశీలించడం.
ముత్తుస్వామి దీక్షితార్ – నొట్టు స్వరాలు
సరిగ్గా త్యాగరాజు కాలంలోనే ఉన్న మరొక సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడూ అయిన ముత్తుస్వామి దీక్షితార్ వెస్ట్రన్ సంగీత ప్రభావంతో కొన్ని పాటలు కట్టాడు. వాటిని నొట్టు స్వరాలు అంటారు. ఇంగ్లీషులో నోట్ (Note) వాడుకలో నొట్టుగా మారింది. ఈ ఇంగ్లీషు నోట్స్ ఆధారంగా పాటలు కట్టారు కాబట్టి వీటిని నొట్టు స్వరాలు అన్నారు. కర్ణాటక సంగీత విద్వాంసులు ఈ నొట్టు స్వరాల నేపథ్యం తెలుసుకోవాలంటే అప్పట్లో మద్రాసు నగరం చరిత్ర కొద్దిగా తెలుసుకోవాలి.
ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కలకత్తా నుండి చెన్నపట్టణం వరకూ వచ్చారని చరిత్ర చెబుతోంది. వారికి ముందే, 1500 కాలం నాటికే పోర్చుగ్రీసు వారు గోవా, కొచ్చిన్ వైపుగా భారత దేశంలోకి ప్రవేశించారు. పోర్చుగీసు దళాల చేతిలో కొచ్చిన్ యుద్ధంలో కళ్ళికోట రాజ్యం చిత్తుగా ఓడిపోయింది. అప్పటి మలబారు, కొచ్చిన్ సంస్థానాలు పోర్చుగ్రీసు వారి ఆధీనంలోకి వచ్చేశాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ వారికీ కొచ్చిన్ రాజు సమూద్రికీ మధ్య జరిగిన ఒడంబడిక ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చెన్నపట్టణం రేవు ఆధారంగా నౌకా వ్యాపారం చెయ్యడానికి వచ్చి స్థిరపడ్డారు. కలకత్తా రేవు ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. మెల్లమెల్లగా చెన్నపట్టణం వైపు ఇంగ్లీషు వాళ్ళ కుటుంబాలు, ముఖ్యంగా సైనికాధికారులూ, సైనికుల కుటుంబాలు తరలి వచ్చాయి. వీళ్ళందరికీ సెయింట్ జార్జ్ ఫోర్ట్ స్థావరంగా[1] ఉండేది. ఈ సైనికులు ప్రధానంగా స్కాట్లాండ్, ఐర్లాండ్ నుండి వచ్చిన కుటుంబాలు. అప్పట్లో బ్యాండ్ సంగీతం ఈ యూరోపియన్ కమ్యూనిటీకి సాయంకాలం వినోద కార్యక్రమంగా ఉండేది. వీళ్ళందరూ రంగు రంగుల ఆడంబరమైన దుస్తులు ధరించి ఒక సంగీత విద్వాంసుడి ఆధ్వర్యంలో సాధన చేసేవారు. ఒక్కోసారి వీళ్ళు సెయింట్ జార్జ్ ఫోర్ట్ దగ్గర అధికార ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. ఇవి చూడ్డానికి చెన్నపట్టణం చుట్టుపక్కల నుండి చాలామందే వచ్చేవారు[2, 3]. సాంబమూర్తి, టి.ఎల్.వెంకట్రామయ్యర్, రచనలలో[4, 5] కూడా ఈ వివరాలు కనిపిస్తాయి.
చెన్నపట్టణానికి ఉత్తరాన మనాలి అన్న వూర్లో ముద్దుక్రిష్ణ ముదలియర్ అనే జమీందారు ఉండేవాడు. ఈయనకి ఈస్ట్ ఇండియా కంపెనీతో వ్యాపార సంబంధాలుండేవి. ఈయన వాళ్ళకీ చెన్నపట్టణంలోని వ్యాపారవేత్తలకీ, అప్పటి గవర్నరు పీగాట్‌కీ దుబాసీగా వ్యవహరించేవాడు. ఈయనకి సెయింట్ జార్జ్ ఫోర్ట్ అధికారులతో సత్సంబంధాలుండేవి. ఈ జమీందారులు తరచూ సెయింట్ జార్జ్ ఫోర్టులో జరిగే ఇంగ్లీషు బ్యాండు కచేరీలకి ఆహ్వానింపబడేవారు.
ముద్దుక్రిష్ణ ముదలియార్ ఓ సారి తంజావూరు దగ్గరున్న తిరువారూర్ వెళ్ళాడు. అక్కడ ఆయన రామస్వామి దీక్షితార్ కచేరీ విన్నాడు. ఈ రామస్వామి దీక్షితార్ కొడుకే ముత్తుస్వామి దీక్షితార్. ముదలియార్ కోరిక మీద రామస్వామి మనాలి జమీందార్ల ఆస్థాన విద్వాంసుడిగా ఉండటానికి అంగీకరించి, మనాలికి మకాం మార్చాడు. ఈ రామస్వామి దీక్షితారుకి ముగ్గురు కొడుకులు – ముత్తుస్వామి, బాలుస్వామి, చిన్నస్వామి. ఈ ముద్దుకృష్ణ ముదలియార్ తరువాత ఆయన కొడుకు వేంకటకృష్ణ మొదలియార్ (ఈయన్నే చిన్నస్వామి ముదలియార్ అనికూడా పిలుస్తారు) రామస్వామి దీక్షితార్ కుటుంబాన్ని సెయింట్ జార్జ్ ఫోర్టులో జరిగే ఇంగ్లీషు బ్యాండు కచేరీలకి వెంటబెట్టుకొని వెళ్ళేవాడు. ముత్తుస్వామికి సంగీతం (వీణ) లోనూ, సంస్కృత భాషమీదా, వేదంలోనూ ఉన్న ఆసక్తీ, పట్టూ చూసి పిన్నవయసులోనే చిదంబరయోగి అనే ఆయన వెంట తీర్థయాత్రలకని తండ్రి పంపించాడు. ఆ రోజుల్లో ఇంగ్లీషు బ్యాండు కచేరీల్లో వయులిన్ ప్రధాన వాయిద్యం కాదు. స్కాట్లాండ్ వారి విన్యాసాలకీ, ఐరిష్ డాన్స్ ట్యూన్లకీ పక్కవాయిద్యంగా వాడేవారు. అప్పట్లో ఇంగ్లీషు బ్యాండ్ కచేరీలో వాహ్యాళి వరుసలూ (మార్చింగ్ ట్యూన్స్), కులాసా పాటలూ, లయబద్ధమైన డప్పులూ (డ్రమ్స్), ఇంకా బ్యాగ్ పైపులూ, వేణువులూ ఉండేవి. బాలుస్వామి సెయింట్ జార్జ్ ఫోర్టు కచేరీల్లో వాడే ఐరిష్ వయులిన్ మీద ఆసక్తి కనబరచడంతో సెయింట్ జార్జ్ ఫోర్ట్ కొలువులో ఉన్న విలియం బ్రౌన్ అనే ఫిడేలు వాయిద్య కారుడిదగ్గర శిక్షణకి ఏర్పాటు చేశాడు వెంకట కృష్ణ ముదలియార్. అప్పట్లో వయులిన్ని ఫిడేల్ అనే వ్యవహరించేవారు. అలా బాలుస్వామి వయులిన్ మీద ప్రావీణ్యం సంపాదించాడు. తరువాత ఈ బాలూస్వామి దీక్షితారే ఫిడేలు వాయిద్యాన్ని కర్ణాటక సంగీతంలో పక్క వాయిద్యంగా ప్రవేశపెట్టాడు. ఈ కథ ముత్తుస్వామి దీక్షితార్ మీద వచ్చిన చాలా పుస్తకాల్లో[4, 5, 6] మనకు కనిపిస్తుంది.
తీర్థయాత్రలు ముగించుకొచ్చిన ముత్తుస్వామి ఫిడేలు వాయిద్యంలో బాలుస్వామి ప్రతిభ గురించి తెలుసుకొని ఎత్తియపురం జమీందారు వద్దనుండి ఫిడేలు కచేరీకి ఆహ్వానం పంపించాడు. కర్ణాటక సంగీతంలో అప్పట్లో ఉన్న కృతులని ఫిడేలు మీద వాయించిన తమ్ముడి ప్రతిభ చూసి మెచ్చుకొన్నాడు. అప్పటికే ముత్తుస్వామి దీక్షితార్ చాలా కృతులు కట్టాడు. ఆయనను తంజావూరు ప్రాంతంలో ప్రసిద్ధ సంగీత విద్వాంసుల్లో ఒకడుగా పరిగణించేవారు. ముత్తుస్వామి కృతులు విని బాలుస్వామి విలియం బ్రౌన్ దగ్గర చెప్పాడని, ఆయన ముత్తుస్వామిని కలవాలని ఉత్సాహపడితే దీక్షితార్ సెయింట్ జార్జ్ ఫోర్టు వెళ్ళి తన సొంత బాణీలు వినిపించాడనీ, అవి విన్నాక విలియం బ్రౌన్ అభ్యర్థన మీద అప్పటికే వెస్ట్రన్ సంగీతంలో ఉన్న కొన్ని పాటలని తీసుకొని వాటికి సంస్కృత సాహిత్యం చేర్చి కొన్ని పాటలు కట్టాడనీ కథనం. ఇలా కట్టిన పాటలకే నొట్టు స్వరాలు అని పేరు. ఇది కాకుండా వేరే కథలున్నాయి కానీ ఈ సంఘటనే కొంచెం విశ్వసనీయంగా అనిపిస్తుంది. వేరే వాటిలో స్థల కాల వివరాలకీ, వ్యక్తులకీ మధ్యన పొంతన లేకపోవడం వల్ల ప్రస్తావించడం లేదు. ఆనోటా, ఈనోటా సాగిన ఇటువంటి ఇలాంటి సంఘటనలే పలు పుస్తకాల్లో ఎక్కాయి. ముత్తుస్వామి దీక్షితార్ ఆ సమయంలో కట్టినవి కేవలం 13 నొట్టుస్వర గీతాలే. కానీ ప్రస్తుతం ఆయన పేరు మీదే 40 దాకా పాటలున్నాయి. ముత్తుస్వామి దీక్షితార్ కట్టిన 13 నొట్టుస్వరాలు వాటికి దగ్గరలో ఉండే ఇంగ్లీషు పాటలు లేదా వరుసలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.
నొట్టు స్వరము | వెస్ట్రన్ పాట/ వరుస |
---|---|
సంతతం పాహిమాం సంగీత శ్యామలే | God save the King/queen – British National Anthem |
శ్యామలే మీనాక్షీ | Twinkle twinkle little star. Based on French tune ‘Ah! Vous dirai-je’ |
జగదీశ గురుగుహ | Lord MacDonald’s Reel |
పీతవర్ణం భజే | Persian verse ‘taza ba-taza nau ba-nau’ with English jingle |
సుబ్రహ్మణ్యం సురసేవ్యం | British Army regimental march – British Grenadiere |
కంచీశం ఏకాంబరం | Country dance |
రామచంద్రం రాజీవాక్షం | Let us lead a life of Pleasure |
సకల సురవినుత | Quick March |
శక్తి సహిత గణపతిం | Voleuz –Vous-dancer |
శౌరి విధినుతే | Oh Whistle and I will come to you, my lad. |
వర శివబాలం | Castilian Maid |
కమల వందిత | Playful tune of ‘Galopede’ folk dance |
వందే మీనాక్షీ | Limerick |
ఈ నొట్టుస్వర సాహిత్యం అంతా సంస్కృతంలోనే ఉంది. పాశ్చాత్య సంగీతపు C-scale మీదే ఇవన్నీ స్వరపరచబడ్డాయి. C Majorకి దగ్గరలో ఉండే రాగం శంకరాభరణం. ఈ నొట్టుస్వరాలన్నీ శంకరాభరణ రాగస్వరాలలా గమక రహితంగా ఉంటాయి కాబట్టి శంకరాభరణ రాగంలో కట్టినవే అని కూడా అనలేం.
ఈ పాటల్లో కొన్ని తిశ్ర ఏక తాళంలోనూ, చతురశ్ర ఏకతాళంలోనూ, మరికొన్ని రూపక తాళంలోనూ ఉన్నాయి. చిన్నస్వామి ముదలియార్ పుస్తకంలో[7] పైన పేర్కొన్న కొన్ని నొట్టుస్వరాలిచ్చారు కానీ వాటికి శీర్షికలు లేవు. గవర్నమెంట్ ఓరియంటల్ లైబ్రరీ, చెన్నైలో ఈ నొట్టుస్వరాల పేరున ఉన్న ప్రతిలో మొత్తం 20 స్వరాలలో 12 నొట్టుస్వరాలు సంస్కృతంలో ఉంటే మిగతావి తెలుగులో ఉన్నాయి. సంస్కృతంలో ఉన్న 12 పాటలకీ గురుగుహ అన్న ముద్ర ఉంది కానీ తెలుగులో ఉన్న వాటికి ఈ ముద్ర లేదు[2,3]. ఈ తెలుగులో ఉన్న నొట్టుస్వరాలు ప్రక్షిప్తాలో కావో తెలియదు. ముత్తుస్వామి దీక్షితార్ సంగీత సాహిత్యమంతా సంస్కృతంలోనే ఉంది. ఇది కాకుండా నొట్టుస్వర ప్రామాణికత మీద మరొక సంశయం కూడా ఉంది.
బాలుస్వామి మనవడైన సుబ్బరామ దీక్షితార్, 1905లో ప్రథమాభ్యాస పుస్తకము అని ఒక పుస్తకం తెలుగులో అచ్చు వేశాడు. ఈ పుస్తకం లక్ష్యం ప్రాధమిక సంగీత బోధన గురించి. ఇందులో 32 నొట్టుస్వరాలు ముత్తుస్వామి దీక్షితారు పేరున నొట్టుస్వర శీర్షికన స్వరాలతో సహా ఉన్నాయి. కానీ పై పట్టికలో ఇచ్చిన ఇంగ్లీషు పాటల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఇందులో కొన్ని తరువాత కాలంలో కట్టబడ్డాయో లేదో స్పష్టంగా తెలీదు. ఇది కాకుండా సి.పి.బ్రౌన్‌కి ముత్తుస్వామి దీక్షితార్ ఈ నొట్టుస్వరాలని అంకితం ఇచ్చాడని వివాదాస్పదమైన కథనం ఉంది. సంగీత శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ సాంబమూర్తి వాగ్గేయకారుల మీద రాసిన, Syama Sastri and other Famous Figures of South Indian Music అనే పుస్తకంలో ముత్తుస్వామి దీక్షితార్ నొట్టుస్వరాల గురించి ఈ విధంగా అన్నారు:
“At the suggestion of an influential friend, Dikshitar composed Sanskrit sahityas to some of the western melodies. These were composed in 1832 and dedicated to Mr Brown, then the collector of Chittoor District. Mr. Brown is the renowned author of the first Telugu Dictionary.”
దీనిలో ఎంత సాధికారత ఉందో చెప్పలేం కానీ ఈ నొట్టు స్వరాల పేరుతో సి.పి.బ్రౌన్‌కి అంకిత మిస్తూ ఒక పత్రం మద్రాసు మ్యూజిక్ అకాడమీలో ఉంది. సి.పి. బ్రౌన్ 1832 కాలంలో చిత్తూరు కలక్టరుగా ఉండేవాడు. కానీ ముత్తుస్వామి దీక్షితారూ సి.పి. బ్రౌనూ కలిసే ఆస్కారం లేదు. ఎందుకంటే చివరి దశలో ముత్తుస్వామి దీక్షితార్ ఎత్తయిపురం విడిచి ఎటూ వెళ్ళలేదు. సాంబమూర్తి వ్యాఖ్యానంలో స్పష్టత, సాధికారత లేదు; ఒక్క బ్రౌన్ పేరూ, నొట్టుస్వరాలు అంకితం ఇవ్వడం తప్ప. ఈ మధ్యనే డా.దుర్గ తన పరిశోధనలో జతిస్వరములు పేరున 1820లో సి.పి.బ్రౌన్ కి శేషయ్య, కుప్పయ్య అనే సంగీత కారులు అంకితమిచ్చిన తెలుగు పత్రం తంజావూరు లైబ్రరీలో ఉందనీ, కానీ అందులో కొన్ని వేరే గీతాలు అంటే మనందరికీ తెలిసిన వరవీణా మృదుపాణీ అనే గీతం కూడా ఉందనీ ప్రస్తావించారు[2]. వీటిబట్టి తేలేదేమిటంటే సి.పి.బ్రౌన్‌కి అంకితం ఇవ్వబడ్డవి జతిస్వరాలు, నొట్టు స్వరాలు కావని.
ప్రస్తుతం సుమారు 40 నొట్టుస్వరాలు ముత్తుస్వామి దీక్షితార్ పేరున చెలామణీ అవుతున్నాయి. అందులో పైన ఇచ్చిన 13 మినహాయించీ, మిగతావి ఏవి ప్రక్షిప్తాలో చెప్పడానికి ఆధారాలు లేవు.
త్యాగరాజు
వ్యాపార నిమిత్తమై బ్రిటీషు వాళ్ళు 1750 కాలానికే చెన్నపట్నం వచ్చినా, దక్షిణాదిన అంతగా పట్టు దొరకలేదు. ఆ తరువాత మొగల్ నవాబులతోటీ, ఆర్కాట్ రాజులతోటీ చేతులు కలిపి మెల్ల మెల్లగా తంజావూరు పై పట్టు సాధించారు. 1780 నుండి 1800 కాలంలో తంజావూరిపై బ్రిటీషు వారి ఆధిపత్యం పెరిగింది. తుల్జాజీ కొడుకు 2వ శరభోజి బ్రిటీషు వారి చెప్పు చేతల్లో నడుస్తూ తంజావూరికి నామ మాత్రపు రాజులా మిగిలాడు. త్యాగరాజు ఈ శరభోజి కాలం నాటి వాడే. ఈ 2వశరభోజికి గురువుగా ఫ్రెడరిక్ ష్వార్ట్జ్ అనే బ్రిటీషు అధికారి ఇంగ్లీషు నేర్పేవాడు. అతనే శరభోజి రాజుకి పాశ్చాత్య సంగీతాన్నీ ఇంగ్లీషు బ్యాండుని పరిచయం చేశాడు.
ఇంగ్లీషు బ్యాండులో తాళానికి (బీట్) ప్రాముఖ్యతెక్కువ. అది కర్ణాటక సంగీతంలో వాడే తాళాలకి వేరుగా ఉంటుంది. ఆ తాళ గతికి సంగీత విద్వాంసులే కాదు, త్యాగరాజు శిష్యులు కూడా సమ్మోహితులయ్యారనీ, ఓసారి ఈ ఇంగ్లీషు బ్యాండు వాళ్ళు ఊరేగింపుగా తిరువయ్యార్ వీధుల్లో వెళితే, త్యాగరాజు శిష్యుడొకడు ఆ పాటకి తాళం వేయడం మొదలెట్టాడనీ, ఇది చూసి త్యాగరాజు రమించు వారెవరురా కీర్తన రాశాడనీ, సాంబమూర్తి రాశారు[4]. బహుశా త్యాగరాజు శిష్య పరంపరలో వచ్చిన విషయాలు సాంబమూర్తికి ఆధారాలు అయ్యుండవచ్చు. ఈ రమించువారెవరురా కృతి కట్టిన సుపోషిణి రాగం హరికాంభోజి జన్యం. ఈ రాగంలో సంగతులూ, గమకాలు ఉండావు. ఇప్పటికీ కర్ణాటక సంగీత కచేరీల్లో ఈ పాటని వైవిధ్యం కోసం పాడుతూనే ఉంటారు.
ఇవే కాకుండా ఇంగ్లీషు బ్యాండు ఆధారంగా శంకరాభరణ రాగంలో గత మోహాశ్రిత, వరలీల గానలోల, సరస నేత్ర; కుంతలవరాళిలో శర శర సమరైకశూర, కలి నరులకు మహిమలు; బంగాళలో గిరి రాజ సుత తనయ, కీర్తనలూ త్యాగరాజు స్వర పరిచాడు. కేవలం వరుస (Tune) వరకే ఇంగ్లీషు బ్యాండుని పోలి వుంటుంది. రాగాలు మాత్రం స్వచ్ఛమైన కర్ణాటక సంగీతంలోవే!
వీణ కుప్పయ్యర్
త్యాగరాజు ముఖ్య శిష్యుల్లో ఒకడైన వీణ కుప్పయ్యర్ కూడా వెస్ట్రన్ సంగీతం విని ప్రభావితమై కొన్ని పాటలు కట్టాడు. ఈ వీణకుప్పయ్యర్ మద్రాసు దగ్గరున్న కోవూరు సంస్థానానికి ఆస్థాన సంగీత విద్వాంసుడు. వీణ కుప్పయ్యర్కి సుందరేశ ముదిలియార్ అనే క్రిష్టియన్ స్నేహితుడుండేవాడు. ఈ సుందరేశ ముదిలియార్ మద్రాసు నగరంలో కర్నాటక సంగీత ప్రముఖుల్లో ముఖ్యుడు. ఈ సుందరేశ ముదిలియారుకి సెయింట్ జార్జ్ ఫోర్టు ఇంగ్లీషు వాళ్ళతో సత్సంబంధాలు బాగా ఉండేవి. ఈయనతో కలిసి వీణకుప్పయ్యర్ యూరోపియన్ బ్యాండు కచేరీలకి వెళ్ళేవాడనీ, అతనికి ఇంగ్లీషు బ్యాండు మ్యూజిక్ అతనికి అమితంగా నచ్చిందనీ మద్రాసు టెర్సెంటెనరీ వాల్యూములో[8] ప్రస్తావించడం జరిగింది.
ఉదాహరణకి వీణ కుప్పయ్యర్ స్వర పరిచిన బిలహరి రాగం (ఇది కూడా శంకరాభరణ రాగ జన్యమే) వర్ణంలో, ‘ప ద రి సా’ అన్న ప్రయోగంలో వెస్ట్రన్ బ్యాండు చాయలు కనిపిస్తాయి. వయులిన్ వాద్యకారులు గుంపుగా ఈ వర్ణం వాయిస్తుంటే అది ఒక వెస్ట్రన్ ట్యూన్ లాగే అనిపిస్తుంది.
ముత్తుస్వామి దీక్షితార్ నొట్టుస్వరాలు మినహాయించి వెస్ట్రన్ మ్యూజిక్ పరంగా కర్ణాటక సంగీతంలో అంత ఎక్కువగా పాటలు కనిపించవు. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కదనకుతూహల రాగంలో స్వరపరిచిన రఘువంశ సుధాంబుధి, హరికేశనల్లూరు భాగవతార్ రచించిన ఇంగ్లీషు నోట్ తప్ప అంతగా ప్రభావం కనిపించదు. ఈ మధ్యనే ఫ్యూజన్ పేరున కర్ణాటక సంగీత కృతులమీద కొన్ని పాటలొస్తున్నాయి. ఉదా: నగుమోము, నిన్నుకోరి వర్ణం, ఎందరో మహానుభావులు…
ఏతావాతా ఈ నొట్టుస్వరాల చరిత్ర వెనుక కర్ణాటక సంగీతంలో వయులిన్ వాయిద్య ప్రవేశ చరిత్ర దాగుంది. ఈ నొట్టుస్వరాల్లో సాహిత్యం కూడా దైవ స్తుతే తప్ప ప్రత్యేకంగా అనిపించదు. వెస్ట్రన్ మ్యూజిక్ నచ్చితే తప్ప శ్రావ్యత పరంగా గొప్పగా అనిపించవు. ప్రాథమిక సంగీత విద్యా బోధనలో ఇప్పటికీ కొంతమంది అన్నీకాకపోయినా, కొన్నయినా ఈ నొట్టు స్వరాలు నేర్పుతున్నారు. చరిత్ర చూస్తే పాశ్చాత్యులు, ముఖ్యంగా ఇంగ్లీషు వాళ్ళ ప్రభావం అన్ని రంగాల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కానీ వారి ఆధునిక పాశ్చాత్య ధోరణికి మాత్రం కర్ణాటక సంగీతం చెక్కు చెదరకుండా నిలబడి తనదైన సొంత బాణీతో ఇప్పటికీ అందర్నీ అలరిస్తోంది.
నొట్టు స్వర సాహిత్యం
- సంతతం పాహిమాం సంగీత శ్యామలే సర్వాధారే జనని
చింతితార్థప్రదే చిద్రూపిణి శివే శ్రీ గురుగుహ సేవితే శివ మోహాకారే - శ్యామలే మీనాక్షీ సుందరేశ్వరసాక్షి శంకరీ గురుగుహ సముద్భవే శివేవా
పామరలోచని పంకజలోచని పద్మాసనవాసిని హరి లక్ష్మివినుతే శాంభవి - జగదీశ గురుగుహ హరవిధి వినుతం దేహాత్రయ విలక్షణమానంద లక్షణం
నిత్యం శుద్ధం బుద్ధం ముక్తం సత్య నిర్వికల్పం నిశ్ప్రపంచమానంద మజం - పీతవర్ణ భజే భైరవం భూత వేతాళ సంసేవ్యమానం
పీత వస్త్రం సువర్ణప్రదం వీతరాగం గురుగుహాత్మజం - కంచీశం ఏకామ్రనాయకం నిత్యమహం భజే కామాది షట్చోరవృత్తమహం త్యజే
పంచాక్షర స్వరూపమాగమాంతసారం పంచాస్యమాది కారణం విశ్వేష్వరం గురుగుహం - రామచంద్రం రాజీవాక్షం శ్యామళాంగం శాష్వత కీర్తిం కోమలహస్తం కోశలరాజం
మామక హృత్కమలాకరం మారుతియుక్తం ధిమంతం మానిత భక్తం శ్రీమంతంకౌమారవరం గురుగుహ మిత్రం కారుణ్యనిధిం దశరథ పుత్రం భూమిసుతాభం
భూపతి రూపం కోమల పల్లవ పాదం మోదం కామగురుం సితారామం కౌస్తుభభూశం వందేహం - శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సుర రాజ వినుత సేవితం
భక్తాళిపోషకం భవసుతం వినాయకం భక్తిముక్తిప్రదం భూశితాంగం రక్తపదాంబుజం భావయామి - వరశివ బాలం వల్లీలోలం వందే నందం హరిహరమోదం హంసానందం హససముఖం
గురుగుహ రూపం గుప్తాకారం ఘోరక్షంతం సురపతిసేనంసుబ్రహ్మణ్యం సురవినుతం - వందే మీనాక్షి త్వాం సరసిజ వక్రే పర్ణే దుర్గే నటసుర బృందే షక్తే గురుగుహ పాలిని జలరుహచరణే
సుందర పాండ్యానందే మాయే సూరిజానాధారే సుందరరాజ సహోదరి గౌరి శుభకరి సతతమహం - శౌరి విధినుతే శాంభవి లలితే శాంతే అతీతే శంకరముదితే గౌరి సురహితై ఏకామ్రపతియుతే
కామాక్షీ మాం పాహి వీరవర వినుత చరణాంభోజే ఘోరతమలయవర హిమగిరిజే
శూరహరణ గురుగుహ మాతహ సంసారతర చరణతర కమలే - కమలాసన వందిత పదాబ్జే కమనీయ కరోదయ సామ్రాజ్యే కమలానగరే సకలాకరే
కమల నయన ధృత జగదాధారే కమలే విమలే గురుగుహ జనని కమలాపతినుత
హృదయే మాయే కమల శశి విజయ వదనే అమేయే కమలేంద్రాణి వాగ్దేవి శ్రీ గౌరీపూజిత
హృదయానందే కమలాక్షి పాహి కామాక్షి కామేశ్వరసతి కల్యాణి - సకల సురవినుత శంభో స్వామిన్ వికట గురుగుహ విజయ త్రిపురహర ఏకామ్రపతే
కరుణామూర్తే ఏకానేక విభూతే ఏకాంత హృదయ ఏకభోగ దాయకనందకర విభో - సుబ్రహ్మణ్యం సురసేవ్యాబ్జపదం సుందర వదనం సుకుమార వినుత లావణ్యం
శుభగాత్రం శుభకర నేత్రం సోమాత్మకమాశ్రిత కల్పభూరుహం
సూరి గురుగుహం సురరాజ విధి వినుతం సర్వజ్ఞం సుమతే చింతయ గురునాథం
స్వజ్ఞాన విదారణ ఫణితం సాధుజన సూనృత వచనం
- Fort St. George, Madras: A short History of Our first Possession in India – Fanny Emily Penny 1938.
- Research Notes: Music Academy – Dr. A.K.Durga.
- Indian Musicological Society Journal, Influence of Western music – Dr. A.K.Durga.
- The Great Composers – Prof.Samba Murthy – The Indian Music Publishing House – Chennai.
- South Indian Music – Vol. I and II – Prof. Samba Murthy – The Indian Music Publishing House – Chennai.
- Muthuswami Deekshitar – T Venkatramayyar – National Book Trust, India, 1968.
- Muthuswami Dikshitar – Agnes F. Vandome, McBrewster John, Frederic P Miller – VDM Publishing – 2010.
- The Oriental Music in Europian Notation – A.M.Cinaswami Mudiliyar, Pudupet, Madras 1893.
- The Madras Tercentenary Commemoration Volume – Published by Asian Educational Services 1934 Madras.
- http://southindianmusic.in
- Theorizing the Local: Music, Practice, and Experience in South Asia and beyond.. – Richard K Wolf – Oxford University.
- Samgita Sampradaya priyadarSini – Subba Rama Dikshitar, Ettiyapuram, 1904 (Reprinted in 1960 by Madras Music Academy.)