జాతర

వంటరితనం మిత్రమా వంటరితనం
అడుగు పెట్టకుండానే ఆలింగనం
జ్ఞాపకాల మాయలో స్ఖలనస్వప్నం
సాధ్యాసాధ్యాల సౌధాల శకలం
సమూహాల సమ్మర్దంలో
చిక్కబడుతున్న వంటరితనం

సహజీవనం మిత్రమా సహజీవనం
కంటికీ రెప్పకీ మధ్య
నెరవేరని కాంక్షలతో సహజీవనం
కన్నీరుతో చిరునవ్వుతో సహజీవనం
పట్టువిడుపులు తెలియని స్వార్ధపు బిగింపులతో
జనం మెచ్చిన చట్రాలతో సహజీవనం

వత్తిళ్ళు మిత్రమా వత్తిళ్ళు
మానవత్వపు వత్తిళ్ళు
మనిషి తత్వపు వత్తిళ్ళు
అత్తిపత్తి అమాయకత్వాన్ని
తుత్తునియలు చేసే వత్తిళ్ళు
పనితో వత్తిళ్ళు పనిలేక వత్తిళ్ళు

వేదనలు మిత్రమా వేదనలు
లాలసల నీడలో సున్నితత్వపు రోదనలు
మురిగిన మురిపెపు వేదనలు
జననానికి వేడుకతో
మరణానికి మౌనంతో వేదనలు

ఇన్ని వర్ణాల, కిరణాల, చర్వితచర్వణాల
జీవితపు జాతరలో
మనసొక పెద్ద మందు పాతర


సాయి పద్మ

రచయిత సాయి పద్మ గురించి: రచయిత మాటల్లో "ఎవరి గురించైనా చెప్పాలంటే చాలా ఉంటుంది. ఒక్కో సారి ఏమీ ఉండదు. చెప్పాలనుకున్నవన్నీ నా కవితల్లో అక్కడక్కడా అప్పుడప్పుడూ తొంగి చూస్తూ, ఒక్కోసారి నేను జాగ్రత్తగా వేసుకున్న లౌక్యపు పరదాలను దాటి, వాటి మాట నన్ను వినమంటాయి. అలా వినే ప్రయత్నాలే ఇవి!" సొంత బ్లాగు: తమ్మి మొగ్గలు  ...