అబద్ధంలో నిజం

“హలో! ఏంటి ఎక్కడున్నారు?”

“హలో రమా! ఇప్పుడే వచ్చాను. హై వే మీద ట్రాఫిక్ జామ్ అయ్యింది. మా వదిన టిఫిన్ తిని వెళ్ళమంది. అదవ్వగానే నేనూ, అమ్మా కలసి వచ్చేస్తాం. ఎంత సేపు టూ అవర్స్ డ్రైవే కదా!”

ఇది అబద్ధం. అక్కడకి వచ్చి రెండు గంటలు దాటింది.

“ఎప్పుడో ఉదయం వెళ్ళారు. మీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారన్న సంగతి మర్చిపోయారా? అసలే పొద్దున్నుంచీ తలనొప్పితో చస్తున్నా! దానికి తోడు ఇందాకనే మెట్ల దగ్గర కాలు జారి బెణికింది. మీరు త్వరగా రండి.”

తడక సందుల్లోచి అబద్ధం స్పష్టంగా కనిపిస్తోంది.

“కాలు బెణికిందా! టైగర్ బామ్ రాసుకో! ఏదైనా పెయిన్ కిల్లర్ తీసుకో! ఎంత, టిఫిన్ తిని వెంటనే బయల్దేరేస్తాగా!”

“నా ఏడుఫు నేనేడుస్తా గానీ, త్వరగా రండి. మీ వాళ్ళని చూస్తే మీకు వళ్ళు తెలీదు. చిన్నాడికి రేపు మండే టెస్టు ఉంది. మీరొచ్చాక వాడిని దగ్గరుండి చదివించాలి. లాస్ట్ టైం టెస్టు వాడు సరిగా చేయలేదు. మీ అమ్మగారు ఎలాగూ ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంటికొచ్చాక తల్లీ కొడుకులిద్దరూ ఎంత సేపయినా ఆచమ్మ కబుర్లు చెప్పుకోవచ్చు. త్వరగా రండి.”

పిల్లల చదువు పేరు చెప్పి బాధ్యత గుర్తు చేసే ఇంకో టెస్టు అబద్ధం!

“ఎలాగూ న్యూయార్క్ వచ్చాను కదా! జాక్సన్ హైట్స్ కెళ్ళి గ్రోసరీ తీసుకురానా!”

“నాకు కాలు విరిగి నే చస్తుంటే, గ్రోసరీలూ వద్దు, గోంగూర వద్దు. ఆ కూరలేవో ఇక్కడే దొరుకుతాయి, త్వరగా రండి చాలు. పైన పిల్లలిద్దరూ కొట్టుకుంటున్నట్లుగా ఉంది. చైతూ, శ్రియా ఏంటా అల్లరి… కమింగ్!”

ఫోన్ కట్!

ఓ గంట తర్వాత మరలా ఫోన్!

“హలో! ఏంటి బయల్దేరారా? లేదా? ఎక్కడున్నారు?”

“నేనా ఇంకా ఇక్కడే ఉన్నాను. బయల్దేర బోతున్నాం, అంతే ఫ్లాట్ టైర్! ఇప్పుడే ట్రిపుల్ ఏ వాడికి కాల్ చేసాను. వాడు రాగానే స్పేర్ టైర్ మార్పించి వచ్చేస్తాను. ”

ఫ్లాట్ గా అబద్ధం అంటే ఇదే. అబద్ధాలకి మొగుణ్ణి కదా, ఆ మాత్రం అతకలేమా!

“ఎప్పుడూ, ఏదో ఒక దిక్కుమాలిన రీజన్! పొద్దున్ననగా వెళ్ళారు. శ్రియ డాడీ అంటూ గోల చేస్తోంది. త్వరగా రండి. అయినా – ఏం చేస్తున్నారక్కడ? ”

“అలాగే! అమ్మ రెడీ! నేనూ, అన్నయ్యా, పిల్లలూ టీవీ చూస్తున్నాం! ట్రిపుల్ ఏ వాడు రావడమే ఆలస్యం – వేంటనే బయల్దేరమూ! ”

ఒక అబద్ధం ఇంకో దానికి దారిచ్చింది.

ఫోన్ కట్!

“ఎవరు? మీ ఆవిడ సుమా! ఫ్లాట్ టైర్ అంటున్నావేమిట్రా! ముందు ముక్క వేయి! షో కి రెడీ గా ఉన్నాను. ”

“అవునన్నయ్యా సుమే కాల్ చేసింది. డ్రైవ్ చేసి చేసి, టయిర్ అయ్యి ఫ్లాట్ అయిపోయానని చెబుతున్నానంతే! ఎలాగూ క్రిస్మస్ శెలవలు కదా, సుమ మిమ్మల్నీ తీసుకు రమ్మనమంది.”

ఈ అబద్దం నిజంలా మలచడానికి ప్రయత్రం.

ఓ గంట తర్వాత , పేకాట పారాయణం కానిచ్చి ఓ అబద్ధానికి మొగుణ్ణి, నిజంగా ఇంటి ముఖం పట్టాను.


రాత్రి పడుక్కోబోయే ముందు –

“మీ ఆన్నయ్య వాళ్ళనీ టూ వీక్స్ తరువాత వచ్చి తీసుకెళ్ళమని చెప్పారా?

“చెప్పాను. సుమా! అమ్మ ఓ నెల్లాళ్ళు ఉంటుంది. పిల్లలకి బామ్మ ప్రేమా అవీ తెలియాలి కదా! ఏమంటావ్ ?

“మీ అమ్మగారికి మన పిల్లల కంటే మీ అన్నయ్య పిల్లలంటేనే ఇష్టం. అయినా వారాల్లో ప్రేమలు పుడతాయా ?”

“మా అమ్మకి గిఫ్ట్ గా ఏదైనా ఇద్దామా?”

“గిఫ్టా? అయినా ఈ అమెరికన్లలా ఈ గిఫ్ట్ గోలేమిటి. అయినా మొన్నమొన్ననే కదా, మీ అమ్మ గారికి పట్టు చీర కొనిచ్చారు. ఎందుకు చెప్పండి ఈ ఫార్మాలిటీస్? ”

మొన్న మొన్న అనగా రెండేళ్ళు అని అర్థం.

“మీ అమ్మగారికోసం నిన్న మాల్ లో మంచి కాఫీ మగ్ కొన్నాను. ఇదిగో చూడండి. బావుందా?”

“చాలా బాగుంది. మంచి గిఫ్ట్!”

“మీకు నచ్చిందా?”

“చాలా బాగా నచ్చింది. ఇది చూస్తే మా అమ్మ సంతోషిస్తుంది.”

అబద్ధం నటించడం నేర్చుకొంది. బాధని దిగమింగుకుంది.

ఇలా ప్రతీ క్షణం అబద్ధాలకి జన్మనిస్తూ మేం ఇద్దరం తల్లితండ్రులమయ్యాం!

క్రితం సారి వెళ్ళబోయే ముందు చేతిలో పెట్టిన అయిదు వందల డాలర్లు వద్దని తిరిగిచ్చేసి గుండెకు హత్తుకున్న అమ్మ ప్రేమ మాత్రం ఎప్పటికీ గుర్తుండి పోయే నిజం!


హలో! ఏంటి? ఎక్కడున్నారు?

“హలో రమా! ఇప్పుడే వచ్చాను. హై వే మీద ట్రాఫిక్ జామ్ అయ్యింది. మీ అక్క టిఫిన్ తిని వెళ్ళమంది. అదవ్వగానే నేనూ, మీ అమ్మ గారూ కలసి వచ్చేస్తాం. ఎంత సేపు టూ అవర్స్ డ్రై వే కదా!”

ఈ ట్రాఫిక్ జామ్ అబద్దాన్ని ఎవరూ ఖండించలేరు. సేఫ్ డ్రైవింగ్‌లా సేఫ్ లయింగ్!

“ఏం పరవాలేదు. ఇక్కడేం కొంపలు అంటుకోవడం లేదు. మా వాళ్ళతో కాసేపు గడిపి రండి. ఇందాకనే మెట్ల దగ్గర కాలు జారి బెణికింది. టైగర్ బామ్ రాసా! పెయిన్ కిల్లర్ తీసుకున్నా! అంత పెయిన్ లేదు లెండి”

బెణకడం అనే నిజం క్రింద “నొప్పి లేదు” అనే అబద్ధం విశ్రాంతి తీసుకుంటోంది. అది బయటకు రాదు.

“అయ్యో నీకు కాలు మళ్ళా బెణికిందా! ఇప్పుడే బయల్దేరి వచ్చేస్తాను. మీ అక్క షాపింగ్ ప్రోగ్రామ్ పెట్టింది. లేదు వెళ్ళాలి అన్నా వినిపించుకోవడం లేదు. క్రిస్మస్ షాపింగ్ సేల్ పెట్టారట. మాకు అక్కడ షాపింగ్ ఉంది కదా అన్నా వినిపించుకోవడం లేదు. నీకు కాలు బెణికిందని చెప్పి వేంటనే వచ్చేస్తాను.”

“అంత నొప్పి లేదని చెప్పానుగా! మా అక్కతో మా అమ్మ షాపింగ్ చేసేకానే మీరు రండి. ఇక్కడేం కొంపలు అంటుకోవడంలేదు. పిల్లల హోం వర్కులూ అన్నీ అయిపోయాయి. బయట పిల్లలతో ఆడుకుంటున్నారు. మీరు మెల్లగా రండి. తొందరేం లేదు.”

“అది కాదు సుమా…”

“సరే! బయల్దేరే ముందు కాల్ చేయండి.”

“అలాగే!”

ఫోన్ కట్!

అరగంట తర్వాత –

“సుమా! షాపింగ్ ఇంకో గంట పట్టేట్లా ఉంది. లాంగ్ లైన్లున్నాయి. పే చేసేసి వేంటనే వచ్చేస్తాము. సరేనా? లేటయితే కంగారు పడతావని చెప్పానంతే! “

“కంగారూ లేదూ, కాకరకాయా లేదూ. మెల్లగా రండి.”

“ఎలాగూ న్యూయార్క్ వచ్చాను కదా! జాక్సన్ హైట్స్ కెళ్ళి గ్రోసరీ తీసుకురానా!”

“అవును! నే మర్చేపోయా! మీరు గ్రోసరీ చేసుకు రండి. న్యూయార్క్ లో కూరలు ఫ్రెష్ గా ఉంటాయి. ఇక్కడ కాస్ట్ ఎక్కువ. అలాగే వచ్చేటప్పుడు సోనా మసూరి రైస్ బేగ్ లు ఓ నాలుగు తీసుకురండి.”

“అలాగే! దారిలో నా ఫ్రెండ్ రావుని కలిసి హాయ్ చెప్పేసి వస్తా. ఏమీ లేటు చెయ్యనులే!”

“ నో ప్రోబ్లెం. రావు గార్ని కలిసి రండి. రావు గారి వైఫ్ ని అడిగానని చెప్పండి.”

“అలాగే! మరలా బయల్దేరే ముందు కాల్ చేస్తాను.”

“ సరే! బై! “

“ బై! “


రాత్రి పడుక్కోబోయే ముందు – “మా అమ్మ ఓ నాలుగు నెలల ఇక్కడే ఉంటుందండీ! పిల్లలకి అమ్మమ్మ ప్రేమ అవీ తెలియాలి. మా ఆక్కకి నాలుగు నెలల వరకూ అమ్మ రాదని చెప్పేసాను. ఆ తర్వాత మనమే తీసుకెళదాం! “

“ సరే!”

“మా అమ్మకి గిఫ్ట్ గా జత గాజులు కొన్నాను.”

“గిఫ్టా?ఎన్ని డాలర్లు?

“ఎంతలెండి, రెండు వందల డాలర్లు – అయినా, ఇంత సంపాదించుకుంటూ ఓ రెండు వందలు ఓ లెక్కా! అయినా మా అమ్మకి ఈ మధ్య నేనంటూ ఏమీ గిఫ్ట్ ఇవ్వలేదు. అందుకే, కాస్త ఎక్కువయినా బంగారం గాజులే కొన్నాను.”

ఈ మధ్య అనగా రెండు నెలలు అని అర్థం.

“నిజమే! మంచి పని చేసావు. మీ అమ్మగారికి ఆ మాత్రం కొనివ్వక పోతే బావుండదు.”

బలహీనత నిజం నోరు నొక్కేస్తుంది. పైకి అనలేక నిజాన్ని దిగమింగుకుంది కోపం.

బంగారం ధర ఆకాశాన్ని అంటిందన్న ఇంకో నిజం ఈ గాజలకి అతి తక్కువ ధర నిర్ణయిస్తోంది.

ప్రతీ రోజూ ఇలా అబద్ధాలని కంటూ మేమొకర్నొకరు నిజంగా నమ్మిస్తున్నామని భ్రమిస్తున్నాం! మా బెడ్ పక్కనే ఏడాది క్రితం వచ్చిన బెస్ట్ కపుల్ అవార్డు ట్రోఫీ ఒక్కటే ప్రపంచానికి కనబడే నిజం!

మా ఇద్దరికీ అమ్మ నిజం – అత్త అబద్దం!

దృశ్యాలవే! కాని అబద్ధాలూ, నిజాలూ తారుమారవుతున్నాయి.