మంచు

నాతో పాటు బస్సు దిగిన వారందరూ చకచకా తలో దిక్కుకీ వెళ్ళిపోయారు. నేను మాత్రం చేతిలో నా లెదర్ డఫెల్‌తో ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తూ అక్కడే నిల్చుండిపోయాను. నవంబరు చలిగాలి రివ్వున వీస్తోంది. టైం చూస్తే ఏడే అయ్యింది గానీ కొండప్రాంతం కావడంతో ఏ తొమ్మిదో అయినట్టుంది ఆ వాతావరణం. అసలు బస్సు సాయంత్రం నాలుగున్నరకే రావాలి. హెయిర్‌పిన్ బెండ్ల ఘాట్‌రోడ్డు ఎక్కలేక ఎక్కలేక ఎక్కబోయిన బస్సు. మధ్యలో మంచెరాప దగ్గర ట్రబులివ్వడంతో మరో బస్సు ఎక్కించి పంపించారు. అలవాటు లేని ఆరుగంటల బస్సు ప్రయాణం. తలనొప్పి. అలసట. అనుభవాలు నిండిన నలభైలు అలసటని వెక్కిరించే వయసు కాదు. ఒక పక్క చలి వణికించెస్తోంది. నా స్కాచ్ ఫ్లాస్క్ తెచ్చుకోనందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. కొద్దిదూరంలో ఒక టీ బండిని చూసి అటువైపు నడిచాను, కనీసం టీ అయినా తాగుదామని.

“ఓ టీ ఇవ్వయ్యా.” పాత స్వెట్టరు వేసుకున్న టీ బండి ఆసామి తన మఫ్లరు తలూపాడు.

పక్కనే టీలు తాగుతూ మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తులు నా వైపు ఒక్కసారి చూసి తిరిగి మళ్ళీ వాళ్ళ మాటల్లో పడ్డారు. ఆకాశ దీపాల మధ్య చీకటి అగాధంలోకి చూస్తూ టీ తాగడం మొదలెట్టాను. రోడ్డు మీద జనసంచారమే లేదు. ఆ ఇద్దరి వైపూ చూశాను. ఒక్కాయనే మాట్లాడుతున్నాడు. రెండో అతను కేవలం వింటున్నాడు.

“మీకు లేటవుతుందేమో. నేను బయలుదేరతాను మాష్టారూ,” టీ కప్పు బండి మీద పెడుతూ అన్నాడు ఆ లావుపాటాయన.

రెండో వ్యక్తి జేబులోంచి చిల్లర తీసి “ఇంద మల్లేశూ,” అంటూండగానే ఆ లావుగా ఉన్నాయన చకచకా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న ఆయన వైపు నవ్వుకుంటూ చూసి మల్లేశు, “సారుకి మా చెడ్డ బయమండి!” అని టీ కెటిల్ కింది నీలి మంట వెలుగులో చిల్లర లెక్కపెట్టుకుని గోనెకింద పెట్టుకున్నాడు.

“ఊరికి కొత్తోరిలా ఉన్నారు. బాబుగారు ఎవరింటికెళ్ళాలండీ?”

“దగ్గర్లో ఏవైనా మంచి గెస్ట్‌హౌస్ గాని, హోటల్ గాని దొరుకుతాయా?”

“హోటళ్ళేమీ లేవండీ. ఫారెస్టు డిపార్టుమెంటు గెస్టు హౌసుంది గానీ, ఆఫీసు అయిదింటికే మూసేస్తారు.” మొదటిసారిగా మాట్లాడాడు ఆ రెండో అతను.

“బస్సు ట్రబులిచ్చింది. అందుకే లేటయిపోయింది.” తప్పు నాది కాదు కదా సంజాయిషీ చెప్పడానికి.

“మీకభ్యంతరం లేకపోతే ఈ రాత్రి నాతో ఉండండి.” పాతికేళ్ళుంటాయేమో సన్నగా పొడుగ్గా ఉన్నాడు.

“అభ్యంతరం ఏమీ లేదు గానీ, మీ ఫ్యామిలీకి ఏమైనా…” ఆ రాత్రంతా అక్కడే గడపాలేమో అన్న భయం నన్ను ఒదిలిపెట్టలేదు.

అతను చిరునవ్వు నవ్వి పదండి అన్నట్టు సైగ చేస్తూ ముందుకి నడిచాడు. మల్లేశుకి డబ్బులిచ్చేసి అతణ్ణి అనుసరించాను. ఇద్దరం నడుస్తున్నాం.

“ఒక చిన్న విషయం…”

చెప్పండి అన్నట్టుగా చూశాడు.

“నేనెవర్ని, ఎక్కడ నుండి? ఎందుకొచ్చాను? ఇలా నా గురించి ప్రశ్నలడగకండి”

చిన్నగా నవ్వి సరే అన్నట్టు తలూపాడు. కాసేపు మౌనంగా నడిచాం.

“మీ పేరేమిటి? ఏం చేస్తుంటారు?”

“నా పేరు దామోదర్. ఇక్కడ ‘మాబడి’లో టీచర్ పని చేస్తున్నాను.”

“టీచర్ గానా? ఎక్రెడిటేడ్ స్కూలేనా?”

కాదన్నట్టుగా తల ఊపాడు.

సాయంత్రం వాన పడిందేమో రోడ్డంతా చిత్తడి చిత్తడిగా ఉంది. దాటుతున్న వీధి దీపాలనుంచి మా నీడలు పొడుగ్గా పరుచుకుంటున్నాయి. నిమిష నిమిషానికీ నాకు చలి పెరిగిపోతోంది. ఒక వీధి దీపం దగ్గర అతణ్ణి ఆగమని ఆ వెలుతురులో డఫెల్ మోకాలి మీద పెట్టుకుని అందులోనించి నా కాష్మీరీ షాల్ తీశాను. చలి ఉంటుందని తెలుసు గానీ మరీ ఇంత చలి ఉంటుందని అనుకోలేదు.

“మీకు చలి వెయ్యట్లేదా?”

చిరునవ్వే సమాధానం. ఒక దగ్గర మెయిన్ రోడ్డు మీంచి మలుపు తిరిగాం. వీధి దీపాలు కూడా లేని సందు. అతను టార్చి వేశాడు. ఆ సన్నని కాంతిపుంజం ఆ దట్టమైన చీకట్లో ఒక వెలుగు సొరంగం తవ్వుతున్నట్టుగా వ్యాపించింది. గడ్డి మధ్యలో చిన్న కాలిబాట. చుట్టూ కీచురాళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి. చీకటి, నిశ్శబ్దం ఇంత దట్టంగా కూడా ఉంటాయని తెలుస్తోంది. ఆ చీకట్లో ఒక మనిషి దీపం పట్టుకుని ముందు నడుస్తుంటే అతణ్ణి అనుసరించడం కొత్తగా ఉంది. మరో ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా అనిపించింది. వెంటనే ఇతను నన్ను ఎక్కడకి తీసుకెళ్తున్నాడోనని మనసులో ఏ మూలో అనుమానం కలిగింది కానీ మహా అయితే ఏమౌతుందిలే అనుకున్నాను. కాలిబాట గుట్టపైకి ఉన్నట్టుంది. ఎక్కలేక అంత చలిలోనూ చెమట్లు పడుతున్నాయి. కాళ్ళు పీకుతున్నాయి.

“ఇంకా ఎంత దూరం?”

“వచ్చేశాం.”

గుట్ట ఎక్కాక మెరక ప్రదేశం వచ్చింది. కాస్త దూరంలో తాళం కప్ప మీదకి టార్చి వేసి చూపించాడు. తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళాం. స్విచ్చి వేశాడు. లైటు వెలగలేదు. ‘కరెంటు పోయింది,’ అన్నాడు ఏ భావమూ లేకుండా. కరెంటు ఉంటేనే ఆశ్చర్య పడాలేమో ఆ కొండ పల్లెలో అనుకున్నాను. అతను లాంతరు వెలిగించాడు. ఒకటే గది. చిన్న వంటిల్లు. అంతే. కూజా లోంచి మంచి నీళ్ళు వంపి గ్లాసుతో తెచ్చిచ్చాడు. ఆ నీళ్ళ చల్లదనానికి పళ్ళు జివ్వుమని లాగాయి. చలికాలం నీళ్ళకీ, గాలికీ కూడా కోరలు మొలుస్తాయేమో అనిపించింది.

“స్నానం చేస్తారా?”

“వేణ్ణీళ్ళున్నాయా?”

అతను నవ్వి, లుంగీ కట్టుకుని పెరటి తలుపు తీసి కర్రలపొయ్యి వెలిగించి మసిపట్టిన సిలవరి డేసాతో నీళ్ళు పెట్టాడు. నేను బట్టలు మార్చుకునేసరికి అతను కిరసనాయిలు స్టవ్వు మీద వంట మొదలుపెట్టాడు. నేను పెరట్లో పొయ్యి దగ్గరకి వెళ్ళి కూచున్నాను. ఎరుపు పసుపు రంగుల అద్భుత మిశ్రమ వర్ణంలో చీకటిని వధించడానికి నాట్యం చేస్తున్న అగ్నిశిఖల చుట్టూ చేతులు కాచుకుంటూ, ఆ నాట్యాన్ని అబ్బురంతో అలాగే చూస్తూ కూచున్నాను. ఎరుపు, పసుపు, నీలం, నలుపు… ఇవే నాకు కావాల్సిన రంగులు. నీళ్ళు కుతకుతా మరుగుతున్న చప్పుడు. నేను లేచి లోపలికి వెళ్ళబోతుంటే ఇనప బాల్చీతో అతనే వచ్చాడు. నీళ్ళు బకెట్లోకి తొరిపేసి, “అదిగో బాత్రూం. కొవ్వొత్తి పట్టుకెళ్ళండి. కొంచెం జాగ్రత్త. పాములు తిరుగుతుంటాయి,” అన్నాడు.

పాములు అనగానే నా వెన్నులో వణుకు పుట్టింది. వచ్చిన పని కాకుండా చస్తానేమో అనుకుంటూ బాత్రూంలోకి నడిచాను. అంచులకి దన్నుగా చెక్కలు దిగ్గొట్టిన రేకు తలుపు మూస్తుంటే గోడకి రాసుకుని భయంకరంగా శబ్దం చేసింది. కొవ్వొత్తి వెలుతురులో హడావిడిగా స్నానం చేశాను. చెంబుతో వేడివేడిగా నీళ్ళు పోసుకుంటుంటే ప్రాణం లేచొచ్చింది. నీళ్ళు ఒంటిమీద ఉన్నంతసేపే వెచ్చదనం. స్నానం ముగించి తువ్వాలుతో తుడుచుకోగానే మళ్ళీ చలి. వణుకుతూనే లుంగీ కట్టుకుని గబగబా గదిలోకి నడిచాను. వంట పూర్తి చేసి చాప వేసి రెండు పాత స్టీలు కంచాలు పెట్టాడు. మంచి నీళ్ళు కూడా కొంచెం గోరువెచ్చగా చేశాడు. వేడి వేడి అన్నం, బంగాళాదుంప వేపుడు, చారు. పొగలు పోయే ఆకలితో ఈ రాత్రి ఒక లాంతరు వెలుగులో, ఒక అపరిచితుడి ఇంట్లో నేను తిన్న భోజనం! నేను జీవితంలో తిరిగిన దేశాలు, తిన్న రకరకాల తిళ్ళు అతనితో చెబుతూ ఈ అనుభవాన్ని గుర్తు పెట్టుకుంటానన్నాను. మళ్ళీ చిన్నగా నవ్వు. భోజనాలు పూర్తి చేసి, కంచాలు బయటపడేసి లోపలికొచ్చేసరికి కరెంటొచ్చింది. ఆ వెలుగులో చూస్తే అటుపక్క ఇంకో గది తాళం వేసి ఉంది.

“అదేమిటి, ఆ గదికి అలా తాళం వేశారూ?”

అతను పరుపులు పట్టుకొస్తూ నా ప్రశ్న వినలేదో లేదూ కావాలని సమాధానం చెప్పలేదో కానీ జవాబివ్వలేదు. అసలే చిన్న ఇల్లు. ఉన్న రెండు అగ్గిపెట్టె గదుల్లోనూ ఒకటి ఎందుకూ వాడుకోకుండా తాళం వేయడం ఎందుకూ. ఆ గదిలో ఈ మనిషి రహస్యం ఏదో ఉంది. అదేమయ్యుంటుందో…

అతను ఇంతలో రెండు పరుపులు కింద పరిచాడు. అలసట, వేడి నీళ్ళ స్నానం, మంచి భోజనం, బయట చలి, వెచ్చని రగ్గులో నేను. జీవితాన్ని మథిస్తూ ప్రతిరాత్రీ ఒంటిగంట దాకా నిద్రపోలేని నేను ఐదు నిమిషాల్లో నిద్రలోకి జారుకున్నాను.

ఉదయం నేను లేచేసరికి చుట్టూ దట్టంగా పొగమంచు. అతను కావడి పట్టుకుని ఆ మంచులో మాయమయ్యాడు. ఇంటి ముందు చిన్న తోటలో దాలియాలు, బంతి పువ్వులు. కొంచెం దూరంలో రెండు నీలగిరి, మరికొన్ని సిల్వర్ ఓక్ చెట్లు. వెదురు, నేపాళం బడితెలతో చిన్న దడి ఇంటి చుట్టూ. నిన్న చీకట్లో కనిపించని పరిసరాలు వెలుగులో చూడ్డం భలే ఉంది. రాత్రి నడిచొచ్చిన దారేనా ఇది అనిపించింది. అతను కావడితో తిరిగొస్తూ నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. నూనె డబ్బాల మూతలు కత్తిరించేసి వాటిని కావడికి తగిలించి బోరింగు నుండి నీళ్ళు తెస్తున్నాడు. రెండోమాటు నేనూ వస్తానని బయలుదేరాను. చుట్టూ ఏ ఇళ్ళూ లేవు. గడ్డి మీద తడి తడిగా మంచు. నీలగిరి చెట్ల ఆకుల్లోంచి జారి సూర్య కిరణాలు బద్దకంగా మంచు బిందువుల మీదకి పాకుతుంటే రకరకాల వర్ణాలు ఆవిష్కృతమౌతున్నాయి. నాకు మరిన్ని రంగులు అవసరం అయ్యేట్టుంది. బోరింగుకి అటువైపు కొంచెం దూరంలో చర్చి ఉంది. నేను బోరింగ్ కొడతానంటే బోరింగు పాడైపోకుండా ఎలా కొట్టాలో చూపించాడు. భూమిలో ఎంత లోతుకున్నాయో నీళ్ళు గంటసేపు కొడితే గానీ ఒక డబ్బా నిండలేదు. అలా మూడు కావళ్ళ నీళ్ళతో డ్రమ్ము నిండింది.

అతను స్నానం చేసి స్కూలుకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక ఫారెస్టు గెస్టు హౌసుకి వెళ్ళాను. అది ఊరికి దూరంగా ఉంది. ఇంకెవరూ ఉండట్లేదు గెస్ట్ హౌస్‌లో. ఒంటరిగా నేను చేయదల్చుకున్న పనికి బాగుంటుంది. కానీ గెస్ట్ హౌస్ మరమ్మత్తులో ఉందట, మూసేశారని చెప్పారు. ఇంక చేసేదేం లేక ఊళ్ళో తిరిగాను. ఊరు పెద్ద ఆసక్తిగా ఏమీ లేదు. పట్టు పరిశ్రమ, మల్బరీ నర్సరీ, పెద్ద పెద్ద ఖాళీ మైదానాలు, చుట్టూ కొండలు, బజారు, సంతబయలు, చిన్న బస్టాండు అంతే. ‘భోజనం తయార్’ అన్న బోర్డు చూసి ఏదో చిన్న హోటల్లో రుచీ పచీ లేని తిండి తిన్నాను మధ్యాహ్నం. రోడ్డు మీద తిరుగుతూ ఈ ఊళ్ళో జనాలకి కాలక్షేపం ఏంటో అని తెగ ఆలోచించాను. ఏదో ఒక వ్యాపకం లేకుండా ఎలా ఉంటారో కదా. అలా సాయంత్రం దాకా తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసరికి అతను బయట కుర్చీ వేసుకుని అలా కూర్చునున్నాడు. నేనూ ఇంకో కుర్చీ తెచ్చుకుని కూచున్నాను.

“ఈ ఊళ్ళో మీకు ఎలా ఊసు పోతుంది?”

అరచేతులు తిప్పి అతను ఎప్పట్లానే ఒక చిరునవ్వు నవ్వాడు. కోంచెం కోపమొచ్చింది. ఏంటో ఏ ప్రశ్నకైనా నవ్వే. సమాధానం తెలీకా? చెప్పడం ఇష్టం లేకా? లేక వీడికేంటి చెప్పేదని పొగరా? సమాధానాలు సిద్ధంగా ఉన్నా, నేను కావాలనే మాటలు పెంచలేదు. అతనూ ఇంకేమీ అడగలేదు. చీకటి పడగానే లోపలికెళ్ళి డేసాలో నీళ్ళు నింపి, పొయ్యి వెలిగించి, లోపలికొచ్చి వంట పనిలో పడ్డాడు. నేనూ స్నానం చేసి అతన్ని గమనిస్తూ కూర్చున్నాను.

రెండు రోజులు ఇలానే గడిచాయి. ఇతనెవరో కానీ చాలా ఇంటరెస్టింగా ఉన్నాడు. దినచర్య చిత్రంగా అనిపిస్తుంది. పొద్దున్నే నిద్ర లేస్తాడు. కాఫీ కలుపుకుని తాగేసి కావడితో బోరింగు నుంచి నీళ్ళు తెస్తాడు. మొక్కలకీ, పెరట్లో పాదులకీ నీళ్ళు పోస్తాడు. ఇల్లు తుడుచుకుని, స్నానం చేసి స్కూలుకెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రం స్కూలునుంచి వచ్చాక బయట కుర్చీలో అలా చూస్తూ కూచుంటాడు. మళ్ళీ వంట, భోజనం, పడుకోడం. బహుశా అప్పుడప్పుడూ ఊళ్ళోకి సాయంకాలం పూట కాసేపు ఆ బస్‌స్టాండ్ దగ్గరికీ వెళ్తాడేమో. లేదూ నిన్నటిలాగా కూరగాయల కోసం సంతకి వెళ్తాడేమో వారానికొకసారి. ఏమీ పట్టకుండా ఎవరుంటారు ఈ ప్రపంచంలో? ఏమీ లేని జీవితంలో ఏకాంతం ఉంటుంది. అదీ లేని మనసెలా ఉంటుంది?

నేను లేచేటప్పటికి అతను పనులు ముగించుకుని మాసిన బట్టలు మూట కట్టుకుంటున్నాడు.

“ఎక్కడికో బయలుదేరినట్టున్నారు.”

“కుబ్బేటిపుట్టు గెడ్డకి. బట్టలుతుక్కోడానికి”

“ఏం గెడ్డా?! ఎక్కడుంది?”

“అదిగో కనిపిస్తోంది కదా తెరిచిన నోరులా. అది నోరుకొండ. అదెక్కి దిగితే వచ్చేదే కుబ్బేటిపుట్టు గెడ్డ.”

నేనూ వస్తానని బయలుదేరాను. ఆదివారం కావడంతో బైబిళ్ళు పట్టుకుని చర్చికి వస్తున్న జనాలు అతణ్ణి పలకరిస్తున్నారు. ఇతను బదులుగా చిరునవ్వు నవ్వుతున్నాడు. కాలిబాటలో నడిచి కొండ దిగువుకి చేరుకున్నాం. దూరంగా రకరకాల ఆకారాల్లో బండరాళ్ళు. వాటి మీద నీటి చారలు. దారి కడ్డంగా బలిసిన తుప్పల్ని దాటుకుంటూ కొండెక్కాం. దారంతా బ్రహ్మజెముడు ముళ్ళు, గాజుపువ్వులు. మధ్యలో రాతిమండపంలో ఆంజనేయుడి బొమ్మ చెక్కి ఉంది. చుట్టూ రకరకాల రంగురంగుల పువ్వులు. చంద్రకాంతం, గన్నేరు పువ్వులు. జిల్లేడు, ఉమ్మెత్త పువ్వులు. ఆ పూల రంగులతో పోటీ పడుతూ వాటి మధ్య ఎగురుతూ సీతాకోక చిలకలు. దూరంగా రంగులు మార్చే ఆకాశం. జీవితాంతం నేను వెతుక్కున్న రంగులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. నాకివన్నీ అవసరమౌతాయి. నేను ఆ రంగుల్ని చూస్తూ ఇక్కడ కాసేపు కూచుందామా అంటే సరే అన్నాడు. నేనో చెట్టు నీడలో, అతనొక చెట్టు నీడలో కూచున్నాం. కాసేపటికి దగ్గర్లోని రాయి మీదకి ఒక తొండ వచ్చింది. బండరాయి రంగులోనే ఉంది. ఆ బండరాయి రంగే ఆ తొండకి పులిమిన అదృశ్య హస్తం ఎవరిది? అతనికి చూపించి ‘ఎంత అద్భుతమండీ,’ అన్నాను గొంతులో ఆర్ద్రతతో.

కొండ దిగ్గానే కాస్తంత దూరంలో సెలయేరు. అక్కడి వాళ్ళ భాషలో కుబ్బేటిపుట్టు గెడ్డ. సాపుగా ఉన్న రాయి మీద పొయ్యి పెట్టిన గుర్తులు. చాకళ్ళు బట్టలు ఉడకబెట్టుకోడానికి కాబోలు అనుకున్నాను. మేం వెళ్ళేసరికి ఇద్దరాడవాళ్ళు ఉతుక్కున్న చీరలని రాటలకి కట్టుకుంటూ ఆరేసుకుంటున్నారు. తేటపడ్డ రంగు రంగుల చీరలు పొద్దుటి సూర్యకాంతిలో మెరుస్తున్నాయి. ఒక రాయి మీద కూచుని, పేంటు పిక్కల దాకా మడుచుకుని చల్లటి నీళ్ళలో కాళ్ళు కదుపుతూ, నేనొచ్చిన పని ఎలా చెయ్యాలో ఆలోచిస్తూ కూచున్నాను. ఏం చెయ్యాలో తెలుసు. ఏది చెయ్యాలో తెలియాలి. అంతే. అతను కొంచెం దూరంలో బండ మీద బట్టలుతుకుతున్నాడు. అయిపోయాక ఆరేసి అతనూ వచ్చి ఇంకో రాయి మీద కూచున్నాడు, మౌనంగా విశ్రాంతి తీసుకుంటూ.

“ఈ సెలయేరు ఎంత అందంగా ఉంది కదా!” అన్నాను అతనితో ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ.

చిన్నగా నవ్వాడు.

“ఎక్కడికో ఈ తొందర? ఎవరి బతుకులోని శూన్యాన్ని నింపడానికో అనిపించదా సెలయేటిని చూస్తే” అన్నాను.

మళ్ళీ నవ్వు. శూన్యం ఏమిటి, అందం ఏమిటి, అన్నట్టుగా నవ్వు. ఇంత అద్భుతమైన ప్రపంచం తన చుట్టూ ఉంటే రాళ్ళైనా పరవశించి పోతాయే. భావుకతలో తేలిపోతాయే. ఈ మనిషికి ఏమీ అనిపించదా? అసలు ఈ ఏరు, ఈ కొండలు, ఈ రంగులు గమనిస్తున్నాడా? ఒకవేళ స్లమ్స్‌లో బతకమన్నా ఇతనింతేనా? ఊహూఁ. ఇంపాసిబుల్. ఇలాంటి మనిషి ఉండడం అసంభవం. అతనికి జీవితంలో ఏదో బలమైన దెబ్బ తగిలుండాలి. అందుకే అతనిలా ఐపోయాడు. దానికి సంబంధించిన రహస్యమేదో ఆ గదిలో ఉంది. అందుకే అది తాళం వేసేశాడు.

మర్నాడు ఇంక ఉండబట్టలేదు. అతను స్కూలుకిలా వెళ్ళాడో లేదో, వెతుకులాట మొదలుపెట్టాను. ఆ గది తాళం చెవి దొరక్కపోతే తాళం బద్దలు కొట్టేసైనా లోపల ఏముందో చూడాలి. ఇతని రహస్యం తెలుసుకోవాలి. ముందు గదిలో పరుపుల చుట్ట పెట్టిన బల్ల, దాని పక్కనే చిన్న చెక్క బీరువా. అంతే సామానంతా. అది తీసి వెతికాను. అతని టెక్స్టు పుస్తకాలు తప్ప మరో పుస్తకమే లేదు. కొన్ని దిద్దేసినవీ, మరికొన్ని దిద్దవలసిన పరీక్ష పేపర్ల కట్టలు. కొన్ని టీచింగ్ నోట్సులు. ఒక డైరీ ఉంది. ఆత్రంగా తెరిచాను. ఏవో ఖర్చుల లెక్కలు తప్ప అందులో ఏమీ రాయలేదు. చిన్న మగ్గులో కొన్ని పాత పెన్నులు, పెన్సిళ్ళు. దానిలోపలే రెండు తాళం చెవులు దొరికాయి. ఒకదాంతో తాళం తెరుచుకుంది. లోపలికి వెళ్ళి చూస్తే గోడకి తగిలించిన ఏసుక్రీస్తు పటాలు, ఒక ట్రంకు పెట్టె, కొన్ని పుస్తకాలు ఉన్నాయి. నా ముఖం ఆనందంతో వెలిగింది. ఇదన్నమాట అసలు సంగతి. అతనొక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె క్రిస్టియన్. ఇద్దరూ పెళ్ళి చేసుకుని ఈ గదిలో కొన్నాళ్ళు కాపురం ఉన్నారు. తర్వాత వాళ్ళ తల్లి తండ్రులు ఇతన్ని బెదిరించి ఆ అమ్మాయిని లాక్కుపోయారు. ఆమెకి సంబంధించిన వస్తువులన్నీ ఈ గదిలో పెట్టేసి తలుపులు వేసేసి, ఆమె తలపుల్లో నిర్వికారంగా బతికేస్తున్నాడు.

ఈ లోపల వీధి తలుపు చప్పుడైంది. అతనే. ఒక్క క్షణం గిల్టీగా అనిపించినా పైకేమీ అనలేదు నేను.

“పేపర్ల కట్ట మర్చిపోయాను” అంటూ లోపలికి వచ్చాడు. గది తాళం తీసి ఉండడం చూసి “ఆ గది తలుపులు తెరిచారా?” అన్నాడు.

అత్యంత నాటకీయంగా చింత నిప్పుల్లాంటి కళ్ళతో నన్ను ఛడామడా తిట్టి నా మీద విరుచుకు పడతాడని ఊహించిన నాకు అతని స్పందన చాలా నిరుత్సాహం కలిగించింది. మళ్ళీ అతనే అన్నాడు.

“ఫాదరు గారు ఏమంటారో.”

“ఫాదరా?” అన్నాను చాలా మామూలుగా ఏమీ జరగనట్టుగా. నేననుకున్న దానికంటే పెద్ద కథే ఉండుండాలి.

“ఈ ఇల్లు ఫాదరు గారిది. చర్చికి దగ్గరని ఇక్కడ ఉండేవారు. ఈ మధ్య ఆరోగ్యం బాగోక పిల్లల దగ్గర కొన్నాళ్ళుండి వస్తానని వెళ్తూ నన్నీ గదిలో ఉండమన్నారు.” అతను పేపర్ల కట్ట తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు.

నిస్త్రాణగా కుర్చీలో కూలబడ్డాను. ఆలోచించే కొద్దీ ఇతను నాకో ఎనిగ్మా అవుతున్నాడు. ఏదో ఉంది. ఏదో ఉండే ఉండాలి. అదేదో నాకు తెలియాలి. అది అతనినుంచే రాబట్టాలి.

మర్నాడు అతనితో ఏదైనా మాట్లాడించాలని స్కూలునించి రాగానే నోరుకొండ మీంచి సూర్యాస్తమయం చూద్దాం పదండి అని తీసుకెళ్ళాను. ఆ పూవుల మధ్య నుంచి, నీలి మబ్బుల మధ్య నుంచి మళ్ళీ వెళ్ళాం. దారంతా ఆ మహాప్రకృతి ఒడిలో నాకు కలుగుతున్న అనుభూతుల గురించి మాట్లాడాను. ఎలా ఆ ప్రకృతిని ఒక లోతైన ఆలోచనతో రంగుల్లో ఒడిసిపట్టుకున్నానో, మా ఇంటి నాలుగు గోడలపై వాటి మధ్యలోనే ఎలా వాటితోనే ఉంటానో చెప్పుకొచ్చాను. అతను అన్నీ మౌనంగా వింటున్నాడు. నోరుకొండ పైకి చేరాం. కొండ కొమ్ముకి దాపుగా ఒకే ఒక చెట్టు. ఆకులన్నీ రాల్చేసుకున్న ఒంటరి చెట్టు. చుట్టూ విశాలంగా సంధ్యాకాశం. ఒక బండరాయి మీద కూర్చున్నాం. చుట్టూ భయానకమూ గాఢమూ అయిన సౌందర్యంతో అనంతంగా లోయ. చెట్ల మీద బంగారు కాంతి. మెల్లగా సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం. ఈ ఊరొచ్చింతర్వాత ఇంత గొప్ప దృశ్యం నేను చూడలేదు. నేను ఇక్కడికొచ్చింది ఈ చిత్రం కోసమే అయివుండాలి. ఇదేనా నా కాబోయే ఆఖరి అద్భుత కళాఖండం? మై స్వాన్ సాంగ్ టు దిస్ అన్‌డిౙర్వింగ్ వర్‌ల్డ్? పంతం కోసం కాదు. నిజమైన కళాకారుడికి చావంటే భయం ఉండదని లోకానికి నా వల్ల తెలియాలి.

“నాకు అలా రెక్కలు కట్టుకుని ఎగురుకుంటూ వెళ్ళి ఆ సంధ్యాసూర్యుడిలో ఐక్యమైపోవాలని ఉంటుంది,” అన్నాను. అతను ఎప్పటిలాగే మళ్ళీ చిన్నగా నవ్వాడు. చీకట్లు చిక్కబడుతుంటే కిందకి దిగాం. ఎక్కడానికో గంట, దిగడానికో గంట పట్టింది. ఈ రెండు గంటల్లో మహా అయితే ఓ రెండు మాటలు మాట్లాడి ఉంటాడేమో అతను.

ఇంకో మూడు రోజులు గడిచాయి. ఆలోచించే కొద్దీ నాకు అతణ్ణి చూస్తే భయం వేస్తోంది. అతని నవ్వు చూస్తే భయం వేస్తోంది. నేను అడగొద్దన్నాను నిజమే. అయితే మాత్రం “మీరెవరు? మీరెక్కడనుండి వచ్చారు? ఏ పని మీదొచ్చారు? ఎన్నాళ్ళుంటారు? ఫారెస్టు గెస్టు హౌసు ఏమైంది?” ఒక్క ప్రశ్నైనా అడగలేదు. నువ్వున్నా సరే, వెళ్ళిపోయినా సరే అన్నట్టు ఎలా ఉన్నాడు? ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా అతనికి అడుగుదామని అనిపించలేదా! అతను చెయ్యొద్దన్న పని చేసినా కోపం తెచ్చుకోలేదు. ఇది మొహమాటమూ కాదు. ఖాళీగా ఉన్నప్పుడు చీకట్లోనూ, వెలుతుర్లోనూ అలా కుర్చీలో కూచుంటాడు అలా బైటికి చూస్తూ. అతణ్ణీ అతని దినచర్యనీ చూస్తే పిచ్చెక్కిపోయేలా ఉంది. విపరీతమైన కోపం వస్తోంది. ఇవాళ అతని విషయం తేల్చెయ్యాలి రాగానే. ఇలా ఇక నావల్ల కాదు. అతని గురించి ఎదురుచూస్తూ కూచున్నాను. అతను రావడం ఆలస్యమయ్యేకొద్దీ కోపం ఇంకా పెరిగిపోతోంది. చివరికి జోళ్ళ శబ్దమైంది.

అతను పలకరింపుగా నవ్వాడు. ఆ నవ్వు చూసి నాకు పట్టరాని కోపం వచ్చింది.

“అసలు మీరెలా ఉంటారు? ఆర్టో, లిటరేచరో, సినిమానో, భక్తో, పేకాటో, అమ్మాయో, మందో, వల్లకాడో ఏదో ఒకటి ఉండాలి కదా? ఏదీ లేకుండా ఎలా ఉంటారు? చెప్పండి. నిజం చెప్పండి?” అన్నాను తీవ్రంగా.

నేనడుగుతున్నదేంటో అర్ధం కానట్టుగా అయోమయంగా చూశాడు.

“వద్దు. దయ చేసి అలా చూడొద్దు. ఇప్పటికైనా నిజం చెప్పండి”

“ఏమైందండీ?”

“మీ లోపల మీరు దాచుకున్నదేమిటి అని అడుగుతున్నాను?”

“ఏముంటుందండీ. ఏమీ లేదు.”

“కుర్చీలో కూచున్నప్పుడు మీరేం ఆలోచిస్తారు? పోనీ, మీరు ధ్యానం చేసుకుంటారు కదూ. కనీసం ఈ విషయమైనా ఒప్పుకోండి,” అర్ధింపుగా అడిగాను.

“లేదండీ. అలా కూచుంటాను అంతే.”


అతడి నుండి దూరంగా పారిపోతున్నాను.

కనీసం ఇవాళ సాయంత్రం బయలుదేరుతున్నా అన్నప్పుడైనా అతని నుంచి ఓ రెండు మాటలు ఆశించాను. అలాగే, నేనొచ్చి బస్సెకిస్తాను అన్నాడు ఎంతో సహజంగా. ‘వద్దు రావద్దు. మీ మౌనాన్ని నేను భరించలేను. నాకు పిచ్చెక్కిపోతుంది,’ అని ఒక్కణ్ణే బయలుదేరి వచ్చేశాను. నేనొక ఆర్టిస్టుననీ, ఒక గొప్ప కళాఖండం సృష్టించి ఆత్మహత్య చేసుకుందామని ఇక్కడికొచ్చానని కాస్త బలవంతం చేసి అడిగితే అతనికి నా రహస్యం చెప్దామనుకుని ఎంతో ఎదురు చూశాను. అతను నాకా అవకాశం ఇవ్వలేదు. బస్సు గాలికొండ దాటింది. అన్ని రంగులనూ కప్పేస్తూ తెల్లటి మంచు దట్టంగా కురుస్తోంది బయట. కిటికీ మూసేసి కళ్ళు మూసుకుని వెనక్కి వాలాను. అవును. అతను మంచు. అతను మౌనం. అతను … .

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. \"ఏటి ఒడ్డున\" కవితా సంపుటి (2006), \"ఆత్మనొక దివ్వెగా\" నవల (2019), \"సెలయేటి సవ్వడి\" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...