…!!
ఒకటే అద్దాలు ఊహలు నీడలు జాడలు అన్నీ ఒక్కసారి గుండెల మీద కూర్చొని ‘నీ ఊపిరి నేనవుతా’ అనే ఒక వింత ఉక్కిరిబిక్కిరి… హటాత్తుగా లేచి కూర్చున్నాడు గౌతమ్. పక్కనే భార్య యశోధర కోసం తడిమాడు. తగల్లేదు. విచిత్రంగా గడియారంలా టంచనుగా పడుకొని తెల్లవారుఝామునే లేచే యశో లేదంటే, అప్పుడే తెల్లారిపోయిందేమోనని గుండె గుభేలుమంది. ఇవాళ మీటింగ్స్, డెడ్ లైన్లు అన్నీ వరుసగా లైన్లో గుర్తొచ్చేసరికి, లేపనందుకు పెళ్ళాం మీద కోపం కూడా వచ్చింది. ‘మన పని కోసం ఇతర్ల మీద డిపెండ్ అవటం అంత బుద్ది తక్కువ పని మరోటి లేదు,’ అనుకుంటూ పెట్టిన అలారం మోగనందుకు విసుగ్గా సెల్‌ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. అబ్బా ఏదో వాసన, మళ్ళీ యశోని తిట్టుకున్నాడు, యేవేవో తెస్తుంది నేచురల్ స్మెల్ ఇస్తాయి అనుకుంటూ బోటిక్స్ నుండి. ఏంటా వాసన, ఏదో గుర్తుకు తెస్తోంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే తెలిసింది. హా! బలపాల వాసన. నానిపోయి, వర్షపు హోరులో ప్లాస్టిక్ కవర్ల మధ్య దాచుకున్న పలకలు, వాటితో పాటు తడిసిపోయి కొన్ని ముద్దై మరికొన్ని కాని సుద్దముక్క బలపాల వాసన! అవి గుర్తు రాగానే గాభరా పుట్టింది గౌతమ్‌కి. ఇంతకీ ఎక్కడికి పోయింది యశో…?
కనీసం సెల్‌ఫోన్ చూస్తే అన్నా టైమెంతయిందో తెలుస్తుంది. సైలెంట్ మోడ్‌లో పెట్టిన ఫోన్ స్క్రీన్ మసకగా కనిపించింది. కళ్ళు నులుముకొని చూసేటంతలో కనీ కనబడని ఆ టైమ్ కాస్తా మాయమై ఒక పాత పలక స్క్రీన్ మీద ప్రత్యక్షం అయింది. ఏంటిది? గౌతమ్ గొంతు పొడారింది. దాని మీద అక్షరాలు…
ఒరే గౌతమ్,
నువ్వు, మీ మమ్మీ డాడీ ఇక్కడి నుండి వెళ్ళిపోయిన దగ్గరనుండీ దుగ్గు గాడు నన్ను బాగా ఏడిపిస్తున్నాడు. నిన్ను టామీ అన్నాడు.నీది డాగ్ పేరు అన్నాడు. నాకు కోపం వచ్చి కొట్టాను. వాడు నా హెయిర్ క్లిప్స్ పీకేసి దాచేశాడు. నా లంచ్ బాక్స్‌లో మాగీ తినేశాడు. నువ్వు ఇంక రావు అని చెప్తున్నాడు. అబద్ధం కదా. వస్తావు కదూ! స్పీడుగా వచ్చి వాడ్ని కొట్టు. కొట్టేసి వెళ్ళిపో కావాలంటే. నాకు నువ్వు లేకుండా ఈ స్కూల్ బాలేదు..!
నీ ఫ్రెండ్
యశోధర,
థర్డ్ క్లాస్, బీ-సెక్షన్ , రోల్ నంబర్ 21.
విద్యా పబ్లిక్ స్కూల్,
అనంతపురం.
గౌతమ్‌కి ఏమీ అర్ధం కాలేదు. ‘యశో! యశో!’ అని పిలిచాడు. తన గొంతు తనకే కీచుగా వినిపించింది. తొట్రుపడుతూ, తడబడుతున్న అడుగులతో, బెడ్రూమ్ దాటి బయటకి వచ్చాడు. ఎంతయింది టైమ్? ఏమో ఏమీ తెలీటం లేదు. యశోకి అస్సలు బుద్ది లేదు. ప్రతిసారీ కేంపులకి వెళ్ళినప్పుడల్లా రకరకాల వాల్ క్లాక్స్ తెస్తూనే ఉంటాడు. రెండు రోజులు ఎక్కడో ఒకచోట తగిలిస్తుంది. తర్వాత తీసేస్తుంది.
అయినా వాల్‌క్లాకే కావాలా, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, ఓవెన్ అన్నిటి మీద టైం ఉంటుందిగా. ప్రిడ్జ్! మర్చిపోయిన దాహం గుర్తొచ్చింది. గభాల్న లైట్స్ అన్నీ వేసుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరకి వెళ్ళి, వాటర్ డిస్పెన్సర్ నుంచి గ్లాసు నిండా నింపుకుని గటా గటా చల్లటి నీళ్ళు తాగాడు. వెంటనే గుర్తొచ్చింది జీవన్మరణ సమస్యలా టైం ఎంతయింది అని.
ఫ్రిడ్జ్ మీద ఉన్న ఎల్ఈడీ స్క్రీన్ చూడటానికి ప్రయత్నించాడు. మసకమసకగా కనిపించింది. ఈ మధ్య ఈ సైట్ ఒకటి! కళ్ళజోడు పెట్టుకుంటే గానీ ఏదీ కనబడి ఛావదు. కళ్ళు చికిలించాడు. ఫ్రిడ్జ్ మీది స్క్రీన్ ఉన్నచోట ఒక అందమైన పింక్ కలర్ కాగితం వేలాడుతోంది. ఇదెక్కడో చూసినట్టుందే. ఓహ్, తను మొదటిసారి కొని రాసిన లెటర్ పాడ్ లోది కదూ. ఇదిక్కడ ఎందుకుందబ్బా? యశో అతికించి ఉంటుంది. అది లాగాలని ప్రయత్నించాడు. వీలుకాలేదు. అది స్క్రీన్‌లా మారిపోయింది. కష్టపడి దాచుకున్న సెంట్ పూసిన ఉత్తరం. మరో అక్షరాల వాన. ఈ అక్షరాలు రాసింది నేనే కదూ అనుకున్నాడు.
ప్రియమైన యశో,
నేను వస్తానని చెప్పాను, వచ్చాను. ఎంత మారావు యశో. రెండు పోనీటెయిల్స్ పిల్ల హటాత్తుగా లంగా వోణీతో, కన్నుల్లో కన్నెతనపు విశ్వాసంతో, క్షణంలో చిలిపితనం మెరిపించి, పెద్దవాళ్ళు వస్తుంటే గంభీరంగా మారిపోయే ముఖ కళవళికలతో, ఎదురయిన నేస్తాన్ని ఏం చేయాలి? నీ దగ్గర మంచివాడిగా ఉండటం అనేది నాకు నేను చెప్పుకొనే పెద్ద అబద్ధం. ఒక్కసారికి చెడ్డవాణ్ని అయిపోనా? ఓహ్! చెడ్డవాళ్ళు పర్మిషన్ అడగరు కదూ!
సరే. ఇంకొక్క నాలుగేళ్ళు యశో… వోపిక పట్టు. తప్పకుండా అధికారికంగా తీసుకు వెళతాను. ప్లీజ్, రా. ఈ ప్లీజ్ నాకు నేనే చెప్పుకున్నట్టు ఉంది, నిన్ను వదల్లేక!
ఒకరోజు నీ జ్ఞాపకాల్లో నలిగి, ఏం తోచక, మొదటి సారి లైబ్రరీలో దొంతర్లుగా ఉన్న తెలుగు పుస్తకాలు కొన్ని చదివాను. నువ్వు తరచు నాతో మాట్లాడే పేర్లు కొన్ని కనిపించాయిరా. అన్నిచోట్లా ప్రబంధ నాయికలు, వాసవ సజ్జిక, విరహోత్కంఠిత, ఇంకెవరో. కానీ, విరహం ఆడవాళ్ళ కేనా, మగవాళ్ళకి ఉండదా? నీ ఆలోచనల్లో నిద్ర పట్టని నన్ను అడగమని చెప్పు. ఎప్పటికో నిద్ర పడుతుంది. నీ కళ్ళ మెరుపో, నవ్వు సవ్వడో వినిపించి తెలివి వచ్చేస్తుంది. బాబోయ్, నాక్కూడా కవిత్వం వస్తోందోయ్!
చాలా చదవాలి. నిన్ను సుకుమారంగా చూసుకోవాలి. ఎలా తెలుసా? అసలు మన జీవితం ఎన్నేళ్ళు గడిచిందో గుర్తుకు రానంత! నీకు సమయమే గుర్తుకు రానంత అపురూపంగా చూసుకుంటా తెలుసా!
ఇంకా ఆపేస్తాను. నా కవిత్వానికి కాదు రేపు పరీక్ష. నా తెలివితేటలకీ, జ్ఞాపక శక్తికీ. ఉంటా యశో…
నీ
గౌతమ్ అనబడే టామీ.
ఆ ఉత్తరంతో పాటు మర్చిపోయిన సెంట్ వాసన. ఎన్ని మంచినీళ్ళు తాగినా గొంతు పొడారినట్టే ఉంది. గౌతమ్ ఏదీ నమ్మలేకపోతున్నాడు. స్పష్టాస్పష్టంగా కూడా జరుగుతున్నది ఏమిటో అర్ధం కావటం లేదు అతనికి. ఇప్పుడు రెండు ప్రశ్నలు — యశో ఏమైంది? సమయం ఎంత అయింది?
హటాత్తుగా గుర్తొచ్చింది. ల్యాండ్ లైన్ కార్డ్‌లెస్ ఫోన్ ఇక్కడే ఎక్కడో ఉండాలి కదూ. యశో ఆ ఫోనే ఎక్కువ వాడుతుంది. ఆ ఫోన్ మీద కూడా టైం కనబడుతుంది కదా. తడబాటు పడుతున్నట్టుగా హాల్లోకి వచ్చాడు. ఇక్కడే ఎక్కడో ఉండాలి. గోడల నిండా, తనవీ యశో వీ, కొడుకు రాహుల్‌వీ ఫోటోలు. రాహుల్ బోర్డింగ్ స్కూల్ యూనిఫారంలో కొన్ని. అవునూ రాహుల్ స్కూల్‌కి ఫోన్ చేస్తే? యశో అక్కడకి వెళ్ళి ఉంటుందేమో. కానీ రాత్రి పక్కన పడుకొనుంది. స్కూల్‌కి ఎప్పుడెళ్ళింది, ఎందుకు వెళ్తుంది? ఏమో…
సన్నగా తలనెప్పి ప్రారంభం అయింది. ల్యాండ్ లైన్ ఫోన్ కోసం వేట కూడా. హాల్లో లేదు. వరండాలో లేదు. యశో ఫోన్ పట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉన్నట్టే అనిపించింది. మళ్ళీ చూస్తానా తనని? వెతుక్కుంటూ ఇల్లంతా తిరిగేశాడు. కాళ్ళు పీక్కుపోతున్నాయి. చివరగా స్టోర్ రూమ్ కనిపించింది. స్టోర్ రూమ్‌లో ఫోన్ ఎందుకు ఉంటుంది? ఏమో. చిత్రంగా స్టోర్ రూమ్ తలుపు తీసే ఉంది. లోపలికి వెళ్ళాడు గౌతమ్. రూమ్ నిండా వాల్ క్లాక్‌లు. ఆకలి మీదున్న వాడికి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినట్టు అనిపించింది. హమ్మయ్య! కనీసం సమయం తెలుస్తుంది. ఆత్రంగా ఆ గడియారాల వంక చూశాడు. అన్నీ ఒకటే సమయం చూపిస్తున్నాయి. ఉదయం 1:43. తేదీ 7-7-2007. అబ్బా! ఈ గడియారాలన్నీ ఆగిపోయాయే. ఈ తేదీ ఎంతో పరిచయం అయినదిలా ఉందే.. అప్పటికి పెళ్ళయి పధ్నాలుగు నెలల ముఫై రోజులు. అంటే పదిహేను నెలలేగా అని యశో నవ్వు. కాదు,ఈ నెల ముఫై ఒకటో రోజు ఉంది. ఇది వన్ ఫోర్ త్రీ రా. అంటే ఐ లవ్ యూ. ఒక తెల్లారుఝామున, ఇద్దరికే పరిమితమైన బీచ్ రిసార్ట్‌లో, సముద్రపు గాలుల మధ్య ఇసుక తన్నుకుంటూ నడిచిన క్షణాలు… రాహుల్ కడుపులో పడ్డాడని తెలిసిన క్షణాలు… అప్రయత్నంగా కళ్ళు తడి అయ్యాయి.
హేయ్! ఇక్కడే ఉంది ఫోన్. యశో పడేసి ఉంటుంది. ఆబగా చేతిలోకి తీసుకున్నాడు. రాహుల్ స్కూల్ ఫోన్. కానీ నంబర్ యశోకే తెలుసు. నేను ఎప్పుడన్నా ఫోన్ చేస్తేగా? ఆశ్చర్యం వేసింది గౌతమ్‌కి. ఐ.ఐ.టీ.లో టాపర్, తన మెమొరీకి ఇప్పటికీ ఫాన్స్ ఉన్నారు క్లాస్మేట్స్ లో. అలాంటిది ఇవాళ… టైం ఎంత అయింది, యశో ఎక్కడ ఉంది, రాహుల్ నంబర్ ఎంత, అన్నీ ప్రశ్నలే!
హుష్! తలుచుకుంటే రాహుల్ స్కూల్ నంబర్ గుర్తు రాదా? ట్రై! ట్రై, మై డియర్ గౌతమ్! నువ్వు చెప్పే మేనేజ్మెంట్ పాఠాలు ఇప్పడు కాకపోతే ఎప్పుడు పనికివస్తాయి. గో బ్యాక్. రిలీజ్ ది మెమొరీ. ఎప్పుడు చూశావు స్కూల్ నంబర్. రాహుల్ ఫీజ్ కట్టేటప్పుడు కదూ? సెక్రెటరీ మేగీ ఫిల్ చేసి తెచ్చిన ఫామ్స్ మీద సంతకం. స్కూల్ లోగో. ఈ మెయిల్ అడ్రస్. ఫోన్ నెంబర్. హా! దొరికింది! గౌతమ్, నీది ఫోటోగ్రఫిక్ మెమొరీ!
ఆత్రంగా రాహుల్ స్కూల్ నంబర్ డయల్ చేశాడు. రింగ్ అవుతోంది. ప్లీజ్, ప్లీజ్, ఎవరైనా ఫోన్ తీయండి. నాకు సమయం ఎంత అయిందో తెలీటం లేదు. నా భార్య, నా కొడుకు దగ్గరకి వచ్చిందేమో కాస్త చెప్పరూ. తన పరిస్థితికి తనకే నవ్వొచ్చింది గౌతమ్‌కి. ఇంతలో ఎవరో ఫోన్ తీశారు. గౌతమ్, గౌతమ్. యశో గొంతు ఫోన్‌లో. చెమటలు పట్టాయి గౌతమ్‌కి. నమ్మలేనట్టుగా, భయంగా ఫోన్ వైపు చూశాడు. యశో నేనా?
‘యశోనే. చాలా ఊహలు కేవలం కలలుగా మిగిలిపోతే ఎలా ఉంటుందో తెలుసా. ఇవాల్టి ఈ వొంటరితనం వరంగా వరించిన శాపం అని నీకు అనిపించటం లేదూ? మొత్తానికి ఇది మనసు రాలే కాలం. దీనికి గ్రీష్మ, వాసంతాలతో పని లేదు. హర్శాతిరేకానికి లోబడదు. ఎంత స్థిత ప్రజ్ఞత. కానీ దేని కోసం? వడగాడ్పు రహస్యాలు చెప్పదు. ముక్కలైన మనసు పలికే నిశ్శబ్దం. విరహాలకి సమయం ఉండదు. వియోగాలకి అర్ధమూ ఉండదు. మనకేం తెలుసు అసలు? అది కూడా తెలీదు. ఎప్పుడూ హడావిడిగా ఉండే నీకు నీ నేస్తంలో వచ్చిన మార్పు తెలీదు. చాలా సుకుమారంగా చూసుకుంటున్నావు గౌతమ్ నన్ను. ఎంత సుకుమారం అంటే… నువ్వు కనపడనంత. రాహుల్ స్కూల్‌కి వెళ్ళిపోయాడు. నీ ట్రావెల్స్, షెడ్యూల్స్, అప్పుడప్పుడూ యశోకి ఒక పది నిమిషాలు. వెకేషన్లు కూడా పార్ట్‌నర్స్ తోనే. డిన్నర్లలో బిజినెస్ ప్లాన్స్ మీరు చర్చించుకుంటుంటే, అర్ధం అయినట్టు సహనంగా నవ్వటం, వాళ్ళ ఫేమిలీలతో కలవడానికి ప్రయత్నించటం. నాకు ఇప్పుడూ అప్పుడూ ఒకటే కోరిక. నీ గుండె చప్పుడు వినాలి. లేదా పూర్తి నిశ్శబ్దం కావాలి. గడియారాలు నన్ను చూసి నవ్వుతున్నట్టు ఉంటుంది. అందుకే అన్నీ ఇక్కడ పడేశాను. ఏమీ అనుకోకు. ఉంటా!’
క్లిక్ మని శబ్దంతో డిస్కనెక్ట్ చేసిన టోన్ వచ్చింది. గౌతమ్‌కి పిచ్చి పట్టినట్టుగా అయింది. ఒక్కసారి గడియారాలన్నీ కదలటం మొదలెట్టాయి. కేవలం శబ్దమే. సమయం కదలటం లేదు. వెన్నులో చలి పుట్టటం అంటే ఏమిటో మొదటి సారి అనుభవం లోకి వచ్చింది. అన్ని గడియారాల కదలిక గుండెల్లో దడ పుట్టించేదిగా అనిపించింది. గబగబా స్టోర్ రూమ్ నుండి బయటకి వచ్చి, ధడేల్ మనేట్టుగా తలుపు గట్టిగా లాగి వేసేశాడు. మళ్ళీ తనూ తన నిశ్శబ్దం. అవే జవాబు దొరకని ప్రశ్నలు!
నిస్సత్తువగా వచ్చి హాల్లో కూలబడ్డాడు. వూరికి దూరంగా, ఎంతో ఇష్టంగా యశో కోసం కొన్న విల్లా అది. పక్కింటి వాళ్ళు ఇంచుమించు వంద గజాల దూరం. ఎవరూ తెలీదు. ఏ ఇంటిలో ఎవరున్నారో యశోకి కూడా కొంచమే తెలుసు. ఎక్కడికెళ్ళావు యశోధరా గౌతమ్‌ని ఇలా వదిలేసి…
టీ.వీ.! సడన్గా బుర్రలో లైట్ వెలిగినట్టు… టీవీ ఆన్ అవుతుందో లేదో చూద్దాం. చివరి ప్రయత్నం. టైం ఎంతయింది, ఏం జరుగుతోంది అన్నా తెలుస్తుంది కదా! ఎక్సలెంట్ ఐడియా గౌతమ్, యూ ఆర్ గూడ్! టీవీ ఆన్ అయింది. ఫైనల్లీ, ఫైనల్లీ. రామ్మా తల్లీ, నాకూ ప్రపంచానికీ నువ్వే ఆఖరి లింక్‌వి. చానెల్ లిస్టు వచ్చింది. టైం ఎంత, ఎక్కడుంది స్క్రీన్ మీద. సరే ఏదో ఒక ఛానల్ పెడితే సరి. మొదట ఏదో దృశ్యం. అంతలోనే అది మాయం. టీవీ లో మళ్ళీ కొత్త ఉత్తరం.
ప్రియమైన గౌతమ్,
నీ కోరికలో ఊపిరి కూడా వలపు తుంపరలా అనిపిస్తుంది. ఉండీ ఉండీ ఉప్పెనలా కురిసే వర్షం. అనుభవం అంటే ఇలానే ఉండాలి అనిపిస్తుంది, అచ్చం మన దేహాల నిట్టూర్పుల్లానే… రాత్రంతా ఒకటే వర్షం. ఆగి ఆగి, మళ్ళీ కురిసి కురిసి, స్పర్శ లేని కంటి చూపు కూడా కలయికే అని ఎంతమందికి అర్ధం అయేలా చెప్తాం మనం. కానీ ఎవరికో ఎందుకు చెప్పాలి. ఒక్క చూపుకి అర్ధం అయితే చాలు కదా. అలసిపోయి పడుకున్న నిన్ను చూస్తూ ఉంటాను నేను. రోజులో నేను గడిపే బెస్ట్ టైం అంటే అదే. నేను చూస్తున్నానని తెలిసిందో ఏమో కలల్లో పిల్లాడిలా ఒక్క నవ్వు నవ్వుతావు నువ్వు. ఒక్క ముద్దు పెడదామంటే, లేస్తావని భయం. కోరిక అణచుకోవటం ఎంత కష్టం కదూ. మనిషి కోరిక మరి మహోజ్వలనం కదూ. ఇందులో కాలిపోయే వాళ్ళు, కాల్చేవాళ్ళు, ఎన్ని రకాలు ఈ జీవితం! అవునూ, కలయికలో కరుణ ఉంటుందా? మరి నువ్వు తాకిన ప్రతీసారీ మనసు చెమ్మగిల్లుతోంది ఎందుకు? ఎంత మంచిదా కన్నీరు, కళ్ళనుంచి జారనా, నీ పెదాలకి నైవేద్యం అవనా అని అడిగి మరీ పనిగట్టుకొని వచ్చినట్టు…
హేయ్! నీకోటి చెప్పనా. ఎవరికీ చెప్పొద్దు మరి. ఒక సుడిగాలిలా నీ కాంక్ష నన్ను కరిగించి, రాత్రిని తెల్లవారు ఝాముగా, ఝాముని వెచ్చటి పగలుగా మార్చేస్తుంది. ఎంత వగలమారిది కదూ. వర్షం కూడా తెల్లారేసరికి ఎక్కడికో పనున్నట్టుగా పారిపోతుంది. ఒక్క కాఫీ తెచ్చుకొని కూర్చొని రాత్రి జరిగింది తలచుకుంటాను నేను. వచ్చే వర్షాలు, తపనలో తడిపే విరహాలూ, రాబోయే పొడి రాత్రులు, మరేవేవో ఎవరో గీసిన చిత్రాల్లా కళ్ళముందు కదులుతాయి. నేనెందుకు నవ్వుతున్నానో తెలీక సూరీడు చికాకు పడతాడు, వేడెక్కి జనాల్ని చికాకు పెడతాడు. సగం నవ్వుల వెనుక నువ్వున్నావని ఎవరికీ చెప్పనులే.
జీవితం, సమయం, నువ్వు లేకుండానే రోజులు, వారాలు, సంవత్సరాలు గడచిపోతున్నాయి గౌతమ్. ఎంత కావాలి మనం మనలా బ్రతకటానికి, ఉన్న ఒక్క పిల్లాడిని పెంచటానికి. నిన్ను, స్పృహతో ఉన్న నీ స్పర్శని, నీ ప్రేమని, రాహుల్‌ని – ఎంత పోగోట్టుకున్నానో ఎలా చెప్తే అర్ధం అవుతుంది? మనం సుఖంగా ఉండాలి. నేను హాయిగా ఉండాలి. కదూ!సుఖం చాలా ఉంది గౌతమ్, సంతోషం లేదు.
నీతో గడిపిన క్షణాలు తక్కువ, నిరీక్షణ ఎక్కువ. నిరీక్షణ భయంగా మారుతోంది. కోల్పోయిన కాలం ఆక్టోపస్ లాగా వర్తమానాన్ని మింగేస్తోంది. ఇది నిన్నూ, నన్నూ మింగకముందే, నీకు నువ్వు విధించుకున్న శిక్షలాంటి పరుగుపందెం ఆపవా గౌతమ్? ఈ పందెంలో నేనే బహుమానం అయితే మొదలు పెట్టక ముందు నుండీ నీతోనే ఉన్నాను గౌతమ్.
టామీ… వచ్చేయవూ, మళ్ళీ మన ప్రపంచంలోకి. సమయం లేని నీ పరుగు మనకి మిగిల్చేది అమావాస్య రాత్రుల్నే, ప్లీజ్…
ఎప్పటికీ
నీ
యశో
ఏడుస్తున్నాడు గౌతమ్. సుమారు వెయ్యి మంది ఉద్యోగులకు లీడర్. మేనేజ్మెంట్, టెక్నికల్ ఫీల్డ్స్‌లో మేధావి అనిపించికున్న గౌతమ్. ఛానల్ మార్చాడు ఏడుస్తూనే. ఏ చానెల్ పెట్టినా అదే ఉత్తరం వస్తోంది. తెలియకుండా మాయమైపోయిన సమయం. ఎక్కడ చూసినా కనబడని యశో. ప్రతీ అణువణువునా నిండినట్టున్న యశో. ఒకసారి కనపడు యశో… యశో… యశో… పెద్దగా అరుస్తున్నాడు, భయంతో పిలిస్తున్నాడు. గొంతు పెగలటం లేదు. ఊబిలోనుంచి వస్తున్నట్టుగా ఉంది. చుట్టూ చీకటి కమ్ముకుంటోంది. ఏదీ కనిపించటం లేదు. యశో!… యశో!…
…గౌతమ్, …గౌతమ్! ఎవరో పిలుస్తున్నారు. విప్పలేని కళ్ళు విప్పి, జడత్వం ఆవరించిన శరీరాన్ని కదపాలనే విఫల ప్రయత్నం. ఇంకా ఇలానే పడుకున్నావా… ఎవరది? యశో గొంతులా ఉందే, యశో… యశో! నేను నీ కోసం ఎంత వెతుకుతున్నానో తెలుసా. వేరార్యూ? నీ గొంతేనా అది? యశో!
గట్టిగా కుదుపుతున్నారు ఎవరో. లే గౌతమ్… లెమ్మంటుంటే… చటుక్కున కళ్ళు విప్పితే ఎదురుగా జాగింగ్ డ్రెస్‌లో యశో. ఏంటిలా హాల్లోనే పడుకున్నావు? రాత్రి ఎన్ని గంటలకు వచ్చావు? యశో ప్రశ్నలేవీ వినకుండా కలలాగే ఆమె వైపే చూస్తూ… యశో చెప్పుకుపోతోంది, నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. బయట నుండి లాక్ చేసి వాకింగ్‌కి వెళ్ళి వచ్చాను. కాఫీ తాగుతావా? ఊ! తాగుతాను, గొంతు పెగల్లేదు పూర్తిగా. గౌతమ్‌ని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది యశో,
“మీటింగ్స్ చాలా ఉన్నాయి అన్నావుగా నిన్న. డికాక్షన్ రెడీగా లేదు. పది నిమిషాలు పడుతుంది. పరవాలేదా?”
“జీవితకాలం పట్టినా పరవాలేదు.”
తన గొంతు తనకే ఖచ్చితంగా వినపడి సంతోషం వేసింది గౌతమ్‌కి. యశో కళ్ళల్లో మెరుపు కంటిచూపు కలయికలో అతన్ని తాకింది. యశో వెనుకనే కిచెన్ వైపు నడుస్తున్న గౌతమ్‌కి తలుపు తీసి ఉన్న స్టోర్ రూమ్, అందులో ఉన్న గడియారాల ఆగిపోయిన సమయం కనపడగానే పై ప్రాణం పైనే పోయినట్టు అనిపించింది. తను ఈ తలుపు వేశాడు కదూ!
జేబులు తడుముకున్నాడు. పాకెట్లో తగిలిన మొబైల్ ఫోన్. ఆన్ చేద్దామంటే యశో పలక మీద రాసిన ప్రేమలేఖ ఇంకా స్క్రీన్ మీద కనబడుతూనే ఉంది.
కాఫీ డికాక్షన్ వాసన, నానిన సుద్దముక్కల వాసన, ఒకేసారి గౌతమ్‌ని పలకరించాయి!